‘నమస్తే కిసాన్’ అనే దేశీ విత్తనాల సాగును ప్రోత్సహిస్తున్న సంస్థ మరియు సికిందరాబాద్ (వెస్ట్) రోటరీ క్లబ్‌వారు సంయుక్తంగా డిసెంబర్ 24న హైదరాబాద్ (షేక్‌పేట్)లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల నుండి సుమారు 150 మందికి పైగా అభ్యుదయ రైతులు, గోప్రేమికులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తాము పండించిన వివిధ రకాల వరి విత్తనాలు, చిరుధాన్య విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఐటి రంగంలోనూ, బిజినెస్ రంగంలోనూ ఉన్నత విద్యలను అభ్యసించిన యువకులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు, ఆధ్యాత్మిక వేత్తలు, గోప్రేమికులు, దేశీ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల ఉత్పత్తిలో తమ అనుభవాలను సభికులకు ఆసక్తికరంగా వివరించారు.
దేశీయ విత్తనాలను ”భద్రపరచు, సంరక్షించు మరియు విస్తరించు” (Conserve – Protect and Propagate) అనే లక్ష్యంతో కొందరు యువ కర్షకులు నిర్వహిస్తున్న ”నమస్తే కిసాన్” ఎంతైనా ప్రశంసనీయమని సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూనాకు చెందిన యోగి చంద్రకాంత్ కులకర్ణి మహరాజ్ – నిర్వాహకులను అభినందించారు.
సేంద్రీయ కర్షకుడు – రాష్ట్రపతి పురస్కార గ్రహీత మరియు దేశీ విత్తన సంరక్షణ ఉద్యమకారుడు రఘువీర్, బ్రిగేడియర్ గణేశం (పల్లెసృజన), శ్రీమతి సూర్యకళ (మన వూరు-మన బాధ్యత), సుబ్రహ్మణ్యరాజు (గోఆధారిత వ్యవసాయదారుల సంఘం), రొటేరియన్ ఏకాంబరరెడ్డి (ఛైర్మన్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ), రొటేరియన్ శ్రీమతి పద్మినీ ప్రసాద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) విశ్రాంత డీన్ శ్రీమతి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పలు అంశాలపై ప్రసంగించారు.
సంగం డెయిరీ విశ్రాంత అధికారి, వ్యవసాయ పాత్రికేయుడు, గోసేవకుడు డా. అహోబలరావు తన ప్రసంగంలో గోశాలల ఆర్థిక సమస్యల పరిష్కారానికి తమ తమ గోశాలలలోని ఎంపిక చేసిన గోవులను, విశిష్ఠమైన అత్యున్నతమైన దేశీ జాతి పశువుల ఉత్పత్తికి ఏవిధంగా వినియోగించుకోవచ్చో వివరించుటతోపాటు, సులువుగా సేంద్రీయ ఎరువుల తయారీకి మరింత సమర్థవంతమైన ఉత్పత్తికి, పంపిణీకి, వినియోగాలకు యువరైతు క్లబ్బుల ఏర్పాటుకు కొన్ని సూచనలు చేశారు. దేశీ పశువుల ఉత్పత్తి – దేశీ విత్తనాల ఉత్పత్తి మరియు సహజ కీటక నాశకాల వినియోగం – ఈ మూడూ ఒకే వ్యవస్థలో సమన్వయంగా కొనసాగినప్పుడే కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈరోజుల్లో రైతుకూ, దేశానికి మేలు చేకూరగలదని ఆయన అన్నారు. దేశీ విత్తనాల ఉత్పత్తిలో అత్యంత ప్రతిభ కనబరచిన రైతులను, డాక్టర్ అహోబలరావును నిర్వాహకులు సత్కరించారు.
ఈ దేశీ విత్తనాల పరస్పర మార్పిడి కార్యక్రమంలో పాల్గొనదలచినవారు నమస్తే కిసాన్ ఫోన్ నం. 7516841687 మరియు 1800-202-0120 (టోల్ ఫ్రీ) నెంబర్లలో సంప్రదించవచ్చునని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘నమస్తే కిసాన్’ వ్యవస్థాపకులు దుర్గాప్రసాద్ బృందం ఎంతైనా అభినందనీయులు. వివిధ రకాల విత్తనాలతో పాటు రోబోటిక్ వ్యవసాయ యంత్రాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా అలరించింది.

