పశువులలో ఈనిన తరువాత వచ్చే అజీర్తి లేదా వాతం వలన పాల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. పశువు ఈనిన తరువాత మొదటి రోజు నుండి మొదటిసారి ఎదకు వచ్చేకాలం, అంటే సుమారుగా 45 నుండి 60 రోజుల వరకు ఉన్నటువంటి పశువులను ఈనిన పశువులుగా పరిగణించవచ్చు. ఈ రెండు నెలలు పాల ఉత్పత్తికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో పశువు అనారోగ్యం బారిన పడితే, రైతాంగం నష్టపోవలసి వస్తుంది.
రైతులు నాశిరకం పశువులను, సరైన సమయాలలో అంటే పాల దిగుబడికి తగిన జాగ్రత్తలు పాటించని యెడల, రైతులు తీవ్ర నష్టానికి గురౌతారు. అధిక పాలదిగుబడి ఇచ్చే సంకరజాతి ఆవులకు, గ్రేడెడ్ జాతి ముర్రా గేదెలకు జన్యుపరంగా పాల ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పశువులకు అన్ని పశువులకంటే అధిక శక్తి అవసరం. అంటే తినే ఆహారం అరలపొట్టలో సరిగా జీర్ణమై, పశువుకి శక్తినిస్తేనే రైతుకు పాల దిగుబడి ఉంటుంది.

పశువు చూడి సమయంలో అరలపొట్ట యొక్క పనితీరు తగ్గి, ఆకలి మందగిస్తుంది. ఈనిన తరువాత ఆరోగ్యమైన పశువులలో సుమారుగా 5 వారాలకు తిరిగి మామూలు పనితనం పొందుతుంది. అరల పొట్ట పనితనం తగ్గడం వలన, అరల పొట్టలోని ద్రవంలో మార్పుతో పాటు కాలేయంలో మార్పులు ఏర్పడతాయి. దీని వలన ఆకలి మందగించడం, పాల ఉత్పత్తి తగ్గడం మరియు పోషకాహారం లోపం వలన, శరీర నిల్వలపై పశువు ఆధారపడి పాలను ఇస్తుంది. దీని మూలంగా పలురకాల జీవక్రియ వ్యాధులు లేక ఉత్పాదక వ్యాధులు బారిన పడతాయి.
పశువు ఎదకు సరిగా రాకపోవడం వంటివి జరుగుతాయి. మొదటి మూడు ఈతల వరకు శరీర నిల్వలపై ఆధారపడుతుంది. కానీ దాని సామర్థ్యానికి తగినంత పాలు ఇవ్వలేకపోతుంది. తరువాత ఈత నుండి పాల దిగుబడి అతిగా తగ్గడంతో పాటు, శరీరాకృతిలో కూడా మార్పు కనబడి బక్కచిక్కి పోతుంది. పశువులలో అజీర్తి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు, ఈనిన తరువాత పశువులలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా మాయవేయకపోవడం, పొదుగువాపు వ్యాధి, గడ్ల మాయ గర్భాశయ వ్యాధులు మరియు మాయ తినడం వలన కూడా అజీర్తి సంభవిస్తుంది.
పశువులు ఈనిన రెండునెలల వెంటనే సంభవించు అజీర్తిని రైతు కొద్దిపాటి నైపుణ్యంతో గుర్తు పట్టవచ్చు. పశువు క్రిందటి ఈతలో కంటే తక్కువ తినటం, పాల దిగుబడి తగ్గటం వంటి లక్షణాలను బట్టి రైతు కనిపెట్టవచ్చు. మూత్ర పరీక్ష ద్వారా ఉత్పాదక వ్యాధులు (పాలజ్వరం, ఎండువాతం మొదలైనవి) గుర్తుపట్టవచ్చు.
నివారణ చర్యలు
* ఈనిన తరువాత పశువులలో వచ్చే అజీర్తికి నివారణగా, చివరి రెండు లేదా మూడు నెలల వ్యవధిలో సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. అలాగే అదనపు కాల్షియం ఇవ్వరాదు.
* పశువు ఈనే ముందు (12 గంటల ముందు), ఈనిన వెంటనే మరియు ఈనిన తరువాత (12 గంటల తరువాత) మూడు సార్లుగా కాల్షియం జెల్‌ను నోటిద్వారా త్రాగించాలి. దీని వలన పశువులలో పాలజ్వరం నివారించవచ్చు.
* శక్తినిచ్చే ఆహారపదార్థాలు ముఖ్యంగా గ్లిజరిన్, కిటోనిల్ జెల్ లేదా ఈ-బూస్టర్ వంటి రైతు ఇంటి దగ్గరే పశువుకు దాణాలో కలిపి లేదా నోటిద్వారా ఇవ్వాలి. దీనివలన ఎండువాతం నుండి నివారించవచ్చు.
* కాలేయం పనితీరుకు, లివర్ టానిక్‌లు త్రాగించాలి.
డా. కె. లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్: 8978154747

