ప్రతి ఆర్థిక వ్యవస్థలోనూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు విభాగాలుంటాయి. అన్ని దేశాల్లోనూ జాతీయాదాయంలో వ్యవసాయరంగపు వాటా తగ్గుతూ వస్తుంది. పరిశ్రమల వాటా మధ్యస్తంగా ఉండగా, సేవారంగపు వాటా పెరుగుతూ అత్యధిక స్థాయికి చేరింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగపు వాటా 15 నుండి 16 శాతం మధ్య కదలాడుతున్నది. సేవారంగపు వాటా 60 శాతం వాటాగా, పరిశ్రమల వాటా 25 శాతం కన్నా తక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్దదైన అమెరికాలో వ్యవసాయరంగపు వాటా ఒక శాతం కన్నా కూడా తక్కువగా ఉంది. పరిశ్రమల వాటా 17.88 శాతం కాగా, సేవా రంగపు వాటా 77.6 శాతంగా ఉంది. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా దేశాదాయంలో వ్యవసాయరంగపు వాటా 7.1 శాతంగానూ, పారిశ్రామిక రంగపు వాటా 38.3 శాతంగానూ, సేవా రంగపు వాటా 54.6 శాతంగానూ ఉన్నాయి. పేద దేశాల్లో వ్యవసాయరంగపు వాటా ఎక్కువగా ఉండగా, ధనిక దేశాల్లో సేవా, పారిశ్రామిక రంగాలు ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. నేటి పరస్పరాధార ప్రపంచంలో వస్తువులు, సేవలు ఒక దేశం నుండి మరెన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచాదాయంలో 56.3 శాతం ఎగుమతి, దిగుమతి వాణిజ్యం ద్వారా లభిస్తున్నట్లు 2021 సంవత్సరపు లెక్కలు తెలుపుతున్నాయి. అత్యధికంగా చైనా ఎగుమతుల ద్వారా చైనా దేశం 3.4 ట్రిలియన్ డాలర్లను ఆర్జిస్తున్నది. ప్రతి దేశమూ తన ఎగుమతుల్ని పెంచుకోవాలని చూస్తుంది. అదే సమయంలో తమ పౌరులకవసరమైన వస్తువుల్ని, సేవలను దిగుమతి చేసుకుంటున్నది. 2023లో భారతదేశపు ఎగుమతుల విలువ 770 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. భారతదేశపు ఎగుమతులకన్నా దిగుమతుల విలువ సుమారుగా 124 బిలియన్ డాలర్లు ఎక్కువ. దాదాపు చైనా, ఇండియాల జనాభా సమంగా ఉన్నా చైనా ఎగుమతులు భారత్ ఎగుమతులతో పోలిస్తే ఐదు రెట్లుగా ఉన్నాయి. జాతీయాదాయాల్లో కూడా ఈ రెండు దేశాల మధ్య ఇంతే అంతరం ఉంది. భారతదేశం వస్తువాణిజ్యంలో 269 బిలియన్ డాలర్ల కొరత ఉంది. ఐతే సేవారంగ వాణిజ్యంలో భారత్‌కు 145 బిలియన్ డాలర్ల మిగులు ఉండటం వల్ల వాణిజ్య లోటు 124 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతుల్ని పెంచుకొని వాణిజ్య లోటుని తగ్గించుకోవాలని అన్ని దేశాల్లాగే భారతదేశం కోరుకుంటుంది. 2030 కల్లా భారత ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 2000 బిలియన్ డాలర్లుకి చేరుతుందని వాణిజ్య శాఖామాత్యులు పీయూష్ గోయల్ ప్రకటించారు. 2022-23లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2030 కల్లా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఎగుమతుల్ని పెంచడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది. కాని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే నెపంతో పలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని నిషేధించటం, ఆంక్షల్ని విధించటం జరిగింది. ఇలా ఆంక్షలు విధిస్తూపోతే ఎగుమతుల లక్ష్యాలు ఎలా నెరవేరతాయి?
ఆహారోత్పత్తిపై ‘ఎల్‌నినో’ ప్రభావం
వాతావరణ పరిస్థితుల్ని ‘లానినో’, ‘ఎల్‌నినో’లుగా విభజిస్తారు. 2022-23లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైంది. ఆహారోత్పత్తి 329.6 మిలియన్ టన్నులుగా తుది అంచనాలు వెల్లడయ్యాయి. 2022-23 వ్యవసాయ సంవత్సరంలో ‘లానినో’ పరిస్థితులే ఉన్నాయి. కాని 2023-24 వ్యవసాయ సంవత్సరంలో ‘ఎల్‌నినో’ పరిస్థితులుండవచ్చనే అనుమానాన్ని వాతావరణ శాఖ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇండియన్ మెటీరిలియోలాజికల్ డిపార్టుమెంటు (భారత వాతావరణ శాఖ) 2023-24లో వర్షపాతం 96 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. వాస్తవంగా నైరుతీ రుతుపవనాలు ముగిసే సరికి సాధారణ వర్షపాతంలో 94 శాతమే కురిసిందని వాతావరణ శాఖ గణాంకాలు ప్రచురించింది. ఈశాన్య రుతుపవన కాలంలో కూడా సాధారణం కన్నా 9 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. తాజాగా వాతావరణ శాఖ 2024-25లో ఎల్‌నినో ప్రభావం అంతరించి పోతుందనీ, సాధారణ వర్షపాతం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వర్షం కురుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గతంలో ‘ఎల్‌నినో’ ప్రభావం రెండు మూడు సంవత్సరాలున్న అనుభవం దేశానికుంది. ఒక్క సంవత్సరం తక్కువ వర్షపాతం కురవటంతో వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా ఆహారోత్పత్తి కొంతవరకు ప్రభావితమైంది.

ముఖ్యంగా వరి ధాన్యపు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. 2022-23లో బియ్యం ఉత్పత్తి 135.76 మిలియన్ టన్నులుగా నమోదై రికార్డుని నెలకొల్పింది. 2021-22లో ఉత్పత్తైన 129.47 మిలియన్ టన్నులతో పోలిస్తే 2022-23లో అదనంగా 6.28 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. అంతకుముందు ఐదు సంవత్సరాల సగటు బియ్యం ఉత్పత్తితో పోలిస్తే 15.37 మిలియన్ టన్నుల బియ్యం అధికంగా ఉత్పత్తయ్యాయి. అంత రికార్డు స్థాయిలో బియ్యం ఉత్పత్తి కావటంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. నిల్వలు కూడా పెరిగాయి. 2023-24లో ఎనిమిదేళ్ళు వరసగా పెరిగిన తర్వాత బియ్యం ఉత్పత్తి 123.8 మిలియన్ టన్నులకు తగ్గింది. 2022-23తో పోలిస్తే బియ్యం ఉత్పత్తి 11.96 మిలియన్ టన్నులకు తగ్గింది. కాని గోధుమ ఉత్పత్తి 2022-23లో ఉత్పత్తి అయిన 110.6 మిలియన్ టన్నుల కన్నా 1.3 శాతం పెరిగి 112 మిలియన్ టన్నులకు పెరిగింది. ముడి ధాన్యాల ఉత్పత్తి 2022-23లో 57.3 మిలియన్ టన్నులు కాగా 2023-24లో 50 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేశారు. మొక్కజొన్న ఉత్పత్తి కూడా 2022-23లో 38 మిలియన్ టన్నులుండగా 2023-24లో 32.4 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా వేసారు. కంది ఉత్పత్తి 2022-23 స్థాయిలోనే 2023-24లో కూడా ఉంటుందని భావిస్తున్నారు. మినుముల ఉత్పత్తి కూడా గత సంవత్సరం స్థాయిలోనే ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఖరీఫ్ కాలంలో అపరాల ఉత్పత్తి గత సంవత్సరం కన్నా కొంత తక్కువ ఉండవచ్చని అంచనాలు తెలుపుతున్నాయి. రబీకాలంలో అపరాల ఉత్పత్తి గత సంవత్సర స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తున్నారు. వరి మొక్కజొన్న, ముతకధాన్యాలు, అపరాల ఉత్పత్తి తగ్గటం వల్ల మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 309.1 మిలియన్ టన్నులకు తగ్గే సూచనలున్నాయి. వరి సాగు విస్తీర్ణం 2023-24 ఖరీఫ్‌లో 41.1 మిలియన్ హెక్టార్లుగా అంచనా వేయబడింది. 2022-23లో ఖరీఫ్ వరి విస్తీర్ణం ఖరీఫ్‌లో 40.43 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే 6.7 లక్షల హెక్టార్లు పెరిగింది. కానీ రుతుపవనాల్లో వర్షపాతం తగ్గటం, కొన్ని సమయాల్లో వర్షాభావం, మరికొన్ని సమయాల్లో అధిక వర్షాల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రబీలో కూడా వరి విస్తీర్ణం తగ్గకున్నా దిగుబడులు తగ్గాయి. నీటి ఎద్దడి కారణంగా బియ్యం దిగుబడులు ఖరీఫ్, రబీ కాలాల్లో తగ్గాయి. సహజంగా దిగుబడులు, ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరుగుతాయి. కాని ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు లభించే ధరలు పెరగలేదు.
వ్యవసాయ ఎగుమతుల్లో తగ్గుదల
2022లో భారతదేశం గోధుమ ఎగుమతుల్ని నిషేధించింది. మే 13వ తేదీన గోధుమ ఎగుమతుల్ని నిషేధించిన తర్వాత ఆగస్టులో గోధుమ ఉత్పత్తులైన గోధుమ పిండి, మైదా, సెమోలినాల ఎగుమతిని కూడా నిషేధించింది. 2022 జులైలో బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి పన్నుని విధించింది. జులై 2023లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. వెంటనే ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం పన్ను విధించింది. పంచదార ఎగుమతుల్ని 60 లక్షల టన్నులు దాటకూడదనే ఆంక్షలను 2022లో విధించి 2023లో కూడా కొనసాగించారు. డిసెంబరు 2023లో ఉల్లి ఎగుమతుల్ని నిషేధించి కొనసాగిస్తున్నారు. ఇటీవల కొన్ని దేశాలకు పరిమిత స్థాయిలో ఎగుమతుల్ని చేయటానికి సడలించింది. 2021-22, 2022-23లో ఉత్పత్తి ఎక్కువగానే ఉన్నా ఆంక్షలు పెట్టటం వల్ల ధరలు తగ్గి రైతులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. రష్యా-యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత గోధుమ ధరలు పెరిగినా ఆ ప్రయోజనం గోధుమ రైతులకు దక్కకుండా గోధుమ, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. అలాగే అంతర్జాతీయంగా బియ్యం ధరలు పెరుగుతున్నా 2022లో ఎగుమతి పన్ను విధించి, 2023లో ఎగుమతుల్ని నిషేధించి రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా తొక్కి పెట్టింది. పంచదార ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినా, దేశంలో నిల్వలున్నా ఎగుమతులపై పరిమితుల్ని విధించి చెరకు రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే బాధ్యత రైతులదేనన్నట్లుగా వారికి కనీస మద్దతు ధరలు మాత్రమే దక్కాలిగాని, గిట్టుబాటు ధరలు లభించకూడదనే కక్షతో రైతుల్ని నష్టపరుస్తున్నారు. వ్యాపారులు, దళారీలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల్ని దోచుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. సేకరణ వ్యవస్థను నిర్వీర్యం చేసి రైతులను ధరలు తగ్గినప్పుడు ఆదుకోకుండా, ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినా దేశంలో వాటిని తొక్కిపెట్టి తీరని నష్టం రైతులకు కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలు బ్రిటిష్ పాలకుల రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. ఎగుమతుల్ని నిరుత్సాహపరుస్తూ దేశ ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నది. ఎగుమతుల్ని పెంచాలని ప్రకటించే లక్ష్యాలకు అర్థం లేకుండా పోతున్నది.

2022 ఏప్రిల్-సెప్టెంబరుల మధ్య వ్యవసాయ ఎగుమతులు 26.7 బిలియన్ డాలర్లుండగా, 2023లో ఇదే సమయంలో అవి 23.6 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022-23లో వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 39.24 బిలియన్ డాలర్లుండగా, వాణిజ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం 2023-24లో మొదటి తొమ్మిది నెలల్లో ఈ ఎగుమతులు 24.93 బిలియన్ డాలర్లకు తగ్గింది. పూర్తి సంవత్సరంలో 32 బిలియన్ డాలర్ల కన్నా తక్కువ స్థాయిలోనే ఎగుమతులుండే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 శాతం తగ్గుదల ఉండటం ఆత్మహత్యా సదృశంగా కనిపిస్తున్నది. బాస్మతీ బియ్యం ఎగుమతుల విలువ తగ్గలేదు కాని నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులు సగానికి తగ్గిపోయాయి. గోధుమ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర గింజ ధాన్యాల ఎగుమతులు కూడా సగానికి పడిపోయాయి. పంచదార ఎగుమతుల విలువ సగానికి పడిపోయింది. పొగాకు, నూనె గింజలు, నూనె తీసిన పిండి, పండ్లు, కూరగాయలు, మాంసం, మద్యం, డెయిరీ ఉ్పత్తులు, పత్తి ఎగుమతులు మాత్రం గత సంవత్సర స్థాయిలోనే 2023-24లో కూడా ఉన్నాయి.
తగ్గని నిల్వలు
బియ్యం నిల్వలు 2018-19 ప్రారంభంలో 22.6 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అవి 2019-20 ప్రారంభంలో 33.9 మిలియన్ టన్నులకు పెరిగాయి. 2021-22 ప్రారంభంలో 29.5 మిలియన్ టన్నులకి, 2020-21 ప్రారంభంలో నిల్వలు బాగా పెరిగి రికార్డు స్థాయిలో 37 మిలియన్ టన్నులకు చేరాయి. 2022-23 ప్రారంభంలో బియ్యం నిల్వలు 34 మిలియన్ టన్నులుగా ఉండగా, 2023-24 ప్రారంభానికి ఆ నిల్వలు 32.5 మిలియన్ టన్నులకు స్వల్పంగా తగ్గాయి. బాస్మతీ, నాన్-బాస్మతీ రకం బియ్యాలు కొంత మేరకు ఎగుమతి అయినా నిల్వల స్థాయి తగ్గలేదు. దేశంలో వినియోగంతో పాటు ఎగుమతులు జరుగుతున్నా ఉత్పత్తి ఏటేటా పెరుగుతుండటం వల్ల ప్రారంభ నిల్వలు సంతృప్తికర స్థాయిలోనే ఉన్నాయి. 2022 జులైలో నాన్-బాస్మతీ రకం బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఆ సుంకాలు చెల్లించి కూడా ఎగుమతిదార్లు సుమారుగా 15 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసారు. 2023-24 ప్రారంభంలో కూడా 32.5 మిలియన్ టన్నుల బియ్యం నిల్వలున్నా జులై 2023లో నాన్-బాస్మతీ రకం బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 ఆగస్టు ఒకటవ తేదీకి బియ్యం నిల్వలు 37.6 మిలియన్ టన్నులకు చేరాయి. వాస్తవానికి అవసరమైన నిల్వలు 13.5 మిలియన్ టన్నులు మాత్రమే.

ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి వచ్చేలోగా ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలకు ఆ నిల్వలు సరిపోతాయి. అవసరమైన నిల్వల కన్నా దాదాపు మూడు రెట్లు నిల్వలున్నా నిషేధం పెట్టటం, ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం సమర్థనీయమైన చర్యలు కావు. ప్రైవేటు వ్యాపారస్తులకు ఎగుమతి చేసే అవకాశం లేకపోవడంతో బియ్యం ధరలు పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ కోఆపరేటివ్ ఎక్సో ్పర్ట్ లిమిటెడ్’ అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా చుట్టుపట్ల ఉన్న దేశాలకు పరిమితంగా బియ్యం ఎగుమతులు చేయించింది. 2023-24 సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మలేసియా, ఇండోనేషియా, వియత్నాం, ఇరాన్ దేశలకు 567 మిలియన్ అమెరికన్ డాలర్లు విలువైన బియ్యాన్ని ఎగుమతి చేయటం జరిగింది. ఇవికాక ఇతర ఏషియా ప్రాంతంలోని దేశాలకు మరో 341 మిలియన్ డార్ల విలువైన బియ్యాన్ని ఎగుమతి చేసారు. తెల్ల బియ్యం ఎగుమతితో పాటు గోధుమల్ని కూడా ఎగుమతి చేసారు. 14,184 టన్నుల గోధుమలు, 5326 టన్నుల గోధుమ పిండి, 15,226 టన్నుల మైదా ఎగుమతి జరిగింది. నూకల్ని మాలీ దేశానికి ఒక లక్ష టన్నులు, సెనెగెల్‌కు 5 లక్షల టన్నులు, జాంబియాకి 50 వేల టన్నులు, ఇండోనేషియాకు 2 లక్షల టన్నులు, భూటాన్‌కి 48,804 టన్నుల మేరకు ఎగుమతి చేశారు. ఇలా భారత ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఒప్పందాలు, అవగాహనలను అమలు పరచటానికి పరిమితంగా వరి, గోధుమ, నూకల ఎగుమతులు జరిగాయి.
రాజకీయ కారణాలు
2024 పార్లమెంటు ఎన్నికల ముందు ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందేమోననే భయంతో ప్రభుత్వం గోధుమ, వరి ఎగుమతుల్ని నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నదాన యోజన’ కింద దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాల నందించే పథకాన్ని ప్రారంభించింది. దాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావటానికి ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకం ఉపయోగపడిందని విశ్లేషించి, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని రాబోయే ఐదు సంవత్సరాల వరకు కొనసాగిస్తామని అధికార పార్టీ ప్రకటించింది. దీనితో పాటు ”భారత్’ అనే బ్రాండుతో కిలో బియ్యం 29 రూపాయలకు అమ్మటానికి ఒక ప్రభుత్వ సంస్థని రంగంలోకి దించింది. నిసేధాలు, ఎగుమతి పన్నుల వల్ల దేశంలో గోధుమలు, వడ్లు ధరలు తగ్గేలాగా చేసింది. మధ్యదళారీలు చౌకగా గోధుమల్ని, వడ్లను కొని వాటి ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నారు. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఆహారధాన్యాలను ఉచితంగా కానీ, తక్కువ ధరకు గానీ పేద ప్రజలకు అందిస్తున్నాయి. అవి ఆహార ధాన్యాలను తక్కువ ధరకు కొనటం ద్వారా వారి ఆర్థిక లోటుని అదుపులోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మార్కెట్ ధరల్లో సగానికి ‘భారత్’ బ్రాండ్ బియ్యాన్ని, గోధుమ పిండిని అమ్మి వినిమయదారుల మెప్పు పొందటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి ఆహారధాన్యాల కొరత లేకున్నా వాటి ఎగుమతుల్ని నిషేధించటం ద్వారా వాటి ధరల్ని క్వింటాలుకి ఐదారు వందలు తగ్గేలా చేసి, వినిమయదారలకు, మధ్యదళారీలకు లాభాన్ని చేకూర్చే విధానాలను ప్రభుత్వం అనుసరించింది. రాజకీయ నాయకుల ప్రజాకర్షక పథకాలకు చౌకగా ఆహార ధాన్యాలు లభించటం కూడా ఈ విధానాల వల్ల వీలయింది. రైతుల ఆదాయాలను రెండు లక్షల కోట్ల రూపాయల వరకు తగ్గించి ఆ మేరకు మధ్యవర్తలకు, ప్రభుత్వాలకు, వినిమయదారులకు లాభం కలిగించింది. దానితో పాటు దాదాపు 10 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం కోల్పోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆదాయాన్ని తగ్గించి, ఎగుమతుల్ని దెబ్బతీయటం అసమంజసం.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ & కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608

