ఎండాకాలంలో తీవ్రమైన ఎండల వల్ల పశువులు అధిక వేడి లేదా తాపానికి గురై ఉత్పాదక శక్తి కోల్పోవడమే కాకుండా కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కనుక వేసవి కాలంలో వేడి నుండి పశువులను మరియు గొర్రెలు, మేకలను సంరక్షించుకోవడానికి తగిన సూచనలను పాటించవలసి ఉంటుంది. మొదటగా పశువులను గాని గొర్రె, మేక పిల్లలను గాని వీలైనంత వరకు ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు మేపుకు తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువుల కొట్టాలలోనే ఉంచాలి. పశువుల కొట్టాలు లేదా షెడ్‌ సౌకర్యం లేని వారు చెట్ల నీడలో పశువులను ఉంచవచ్చును. పశుగ్రాస వసతి సమృద్ధిగా ఉన్నప్పుడు షెడ్లలో మేపడమే శ్రేయస్కరము. కొట్టాలు లేదా షెడ్‌ చుట్టుపక్కల నీడనిచ్చే చెట్లను పెంచుకుంటే పశువులకు వేసవికాలంలో చల్లదనాన్ని అందిస్తాయి. పగటి సమయాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టాలు లేదా షెడ్లకు గోనె సంచులు కట్టి తడపడం వలన లోపల వాతావరణం చల్లగా మారి పశువులకు అనుకూలంగా ఉంటుంది. 

ఎండాకాలంలో ప్రతి పశువుకు రోజుకు సుమారు 60 నుంచి 70 లీటర్ల త్రాగునీరు అవసరం అవుతుంది. కావున వేసవిలో తగినంత త్రాగునీరు పశువులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా పచ్చి మేత అందించాలి. మరియు దాణాను తడిపి ఇవ్వడం మంచిది. వాణిజ్యపరంగా పాడి పశువులు మరియు గొర్రెల, మేకల పెంపకం చేపట్టేవారు షెడ్లలో ఫ్యాన్లు, ఫాగర్సు, స్ప్రింక్లర్స్‌ ఏర్పరచుకొని ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయవచ్చును. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దాణాతో పాటు ఖనిజ లవణాల మిశ్రమము మరియు పుష్కలంగా త్రాగునీరు ఇవ్వడం వలన పశువులు బలహీన పడకుండా తొందరగా డీహైడ్రేషన్‌కు గురికాకుండా సంరక్షించుకోవచ్చు. వేసవి తాపానికి గురైన పశువులు అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగి, అధిక శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి పశువులను గమనించి వెంటనే తల మరియు శరీర భాగాలను నీటితో తడుపుతూ సమీప పశు వైద్య అధికారిచే చికిత్స చేయించుకోవాలి. అదేవిధంగా కోళ్లకు వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా షెడ్‌పై స్ప్రింక్లర్లను మరియు షెడ్లు లోపల ఫాగర్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చల్లటి వాతావరణాన్ని అందించగలం. పైన తెలిపిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని వేసవికాలంలో పశువుల యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించినట్లయితే ఎండ వేడి నుంచి పశువులను సంరక్షించుకోవచ్చు.           దీ

డా|| కె. అర్చన, సబ్జక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌, కెవికె, రామగిర్‌ కిల్లా.