మన అందరికి తెలుసు కోడి అంటే ముందు గుర్తుకు వచ్చేది కోడి మాంసం’ మరియు కోడిగ్రుడ్లు వాటి పోషక విలువలు, మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ కొన్ని జాతి కోళ్లు పోషక విలువలతో (ప్రోటీన్స్, ఆమ్లాలు…) పాటు ఆరోగ్యపు విలువలు బహుళ ప్రయోజన విలువలు కూడా కలిగి ఉన్నాయి అని ముందుకు వచ్చే కోళ్ళ జాతిలో మొదటిది, మధ్యప్రదేశ్‌లో పుట్టింది, రంగులలో నాకు ఎవరు సాటిరారు అని నిరూపించుకొని వచ్చే అరుదైన జాతి ‘కడక్‌నాథ్’.
‘కడక్‌నాధ్’ అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరికే అరుదైన జాతి, నాటుకోడి. ఈ కడక్‌నాథ్‌ని ‘కాలమసి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ కోళ్లు చూడటానికి నల్లగా ఉంటుంది. అంతేకాకుండా అరుదైన విషయం ఏమిటంటే వీటి మాంసం కూడా నల్లగానే ఉంటుంది కాబట్టి. కడక్‌నాధ్ జన్మస్థలం కతివార్ అలిరాజాపూర్ అడవులు ఉన్నటువంటి జబువా జిల్లా మధ్యప్రదేశ్. ఇటువంటి జాతి కోళ్లే ఇండోనేషియాలో కూడా గలవు. వీటిని అక్కడ అయామ్‌సెమాని అంటారు. ఈ జాతి కోళ్లను ఆయా ప్రదేశాలలో గ్రామాలలో నివసించే వాళ్లు ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీయులు ఎక్కువగా పెంచుతారు. ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా ఆదివాసీయులు వీటిని పవిత్రముగా పూజించి దీపావళి రోజున దేవునికి నైవేద్యంగా పెడతారు. ఈ జాతి కోళ్లను రెండు రకాలుగా పెంచుతారు, గ్రుడ్ల కోసం మరియు మాంసం కోసం. మరీ ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు ఎందుకంటే ఈ నల్లజాతి కోడి ఎన్నో ఆయుర్వేదిక మరియు మెడిసినల్ గుణాలను కలిగి ఉంది.
ఈ జాతి కోళ్లు ముదురు నలుపు మరియు బంగారపు ఈకలును కలిగి ఉంటుంది. బూడిద నలుపు రంగు మాత్రం కాళ్లు, ముక్కు, నాలుక, వాటిల్స్ మరియు కూంబ్ మీద ఉంటుంది. అంతేకాకుండా ముదురు నలుపు మరియు నీలం రంగుల్లో ఉండే కోళ్లలో చర్మం, వెంట్రుకలు, మాంసంతో పాటు రక్తం కూడా నలుపు రంగులో ఉంటుంది.
ఈ కడక్‌నాథ్ జాతి కోళ్లు ముఖ్యంగా మూడు రకాలు:
ఎ) నల్లని జెట్ బ్లాక్, బి) పెన్సిల్ రంగు, సి) గోల్డెన్ రంగు
ఈ మూడు రకాలు కోళ్లలో మాంసం మాత్రం నల్లని రంగులోనే ఉంటుంది. మాములుగా కోడిపుంజు: 1.8-2 కిలోలు మరియు ఆడకోళ్లు 1.2-1.4 కిలోలు బరువు ఉంటాయి. కడక్‌నాధ్ కోడిగ్రుడ్లు బూడిద రంగుతో పాటు అక్కడక్కడ గులాబిరంగులో ఉంటాయి. ఈ జాతి కోళ్లలో పొదుగు లక్షణం చాలా తక్కువ. అదేవిధంగా గ్రుడ్డు బరువు 33-35 గ్రాములు ఉంటుంది. మిగిలిన కోళ్ల జాతితో పోల్చితే (55 గ్రా.) గుడ్డు బరువు వీటిలో తక్కువగా ఉంటుంది.

ప్రయోజనాలు: ఈ కడక్‌నాధ్ కోళ్లు ఎక్కువ రోగనిరోధక శక్తి మరియు ఎటువంటి వాతావరణ పరిస్థితులను అయినా తట్టుకొనే సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ జాతికోళ్ళలో మాంసం రంగు నల్లగా ఉండటానికి ముఖ్యకారణం ‘మెలనిన్’ అనే పిగ్మెంట్. అందుకే ఈ కోళ్లు ఎక్కువ రోగనిరోధక శక్తిని, సామర్థ్యంను కలిగి ఉన్నాయి. అందువలన ఈ జాతి కోళ్లు ఆయా ప్రదేశాల్లో గిరిజనులు మూలికా వైద్యంలో వాడుతారు. మిగిలిన కోడి జాతుల మాంసంతో పోల్చితే ఈ కడక్‌నాధ్ జాతి కోళ్ల మాంసంలో క్రొవ్వు శాతం తక్కువ మరియు మాంసకృత్తులు, లినోలిక్ ఆమ్లాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. వీటి మాంసం ఉండే మెలనిన్ పిగ్మెంట్ అధికంగా ఉండటం వలన పురుషులలో నరాలబలహీనత, వంధ్యత్వ నిరోధానికి ఉపయోగపడుతుంది. వీటి మాంసం అనేక రకాలైన అమైనోయాసిడ్స్ మరియు విటమిన్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ జాతి కోళ్ల మాంసం తినడం వలన రక్తకనాలు పెరగడమే కాకుండా హిమోగ్లోబిన్‌ని కూడా రక్తంలో పెంచుతాయి. ఈ కడక్‌నాధ్ కోళ్లు వ్యర్ధపదార్థలను మరియు కీటకాలను తొందరగా మాంసంగా మార్చుకొనే గుణం కలిగి ఉంది.
మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు దీర్ఘకాలిక జబ్బులు నివారించేందుకు ఈ జాతి కోళ్ళ రక్తాన్ని వైద్యం కొరకు మరియు ఆయుర్వేదం కొరకు వాడుతారు. ముఖ్యంగా స్త్రీలలో గైనకాలజీ సమస్యలు తీరుతాయని, వాటి గ్రుడ్లు తినడం వలన తలనొప్పి, మూత్రపిండ వ్యాధులు, నీరసం, ఆస్థమా, శ్వాసకోశవ్యాధులు, ముసలివాళ్లలో కీళ్లనొప్పులకి ఆరోగ్యదాయకం అని ఆయా ప్రదేశాలలో గిరిజనుల నమ్మకం.
ఈ కడక్‌నాధ్ జాతి మాంసంలో అధిక మోతాదులో ఖనిజ లవణాలు మరియు ఆవశ్యక అమైనో ఆమ్లాలు బి1, బి1, బి6, బి12, సి ఞ ఇ విటమిన్లు ఉండటం మరీ ముఖ్యంగా బి12 మరియు ఇనుపధాతువులు ఉండటం వల్ల ఎనిమియా, నిమోనియా, ఆస్థమా, కీళ్ల నొప్పులు, ఎముకలు విరిగిన వారికి ఆరోగ్యకరమైన ఆహారంగా భావించవచ్చు. ఈ జాతి కోళ్లలో మరొక మంచి లక్షణం ఏమిటంటే బయట పడేసిన వంట వ్యర్థాలు, కీటకాలు తిని బ్రతికేయగలవు. కాకపోతే ఈ జాతికోళ్ళలో పొదుగులక్షణం చాలా తక్కువ. 6 నెలల వయస్సు నుండే గ్రుడ్లను పెడతాయి. వేసవిలో 100 గ్రుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ జాతి కేవలం 1.5 కిలో బరువు మాత్రమే పెరుగుతుంది.
పోషక విలువలు కడక్‌నాధ్ మిగతా కోళ్లు
కొవ్వు శాతం 0.73-1.03% 13-25%
మాంసకృత్తులు 25% 18-20%
కొలస్ట్రాల్ 184 మి.గ్రా./100 గ్రా. 218 మి.గ్రా./100 గ్రా.
లినోలిక్ ఆమ్లం 24% 21%
విదేశీ కోళ్లపై ఉన్న మమకారం దేశీ కోళ్లపై ఉండదు. మనిషి ఎప్పుడూ తను ఆర్థికంగా స్థిరపడాలంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటాడు. విదేశీ కోళ్లు తొందరగా పెరిగి మాంసాన్ని మరియు గ్రుడ్లను ఇస్తాయి. అందుకు భిన్నంగా దేశీ కోళ్లులో ఎదుగుదలకు చాలా సమయం తీసుకొంటాయి. అంతేకాకుండా సహజ మేతతో నిదానంగా పెరగడం, పిల్ల థలలోనే చాలా వరకు మరణిస్తున్నాయి అనే కారణంతో ఈ దేశీ జాతి కోళ్లు అంతగా వృద్ధి చెందట్లేదు. ఎంతో అరుదైన జాతి గల ఈ కడక్‌నాధ్ కోళ్లు ప్రస్తుతం అంతరించిపోతున్న స్థితికి చేరుకొన్నాయి. అందువలన ఈ కడక్‌నాధ్ కోళ్లలో గల ప్రయోజనాలను అందరికీ తెలియజేసి ఈ కడక్‌నాధ్ ఆరోగ్యంగా ఉంటే మనుషులు కూడా ఆరోగ్యవంతులు అవుతారు అని అందరికీ తెలియజేసి, ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని వీటిని అంతరించిపోకుండా, వీటి సంఖ్యను పెంచే కార్యాచరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే గ్రామాల్లో మరియు నగరాల్లో ఈ జాతి కోళ్లను కోడిగ్రుడ్లు మరియు మాంసం కోసమే కాదు వీటిలో చాలావరకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలలో అవగాహన కల్గించి అంతరించి పోతున్న ఈ అరుదైన అందమైన నల్లజాతి కోళ్లను కాపాడుకుందాం!
డా|| యు. వినోద్, డా. బి. పుణ్యకుమారి, పశుజన్యుశాస్త్రం ఞ ప్రజనన విభాగము, పశువైద్య కళాశాల, తిరుపతి, ఫోన్: 9492298321
