వేసవి పంట కోసిన తర్వాత (మార్చ్-ఏప్రిల్) తొలకరి వానలు కురిసే వరకు (జూన్) భూమి ఖాళీగా ఉంటుంది. సుమారు రెండు, మూడు నెలలు ఎటువంటి వ్యవసాయ పనులు చేయక పోవడం వలన భూమి గట్టి పడుతుంది. మే-జూన్ మాసాల్లో తొలకరి జల్లులు కురిసిన వెంటనే కొందరు అనుభవం ఉన్న రైతులు తగినంత తేమ ఉన్నపుడు నేలను దున్నడం ప్రారంభిస్తారు. కానీ, కొందరు రైతులు ఖరీఫ్, రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ”దున్నకుండా వేస్తే కొయ్యకుండా పోతుంది” అనేది తెలుగు నానుడి. విత్తనాలు విత్తాలన్నా, నారు నాటేయాలన్నా దుక్కిని దున్ని విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సామెత తెలియచేస్తుంది. ”దుక్కికొద్దీ పంట” అనే తెలుగు సామెత తొలకరిలో చేసే దుక్కి యొక్క ప్రాముఖ్యతను తెలియ చేస్తుంది.
దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు మరియు ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిని సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూసారం తగ్గి పోవడమే కాకుండా, నీరు భూమి లోపలి పొరల నుండి గ్రహించబడి ఆవిరి అయిపోతుంది. అంతే కాకుండా ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు అత్యధిక మోతాదుల్లో రసాయన ఎరువులు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కావున, ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున రైతులు వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో కురిసే తొలకరి జల్లులను సద్వినియోగపరుచుకొని దాదాపు 9-10 అంగుళాలకు (25-30 సెం.మీ.) తగ్గకుండా దుక్కులు చేసుకోవడం శ్రేయస్కరం. వీటినే వేసవి దుక్కులు (లేదా) తొలకరి సేద్యం అంటారు. వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన తొలకరి వర్షాలు పడగానే మట్టి పెళ్లలు మెత్తపడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకడం వలన అవసరం అయితే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు. నేల రకాన్ని బట్టి, వేయబోయే పంటను బట్టి నేలను ఎన్నిసార్లు దున్నాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. దుక్కి అనేది దున్నడం వలన నేల ఏ విధంగా తయారు అయింది అనేది తెలుపుతుంది. మంచి దుక్కి వచ్చింది అంటే నేల విత్తనం వేసుకోవడం కోసం అనుకూలంగా తయారు అయింది అన్నమాట. ప్రాధమికంగా దుక్కి దున్నే విధాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. లోతుగా దున్నడం: వేసవిలో తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని లోతుగా దున్నడం వలన క్రింది పొర మట్టి పైకి తిరగబడుతుంది. తద్వారా నేలలో హానికర కీటకాల గుడ్లు, ప్యూపాలు మరియు శిలీంద్ర బీజాలు సూర్యరశ్మికి గురై నశిస్తాయి. నేలను ఎంత లోతుకు దున్నాలి అనే విషయం – నేల లోతు, ముందు వేయబోయే పంట, కలుపు ఉదృతి పైన ఆధార పడి ఉంటుంది. సాధారణంగా కనీసం 25-30 సెం.మీ. లోతు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూమిని దున్నుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.
2. నేల క్రింది గట్టి పొరలను చేదించే విధంగా దున్నుట (సబ్ సాయిలింగ్): సాధారణంగా చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం పొలాన్ని కల్టివేటరు తో తక్కువ లోతులో (సుమారు 10-15 సెం. మీ.) దున్నుతుంటారు. తద్వారా భూమి లోపలి పొరల్లో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ గట్టి పొరల వలన వర్షపు నీరు భూమిలోనికి ఇంక కుండా చేయడమే కాక, పంట వేళ్ళు భూమి లోపలి పొరలకు విస్తరించకుండా అడ్డుపడతాయి. కావున ప్రతి 2 మీ. దూరంలో సుమారు 60-75 సెం.మీ. లోతుగా దున్ని ఈ నేల క్రింది పొరలను చేదించడం వలన మెట్ట పంటల్లో సుమారు 20-30 శాతం దిగుబడి పెరిగింది అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి 2-3 సంవత్సరాలకొకసారి లోతుగా దున్నితే సరి పోతుంది. ఈ విధంగా దున్నడానికి సబ్ సాయిలర్ /చిజిల్ నాగలిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక మరియు లోతైన వేరు వ్యవస్థ గల కంది, ఆముదం వంటి మెట్ట పంటల్లో ఈ పద్ధతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
3. సంవత్సరం పొడవునా దున్నడం: పంట వేసే ముందు దున్నడమే కాకుండా పంట వేసిన తర్వాత వరుసల మధ్య వివిధ రకాల పనిముట్లను ఉపయోగించి పంటలను కలుపు మొక్కల భారి నుండి కాపాడటమే గాక, పలుమార్లు దున్నడం వలన, నేల గుల్ల బారి పడిన వర్షపు నీరు అంతా నేల లోనికి ఇంకి పంటలు బెట్టకు గురి కాకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రకమైన సేద్యం మెట్ట ప్రాంతాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
లోతు దుక్కులకు ఉపయోగించే పనిముట్లు
కొయ్య నాగలి, రెక్కల నాగలి, పెద్ద మడక, మోల్డ్ బోర్డ్ నాగలి, పల్లెపు నాగలి, 5/7 – కొయ్యల బాతు కాళ్ళ నాగలి, చిజిల్ నాగలి.
తొలకరిలో లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు:
* లోతైన దుక్కులు (30 సెం. మీ.) వాలుకు అడ్డంగా దున్నడం వలన వర్షపు నీరు వృధాగా పోకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వలన ఈ సమస్య అధిగమించబడి, భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్ద్యాన్ని పెంపొం దించుకుంటుంది. తద్వారా నీటిని పరిరక్షించడమే కాకుండా నేల కోతను కూడా నివారిస్తుంది. వర్షాధార పంటలు వివిధ కీలక థల్లో బెట్టకు గురైనప్పుడు (లేదా) తక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు పంట వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తిని చేకూరుస్తుంది.
* లోతు దుక్కుల వలన ఖరీఫ్ మరియు రబీ పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంట మొక్కల నుండి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్థాలు ఎరువుగా మారతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రీయ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మ జీవులు గణనీయంగా వృద్ధి చెందడమే కాకుండా, వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా భూసారం వృద్ధి చెందుతుంది.
* లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి మరియు భూమి పైమట్టి లోపలి పొరల్లోకి కలసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకు అందుతుంది.
* లోతు దుక్కులు చేసినట్లైతే బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక, దర్భ మరియు జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కల వేర్లు, దుంపలు భూమి పైకి వచ్చి వేసవిలో ఉండే అధిక సూర్యరశ్మికి గురై నశిస్తాయి. అంతే గాక, నేల పైకి వచ్చిన వేర్లు, దుంపలు ఏరివేయడం ద్వారా వీటిని అరికట్టవచ్చు. తద్వారా ఆ తర్వాత పంట కాలంలో కలుపు మందులకు మరియు ఇతర క్రిమిసంహారక మందులకు వెచ్చించాల్సిన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గిపోతుంది.
* వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమిలో దాగి ఉన్న చీడ పీడల కోశాలు, గుడ్లు మరియు ఇతర శిలీంద్ర జాలాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవడం ద్వారా నశిస్తాయి. అంతే గాకుండా, భూమి పైన బయట పడిన ప్యుపాలను, గుడ్లను కొంగలు, కాకులు మొదలైన పకక్షులు తిని నాశనం చేస్తాయి. దుక్కి దున్నేటపుడు, మనుషులు, పశువుల తొక్కిసలాటలో కొన్ని పురుగులు, ప్యూపాలు చనిపోతాయి. కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి లోతు దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పురుగు మరియు తెగుళ్ల మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది మరియు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
* గత పంటకు (ఖరీఫ్/రబీ) సంబందించిన మొక్కల దుబ్బులు, కొయ్యలు, వేర్లు కుళ్ళి పోయి సేంద్రీయ ఎరువుగా మారుతాయి.
* లోతు దుక్కుల వలన భూమిపై మట్టి లోనికి తిరగబడుతుంది. అంతేగాక, కొన్ని లవణాలు, క్షారాలు భూమి లోపలి పొరలకు చేరుకొని పై భాగంలో ఉదజని సూచిక సమంగా ఉంటుంది.
* వేసవి లోతు దుక్కుల వలన మట్టి రేణువుల లోనికి గాలి వెళుతుంది.నేల ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి రేణువుల్లో 50 శాతం నీరు, 25 శాతం గాలి ఉండాలి.
కావున రైతుసోదరులు వేసవిలో కురిసే తొలకరిజల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా లోతుగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వచేసుకొనే శక్తీ పెరగడమే కాకుండా, భూసారం కూడా పెంపొందించుకోవచ్చు మరియు నేలకోతను నివారించు కోవచ్చు. అంతే గాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణ తో పాటు చీడ పీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. కావున రైతు సోదరులు ప్రతీ 2-3 సంవత్సరాలకు ఒకసారి వేసవిలో లోతుడుక్కులను (20-30 సెం.మీ.) చేసుకోవడం వల్ల పైన చెప్పిన లాభాలు పొంది, మెట్ట పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు.
ఎ. మల్లీశ్వర రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్,
వి. సంధ్యారాణి, బి. శ్రీరాం ప్రవీణ్, విద్యా ప్రవల్లిక, కావ్య, పి.జి. రీసెర్చ్ స్కాలర్స్,
ఎం. శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్, పి.వి. రమేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు జయసింహారెడ్డి, టీచింగ్ అసోసియేట్,
సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, మహానంది, నంద్యాల జిల్లా.

