తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకుడు గోపి గురువారం సూచించారు. రాష్ట్రంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కోళ్ల మరణాలు సంభవించగా వాటి నమూనాలను పరీక్షలకు పంపించామని, ఆ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. గుడ్లు, 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద 30 నిమిషాల పాటు వండిన కోడి మాంసం తినొచ్చని చెప్పారు. ”వలస పకక్షుల ద్వారా వ్యాపించే బర్డ్ ఫ్లూ పలు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు దాని నివారణ చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా అన్ని జిల్లాలను అప్రమత్తం చేశాం” అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందవద్దని పశుసంవర్ధకశాఖ సంచాలకులు టి.దామోదర్‌నాయుడు తెలిపారు. నిఘా పరిధిలోని 5 గ్రామాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని వివరించారు. ఎక్కడైనా కోళ్లు, గుడ్ల రవాణాను అడ్డుకుంటే కాల్ సెంటర్‌కు (0866-2472543, 9491168699)కు ఫోన్ చేయాలని సూచించారు. అసత్య ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. కోడి మాంసం, గుడ్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు.
బర్డ్ ఫ్లూ వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో బర్డ్ ఫ్లూ, దాని నియంత్రణ చర్యలపై సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. చనిపోయిన కోళ్లను సరైన విధానంలో పూడ్చిపెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మనుషులకు సోకడం అత్యంత అరుదు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ రాష్ట్రంలో మనుషులకు సోకినట్లు ఎక్కడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. మనుషులకు ఈ వైరస్ అత్యంత అరుదుగా సోకుతుందని, గత అయిదేళ్లలో హరియాణా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో కేవలం నాలుగు కేసులు నమోదయ్యాయని వివరించారు.
15 రోజులకోసారి నివేదికలివ్వాలి ప్రతి జిల్లా, మండలంలో ఏర్పాటు చేసే కోళ్ల ఫారాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించేలా చూడాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా అధికారులకు సూచించారు. ప్రతి 15 రోజులకు కోళ్లకు సంబంధించిన నమూనాలు తీసి, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వ్యాధి సోకిన ఫారాలకు కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ ప్రకటించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల కోళ్లు, గుడ్ల వాహనాల అడ్డగింత ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చర్యలు
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్ల సరఫరాను అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఏపీ నుంచి రాష్ట్రానికి వస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎనిమిది, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మరో 21 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల కోళ్ల వాహనాలను అడ్డుకున్నారు.
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. పౌల్ట్రీ రంగానికి చెందిన వారికి దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల, గుడ్ల వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించాలన్నారు.
బర్డ్ ఫ్లూపై పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో హెల్ప్ లైన్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) పై అప్రమత్తతలో భాగంగా హైదరాబాద్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్ 040-23314876 నంబర్‌తో సహాయక కేంద్రం (హెల్ప్ లైన్) ఏర్పాటు చేసినట్లు సంచాలకుడు గోపి తెలిపారు. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే ఈ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లాల పశువైద్యాధికారులకు సూచించారు.
వైరస్‌తో 11 వేల కోళ్ల మృతి ఆందోళనలో పౌల్ట్రీఫామ్ యజమానులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులను కుదిపేసింది. వైరస్ బారిన పడి వేల కోళ్లు మృతిచెందడంతో యజమానులకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. గంపలగూడెం మండలం అనుముల్లంకలోని శ్రీబాలాజీ పౌల్ట్రీఫామ్‌లో ఇప్పటి వరకు 11వేల బ్రాయిలర్ కోళ్లు వైరస్‌తో చనిపోయాయి. మరో 3,800 కోళ్లు వైరస్‌తో కొన ఊపిరితో ఉన్నాయని, యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పశు వైద్యాధికారులు అభిలాష్, సాయికృష్ణ అనుముల్లంక వెళ్లి పరిశీలించారు. నమూనాలను ప్రయోగశాలకు పంపించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. మృతిచెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చిపెట్టారు.
గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడిగుడ్లను తాత్కాలికంగా మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించవద్దని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.
”ఏంటి బాబాయ్ ఏదో దిగులుగా వున్నావ్?” అడిగాడు సుబ్బారావు రామయ్యను. ”ఏమి చెప్పమంటావు నాయనా మా అబ్బాయికి పెళ్లి చేసి నాలుగేళ్లు అయింది. ఇప్పటి వరకు నా కోడలికి కడుపులో కాయ కాయలేదు. అసలు నాకు మనవణ్ణో లేదా మనవరాలినో చూసే భాగ్యం ఉందో లేదో తెలియడం లేదు. అదే నా బాధ! ఇప్పటికే నా కోడలికి వైద్య పరీక్షలు జరిగాయి. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు. ఇక మా అబ్బాయి తనలో ఏ లోపం లేదని అంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు! బస్తీకి వెళ్లి పెద్ద డాక్టర్‌ను కలిసి రమ్మని చెప్పినా వాడు నా మాట వినడం లేదు అని నిట్టూర్చాడు.
”అయితే నేను ఒక సలహా ఇస్తాను పాటిస్తావా బాబాయ్! ఇప్పుడు కడక్‌నాథ్ అనే కారు నలుపు కోళ్లు వస్తున్నాయి. వీటి మాంసంలో ఇతర కోళ్లు ముఖ్యంగా మన నాటుకోళ్ల మాంసం కంటే అనేక పోషకాలు ముఖ్యంగా ఇనుము చాలా ఎక్కువగా వుంటాయట! ఈ మాంసంలో పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధ లక్షణాలు కూడా ఉంటాయని మొన్న ఒక సైంటిస్ట్ చెబితే విన్నాను. ఎలాగూ మనం వారంలో రెండు మూడు సార్లు బ్రాయిలర్ చికెన్ వండుకుంటున్నాం కదా! ఇప్పటి నుండి వారానికి 4-5 సార్లు రెండు నెలల పాటు కడక్‌నాథ్ కోడి మాంసాన్ని ఇంట్లో వండించి మీ వాడితో తినిపించు. ఇది అందరికీ మంచిదే ఈ వయస్సులో నీకు కూడా.. అంటూ నవ్వాడు సుబ్బారావు. కావాలంటే మరికొంత సమాచారం తెలుసుకొని నీకు చెప్పగలను. అయినా కొంత ఖరీదైనప్పటికీ దీని ప్రత్యేక రుచి, సువాసన, పోషక విలువలను గుర్తిస్తే ఈ ధర అంత ఎక్కువేమీ కాదని చెప్పగలను.
నాలుగు నెలల తర్వాత – స్వీట్ ప్యాకెట్‌తో రామయ్య సుబ్బారావు ఇంటికి వచ్చి ‘ఒరేయ్ సుబ్బారావు నువ్వు చెప్పిన చిట్కా బాగా పనిచేసినట్లుంది. మా కోడలు మొన్న లేడీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకుంది. మా కోడలకు ఇప్పుడు మూడో నెల! ఇప్పుడు మా కోడలేకాక అందరమూ మునుపటి కన్నా అన్ని విధాలా ఎక్కువ ఆరోగ్యంగా, బలంగా ఉన్నాము! అంతా నువ్వు చెప్పిన కడక్‌నాథ్ కోడి మాంస మహత్యం మరి! అని నాకు స్వీట్ ప్యాకెట్ ఇస్తూ ఇవాళ మా కోడలు కడక్‌నాథ్ చికెన్ బిర్యాని వండింది అంటూ సుబ్బారావును భోజనానికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు!
మానసిక, శారీరక వత్తిళ్ల వల్ల ఇటీవల యువతలో లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతోందని వైద్య అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వత్తిళ్లు తగ్గించుకొని, మంచి పోషణ ద్వారా తమ శరీర పుష్టిని, వ్యాధినిరోధక శక్తిని, లైంగిక పటిష్ఠతను పెంచుకొనుటలో కడక్‌నాథ్ కోళ్ల ఉత్పత్తుల పాత్రను కూడా గుర్తించాలి.
ఈ కడక్‌నాథ్ కోళ్ల ప్రత్యేకత, పెంపకం, మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం! కారు నలుపు రంగులో వుండుట వల్ల వాటిని కాలిమసి కోళ్లు అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ధర్ మరియు ఘాబువా జిల్లాల నుండి ఇవి, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాతి కోడిపిల్లలు, పెట్టలు, పుంజులు హైదరాబాదులో కూడా లభిస్తున్నాయి. వీటి పెరుగుదల వేగం, శరీర తూకం, గుడ్ల ఉత్పాదక సామర్థ్యం ఇతర బ్రాయిలర్ కోళ్లు, కొన్ని నాటుకోళ్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఈ కోళ్ల మాంసంతో పాటు గుడ్లలో కూడా ఉండే అదనపు పోషకాలు, కొన్ని ఔషధ ధాతువుల కారణంగా, వీటి మాంసం ధర, గ్రుడ్ల ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఖర్చుతో పాటు గిరాకీలు పెరుగుట వల్ల ప్రస్తుతం బ్రతికిన కోడి ధర కిలోకి 500 నుండి 550 రూపాయలు, మాంసం ధర 1000 నుండి 1200 రూపాయలు, గ్రుడ్లు ధర 15-16 రూపాయల వరకు ఉంటున్నాయి.
వీటి చర్మం నల్లగా ఉండి, మాంసం, రక్తం ముదురు రంగులో అంత ఆకర్షణీయంగా కనిపించక పోవుట వల్ల క్రొత్త వినియోగదారుల్ని ఈ మాంసం ఆకర్షించుటలో వెనుకబడింది. అయితే ఒకసారి రుచి చూసిన తర్వాత ఏ అభ్యంతరమూ వుండదు. లేత గోధుమ రంగులో ఉండే వీటి గ్రుడ్ల పరిమాణం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అందులో 11.67 శాతం నాణ్యమైన మాంసకృత్తులు, ఇతర ముఖ్య పోషకధాతువులు ఎక్కువగానే ఉంటాయి.
కడక్‌నాథ్ కోళ్ల వెంట్రుకలు, చర్మం నల్లగా వుండుటకు మాంసము, రక్తము ముదురు రంగులో వుండుటకు వీటిలో ఎక్కువగా వుండే మెలనిన్ అనే నల్ల వర్ణ ధాతువుతో పాటు ఇతర మాంసాలలో కంటే సుమారు 10 రెట్లు ఎక్కువగా వుండే ఐరన్ కూడా కారణమని, వీటి వల్లనే ఇవి పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. కడక్‌నాథ్ కోడి మాంసంలో అధికంగా ఉండే నల్లని మెలనిన్ పిగ్మెంట్ వల్ల బొల్లి (చర్మపు వ్యాధి) వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడగలదు. కడక్‌నాథ్ జాతి కోళ్ల మాంసం తక్కువ క్రొవ్వు (0.73-2.8%), 18 రకాల ఎమైనో ఆమ్లాలు కలిగిన ప్రోటీన్స్ (25.47%), మరియు అతి తక్కువ కొలెస్టెరాల్ కలిగి గుండెకు ఆరోగ్య భద్రతను ఇస్తుంది. ఈ మాంసంలో ఉండే కొన్ని యాంటి ఆక్సిడెంట్సు మరియు ఇతర పోషకాల వల్ల వినియోగదారులలో రక్తపుష్టితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతున్నదని అధ్యయనాలలో తెలిసింది.
కడక్‌నాథ్ కోళ్లు 22-25 వారాలకు యుక్త వయస్సుకు వస్తాయి. వీటిలో పెట్టలు 1.2 నుండి 1.5 కిలోలు, పుంజులు 1.8 నుండి 2.2 కిలోల వరకు తూకానికి, 5-6 నెలల వయస్సుకు వస్తాయి. ఇవి సంవత్సరానికి 110 నుండి 120 గ్రుడ్లను మాత్రమే ఉత్పత్తి చేయగలవు. ఇవి సుమారు 10 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కొంత ఎక్కువే అయినప్పటికీ 1-3 రోజుల వయస్సులో రానిఖెట్ (మారెక్స్) వ్యాక్సిన్, 14-16 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్, 21-30 రోజులకు రానిఖెట్ వ్యాక్సిన్, మరల 35-40 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్ చేయించుట మంచిది.
నానాటికి వినియోగదారుల నుండి ఈ కడక్‌నాథ్ కోడి మాంసానికి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా శాస్త్రీయంగా ఫారాలలోనే కాక గ్రామీణ పెరళ్లలో కూడా వీటి పెంపకం మంచి లాభదాయకం కాగలదు. పండ్ల తోటలు, ఫారమ్ హౌస్‌లు, డెయిరీ మరియు జీవాల ఫారాల ఆవరణల్లో కూడా కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చును. సాధారణంగా ఇతర కోళ్లకు పాటించే యాజమాన్య పోషణ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. నమ్మకమైన సరఫరా దారుల నుండి కొనుగోలు చేసిన కోడిగ్రుడ్లను పొదిగిస్తే 65 నుండి 70 శాతం వరకు పిల్లలు జన్మించగలవు. తొలుత 50 నుండి 100 కోడి పిల్లలతో వీటి పెంపకాన్ని ప్రారంభించి క్రమేపీ సంఖ్యను వేలకు పెంచుట మంచిది.
మార్కెటింగ్: మార్కెట్‌లోని ఇతర కోడి మాంసాల కంటే కడక్‌నాథ్ కోడి మాంసం ధర 3 నుండి 4 రెట్లు అధికంగా వుండటం, ఈ మాంసం రంగు ఆకర్షణీయంగా వుండకపోవడం మరియు ఎముకల బరువు ఎక్కువగా వుండుట వంటి కారణాల వల్ల మార్కెట్‌లో వినియోగదారులలో అవగాహన పెంచుటకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేయాలి. నిపుణులు, అనుభవజ్ఞులతో వండించిన బిర్యానీలు, కూరలు, ఫ్రైలను ఎగ్జిబిషన్‌లు, విందులు, వినోద స్థలాలలో తక్కువ ధరకు విక్రయించి ప్రజలకు వీటి రుచిని అలవాటు చేయాలి. వంటల పోటీలలో కడక్‌నాధ్ చికెన్ మరియు గ్రుడ్లను ప్రవేశపెట్టవచ్చును. ప్రత్యేక డిస్కౌంట్సు, పండుగలు (జాతరలు, సంక్రాంతి, దసరా పర్వదినాలు) సందర్భాలలో నల్లని ఈ కోళ్లను డిస్కౌంట్స్‌తో విక్రయించి వినియోగవర్గాలను ఆకర్షించవచ్చును.
వ్యూహాత్మక శాస్త్రీయ బ్రీడింగు పద్ధతుల ద్వారా కడక్‌నాధ్ కోళ్ల పెరుగుదల వేగాన్ని శరీర బరువును గ్రుడ్ల ఉత్పత్తిని, మెరుగుపరచి వీటి లాభదాయకతను పెంచే కృషి చేయాలని మన విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలను కోరుచున్నాను. అదేవిధంగా అంతర్గత సంపర్కం వల్ల గానీ, విచక్షణా రహిత క్రాస్ బ్రీడింగ్ వల్ల గానీ ఈ జాతి యొక్క సహజత్వం ఈ జాతి జన్యు స్వచ్ఛత నశించకుండా, జాతి అంతరించకుండా పరిరక్షించవలసిన అవసరం కూడా వుంది.
మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న గ్రామీణ పెరటి పరిశ్రమలో కడక్‌నాథ్ కోళ్లను ప్రవేశపెట్టి లబ్దిదారుల ఆదాయాలతో పాటు, వినియోగదారుల ఆరోగ్యాలను కూడా మెరుగుపరచవచ్చు.
మన దేశ వ్యవసాయ పరిశ్రమల్లో కోళ్ళ పెంపకం ఒక ముఖ్యమైన భాగము. కోళ్ళ పరిశ్రమ పెరుగుతున్న జనాభా యొక్క పోషణ మరియు మాంసకృతుల అవసరాలను అందించడానికి కీలక పాత్ర వహిస్తున్నది. అయితే, ఇతర వ్యవసాయ రంగాల మాదిరిగానే, కోళ్ళ పెంపకం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. కోళ్ళ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో, కోళ్ళ మందలలో దుర్గుణాల ఉనికి సూక్ష్మమైన మరియు సంక్లిష్టమైన ఆందోళనగా నిలుస్తూ వాటి నిర్మూలన రైతులకు ఒక ప్రధాన నిర్వహణ సమస్యగా మారింది. దుర్గుణాలు కోళ్ళు ప్రదర్శించే అవాంఛనీయ ప్రవర్తనలు అవి కోళ్ళ ఆరోగ్యం, ఉత్పాదకత మరియు సంక్షేమాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దుర్గుణాలు ఒక్క సారి మందలో అభివృద్ధి చెందిన తర్వాత అవి వేగంగా మంద అంతటా వ్యాపించి వాటి నియంత్రణ మరియు నిర్మూలన చాలా కష్ట సాద్యంగా మారుతుంది. ఫలితంగా, ఈ దుర్గుణాలు (చెడు అలవాట్లు) పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
కోళ్లలో తరచుగా కనిపించు దుర్గుణాలు
ఈకలు మరియు చర్మాన్ని పొడవడం, పీకడం: ఇది కోళ్లలో ఒక తీవ్రమైన చెడు అలవాటు, కోళ్ళు ఒకదానికొకటి ఈకలు, చర్మం మరియు మలద్వారం ప్రాంతాన్ని పొడుచుకుని పీకుతుంటాయి. పొడుచుకోవడం వల్ల ఏర్పడిన గాయాల ద్వారా వివిధ రకాల రోగాలు మరియు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ గాయాలు ఇతర కోళ్లను తిరిగి పొడవడానికి ప్రేరేపిస్తాయి. ఇలా ఆ గాయాలను తిరిగి మందలోని ఇతర కోళ్ళు పొడవడం ద్వారా అవి తీవ్రతరమయ్యి చివరికి కోళ్ళ మరణానికి దారితీస్తాయి. ఈ సమస్యలు ప్రదానంగా కోళ్ళ గృహ వ్యవస్థ లో కావాల్సిన స్థలం లేక రద్దీ పెరగడం వలన, పేలవమైన యాజమాన్య పద్ధతుల కారణంగా మరియు ముఖ్యంగా పోషకాహార లోపాలు (మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపం మరియు అధిక శక్తి తక్కువ పీచు పదార్థము ఉన్న దాణా) వలన తలెత్తుతాయి.
గుడ్లను కుక్కడం మరియు తినడం: కోళ్ళు తమ స్వంత లేదా ఇతర కోళ్ళ గుడ్లను తినే ప్రవర్తనను అలవర్చుకుని మంద అంతటా వ్యాపింపజేస్తాయి. ఈ ప్రవర్తన, ఒకసారి మందలో కనిపించిన తర్వాత, త్వరగా వ్యాపించి ఒక నిరంతర సమస్యగా మారుతుంది, దీని నిర్వహణ మరియు నివారణ కోళ్ళ పెంపకంలో ప్రధాన అంశంగా మారుతుంది. ఈ దురలవాటు కోళ్ళ ఉత్పాదకత మరియు ఆర్థిక సాధ్యతను ప్రభావితం చేసి రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.
కోళ్లలో గుడ్లను తినే అలవాటు అవి గుడ్లు పెట్టడానికి ఏర్పరిచిన గూళ్ళ యొక్క పేలవమైన నిర్వహణ వలన కలగవచ్చును, పోషకాహార లోపాల వలన కోళ్ళు పెట్టే గుడ్లలో పగుళ్లు మరియు చీలికలు ఉన్నపుడు కోళ్ళు ఆ గుడ్లను పొడిచే అవకాశం ఎక్కువ అలాగే కోళ్ళు నిత్యం గురయ్యే ఒత్తిడికి ప్రతిస్పందనగా కూడా ఈ దుర్గుణము ఉద్భవించవచ్చు.
గుడ్లను దాచిపెట్టుట: గుడ్డు దాచడం అనేది పెరటి కోళ్లలో అప్పుడప్పుడు గమనించే ప్రవర్తన, ఇక్కడ కోళ్లు తమ గుడ్లను నియమించబడిన గూళ్ళు, గూడు పెట్టెల్లో కాకుండా ఇతర ప్రదేశాలలో పెట్టడానికి ఎంచుకుంటాయి. గుడ్డు దాచడం అనేది అడవి కోడి యొక్క సహజ ప్రవృత్తి, కొన్ని పెరటి కోళ్లలో కూడా ఈ ప్రవృత్తి జన్యుపరంగా సంక్రమించడం వల్ల అవి గుడ్లను దాచి పెట్టవచ్చును. గుడ్లు పెట్టడానికి సరైన గూళ్ళు మరియు గూడు పెట్టెల్లో లేకపోవుట, అధిక రద్దీ వలన కూడా కోళ్లలో ఈ ప్రవర్తన గమనించవచ్చును. దీనివలన రైతులకు కోళ్ళు పెట్టిన గుడ్లను గుర్తించడం మరియు సేకరించడం సవాలుగా మారుతుంది, ఫలితంగా సేకరించిన గుడ్ల సంఖ్య తగ్గి దిగుబడి పడిపోతుంది.
నివారణ మరియు నిర్వహణ
మెరుగైన గృహవ్యవస్థ మరియు సరిపడా నేల స్థలం కేటాయించడం: కోళ్ళలో దుర్గుణాలకు దోహదపడే ప్రదాన కారకం అధిక రద్దీ. తగినంత స్థలం, తగినన్ని దాణా మరియు నీటి తొట్టెలు కల్పించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చును. సరైన గాలి ప్రసరణ మరియు మెరుగైన జీవన పరిస్థితులను కలిగిన గృహవ్యవస్థను అందించడం ద్వారా కోళ్ళలో ఒత్తిడిని తగ్గించి అవాంఛనీయ ప్రవర్తనలను అరికట్టవచ్చును.
సమతుల్య పోషణను అందించడం: దుర్గుణాలను నివారించడంలో కోళ్లకు సమతుల్య దాణా అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపము మరియు దాణాలో శక్తినిచ్చు పదార్థాలు మరియు పీచు పదార్థాల హెచ్చుతగ్గులు లేకుండా పశువైద్యుల సలహా మేరకు నిర్దిష్ట పోషణ సమతుల్యత కలిగిన దాణాను కోళ్లకు అందించాలి.
కోళ్ళ ముక్కులు కత్తరించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చు: నాలుకను జాగ్రత్తగా వెనక్కి నెట్టి పై ముక్కు 2/3వ వంతు మరియు దిగువ ముక్కును 1/3వ వంతు ముక్కులు కత్తిరించు యంత్రం సహాయంతో కత్తిరించాలి.
దుర్గుణాలు కలిగిన కోళ్లను, గాయపడిన కోళ్లను గమనించి వెంటనే మంద నుండి వేరు చేయాలి.