బహుళ ప్రయోజనకారి అరటి

అరటి అనగానే మనకు అరటి పండ్లు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. లేదా అరటి ఆకులు అరటి పూవులు కూడా కొంతమందికి గుర్తుకు వస్తాయి. కాని అరటి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. ఒక అరటి మొక్కను నాటినట్లయితే అనేక పిలకలు వస్తూనే ఉంటాయి. అరటి వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి తమ ఇంటి ప్రక్కన కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని వివిధ రకాల అరటి మొక్కలు పెంచుతున్నాడు విజయవాడకు చెందిన సురేష్‌.

సురేష్‌ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని ఉన్నత చదువులు చదివి వ్యవసాయానికి దూరం జరిగి విజయవాడలోని ఒక మల్టీస్పెషాలటీ వైద్యశాలలో ఐ.టి. మేనేజరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సురేష్‌కి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ చాలా ఎక్కువ. తన మక్కువను తీర్చుకొనటానికి విజయవాడ మాచవరం డౌన్‌లో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో వివిధ రకాల అరటి మొక్కలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం తన అరటి వనంలో 7 రకాల అరటి మొక్కలు ఉన్నాయి. కర్పూర, రెండు రకాల చక్రకేళి, ఎర్ర అరటి, పచ్చఅరటి, రెండు రకాల కూర అరటి మొక్కలను తెలిసిన  రైతుల వద్ద నుంచి తెలిసిన ఇంటి పంట దారుల నుంచి సేకరించి 7 రకాల అరటి మొక్కలతో అరటి వనాన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.

అరటి మొక్కలతోపాటు పడి మొలసిన కొన్ని రకాల మొక్కలను కూడా సురేష్‌ పెంచుతున్నాడు. వాటిలో నల్ల ఉమ్మెత్త, పారిజాతం, గురివింద మొక్కలు కూడా ఉన్నాయి. అరటి మొక్కలు పెరిగిన తరువాత ఆ మొక్కల కింద నీడ ఉండి నర్సరీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సురేష్‌ ఆవిధంగా కూడా అరటి మొక్కల నీడను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ నీడలో కొన్ని రకాల మొక్కలను పెంపకం చేస్తూ తాను ఉపయోగించుకోవడంతో పాటు, ఇంటిపంటదారులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఉచితంగా అందచేస్తుంటాడు. కొన్నిసార్లు తానే రవాణా ఖర్చులు కూడా భరించి ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిస్తుంటాడు. సురేష్‌ విత్తన నిధిని మెయింటేన్‌ చేస్తూ కొన్ని రకాల పురాతన, నాటు విత్తనాలను సంరక్షిస్తూ, వృద్ధి పరుస్తూ, తన వద్దలేని విత్తనాలను తోటి రైతుల వద్ద నుంచి, తోటి ఇంటి పంటదారుల నుంచి, తెలిసిన వారి నుంచి సేకరిస్తూ అవసరమైన వారికి అందిస్తుంటాడు. ఈ విధంగా పచ్చదనం పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.

తన అరటి వనంలో అరటితో పాటు వివిధ రకాల మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పెంపకం చేస్తున్నారు కాబట్టి తేనెటీగలు తేనె తుట్టెలను పెడుతుంటాయి. ఈ తేనె టీగల వలన అరటి పంటలో పరపరాగ సంపర్కము సక్రమంగా జరిగి అరటి పండ్ల నాణ్యత, రుచి పెరగటంతోపాటు అరటి గెలలు కూడా పెద్దగా వస్తున్నాయి. గెలలో అన్ని కాయలు గట్టిపడి నాలుగు, ఐదు కాయలు పండి రంగు మారిన తరువాత గెలను కోసి ప్రకృతి సిద్ధంగా పండించి కొన్ని కాయలను తాము వినియోగించుకుంటూ మిగిలిన కాయలను అడిగిన వారికి అమ్మకం చేసి ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు.

అరటి మొక్కలలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అరటి ఆకులు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. అరటి గెలలో కాయలు పడిన తరువాత గెల చివరన మిగిలిన పువ్వులతో కూర చేసుకోవచ్చు. అరటి గెలలో కాయలు కోసిన తర్వాత మిగిలే దూటను కూడా కొంతమంది కూరగా చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. అరటి బోదెలో దొప్పలను కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టి నీటిలో వదలటానికి ఉపయోగిస్తుంటారు. మిగిలి పోయిన అరటి బోదెను వేస్ట్‌డికంపోజరుతో కుళ్ళించినట్లయితే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ విధంగా అరటి మొక్కలోని ఏభాగం వృధా కాకుండా అరటి మొక్క మొత్తం ఉపయోగపడడంతో పాటు అరటి మొక్క నుండి ప్రతినిత్యం పిలకలు వస్తుంటాయి. ఆ పిలకలు ముదిరిన తరువాత తవ్వి మరలా నాటుకోవచ్చు. కాబట్టి అరటిని బహుళ ప్రయోజనకారి అని తెలుసుకున్న సురేష్‌ అరటి వనాన్ని సృష్టించాడు. మరిన్ని విరాలు 89850 68899 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

వృథా వస్తువులతో మిద్దెతోట

కారణాలు ఏమైనా కాని ఇంటిపంట చేపట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచుకోవటానికి అనేక రకాల కుండీలు, టబ్బులు, డ్రమ్ములలాంటివి వివిధ రకాల కొలతలలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇలాంటివి అన్నీ కూడా కొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎక్కువుగా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునేవారు తమ ఇంట్లో అందుబాటులో ఉండే వృథా అయిన ఫ్రిజ్‌ డబ్బాలు, బక్కెట్లు, కూలర్‌ డబ్బాల లాంటి వాటితో మొదలు పెడుతున్నారు. వాటన్నింటితో పాటు ఇంట్లో అనేక రకాల బిందెలు, కుండీలు, నీళ్ళ డబ్బాల లాంటి వాటిని కూడా తమ మిద్దెతోటలో వినియోగిస్తున్నారు నెల్లూరు పట్టణంలోని మైపాడు గేటు సమీపములో మిద్దెతోటను పెంచుతున్నారు విజయ.

విజయ గారిది వ్యవసాయ నేపథ్యం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విజయకి మొక్కలన్నా, పచ్చదనం అన్నా బాగా ఇష్టం కాబట్టి ఇంటిపంటలను మొదలు పెట్టాలని ఆలోచించి తమ మిద్దెమీద మిద్దె తోట పెంపకానికి అవకాశం ఉంది కాబట్టి మిద్దెతోటను సాగు చేస్తున్నారు. జీరో బడ్జెట్‌తో మిద్దెతోటను మొదలు పెట్టాలనే తలంపుతో మొక్కల పెంపకానికి అవసరమయిన కుండీలు లేదా డ్రమ్ముల లాంటివాటిని బయట నుంచి కొనుగోలు చేయకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉండే బక్కెట్లు, డబ్బాలు, కుండీలు, బియ్యం డబ్బాలు, స్టీలు బిందెలు, ఫ్రిజ్‌ డబ్బాల లాంటి వాటిని తమ మిద్దె తోటలో ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పాతసామానుకు ఉల్లిపాయలు అమ్మేవారి వద్ద నుంచి తక్కువ ధరకు ప్లాస్టిక్‌ బక్కెట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు లేదా ఏ ఇతర సామాన్లు మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా కాని మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల కోసం సాధ్యమయినంతవరకు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్‌లో చేయాలన్నదే విజయ గారి లక్ష్యం. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ఇంట్లో ఏ వస్తువును వృథాగా పడవేయకుండా చివరికి పగిలిపోయిన కుండలలో కూడా మొక్కలు పెంచుతున్నారు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమం కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ మిద్దెతోటలో ఉండే మొక్కల నుండి లభించే ఎండు ఆకులతో పాటు బయట అందుబాటులో ఉండే ఎండు ఆకులను కూడా సేకరించి ఎండు ఆకులు మరియు మట్టిని పొరలు పొరలుగా వేసుకుంటూ పైన 25 శాతం భాగం మాత్రమే ఎరువు, మట్టితో నింపి అందులో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ పద్ధతి వలన లోపల వేసిన ఎండు ఆకులు నిదానంగా కుళ్లుతుంటాయి కాబట్టి మొక్క నాటిన లేదా విత్తనం పెట్టిన 60 నుండి 90  రోజుల వరకు మొక్కకు పోషకాలు ప్రధానంగా అందుతుండడము విజయ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. మొక్కకు అవసరమైన పోషకాలు సక్రమంగా అందడము వలన మొక్కల రోగనిరోధక శక్తి పెరిగి చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది. తాను పెంపకం చేసే మిద్దెతోటలో చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది కాట్టి చీడపీడల నివారణ కొరకు పెద్దగా ఇబ్బందులు ఉండడం లేదు.

వీరి మిద్దెతోటలో ఆకుకూరలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుటలో ఆకుకూరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి రోజు మార్చి రోజు తమ ఆహారంలో ఆకుకూర ఉండేలా తమ మిద్దెతోటలో ఆకుకూరలను పెంచుతున్నారు. తోటకూర, కొత్తిమీర, పొదీనా, రెండు రకాల బచ్చలి కూర, పొన్నగంటి కూర, రెండు రకాల గోంగూర, మెంతికూర పెంచడముతోపాటు ఆవాలు, వాము లాంటి వాటిని కూడా మిద్దెతోటలో పెంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు మునగ ఆకు, తమలపాకు లాంటి వాటిని కూడా తమ వంటలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. వంగ, బెండ, టమాట లాంటి కూరగాయలతో పాటు తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తీగజాతి కూరగాయల పెంపకానికి ఎక్కవ స్థలం అవసరం లేకపోగా దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి బీర, కాకర, పొట్ల, దోస లాంటి కూరగాయలు 365 రోజులు వచ్చేలా విత్తనాలను వేస్తుంటారు. ఏది ఏమైనా కాని తమ ఇంటి అవసరాలకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను అతి తక్కువ ఖర్చుతో ఒక విధంగా చెప్పాలంటే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా పెంచుతూ ఉపయోగిస్తున్నారు. వీరు పెంపకం చేసే చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చింత చిగురు కోసమని చింత చెట్టును పెంచుతున్నారు. ఆ చెట్టు నుండి ప్రతినిత్యం చింతచిగురు పొందుతున్నారు. చింత చెట్టు పెద్ద చెట్టు అయిన తరువాత తమ ఇంటి చుట్టుప్రక్కల వారు తమ తమ అవసరాలకు ఆ చెట్టు నుండి చింత చిగురును పొందుతుంటారు. వీటితో పాటు కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, కొబ్బరి, కుంకుడు, బత్తాయి, నారింజ, గన్నేరు, మల్లె లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.

తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మొక్కల పెంపకం గురించి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అనునిత్యం తెలియ చేయడంతో పాటు స్కూలు ఆవరణలో కూడా కొన్ని మొక్కలను పిల్లల చేత నాటిస్తుంటారు. అంతేకాకుండా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అవకాశం ఉన్న చోట మొక్కల పెంపకం చేపడుతుంటారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు ఇంట్లో వృథాగా ఉండే వస్తువులను తమ ఇంటి పంటలో ఉపయోగిస్తే జీరోబడ్జెట్‌తో ఇంటి పంటను మొదలు పెట్టవచ్చు అని సలహా ఇస్తున్నారు.        – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More