కారణాలు ఏమైనా కాని ఇంటిపంట చేపట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచుకోవటానికి అనేక రకాల కుండీలు, టబ్బులు, డ్రమ్ములలాంటివి వివిధ రకాల కొలతలలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇలాంటివి అన్నీ కూడా కొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎక్కువుగా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునేవారు తమ ఇంట్లో అందుబాటులో ఉండే వృథా అయిన ఫ్రిజ్‌ డబ్బాలు, బక్కెట్లు, కూలర్‌ డబ్బాల లాంటి వాటితో మొదలు పెడుతున్నారు. వాటన్నింటితో పాటు ఇంట్లో అనేక రకాల బిందెలు, కుండీలు, నీళ్ళ డబ్బాల లాంటి వాటిని కూడా తమ మిద్దెతోటలో వినియోగిస్తున్నారు నెల్లూరు పట్టణంలోని మైపాడు గేటు సమీపములో మిద్దెతోటను పెంచుతున్నారు విజయ.

విజయ గారిది వ్యవసాయ నేపథ్యం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విజయకి మొక్కలన్నా, పచ్చదనం అన్నా బాగా ఇష్టం కాబట్టి ఇంటిపంటలను మొదలు పెట్టాలని ఆలోచించి తమ మిద్దెమీద మిద్దె తోట పెంపకానికి అవకాశం ఉంది కాబట్టి మిద్దెతోటను సాగు చేస్తున్నారు. జీరో బడ్జెట్‌తో మిద్దెతోటను మొదలు పెట్టాలనే తలంపుతో మొక్కల పెంపకానికి అవసరమయిన కుండీలు లేదా డ్రమ్ముల లాంటివాటిని బయట నుంచి కొనుగోలు చేయకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉండే బక్కెట్లు, డబ్బాలు, కుండీలు, బియ్యం డబ్బాలు, స్టీలు బిందెలు, ఫ్రిజ్‌ డబ్బాల లాంటి వాటిని తమ మిద్దె తోటలో ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పాతసామానుకు ఉల్లిపాయలు అమ్మేవారి వద్ద నుంచి తక్కువ ధరకు ప్లాస్టిక్‌ బక్కెట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు లేదా ఏ ఇతర సామాన్లు మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా కాని మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల కోసం సాధ్యమయినంతవరకు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్‌లో చేయాలన్నదే విజయ గారి లక్ష్యం. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ఇంట్లో ఏ వస్తువును వృథాగా పడవేయకుండా చివరికి పగిలిపోయిన కుండలలో కూడా మొక్కలు పెంచుతున్నారు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమం కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ మిద్దెతోటలో ఉండే మొక్కల నుండి లభించే ఎండు ఆకులతో పాటు బయట అందుబాటులో ఉండే ఎండు ఆకులను కూడా సేకరించి ఎండు ఆకులు మరియు మట్టిని పొరలు పొరలుగా వేసుకుంటూ పైన 25 శాతం భాగం మాత్రమే ఎరువు, మట్టితో నింపి అందులో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ పద్ధతి వలన లోపల వేసిన ఎండు ఆకులు నిదానంగా కుళ్లుతుంటాయి కాబట్టి మొక్క నాటిన లేదా విత్తనం పెట్టిన 60 నుండి 90  రోజుల వరకు మొక్కకు పోషకాలు ప్రధానంగా అందుతుండడము విజయ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. మొక్కకు అవసరమైన పోషకాలు సక్రమంగా అందడము వలన మొక్కల రోగనిరోధక శక్తి పెరిగి చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది. తాను పెంపకం చేసే మిద్దెతోటలో చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది కాట్టి చీడపీడల నివారణ కొరకు పెద్దగా ఇబ్బందులు ఉండడం లేదు.

వీరి మిద్దెతోటలో ఆకుకూరలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుటలో ఆకుకూరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి రోజు మార్చి రోజు తమ ఆహారంలో ఆకుకూర ఉండేలా తమ మిద్దెతోటలో ఆకుకూరలను పెంచుతున్నారు. తోటకూర, కొత్తిమీర, పొదీనా, రెండు రకాల బచ్చలి కూర, పొన్నగంటి కూర, రెండు రకాల గోంగూర, మెంతికూర పెంచడముతోపాటు ఆవాలు, వాము లాంటి వాటిని కూడా మిద్దెతోటలో పెంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు మునగ ఆకు, తమలపాకు లాంటి వాటిని కూడా తమ వంటలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. వంగ, బెండ, టమాట లాంటి కూరగాయలతో పాటు తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తీగజాతి కూరగాయల పెంపకానికి ఎక్కవ స్థలం అవసరం లేకపోగా దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి బీర, కాకర, పొట్ల, దోస లాంటి కూరగాయలు 365 రోజులు వచ్చేలా విత్తనాలను వేస్తుంటారు. ఏది ఏమైనా కాని తమ ఇంటి అవసరాలకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను అతి తక్కువ ఖర్చుతో ఒక విధంగా చెప్పాలంటే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా పెంచుతూ ఉపయోగిస్తున్నారు. వీరు పెంపకం చేసే చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చింత చిగురు కోసమని చింత చెట్టును పెంచుతున్నారు. ఆ చెట్టు నుండి ప్రతినిత్యం చింతచిగురు పొందుతున్నారు. చింత చెట్టు పెద్ద చెట్టు అయిన తరువాత తమ ఇంటి చుట్టుప్రక్కల వారు తమ తమ అవసరాలకు ఆ చెట్టు నుండి చింత చిగురును పొందుతుంటారు. వీటితో పాటు కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, కొబ్బరి, కుంకుడు, బత్తాయి, నారింజ, గన్నేరు, మల్లె లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.

తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మొక్కల పెంపకం గురించి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అనునిత్యం తెలియ చేయడంతో పాటు స్కూలు ఆవరణలో కూడా కొన్ని మొక్కలను పిల్లల చేత నాటిస్తుంటారు. అంతేకాకుండా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అవకాశం ఉన్న చోట మొక్కల పెంపకం చేపడుతుంటారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు ఇంట్లో వృథాగా ఉండే వస్తువులను తమ ఇంటి పంటలో ఉపయోగిస్తే జీరోబడ్జెట్‌తో ఇంటి పంటను మొదలు పెట్టవచ్చు అని సలహా ఇస్తున్నారు.        – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌