దోమలు, ఈగలు, కందిరీగలు, పేలు, పిడుదులు, గోమార్లు, చిరుపేల వంటి అనేక కీటకాల వల్ల పాడి పశువులు, దూడలతో పాటు పనిచేసే పశువులు కూడా తీవ్ర అసౌకర్యానికి, బాధకు, వ్యాధులకు గురౌతున్నాయి. ఈ కీటకాల బెడద వల్ల దూడలలో ఎదుగుదల, పాడిపశువులలో పాల ఉత్పాదకశక్తి పనిచేసే పశువుల్లో పనిసామర్థ్యం క్షీణిస్తున్నాయి. కొన్ని రకాల ఈగలు, జోరీగలు, పిడుదులు అనేక బాక్టీరియా, వైరస్ మరియు బెబీసియోసిస్, ట్రిపనజోమియాసిస్ మరియు థెయిలీరియాసిస్ వంటి ప్రాణాంతక వ్యాధి క్రిముల వాహకాలుగా ఈ వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతున్నాయి. ఈ కీటకాల బెడదవల్ల పశువులు సరిగ్గా మేయనందున అవి రక్తహీనతకు లోనై, వాటి సహజమైన వ్యాధి నిరోధక శక్తిని సైతం కోల్పోతున్నాయి. అశ్రద్ధకు గురైన పుండ్లు, గాయాల మీద వాలిన ఈగలు పెట్టిన గ్రుడ్లు పురుగులుగా మారి పుండ్లను మరింత ప్రమాదకరంగానే కాక తీవ్రమైన బాధను, రక్తస్రావాన్ని మరియు మరణాలకు కూడా కారణం అవ్వడాన్ని గమనించవచ్చు. మన పాడికమతాలలో పాలుపిండే సమయాలలో దోమలు కలిగించే చికాకు వల్ల అవి చిందులు వేయటం, తద్వారా పాలపాత్రలోకి బయటి మలినాలు ప్రవేశించుటవల్ల పాలనాణ్యత, జీవిత కాలాలు క్షీణించటం, అటువంటి పాలతో చేసిన వంటకాల రుచి, నాణ్యతలు క్షీణించటం మనం చూస్తూ వుంటాము.
ఇటీవల కొన్ని సంవత్సరాలుగా మన పశువులలో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీడిసీజ్ వైరస్ వ్యాప్తికి, గాలికుంటు వ్యాధి మరియు ఇతర వ్యాధుల వ్యాప్తిలో అనేక రకాల కీటకాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి.
పశువుల చర్మపు పొరల్లోకి ప్రవేశించి, చర్మం మృదుత్వాన్ని, సున్నితత్వాన్ని, స్పర్శజ్ఞానాన్ని క్షీణింపచేస్తూ చర్మం మొద్దుబారి, పగుళ్లుబారటాన్ని కలిగించే డేమోడెక్టివ్ మేంజ్‌మైట్స్ వల్ల కలిగే (ఒకేతరహా పొడిగజ్జి) చర్మవ్యాధి వల్ల అవి పడే బాధ వర్ణనాతీతం!
కీటకాల బెడద లక్షణాలు: పశువుల మీద పరిసరాలు, పరికరాల మీద కనిపించే వివిధ రకాల ఈగలు, జోరీగలు, పిడుదులు, గోమార్లు ఈ సమస్య తీవ్రతను ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా చెవులు, కొమ్ములు, చంకల సందులు తోక మొదళ్లకు ప్రక్కన వృషణాల మీద కనిపించే పిడుదులు పీల్చే రక్తం, కలిగించే బాధ కారణంగా పశువు నీరసంగా, నిస్సత్తువగా, హుషారు లేకుండా మందంగా కనిపిస్తాయి.
పశువు చికాకుగా, ఆందోళనగా, కాళ్లను, తోకను, మెడను పదే పదే కదులుస్తూ, సమస్య తీవ్రమైతే పదేపదే కూర్చొని లేస్తూ బాధ, ఆందోళన, చికాకుల్ని ప్రదర్శిస్తుంది.
పేలు, పిడుదులు, గోమార్లు కలిగించే దురద వల్ల గడ్డివాములకు, స్తంభాలకు, చెట్లకు శరీరాన్ని రాస్తూ కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో దురద ప్రదేశాన్ని పళ్లతో కొరుక్కుని తమకు తామే సమస్యను తీవ్రతరం చేసుకుంటూ ఉంటాయి.
తేనెటీగలు, మరికొన్ని ఇతర కీటకాల నుండి విడుదలయ్యే విషపదార్థాల వల్ల చర్మం విూద దొద్దుర్లు ఏర్పడి, ఎర్రగా వాచిపోవటం, సమస్య తీవ్రమైతే ప్రాణాంతకమయ్యే ముప్పు కూడా ఉండవచ్చు.
వెంట్రుకల విూద పేలు పెట్టిన గ్రుడ్లు కూడా కనిపించవచ్చు. ఇవి కీటకాలుగా పెరిగి ఇతర పశువులకు వ్యాపించగలవు.
అశ్రద్ధ వల్ల ముదిరిపోయిన పుండ్లు, గాయాలలో చేరిన ఈగల లార్వాలు సుమారు ఒక సెంటీమీటరు పొడవైన తెల్లని పురుగులుగా పుండ్లలో కదిలాడుతూ వుంటాయి. ఇవి పుండును తొలుస్తూ రక్తస్రావాన్ని కలిగిస్తూ కనిపిస్తాయి.

చికిత్స: పురుగులు పట్టిన పుండ్ల నుండి వాటిని ఫోర్సెప్స్‌తో తీసివేసి, మొదటి రెండు రోజులు మైలుతుత్తుం+బోరిక్‌పౌడర్+జింక్ ఆక్సైడ్ పౌడర్ డ్రెస్సింగ్ చేసి, ఆ తర్వాత హిమాక్స్ లేదా ఛార్మిల్ వంటి బహుమూలికా ఆయింట్‌మెంట్లతో డ్రస్సింగ్‌ను పుండు మానే వరకు కొనసాగించి, అవసరమైన యాంటిబయొటిక్ ఇంజక్షన్లు వాడాలి. వేపనూనె మరియు టర్పంటైన్ ఆయిల్‌తో కూడా పురుగులు నశిస్తాయి.
డెమోడెక్టివ్‌మేంజ్ (పొడి గజ్జి) భాగాన్ని 0.1-0.2 శాతం డెల్టామెత్రిన్ లేదా సైపర్‌మెత్రిన్ లేదా అమిత్‌రాజ్ ద్రావణంతో పగుళ్లలోపలి వరకు లోషన్ వెళ్లే విధంగా శుభ్రం చేసి, ఐవర్‌మెక్టిన్ ఇంజక్షను దూడలకు 2 నుండి 3 మి.లీ., పెద్ద పశువుకు 7-8 మి.లీ. చర్మం క్రిందకు వారం వ్యవధిలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. అదనంగా లెవామొజోల్ మరియు విటమిన్ ఇంజక్షన్లు కూడా వాడవలసి ఉంటుంది. ఇంతేకాక పశువు అలంకరణ సామాగ్రి, గొలుసులు, తాళ్లు, గుంజలు, నేల మరియు పరిసరాలపై కూడా డెల్టామెత్రిన్, సైపర్‌మెత్రిన్ లోషన్లతో శుభ్రపరచి కీటకాలను సమూలంగా నిర్మూలించాలి.
పిడుదులు, పొడిగజ్జిని కలిగించే చిరు పేల నిర్మూలనకు పశువుల వెన్ను విూద ప్రయోగించే ద్రవ రూప మందులు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి.
కీటకాల బెడద నివారణ: సకాలంలో సమస్యను గుర్తించి నిర్మూలనా చర్యలను పటిష్టంగా అమలు చేయాలి.
పశువుల్ని, పాకల్ని, పరిసరాలను ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచాలి. వేసవికి ముందు పశువుల వెంట్రుకల్ని పూర్తిగా కత్తిరించుట, లేదా షేవింగ్ చేయుట మంచిది.
పాకలలోని దోమల నిర్మూలనకు వేపాకు, సాంబ్రాణి ధూపాలు వేయటం, పాకలచుట్టూ దోమతెరల్ని ఏర్పాటు చేయటం లేదా సీలింగ్ ఫాన్లు ఏర్పాటు చేయటం మంచిది.

పాకల్ని, పరిసరాలను డి.డి.టి., గమాక్సిన్, డెల్టామెత్రిన్, సైపర్‌మెత్రిన్ వంటి కీటకనాశకాలతో స్ప్రే చేయాలి.
పొడిగజ్జి (మేంజి) కీటకాల నిర్మూలనకు, పశువు మీద కాక, పశువు యొక్క అలంకరణ బెల్టులు, గొలుసులు, త్రాళ్లు, గుంజలు, స్తంభాలను కూడా కీటక నాశకాలతో శుభ్రపరచుట చాలా అవసరం.
పశువుల వ్యర్థాలు, మేత వ్యర్థాలను మండే ఎండలో ఎండబెట్టి కూడా వాటిలోని కీటకాలను నిర్మూలించవచ్చు.
పశువుల ఆవరణలో ఒక గుంజను పాతి దానికి కొబ్బరి తాడును చుట్టి, దానిమీద కీటకనాశక పౌడర్లను చల్లుతూ ఉంటే దురదల ఉపశమనానికి అవి గుంజకు రాసుకున్నప్పుడు కీటకనాశకాల వల్ల చర్మం విూది కీటకాలు చాలావరకు నశిస్తాయి.
అలవాటుగా పశువులకు వాడే మోకులు, శిగమారలు, గొలుసుల్ని మరుగుచున్న నీటితో శుప్రరుస్తూ ఉండాలి.

పశువుల పాకలలో ప్రతి పశువుకు కనీసం 35-40 చదరపు అడుగుల స్థలాన్ని ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా విశాలంగా ఉండి గాలి, వెలుతురు సోకేవిధంగా వసతిని ఏర్పాటు చేయాలి. కీటక బెడదతో బాధపడే పశువును వెంటనే మంద నుండి వేరు చేయాలి.
అవకాశం ఉంటే ఒక తొట్టెలోని నీటిలో కీటకనాశక మందును నిర్ణీత మోతాదులు కలిపి, జీవాలను, దూడల్ని అందులో 1-2 నిముషాలపాటు ముంచటం ద్వారా కూడా చర్మం మీద ఉండే బాహ్యపరాన్న జీవుల్ని నిర్మూలించవచ్చు.
ఒక మంద లేదా అవరణలోని పశువులన్నింటి విూద ఉండే కీటకాలను ఒకేసారి నిర్మూలిస్తే తప్ప ఈ కీటకాల బెడద సులువుగా సమసిపోదని గ్రహించాలి.
డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్. 93930 55611

