మనతోపాటు ఈ విశ్వంలో జీవనాన్ని కొనసాగిస్తున్న అనంత జీవకోటి, ఈ విశ్వంలో ఉన్న అన్నీ కూడా ప్రకృతిలో భాగమే. మిగతా వాటి గురించి ప్రక్కన పెడితే భూమండలంలో జీవించే ప్రాణికోటి మొత్తం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంది. మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం. ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో నుంచి మనం పొందుతున్నాము. ఈ విషయం అందరికీ తెలిసిందే కాని చాలామంది ఈ విషయాన్ని గ్రహించకుండా ప్రకృతిని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకృతి అంటే ఏదో తమకు సంబంధించినది కాదు అనే భావంతో చాలామంది తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకృతిని అశ్రద్ధ చేయటం వలన, ప్రకృతికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వలేకపోవడం వలన  అనేక అనర్థాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా కూడా జరుగుతూనే ఉంటాయి అనే మాట అక్షర సత్యం. ప్రకృతి వలన జరిగే అనార్థల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే ఇటీవల ఉద్భవించిన కరోనాను ఉదాహరణగా తీసుకుంటే అందరికీ బాగా అర్థం అవుతాది కరోనా ఇటీవల జరిగిన వినాశనం కాబట్టి అందరికీ గుర్తు ఉంటుంది. ప్రపంచం మొత్తం కరోనాతో అతాలకుతలం అయ్యిందనే విషయం అందరికీ తెలిసిందే. 

కరోనా వలన కొంతమంది చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది తక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అర్ధం అవుతుంది. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ, ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యేవారు కరోనా వలన పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ప్రకృతికి దూరం జరిగి, ప్రకతికి విరుద్ధమైన జీవనశైలికి అలవాటు పడ్డవారు కరోనా వలన ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అక్షర సత్యం. ఈ ఉదాహరణతో ప్రకృతి యొక్క ప్రాముఖ్యత సులభంగా తెలుసుకోవచ్చు. మనము మరియు మనతోపాటు జీవనాన్ని కొనసాగించే అనంత జీవకోటి క్షేమంగా జీవనాన్ని కొనసాగించాలంటే ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతిని నాశనం చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. మిగతా రంగాలను ప్రక్కన పెడితే వ్యవసాయ రంగం కూడా ప్రకృతిని ఇబ్బంది పెట్టడములో తనవంతు పాత్రను పోషిస్తుందనడంలో సందేహం లేదు. దాని ఫలితంగానే వ్యవసాయరంగంలో అనేక ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. రైతులు అనేక రకాలుగా నష్టాలను భరించవలసి వస్తుంది. విష రసాయనాలతో పండించిన ఆహారాలను రైతులు ప్రజలకు అందిస్తున్నారు. విష రసాయనాలతో నేల, నీరు, ఆహారం, వాతావరణం కలుషితమవుతుంది. అందువలననే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాలను గమనించిన చాలామంది ఔత్సాహికులు ప్రకృతిని ఇబ్బంది పెట్టని సాగు పద్ధతుల వైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ కోవకి చెందుతారు హైదరాబాదు శివారు ఘట్‌కేసర్‌లో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్న విజయ్‌.

వ్యవసాయరంగంతో ఏలాంటి ప్రత్యక్ష సంబంధం లేని విజయ్‌ ఉన్నత చదువులు చదివి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో మనం తినే ఆహారంలో ఉండే విష రసాయనాల గురించి తెలుసుకుని తన గమ్యం ఆరోగ్యకర ఆహారాన్ని సమాజానికి అందిస్తూ రసాయన అవశేషాలు లేని భూమిని తరువాత తరాలకి అందించడమే అని తలచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగు పెట్టాడు. తనకు సొంత భూమి లేదు కాబట్టి ఘట్‌కేసర్‌ సమీపంలోని అవిషాపూర్‌లో కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని 2015 వ సంత్సరం నుండి పూర్తి సేంద్రియ పద్ధతులో వరి, మామిడి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు నాటుకోళ్ళను కూడా పోషిస్తూ గుడ్లను వినియోగదారులకు అందిస్తూ వస్తున్నారు.

తాము వ్యవసాయంలోకి ప్రవేశించిన ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినాకాని వెనుకంజ వేయకుండా అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు నడుస్తూ తమ సమస్యలకు కొంతలో కొంత పరిష్కారంగా సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల దుకాణాన్ని హైదరాబాద్‌ నగరంలోని అల్వాలు ప్రాంతంలో ప్రాచీన పేరుతో ఏర్పాటు చేశారు. సేంద్రియ  సాగులో ఎదరుయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం కావాలంటే తమ సేంద్రియ ఉత్పత్తులను ఆశాజనకమయిన ధరలకు వినియోగదారులకు నేరుగా అమ్మగలగాలి. దానికి సరైన దారి సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం దుకాణం కాబట్టి అటువైపు అడుగులు వేశారు. వినియోగదారులకు అవసరమయిన అన్ని వస్తువులను అందుబాటులో ఉంచాలి కాబట్టి తాము పండించలేని ఆహార ఉత్పత్తులను తోటి రైతుల చేత పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయించి రైతుల వద్ద నుంచి మంచి ధరలకు ఉత్పత్తులను కోనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు అన్ని సాంకేతిక సలహాలను సమయానుకూలంగా అందిస్తూ రైతులు ఆరోగ్యకర దిగుబడి సాధించటములో తమవంతు పాత్రను పోషిస్తున్నారు.

మామిడి: మిగతా ఆహార పదార్థాల కంటే మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాము సొంతంగా మామిడి సాగు చేయడముతో పాటు తోటి మామిడి రైతుల వద్ద నుంచి కూడా మామిడి కాయలు కొనుగోలు చేస్తూ సంవత్సరానికి 10000 కిలోలకు తగ్గకుండా ఆరోగ్యకరమయిన, రుచికరమైన మామిడి కాయలను వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తున్నారు. ఒక్కసారి ఈ మామిడి కాయల రుచి చూసిన వినియోగదారులు తిరిగి తిరిగి కొనుగోలు చేస్తున్నారు. మొదటలో 100 మందితో మొదలైన వినియోగదారుల సంఖ్య ప్రస్తుతానికి 3000 పైగా పెరిగింది. మామిడి కాయల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకపోవటం వలననే వినియోగదారుల సంఖ్య పెరిగింది.

మామిడితో పాటు వరి, వివిధ రకాల ఆకుకూరలు, గోరుచిక్కుడు, చిక్కుడు, టమాట, చెర్రి టమాట లాంటి వాటిని పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు దుక్కిలో పశువుల ఎరువు, గొర్రెల, మేకల ఎరువు అందించడంతో పాటు పంచగవ్య, జీవామృతం, థపర్ణి కషాయం, నీమాస్త్రం లాంటి వాటిని ఉపయోగిస్తూ ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో ఆరోగ్యకర దిగుబడులు సాధిస్తూ సొంతంగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. మరిన్ని వివరాలు 9848312988 కి ఫోను చేసి తెలుసుకోగలరు.     

మామిడి కాయలను ఇబ్బంది పెట్టకుండా సహజంగా పండనివ్వాలి

మనం పొందే ఆహారం ప్రకృతి నుంచే లభిస్తుంది కాబట్టి ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పొందగలిగితే ఆ ఆహారం రుచిగా, ఆరోగ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మామిడిని ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది రైతులు వివిధ రకాల కారణాలు, సమస్యల వలన పూర్తిగా తయారు కాని మామిడి కాయలను వివిధ రకాల పద్ధతులతో మాగించి మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి అవి సరిగ్గా రుచిగా లేకపోవడంతో పాటు అరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పూర్తిగా తయారయిన కాయలను మాత్రమే చెట్టునుంచి కోసి, ఆ కాయలను 40 డిగ్రీల సెంటీగ్రేడు ఉన్న వెచ్చని నీటిలో కడిగి అవి ఆరిన తరువాత వరిగడ్డిలో మాగపెట్టి వినియోగదారులకు అందిస్తున్నారు. ఇక్కడ వీరు మామిడి కాయలను ఇబ్బంది పెట్టకుండా సహజ సిద్ధంగా పండే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి రుచి బాగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు మరలా మరలా కొనుగోలు చేస్తున్నారని విజయ్‌ అంటున్నారు. బంగినపల్లి, చిన్నరసాలు, పెద్ద రసాలు, థేరి, కేసరి లాంటి రకాలను ఎక్కువగా అమ్మకం చేస్తున్నారు.  

వినియోగదారుల ఆరోగ్యం, ఆనందం మాకు తృప్తినిస్తుంది

వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాము కాబట్టి వినియోగదారుల సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. మేము అందించిన మామిడికాయలు తిన్న వినియోగదారులు మామిడి కాయల రుచిని ఆస్వాదించిన తరువాత తమ ఆనందాన్ని మాకు తెలియచేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మామిడి రుచి ఇలా ఉంటుందనే విషయం మేము అందించిన మామిడి పండ్లను తిన్న తరువాత తెలిసిందని, నిజమైన మామిడి రుచిని తెలియ చేసినందుకు మాకు కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్‌లు పంపుతుంటారు. ఇలాంటి మెసేజ్‌లు మాకు ఎంతో తృప్తిని కలుగ చేస్తున్నవని, సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందించే సామాజిక బాధ్యత గల వ్యాపకంలో ఉండటము మాకు చాలా ఆనందంగా ఉందని విజయ్‌ అభిప్రాయపడుతున్నాడు.