గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొన్నట్లయితే గతంలో మహిళలను పలు రకాల వివక్షలకు బలిచేశారు. మహిళలను అన్ని విధాలుగా అణచి వేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా మహిళలను అణచి వేస్తూనే ఉన్నారు. మహిళలను బానిసలుగా, ఆటబొమ్మలుగా, విలాస వస్తువులుగా చూసిన సమాజం మనది. అప్పట్లో గ్రంథాలు వ్రాసినవారు అందరూ కూడా మగవారే కాబట్టి ఆడవారిని 'అణచి వేయడానికి, మగవాడు చెప్పినట్లు ఆడటానికి మాత్రమే ఆడమనిషి పుట్టింది' అనే విధంగా గ్రంథాలలో వ్రాశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంతమంది అయితే ఆడమనిషి పిల్లలను కనే యంత్రం మరియు భర్తకు సేవ చేసే పనిమనిషి మాత్రమే అన్నట్లు ప్రవర్తించారు. ఇంకా కూడా కొన్ని చోట్ల అలానే ప్రవర్తిస్తున్నారు. దానిని అవకాశంగా తీసుకుని కొంతమంది మగవారు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోగా చులకనగా చూడటం మొదలయ్యింది. ఆడమనిషి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే హేళనగా చూడటం, డబ్బు సంపాదన కోసం ఇల్లుదాటి ఆడమనిషి బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఆశచూపి లొంగదీసుకోవచ్చు అనే భావనను మనసులో పెట్టుకున్న మగవారు అనేకమంది ఉన్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంతమంది మగవారు అయితే ఆడమనిషి కనిపిస్తే అవకాశం ఉంటే గిల్లుదామని, గిచ్చుదామని, ఎక్కడపడితే అక్కడ పట్టుకుందామని ప్రయత్నించే మగవారు బస్పులో, రైళ్లలో, రద్దీ ప్రదేశాలలో, ఆఫీసులలో ఉంటూనే ఉంటారు. ఇలాంటి పనికిమాలిన చేష్టలు చేస్తూ మహిళలను ఏడిపించే మగవారు తమ అక్కకో, చెల్లికో, కూతురుకో, భార్యకో ఇలాంటి పరిస్థితులే వేరే మగవారి నుంచి ఎదురైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలిగితే ఎలాంటి వెధవ పనులు చేయరు. ఇలాంటి మగవారు పైకి మాత్రం నీతులు చెబుతూ బయటకు మాత్రం మంచిగా నటిస్తూ ఆడమనిషిని విలాస వస్తువుగానే చూస్తూ అణగదొక్కాలనే చూస్తుంటారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమాజంలో కూడా కొంతమంది అభ్యుదయ భావాలు గల మగవారు ఆదర్శంగా ఆలోచించి ఆడమనిషి కూడా మగవారితో సమానము అని భావించి వారికి అవకాశం ఇస్తే మగవారిలాగానే అన్ని రంగాలలో ముందడుగు వేయగలరని నమ్మి ఆడవారి ప్రతిభని సమాజానికి తెలియచేయాలనుకునే జ్ఞానవంతులు తమ కుటుంబంలోని మహిళలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇచ్చి ప్రోత్సహిస్తూ ఆడవారిని ఎదగనిస్తూ సరైన సహకారం అందిస్తే మహిళలు ఏరంగంలోనైనా, చివరకు వ్యవసాయ రంగంలో కూడా రాణించగలరని నిరూపిస్తున్నారు. ఈ కోవకు చెందిన అభ్యుదయ భావాలున్న యుగేష్ ఆదర్శంగా ఆలోచించి తన భార్య ఐశ్వర్యను ప్రోత్సహించి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టించి అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగటానికి తనవంతు ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాడు.
యుగేష్ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తున్న క్రమంలో తన అర్థాంగి ఐశ్వర్య గృహిణి బాధ్యతలు నిర్వహిస్తుంది. ఉన్నత చదువులు చదివిన ఐశ్వర్య తన ఖాళీ సమయాన్ని చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్నకుండీలు లేదా సిరామిక్ పాట్‌లలో పెట్టి ఆన్‌లైన్‌లో అమ్మకం చేయడం మొదలు పెట్టింది. అవి అమ్మకం చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతూ ఉండేది. ఐశ్వర్యకు మొక్కల మీద ఉన్న శ్రద్ధను గమనించిన భర్త యుగేష్ తన భార్యకు ప్రోత్సాహాన్ని అందిస్తే వ్యవసాయ రంగంలో కూడా రాణించగలదని గ్రహించి తాను ఉద్యోగం కొనసాగిస్తూనే ఐశ్వర్యను పంటల సాగులో అదీను సేంద్రియ సాగులోకి ప్రోత్సహించటం జరిగింది.

తమకు సొంత పొలం లేదు కాబట్టి హైదరాబాదు శివారులో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని నాలుగున్నర సంవత్సరాలు ఆ భూమిలో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయడంతో పాటు, నాటు కోళ్ళను కూడా పెంచుతూ నాటు కోడి మాంసం మరియు నాటుకోడిగ్రుడ్లు అమ్మకం చేస్తూ వస్తున్నారు. వీరి నివాసగృహానికి పొలం దూరంగా ఉండటంతో నిర్వహణ ఇబ్బందిగా ఉందని గ్రహించి ఆ పొలాన్ని వదలి వేసి ఇంటి సమీపములోనే 2023వ సంవత్సరం జనవరి నెలలో ఎకరంన్నర పొలాన్ని కౌలుకి తీసుకుని ఆ పొలంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, కోళ్ళ పెంపకం, స్ట్రాబెర్రీ సాగు మొదలు పెట్టి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాబెర్రి సాగు మరియు కొన్ని రకాల ఆకుకూరల సాగుతో పాటు నాటుకోళ్ళ పెంపకం కొనసాగుతుంది.
స్ట్రాబెర్రి: అర ఎకరంలో స్ట్రాబెర్రి పంట సాగులో ఉంది. ఇందుకుగాను స్ట్రాబెర్రి మొక్కలను ఒక్కొక్కటి 13/-ల చొప్పున పూణే నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దుక్కిలో కోడి ఎరువు, ఆవుల ఎరువు, వర్మికంపోస్టు మిశ్రమాన్ని అందించి అర ఎకరం పొలాన్ని బెడ్‌లు చేసుకున్నారు. బెడ్‌కి బెడ్‌కి మూడు అడుగుల దూరం పాటించి బెడ్‌లపై మల్చింగ్ షీటు పరచారు. మల్చింగ్ షీటుకు అడుగు దూరంలో బెజ్జాలు చేసుకుని ఆ బెజ్జాలలో మరలా సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని అందించి నవంబరు నెలాఖరులో అర ఎకరానికి గాను 5000 మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడంతో సుమారు 2000 మొక్కలు చనిపోగా మిగిలిన 3000 మొక్కలను పోషిస్తూ వచ్చారు. మొక్కలు నాటిన తరువాత 10 నుంచి 15 రోజుల వ్యత్యాసంలో రెండుసార్లు సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని అందించారు. వారానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని డ్రిప్పు ద్వారా అందిస్తూ వస్తున్నారు. జీవ సంబంధిత కీటకనాశనులను ఒకసారి డ్రిప్పుద్వారా నేలకు అందించారు. వివిధ రకాల చీడపీడల నివారణకు పుల్లటి మజ్జిగ, అగ్నాస్త్రం, గంజి ద్రావణం,, నీమాస్త్రం మొదలగు వాటిని ప్రతి మూడు రోజులకు ఏదో ఒకటి పిచికారి చేస్తూ వస్తున్నారు. వీటన్నింటితో పాటు ఎర పంటలుగా ఆముదము, టమాట మొక్కలు, దీపపు ఎర, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ జనవరి మొదటి వారంలో మొదట దిగుబడి పొందగలిగారు. పిబ్రవరి మొదటి వారం వరకు 3000 మొక్కల నుండి 30 కిలోల దిగుబడి పొందారు. పంటను గమనించినట్లయితే ఇంకా 50 కిలోల వరకు దిగుబడి వచ్చేలా ఉంది. కిలో 600/-ల నుంచి 800/-ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని అమ్మటానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

నాటుకోళ్ళు: వీరు వ్యవసాయ రంగంలో అడుగుపెట్టినప్పటినుంచి నాటు కోళ్ళను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర సోనాలికా, అసిల్ క్రాస్, వనరాజా, కడక్‌నాథ్, గిన్నె కోళ్ళు మొదలగు రకాలు అన్నీ కలిపి 250 వరకు ఉన్నాయి. వీటి నుండి ప్రతి రోజు 40 వరకు గ్రుడ్ల దిగుబడి పొందుతూ ఒక్కొక్క గ్రుడ్డును 13 నుంచి 14 రూపాయల వరకు అమ్మకం చేస్తున్నారు. గ్రుడ్లతో పాటు నాటుకోడి మాంసాన్ని కూడా అమ్ముతున్నారు. లైవ్ వెయిట్ అయితే నాటుకోడి కిలో 450/- లకు, కడక్‌నాథ్ కిలో 750/-లకు, కోడిమాంసం అయితే నాటుకోడి మాంసం కిలో 650/-లకు, కడక్‌నాథ్ కోడి మాంసం కిలో 850/-లకు అమ్మకం చేస్తున్నారు. నెలకు 70 నుంచి 80 కిలోల మాంసం అమ్మకం చేస్తున్నారు.
రెండు ఆవులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల ఆకుకూరలు సాగులో ఉన్నాయి. భవిష్యత్తులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు ఇంటిపంట నిర్వహించే వారికి అవసరమయిన మొక్కలను సరఫరా చేయడానికి వీలుగా నర్సరీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. భర్త యుగేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఐశ్వర్య అతి క్లిష్టమైన సేంద్రియ వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి పట్టుదలతో ముందుకు సాగుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తే మహిళలు వ్యవసాయ రంగంలో కూడా రాణింగలరని నిరూపిస్తున్నారు. మరిన్ని వివరాలు 7671075270 / 6302308300 నెంబర్లకు ఫోను చేసి తెలుసుకోగలరు.
దీపపు ఎర : స్ట్రాబెర్రి పంటకు ఒకానొక సమయంలో పొగాకు లద్దె పురుగు విపరీతంగా ఆశించింది. ఆ పురుగు నివారణకు వివిధ రకాల కషాయాలు, జీవ సంబంధిత పురుగు మందులు పిచికారి చేయడంతో పాటు భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ఉండటానికి దీపపు ఎరలను ఏర్పాటు చేశాము. బల్బు క్రింద బక్కెట్లు ఏర్పాటు చేసి బక్కెట్లో 70% నుంచి 80% నీటిని నింపి బక్కెట్ పైన బల్బును వేలాడదీసి సాయంకాలం 6 గంటల తరువాత బల్పును వెలిగించి రాత్రి ఒంటి గంటకు బల్బు ఆగిపోయేలా ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా చేయడం వలన తరువాత పొగాకు లద్దె పురుగు సమస్య స్ట్రా బెర్రి పంటకు రాలేదు అని ఐశ్వర్య వివరించారు.
కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో మహిళల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమాజంలో భర్త సహకారంతో ఐశ్వర్య వ్యవసాయ రంగంలో అదీను సేంద్రీయ వ్యవసాయ రంగంలో అడుగు పెట్టి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఆడవారిని బయటకు పంపడానికే వ్యతిరేకించే పరిస్థితులనుంచి, ‘మగవారితో పోల్చుకుంటే ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు’ అని అనేక మంది మహిళలు నిరూపిస్తున్నారు. సమాజంలో బుద్ధి లేని మగవారి నుంచి ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటూ వివిధ రంగాలలో మహిళలు రాణించగలుగుతున్నారు. ఏ రంగంలో మహిళలు విజయం సాధించినా అందుకు ప్రధాన కారణం తమ కుటుంబంలోని పురుషుల సహకారం, ప్రోత్సాహం అందడం వలననే సాధ్యమవుతుంది. అన్ని రకాలుగా తమ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తన భర్త యుగేష్ నుంచి మంచి సహకారం, ప్రోత్సాహం అందడం వలన నేను ఈ రంగంలో ముందుకు సాగ గలుగుతున్నానని తన కుటుంబసభ్యులకు ఐశ్వర్య కృతజ్ఞతలు తెలియజేశారు.

