పాడిపరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ అనుబంధరంగం జీవాల పెంపకం. ఒకప్పుడు కుల వృత్తిగా ఉన్నా ప్రస్తుత వాణిజ్య సరళిలో చాలామంది జీవనోపాధి కోసం గొర్రెల ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేసే సంప్రదాయ విస్తృత పద్ధతిని అలాగే షెడ్‌లలో ఉంచి మేపే పాక్షిక సాంద్రపద్ధతులను పాటిస్తున్నారు.
వర్షాకాలంలో గొర్రెల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే. ముఖ్యంగా ఆరుబయట తిరిగే జీవాలు పచ్చిగడ్డిని తింటూ, గుంటలలోని నీటిని తాగుతూ, తొలకరి జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో జీవాలు పలురకాల రోగాలకు గురౌతాయి. చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పిపిఆర్ వంటి రోగాలు వచ్చి జీవాలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి జీవాలను రక్షించడానికి యజమానులు పలురకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
బ్యాక్టీరియా వల్ల కలిగే రోగాలు
చిటుకువ్యాధి: సంప్రదాయ పద్ధతిలో మేసే గొర్రెలకి మేత పుష్కలంగా దొరికినా వ్యాధులు సోకే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. వర్షాకాలంలో తొలకరి జల్లులకి మొలచిన గడ్డి తిని చిటుకు వ్యాధి సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ టైప్-డి ద్వారా వస్తుంది. అన్ని వయసు గొర్రెలు ఈ వ్యాధికి గురౌతాయి. అందువలన తొలకరి జల్లులు కురిసే ఒక నెల ముందు చిటుకు వ్యాధి టీకాను గొర్రెలకు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి గొర్రెలను కాపాడవచ్చు.
కాలిపుండు వ్యాధి: వర్షాకాలంలో చిత్తడినేలలలో ఎక్కువసేపు తిరగడం వలన బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన గొర్రెల గిట్టల మధ్యభాగం ఎర్రగా కందుతుంది. కుంటుతూ నడుస్తాయి. వ్యాధిసోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేసి యాంటిబయోటిక్స్ పశువైద్యుని పర్యవేక్షణలో వేయించాలి. వ్యాధిసోకిన గిట్టలను 10% ఫార్మలిన్ మరియు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచాలి. ఈ వ్యాధికి టీకాలు ఉండవు. గొర్రెలను బురద నేలలో ఎక్కువగా తిరగకుండా చూడాలి.
సూక్ష్మాతి సూక్ష్మజీవుల వల్ల కలిగే రోగాలు
పిపిఆర్: గొర్రెల్లో అధిక నష్టాన్ని కలిగించే మరొక రోగం పిపిఆర్. దీనిని పారుడు రోగం అంటారు. ఇది సూక్ష్మాతిసూక్ష్మమైన జీవుల వల్ల గొర్రెలకి సోకుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. నివారణమే ముఖ్యం. సంవత్సరంలోపు పిల్లల్లో ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి తీవ్రమైన థలో శ్వాసకోశ మరియు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అధిక జ్వరం, ముక్కు నుంచి పలుచటి స్రవాలు కారుతాయి. ఇది తీవ్ర థలో చీములాగా మారి జీవాల నుంచి దుర్వాసన వస్తుంది. రక్తము మరియు జిగురుతో కూడిన విరేచనాలు అవుతాయి. నోటి పూత పూస్తుంది. పిపిఆర్ సోకిన గొర్రెల్లో అధిక నష్టం కలగకుండా యాంటీబయోటిక్ మందుల్ని వాడాలి. నోటి పూత వల్ల ఆహారం తీసుకోలేవు. అందువలన జావ మరియు ఓఆర్‌యస్ కలిపి త్రాగించాలి. క్రమం తప్పకుండా పిపిఆర్ టీకాలు వేయించాలి. మూడు మాసాలు దాటిన గొర్రె పిల్లల్లో టీకాలు వేయించాలి. ఇలా చేయడం వలన గొర్రెల మందలో ఈ వ్యాధిని వ్యాప్తిచెందకుండా చూడవచ్చు.
నీలినాలుక: వర్షాకాలంలో ఈగలు, దోమలు, బాహ్యపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. క్యులికోయిడ్స్ అనే దోమ కాటు వలన ఆరోగ్యంగా ఉన్న గొర్రెలలో ఆర్బోవైరస్ సంక్రమించి నీలినాలుక వ్యాధికి గురౌతాయి. ఈ వైరస్ రక్తనాళంను నాశనం చేస్తాయి. రక్తం గడ్డకట్టకపోవడం వలన వివిధ శరీర భాగాల్లో రక్తస్రావంతో పాటు నీరు చేరి గొర్రెలు చనిపోతాయి. నాలుకలోని రక్తనాళాలు వాచిపోవడం వలన నాలుక నీలిరంగులోకి మారిపోతుంది. అధిక జ్వరం, ముక్కు నుంచి జిగురు వంటి ద్రవం కారుతుంది. కాళ్ళ గిట్టలు ఎర్రగా వాచిపోతాయి. దాని వలన గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఆకలి మందగిస్తుంది. మరియు నోటిలో పుండ్లు అవుతాయి. జావ మరియు ఓఆర్‌యస్ త్రాగించాలి. వ్యాధి నివారణ కోసం నీలినాలుక టీకాలు అందుబాటులో ఉన్నాయి. మూడు మాసాలు దాటిన పిల్లల్లో ఈ టీకా వేయాలి. నెల తర్వాత బూస్టర్ డోస్ వేయాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టీకాలు వేయడం వల్ల వ్యాధిని నివారించి అధిక దిగుబడిని పొందవచ్చు.
గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. గొర్రెలు కుంటుతూ మేత మేయవు. ఈ వ్యాధి వ్యాపించి పెంపకందార్లకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. గొర్రెలలో తీవ్రమైన జ్వరం వస్తుంది. నోరు, నాలిక, గిట్టల మధ్యలో పుండ్లు అవుతాయి. చూడి గొర్రెలు ఈడ్చుకుపోతాయి. వ్యాధిసోకిన జీవాలను మందనుంచి వేరు చేసి చికిత్స చేయాలి. యాంటీబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు ఇవ్వాలి. నోటిపుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రవంతో కడిగి బోరిక్ గ్లిసరిన్ ఆయింట్‌మెంట్ పూయాలి. గాలికుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుల వల్ల కలిగే రోగాలు ఒక్కసారి మందలో ప్రవేశిస్తే టీకాలు వేయించరాదు. వైరస్ సోకిన జీవాలను గుర్తించి వెంటనే మంద నుంచి వేరు చేయాలి మరియు తగిన చికిత్స అందించి వ్యాధి తగ్గిన తరువాత మందలో ప్రవేశపెట్టాలి.
కొత్తగా సంతలో కొన్న జీవాలను మందలో కలిపేముందు వాటిని వేరుగా ఉంచి వ్యాధి నిరోధక టీకాలు విప్పించి వ్యాధులు ఏమీ లేవు అని నిర్ధారించిన తర్వాత మందలో ప్రవేశపెట్టాలి.
బూజు పట్టిన ఆహారాన్ని గొర్రెలకు మేపితే అఫ్లాటాక్సికోసిస్ అనే ఫంగల్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువలన రైతులు గొర్రెలకు ఆహారం వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ తొలకరి జల్లులకు గొర్రె పిల్లల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులు సోకి 30% మరణాలు సంభవిస్తాయి. గొర్రెల శాలలో తేమశాతం పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మలమూత్రాలను తీసివేస్తూ శుభ్రపరిచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలంలో జీవాలు వ్యాధిబారిన పడితే వెంటనే పశువైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ద్వారా రైతులు నష్టాలబారిన పడకుండా ఉంటారు.
డా. కె. వాణి, పి.జి స్కాలర్, పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, సెల్: 9640697636

