ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష మరియు ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కుసుమ మరియు అవిసెలు పంటలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలు 150 మంది పాల్గొని వివిధ పరిశోధన అంశాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు.
ఈ కార్యక్రమంను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) మరియు జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ (ICAR-IIOR)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంకు డా. టి.ఆర్. శర్మ (ICAR-DDG, న్యూ ఢిల్లీ) అధ్యక్షత వహించి ప్రస్తుతం ఇండియా 1.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నూనెలని దిగుబడి చేసుకుంటున్నదని, దీన్ని తగ్గించడానికి జాతీయ నూనె గింజల మిషన్‌ని భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు కావున మనం చేసే పరిశోధనలు నూనె గింజ పంటల సాగును పెంచి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ముళ్ళు లేని కుసుమ రకాలను వృద్ధి చేయాలన్నారు. అన్ని పరిశోధన సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం వల్ల కుసుమ మరియు అవిసెలలో చాలా నూతన రకాలను వృద్ధి చేయడం జరిగిందని శర్మ వివరించారు.
డా. సంజీవ్ గుప్త (ICAR-DDG, న్యూ ఢిల్లీ) మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో కుసుమ మరియు అవిసె పంటలకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ముఖ్యంగా ఈ నూనె గింజలలో లైనోలేనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అన్నారు. కాబట్టి ఈ పంటల సాగు ఇంకా పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. డా.మాథూర్ (డైరెక్టర్, IIOR) గత సంవత్సరం కుసుమ మరియు అవిసెలలో చేపట్టిన పరిశోదన ఫలితాలను క్లుప్తంగా వివరించారు. డా. జెల్లా సత్యనారాయణ (డీన్ అఫ్ అగ్రికల్చర్, PJTAU) మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా వరకు కుసుమ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంను అందిస్తుందన్నారు. విశ్వ విద్యాలయం చీడ పీడలను తట్టుకునే రకాలను వృద్ధి చేయడమే కాకుండా కుసుమ నూనె కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ మరియు అవిసెలు సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతినిధులు, ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.

28 Oct, 2024
