మనది వ్యవసాయక దేశం అయినప్పటికి రైతులందరూ తమ పంటల సాగులో లాభాలు ఆర్జించ లేకపోతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. రైతులందరూ ఆర్థికంగా లాభాలు సంపాదించలేకపోతున్నారా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. కొంతమంది అంటే చాలా తక్కువ మంది తమ పంటల సాగులో లాభాలు ఆర్జించగలుగుతున్నారు. వ్యవసాయంలో లాభాలు ఆర్జించే వారిని గమనించినట్లయితే వారు లాభాలు ఆర్జించటానికి అనేక కారణాలు మనకు అర్థం అవుతాయి. సరైన సమయంలో సరైన మెళకువలు పాటించడం, కుటుంబ సభ్యులందరూ కలసికట్టుగా పనిచేస్తూ కూలీల మీద ఎక్కువగా ఆధారపడకపోవటం, పంట ఉత్పత్తులను అదేవిధంగా అమ్మకుండా విలువజోడించి అమ్మడము, పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మడము, వినియోగదారుల అభిరుచుల మేరకు పంట ఉత్పత్తులను పండించి ఇవ్వడము, వాతావరణం అనుకూలించని పరిస్థితులలో పంట దిగుబడులు పొందడమో… లాంటి వివిధ రకాల పరిస్థితులలో కొంతమంది రైతులు తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నారు. పంటల సాగులో లాభాలు ఆర్జించే వారిని గమనిస్తే మనకు బోధపడే విషయం ఏమిటంటే… వీరు వ్యవసాయంలో ఏ ఒక్క అంశాన్ని అశ్రద్ధ చేయకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలచుకుంటూ తమ సాగుని లాభాల బాటలో నడిపిస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలీహౌస్‌లో ఆకుకూరలు పండిస్తూ తమ ఆకుకూరల సాగును లాభాల బాటలో నడిపిస్తున్న రైతు దంపతులు కృష్ణమూర్తి, నీలిమ.
వీరిది వ్యవసాయకుంటుంబం. వీరికి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. వీరికి ప్రత్తి, మిరప లాంటి పంటల సాగులో మంచి అనుభవం ఉంది. 2018వ సంవత్సరం తెలంగాణా ప్రభుత్వం పాలీహౌస్‌లకు 90% సబ్సిడీ అందించగా వీరు తమ సాగును నూతన పంథాలో నడిపించాలని ఒక ఎకరంలో పాలీహౌస్‌ని నిర్మించారు. పాలీహౌస్‌ను నిర్మించి అందులో క్యాప్సికమ్, కీరా లాంటి పంటలు సాగు చేయగా వివిధ రకాల కారణాల వలన ఆ పంటల సాగు లాభదాయకంగా లేదు. ప్రత్యేకించి క్యాప్సికమ్, కీరా లాంటి వాటికి హైదరాబాదు లాంటి మహానగరాలలో మాత్రమే మార్కెట్ ఉంటుంది. అంతదూరం రవాణా చేయాలంటే రవాణా ఖర్చులు పెరిగి గిట్టుబాటు కాకుండా పోయింది. ఆ సమయంలో తమ సాగుని లాభాలబాటలో నడిపించటానికి అందుబాటులో ఉన్న అవకాశాలని పరిశీలించి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు పండిస్తూ వాటిని దగ్గరలో మార్కెట్ చేసుకోగలిగితే ఫలితం ఉంటుందని గ్రహించి 2019వ సంవత్సరములో సేంద్రియ ఆకుకూరల సాగు మొదలు పెట్టారు.

సాధారణంగా వర్షాకాలం మరియు వేసవి కాలంలో ఆకుకూరల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో బయట నుంచి వచ్చే ఆకుకూరలు వర్షాలు మరియు ఎండల వలన నాణ్యత దెబ్బతింటాయి కాబట్టి పాలీహౌస్‌లో అలాంటి సమస్యలు ఉండవు కాబట్టి వర్షాకాలం మరియు వేసవికాలంలో ఆకుకూరలకి మంచి ధర లభిస్తుందని గ్రహించి ప్రతి సంవత్సర వర్షాకాలం మరియు వేసవి కాలంలో నిరంతరం ఆకుకూరలు దిగుబడి తీసేలా ప్రణాళిక వేసుకుంటూ ఆకుకూరల సాగును కొనసాగిస్తున్నారు.
ఆకుకూరల సాగుకి సేంద్రియ పద్ధతులు పాటించాలని తలంచారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎకరానికి 20 ట్రక్కులకు తగ్గకుండా ఎరువుని అందిస్తుంటారు. ఎకరం పొలాన్ని 16 బెడ్‌లలాగా చేసుకుని, ఈ బెడ్‌లపై విత్తనాలను దఫాలుదఫాలుగా చల్లి నెలలో 20 రోజులు ఆకుకూరలు దిగుబడులు వచ్చేలా తమ సాగుని కొనసాగిస్తున్నారు. పాలకూరకు డిమాండు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 70% పొలాన్ని పాలకూరకు కేటాయించి మిగతా 30% పొలంలో తోటకూర, బచ్చలికూర, మెంతికూర లాంటి వాటిని సాగు చేస్తుంటారు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటిస్తుంటారు. విత్తనాలు విత్తిన 30 రోజులలో పాలకూర మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 20-22 రోజులకు ఒక కోత చొప్పున మొత్తం 3 లేదా 4 కోతలు కోసిన తరువాత మొత్తం దున్ని మరలా తాజాగా విత్తనాలను వేస్తుంటారు.
ఎలాంటి రసాయనిక ఎరువులను భూమికి అందించకుండా కేవలం పశువుల ఎరువును మాత్రమే అందిస్తుంటారు. చీడపీడల నివారణకు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, పుల్లటి మజ్జిగ, మట్టిద్రావణం లాంటి వాటిని ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క బెడ్ నుంచి 150 నుంచి 200 కిలోల వరకు అంటే నెలలో సుమారు 20 రోజులకు 3000 కిలోల వరకు తగ్గకుండా ఆకుకూరల దిగుబడి పొంది కిలో 40/- నుంచి 60/- వరకు అమ్మకం చేస్తుంటారు. మామూలుగా పండించే ఆకుకూరలతో పోల్చుకుంటే సేంద్రియ పద్ధతులతో పాలీహౌస్‌లో పండించే ఆకుకూరలు రెండు, మూడు రోజులు తాజాగా ఉండడము రుచి కూడా బాగా ఉండడం వలన తాము పండించిన ఆకుకూరలను మార్కెట్ చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు పడటము లేదు అని, ఏరోజు వచ్చిన దిగుబడిని ఆరోజు అమ్ముకోగలుగుతున్నాము అని, ఒకసారి కొనుగోలు చేసిన కొనుగోలుదారు మరలా మరలా అడిగి కొనుగోలు చేస్తున్నారని కృష్ణమూర్తి వివరించారు. సేంద్రియ పద్ధతిలో రసాయనాలకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, తమ శ్రమనే పెట్టుబడిగా పెట్టి ఆకుకూరలను సాగు చేస్తున్నాము కాబట్టి పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతున్నాయని వీరు వివరిస్తున్నారు. బయట మార్కెట్‌కు అవసరమయిన ఆకుకూరలు పండించడంతో పాటు తమ ఇంటి అవసరాలకు అవసరమైన మిగతా కూరగాయలు, అల్లం, పసుపు, ఉల్లి, వెల్లుల్లి లాంటి వన్నీ పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తూ తాము ఉపయోగిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా తమ సాగుని కొనసాగిస్తున్నాము అని కృష్ణమూర్తి దపంతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు 9676444600కి ఫోను చేసి తెలుసుకోగలరు.

