పరిచయం : సాధారణంగా జూన్‌ లేదా జులై మొదలుకొని డిసెంబర్‌ వరకు గాలికుంటు, చిటుక వ్యాధి, నీలి నాలుక, ఫుట్‌ రాట్‌ (బురద పుండ్ల వ్యాధి), నిమోనియా, పిపీఆర్‌ (PPR) వంటి వ్యాధులు సోకుతుంటాయి. (PPR) అనేది వైరస్‌ వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స లేదు. నిరోధమే ఉత్తమ మార్గం. గొర్రెలు మరియు మేకల పెంపకంలో అతి నష్టాన్ని కలిగించే వ్యాధి (PPR) దీన్నే మనం పారుడు రోగం అని అంటారు.

వ్యాధి బారినపడు పశువులు : 

ఒక సంవత్సరము వయసు కలిగి ఉన్న మేక మరియు గొర్రె పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

వ్యాధిని ప్రభావితం చేసే అంశాలు :

ఈ వ్యాధి పారామిక్సో గ్రూప్‌కు చెందిన మార్‌టిల్లి వైరస్‌ వలన కలుగుతుంది. 

  • వైరస్‌ వ్యాధిగ్రస్త పశువు యొక్క మల మూత్రములో మరియు ముక్కు మరియు కంటి నుండి వచ్చే స్రావాలలో అధికంగా ఉంటుంది. 
  • సరిపడ గాలి మరియు వెలుతురు అందకపోవడం
  • వైరస్‌తో కలుషితమైన నీటిని మరియు ఆహారము తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుంది.
  • అధికంగా వర్షాలు పడినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
  • వ్యాధి సోకిన గొర్రెలు లేదా మేకలు సంతనుండి కొనుగోలు చేసి కొత్తగా మందలో కలిపినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 

వ్యాధి లక్షణాలు : 

  • శ్వాసకోశ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి.
  • అధిక జ్వరం ఉంటుంది (104-1050ఓ)
  • ఆకలి మందగిస్తుంది, మేత మేయవు.
  • కంటిలోని శ్లేష పొరలు అనేవి ముదురు ఎరుపురంగుగా మారుతాయి.
  • ముక్కు నుండి పలుచటి స్రావాలు కారడం ప్రారంభమవుతుంది, వ్యాధి పెరిగే కొద్ది చీముగా మారుతుంది.
  • జీవాల పెదవులు, నోటి చిగుర్లు నాలుకపై పుండ్లు ఏర్పడుతాయి.
  • జ్వరం సోకిన మూడు రోజుల తరువాత రక్తంలో జిగురుతో కూడిన విరోచనలు వస్తాయి. 
  • శరీరం చల్లబడిపోయి జీవాలు చనిపోయే అవకాశం ఉంది.

చికిత్స : ఈ వ్యాధికి ఎటువంటి వైద్యం లేదు. 

వ్యాధి లక్షణాలకు చేయు చికిత్స : 

  • పశువు శరీర ఉష్ణోగ్రతనుబట్టి ఆంటీపైరెటిక్స్‌ మరియు ఆంటిబయోటిక్స్‌ విరోచనాలకుగాను ఆంటి డయేరియల్‌ ఔషధములను ఇవ్వాలి. 
  • నోటి పుండ్లకు (Borix Powder +Glycerin ) ను పట్టించాలి.

నివారణ : 

  • PPR వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుండి వేరు చెయ్యాలి. 
  • మూడు మాసాలు దాటిన గొర్రెలకు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలి. క్రమం తప్పకుండా టీకాలను వేయించాలి.
  • ఈ టీకాలు వేయించినట్లయితే మూడు సంవత్సరముల వరకు వ్యాధి నిరోధకశక్తి అనేది ఉంటుంది. 

– డా|| యం. వెంకట ప్రసన్న, MVSc, వెటర్నరి డాక్టర్‌, మైదుకూర్‌ (MAVC)

ఫోన్‌ : 8309724436