భారత దేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం, సుమారు 77 శాతం ప్రజానీకం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు ,భారత దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 17.5 శాతం వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతుంది. అయితే మారుతున్న కాలం తో పాటు, పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహారం పండించాలన్నా, వ్యవసాయంలో పెరుగుతున్న వ్యవసాయ కూలీల కొరతను అధిగమించాలన్నా వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన మార్పు రావాలి. వ్యవసాయం హైటెక్‌ పరుగులు పెడుతోంది. వాతావరణ పరిస్థితులు మొదలుకుని నాట్లు వేయడం, విత్తనాలు జల్లడం, కలుపు తీయడం, కోతలు కోయడం వరకూ అన్ని పనుల్లోనూ రోబోలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దుక్కిదున్నే ట్రాక్టర్‌ నుంచి పంట కోసే మిషన్ల వరకూ ఇప్పుడు అందుబాటులో ఉండగా పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కోయాలి, పురుగు పడితే ఏం చేయాలనేది చెప్పేందుకు మొబైల్‌ యాప్‌లు రెడీ అయ్యాయి. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారు అవుతున్నాయి. 

అయితే మారుతున్న కాలం తో పాటు, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన డ్రోన్‌ల యొక్క వినియోగాన్ని పెంచడం ఎంతయినా అవసరం. డ్రోన్‌ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్‌ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్‌ లకు ఉండే అధునాతన సెన్‌సార్లు, డిజిటల్‌ ఇమేజ్‌ ద్వారా తమ పొలం యొక్క చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఒక డ్రోన్‌ పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లగలదు.

భారతదేశంలో వ్యవసాయ డ్రోన్‌ ధర

ఒక వ్యవసాయ డ్రోన్‌ తరచుగా ఇంటర్నెట్‌ ఆధారిత స్మార్ట్‌ టెక్నాలజీని ఉపయోగించి పిచికారీ మరియు పంట ఆరోగ్య పర్యవేక్షణ వంటి ఖచ్చితమైన వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది, దీని ధర 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉండవచ్చు. ఇది మొదట్లో కొంత ఖరీదైనదిగా అనిపించినా రానున్న రోజులలో చాల చవుకగా లభించే అవకాశాలు వున్నాయి.

వ్యవసాయంలో డ్రోన్‌ పాత్ర అమోఘం. ముఖ్యంగా వ్యవసాయ రంగ వెలుగు కనిపిస్తోంది. కూలీలు, మందుల పిచికారీ సమస్యలకు తరుణోపాయంగా ఆశలు కల్పిస్తోంది. రెండు థాబ్దాల క్రితం వరకు నిఘా కార్యకలాపాలకే పరిమితమైన ఈ బుల్లిమానవ రహిత విమానం ప్రతి చోట తన ఉనికిని చాటుతోంది. రక్షణ, భద్రత మొదలు వైద్యం, ఆర్ధికం, మైనింగ్‌, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, సరకు రవాణా వరకు ప్రతి రంగంలో విశిష్ట సేవలందిస్తోంది. ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. నెమ్మదినెమ్మదిగా సరికొత్త రూపు సంతరించుకుని, బహుళ సౌకర్యాలతో నిఘా విభాగం, రక్షణ గోడలు దాటుకుని ఇప్పుడు పొలంలోకి అడుగు పెట్టింది.

పెద్ద కమతాల్లో పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా రైతులు, వ్యవసాయ, పారిశ్రామికవేత్తలు డ్రోన్ల మీదే ఆధారపడుతున్నారు. పెద్ద పెద్ద తోటలు, డెయిరీ ఫారాల్లో అడుగడుగునా నడవలేనిచోట డ్రోన్‌ని వినియోగించి క్షణాల్లో వీడియో తీసి ఆ దృశ్యాలని కంప్యూటర్లో చూసి పంటల స్థితిగతులు, చీడపీడల ప్రభావం అంచనావేసి తదనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు నిర్థారించుకుంటున్నారు. మట్టి నాణ్యత విశ్లేషణ, వాతావరణం, పంట దిగుబడి అంచనాలకి సైతం డ్రోన్లనే వాడుతున్నారు.

కంపెనీలు సైతం వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్‌లని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు రైతులకు కలిగే అరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. పిచికారీ కోసం గంటల తరబడి రైతులు పొలాల్లో శ్రమిస్తుంటారు. సరైన రక్షణ లేకుండా ఈ క్రమంలో ఆ గాలిని పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంలా నిలుస్తున్నాయి డ్రోన్లు. డ్రోన్ల సహాయంతో పురుగుమందుల పిచికారీ చేపట్టవచ్చు. రైతు ఆరోగ్యం కాపాడవచ్చు. ముఖ్యంగా పంటల్లో చీడపీడలు, తెగుళ్ల తాకిడి అధికమై వెంటనే పురుగు మందులు పిచికారీ చేయాల్సిన సమయంలో కూలీల కొరత, ఒకేసారి పెద్దకమతాల్లో మందులు చల్లే అవకాశం లేక రైతులు పంటని రక్షించుకోలేకపోతున్నారు. పొలాలకు పురుగు మందులు చల్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. డ్రోన్‌ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు. తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగు మందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్‌లో పొందుపరిచారు. 

మామూలు స్ప్రే వల్ల పురుగు మందులు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. డ్రోన్‌లో అందుకు ఆస్కారం ఉండదు. పది మంది కూలీలు చేసే పనిని డ్రోన్‌ ఒక్కటే చేస్తుంది. పది నిమిషాల్లో ఎకరం పొలంలోని పంటనంతటిపై మందు చల్లేస్తుంది. అది కూడా నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలన్నింటికీ సమానంగా మందు పిచికారీ చేస్తుంది. సాధారణంగా పిచికారీ చేసే కంటే డ్రోన్‌ 40 నుంచి 60 శాతం సమర్థంగా మొక్కలకి మందు చేరవేస్తుంది. ప్రస్తుతం 3 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. 

డ్రోన్ల వాడకంతో మరో సౌలభ్యం కూడా ఉంది. మొబైల్‌ యాప్‌, జీపీఎస్‌ మ్యాపింగ్‌, వెబ్‌ల్యాండ్‌ అనుసంధానం ద్వారా పొలం సర్వే నంబర్లు, విస్తీర్ణం తెలియడంతో పాటు నిర్ణీత ప్రదేశంలోనే ఎగురుతూ మందుని చల్లుతుంది. మరోసారి అదే చోట మందు పిచికారీ చేయడం తేలికవుతుంది. రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువులు వేసే డ్రోన్లని కూడా తయారీ సంస్థలు రూపొందించాయి. పంటకు ఏ పురుగు ఆశించింది? ఏ తెగులు వచ్చిందో తెలుసుకునేందుకు , పంటని విహంగ వీక్షణం చేసి సమస్యని గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి. అత్యాధునిక పరికరాలతో నిమిషాలలో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు చెప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి.

అత్యాధునిక డ్రోన్లు అన్ని కోణాల్లోనూ ఫోటోలు, వీడియోలు తీయగలవు. హెచ్‌డీ నాణ్యతతో, త్రీడైమెన్షన్‌లో దృశ్యాలని బంధించగలవు. అంతే కాకుండా డ్రోన్‌కి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోను ద్వారా పైలట్‌ కంట్రోలర్‌ పొలంలో కావాల్సిన ప్రదేశంవైపు డ్రోన్‌, కెమెరాని తిప్పుతూ ఫోటోలు, దృశ్యాలు చిత్రీకరించే వెసులుబాటు ఉంది. అడ్వాన్స్‌డ్‌ సెన్సార్లు. డిజిటల్‌ ఇమేజింగ్‌ ద్వారా పంటకి సంబంధించిన నాణ్యమైన చిత్రాలు తీసుకుని విశ్లేషించే సౌలభ్యమూ ఉంది. మనిషి చూపుకి అందని ఎన్నో విషయాలు డ్రోన్‌ సెన్సార్లు పసిగడతాయి. సాధారణంగా బర్డ్స్‌ ఐ వ్యూ, ఇన్‌ఫ్రారెడ్‌ వ్యూ అనే రెండు విధాలుగా చిత్రాలు తీయవచ్చు. నీటి సమస్య, నేలతీరు, చీడపీడల ప్రభావం వంటి వాటిని మొదటిదాని ద్వారా తెలుసుకోవచ్చు. 

ఇన్‌ఫ్రారెడ్‌ వ్యూ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, చీడపీడలబారిన పడ్డ మొక్కల మధ్య తేడాని గుర్తించవచ్చు. మొక్క ఆకుల ఆరోగ్యం, నాణ్యత ఆధారంగా డ్రోన్లకి అమర్చిన ఇన్‌ఫ్రారెడ్‌ లైట్లు వెలుగుతాయి. ఈ లైట్లు వెలిగే తీరు, రంగులు బట్టి మొక్కల ఆరోగ్యం తెలుసుకోవచ్చు. ఇలా పొలంలో అణువణువునా తీసిన ఫోటోలు, దృశ్యాలని కంప్యూటర్‌ ద్వారా చూసి తదనుగుణంగా చీడపీడల నివారణ చర్యలు చేపట్టవచ్చు. పొలంలో దిగడం సాధ్యం కాని చోట గాల్లో అంచనాలు కట్టి వివరాలు నమోదు చేస్తున్నారు. రైతుల సహనాన్ని పరీక్షించి చివరికి ఉసూరుమనిపించే ఈ విధానం ఇకముందు మారబోతోంది. విలువైన సమయాన్ని ఆదాచేసి మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో సైతం అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసే విహంగాలు అందుబాటులోకి వచ్చాయి. పంట నష్టం అంచనాలో సమగ్ర వివరాలకోసం అత్యాధునిక డ్రోన్‌ పరికరాల వాడకం ఈమధ్యకాలంలో మొదలైంది. మూడు కిలోమీటర్ల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటల స్థితిగతులను సర్వే చేసి ఫోటోలను తీసే డ్రోన్లను గతేడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాపట్లలో తొలిసారి ప్రయోగాత్మకంగా వాడింది. 

డ్రోన్‌ల వాడకం ద్వారా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో వివరాల సేకరణ సులభమవుతుంది. జీపీఎస్‌ పరిజ్ఞానం వల్ల ఏయే ప్రాంతాల్లో ఫోటోలు తీసిందనేది తెలియడమే కాకుండా. వాటి వివరాలను మ్యాపింగ్‌ చేస్తుంది. డ్రోన్ల ద్వారా అధికారులకి సర్వే నిర్వహణ తేలికవడంతో పాటు అటు రైతులకి సకాలంలో పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఒక్క మందుల పిచికారీ, పంట నష్టం సర్వే మాత్రమే కాకుండా నీటి వనరులు, నేలలోని పోషకాలు గుర్తించే డ్రోన్లు తయారయ్యాయి. అపరాలు, వాణిజ్య పంటల ఎదుగుదల, చీడపీడల ఉదృతని సమీక్షించడానికి డ్రోన్‌ తీసిన ఛాయాచిత్రాలు, దృశ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అసలు ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి? డ్రోన్లను వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి? కేంద్రం మార్గదర్శకాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 

పైలట్‌ కంట్రోలర్‌, రెక్కలు, ఛార్జర్‌, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్‌ మెమొరీ కార్డులు, టాబ్లెట్‌, క్లౌడ్‌ ప్రాసెసింగ్‌కి సమాచారం పంపే సాఫ్ట్‌వేర్‌ ఇవీ ప్రాథమికంగా డ్రోన్‌ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్‌ సిస్టమ్స్‌, చిన్నపాటి జీపీఎస్‌ మాడ్యూల్స్‌, అధిక శక్తి కలిగిన కంప్యూటర్‌ ప్రాసెసర్లు, చిన్నపాటి డిజిటల్‌ రేడియోస్‌ అన్నవి డ్రోన్లలోని నూతనత్వాలు. మన దేశంలో ఐదు రకాల పరిమాణంలో డ్రోన్లు వాడడానికి కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అవి నానో, మైక్రో, మిని, స్మాల్‌, లార్జ్‌. కనిష్టంగా 250 గ్రాములు, గరిష్టంగా 150 కిలోల వరకు బరువుంటాయి. డ్రోన్లు వినియోగించడానికి దేశంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 250 గ్రాములకంటే తక్కువ బరువున్న నానోడ్రోన్ల వాడకానికి ఎటువంటి లైసెన్సు అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల వాడకానికి సంబంధించి కొత్త విధానం తీసుకొస్తోంది. పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించి, డ్రోన్‌లకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లనూ తప్పనిసరి చేయబోతోంది. ఇక డ్రోన్‌ పనిచేసే విషయానికి వస్తే… పైలట్‌ కంట్రోలర్‌, మొబైల్‌ యాప్‌, స్మార్టుఫోన్‌ లేదా కంప్యూటర్‌ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. వైమానిక ఇమేజింగ్‌ మ్యాపింగ్‌ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో నడిపించవచ్చు. డ్రోన్‌ ప్రత్యేకతలు, పనితనంరీత్యా రోజు రోజుకి వీటి అవసరం, వినియోగం పెరుగుతోంది.

రైతులు ఎరువులు, పురుగుమందులు చల్లడానికి కూలీలను వెతుక్కోవాల్సిన తిప్పలు తప్పుతాయి. ఎంత పెద్ద కమతాల్లోనైనా పొలం గట్టుపైనే నిలబడి ఒక్క డ్రోన్‌తో నిమిషాల్లో మందులు పిచికారీ చేసేయవచ్చు. ఒక్కసారి డ్రోన్‌ని చేనంతా తిప్పేసి పంట ఎదుగుదల, చీడల జాడని పసిగట్టేయవచ్చు. సూక్ష్మంలో మోక్షంలా బుల్లి విహంగాలతో అద్భుత ప్రయోజనాలున్నా ప్రస్తుతానికైతే ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే. డ్రోన్‌ సైజు, సామర్థ్యాన్ని బట్టి లక్షన్నర నుంచి 10 లక్షల వరకు పలుకుతున్నాయి. మిగతా యంత్రాల మాదిరిగా ప్రభుత్వమే ప్రతి గ్రామానికి సరఫరా చేస్తే సామాన్య రైతులు వినియోగించుకోగలుగుతారు. ఒకే రకం పంట పొలాల్లో ఒకేసారి పిచికారీ చేయడం వల్ల చీడపీడల తీవ్రత తగ్గుతుంది. ఈ పయనంలో కొన్ని సాంకేతిక అవరోధాలని అధిగమించాల్సిన అవసరముంది. నీడ, వెలుతురు సమస్యలతో ఫోటో నాణ్యత తగ్గే పరిస్థితులకి పరిష్కారం కనుగొనాలి. అలాగే డ్రోన్లు తీసిన ఫోటోలని పరిశీలించి నివారణ మార్గాలు సూచించే వ్యవస్థ, వ్యక్తులను తయారు చేయాలి. చట్టపరంగా, భద్రతపరంగా డ్రోన్లను ఉపయోగించడానికి పైలెట్లకి శిక్షణ ఇవ్వాలి. 

అన్నింటికంటే ముఖ్యంగా పంటలపై మూడు నాలుగు అడుగుల ఎత్తు నుంచి గాలిలో రసాయన పురుగుమందులు పిచికారీ చేయడం ద్వారా తలెత్తే సమస్యలు, పర్యావరణ కాలుష్య, ఆరోగ్య ముప్పు అంశాలపై దృష్టి పెట్టాలి. అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు చల్లడానికి, శ్రమ, శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి ఉపయోగపడుతుండటంతో ఇవి ఎక్కువ మందినే ఆకర్షిస్తున్నాయి.

డ్రోన్‌ల వినియోగంలో సవాళ్లు:

డ్రోన్ల వినియోగం అనేది పూర్తిగా సాంకేతికతతో కూడుకునట్టువంటి అంశం, రైతులు సులువుగా వినియోగించలేరు మరియు డ్రోన్ల కొనుగోళ్లు అనేది సామాన్య చిన్న, సన్నకారు రైతులకు ఖర్చుతో కూడుకునట్టువంటిది మరియు డ్రోన్‌లను వినియోగించేటపుడు విద్యుత్‌ స్తంభాలు, పొలం మధ్యలోగల చెట్లు వీటికి అడ్డంకిగా మారవచ్చు.

డ్రోన్‌ల ఉపయోగం కొరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఎస్‌ వోపి (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) జారీ చేసింది, ఇది డ్రోన్లు, డ్రోన్‌ పైలట్లు మరియు డ్రోన్‌ ఆపరేటర్లు ఏరియల్‌ క్రిమిసంహారక పిచికారీ ఆపరేషన్‌ సమయంలో అనుసరించాల్సిన సూచనలు, నిబంధనలు మరియు ఆవశ్యకతలను జాబితా సూచిస్తుంది అవి :

  • క్రిమిసంహారిణి పిచికారీ చేసే ప్రాంతాన్ని డ్రోన్‌ ఆపరేటర్‌ ద్వారా డ్రోన్‌ పైలట్‌ ఆ పరిసరాలను ముందు మార్క్‌ చేయాలి.
  • ఆమోదించబడ్డ క్రిమిసంహారకాలను మాత్రమే ఉపయోగించాలి.
  • ప్రథమ చికిత్స సదుపాయాలను ఆపరేటర్‌లకు అందించాలి.
  • ఆపరేషన్‌కు సంబంధం లేని జంతువులు లేదా వ్యక్తులు నిర్ధిష్ట కాలం పాటు ఆపరేషన్‌ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించరాదు.
  • డ్రోన్‌ పైలట్‌లు క్రిమిసంహారకాల యొక్క క్లినికల్‌ ప్రభావాలతో సహా క్రిమిసంహారకాల స్పెషలైజేషన్‌లో ట్రైనింగ్‌ను పొంది ఉండాలి.

డా.ఎస్‌. లోకేష్‌ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), ఫోన్‌: 99485 42942; డా. కిరణ్‌ కుమార్‌ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము), డా. విజయ్‌ కుమార్‌ నాయక్‌ (సస్య రక్షణ విభాగము), హరి సాదు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), డా. ఆర్‌. సుజాత, శాస్త్రవేత్త (గృహవిజ్ఞానం), డా. లలిత శివ జ్యోతి, ప్రోగ్రాం-కో ఆర్డినేటర్‌, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు.