నానాటికీ కనుమరుగై పోతున్న పచ్చికబీళ్ళు, ఇతర మేపు సమస్యల వల్ల సాంప్రదాయమైన పాత పద్ధతులలో భారీ సంఖ్యలో గొర్రెలు, మేకల్ని పెంచే అవకాశాలు క్షీణిస్తున్నాయి. పంటల మీద ఎక్కువగా వాడుతున్న రసాయనాల వల్ల, పంటల వ్యర్థాలు, దంట్ల మీద ఆధారపడే జీవాల ఆరోగ్యాలు, ఎదుగుదల క్షీణించే అవకాశాలే ఎక్కువ. క్రూరమృగాల భయంతో ఇటీవల మందల్ని సమీప అరణ్యాలకు జీవాలను మేపుకు తోలుకు వెళ్లటం కూడా ప్రమాదకరంగా మారింది. సంచార మందలు రోడ్డు ప్రమాదాలతో పాటు అంటురోగాల బారిన కూడా ఎక్కువగా పడుతున్నాయి. ఇవికాక అనేక ఇతర కారణాల వల్ల కూడా ఇండ్‌బ్రో పౌల్ట్రీ సంస్థ యజమాని తాను రెండేళ్ల క్రింత ఎం.ఆర్.ఎఫ్. షీప్ బ్రీడింగ్ ఫారంను సాంద్ర పద్ధతిలో పూర్తి చేతి మేత పద్ధతిలో ప్రారంభించారు. ఈ షీప్ బ్రీడింగ్ ఫారం మహబూబ్‌నగర్ జిల్లా దోనూరు గ్రామ శివారులో హైదరాబాదు నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిరకాలంగా తన హాచరీ మరియు పౌల్ట్రీ యూనిట్లలో అత్యంత విశ్వాసపాత్రంగా, నమ్మకంతో పనిచేస్తూ ఉన్న సిబ్బందితోపాటు తన చిరకాల మిత్రులు జీవాల బ్రీడింగు మరియు న్యూట్రిషన్ విభాగాలలోని శాస్త్రజ్ఞులు ఇస్తున్న సహాయ సహకారాల మీద నమ్మకంతోనే తాను ఈ షీప్ బ్రీడింగ్ రంగంలోకి ప్రవేశించినట్లు స్వయంగా జంతు జన్యుశాస్త్రజ్ఞుడైన డా. కోటయ్య అంటున్నారు. వీరి సలహాలు, సేవలు, సహకారాల కారణంగానే సాధారణంగా ప్రారంభ సంవత్సరాలలో 4-5 శాతం ఉండే మరణాలను గత రెండేళ్లలో కేవలం 0.7 శాతానికి సమర్ధవంతంగా అదుపు చేయగలిగానని, అంతేకాక శాస్త్రీయ మేపు విధానాల వల్ల తన ఫారంలో జీవాల ఎదుగుదలతో పాటు ప్రత్యుత్పాదక సామర్థ్యం కూడా రాష్ట్ర మరియు జాతీయ సగటు కంటే ఎక్కువగా వున్నట్లు ఆయన వివరించారు. జీవాల చర్మాలకు, ఉన్నికి క్షీణించిన మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని కేవలం ఉన్నతమైన సంతతి ద్వారా ఎక్కువగా నాణ్యతా పరిమాణాలు కలిగిన మాంస ఉత్పత్తినే తన లక్ష్యంగా కృషి చేస్తున్నానని వివరిస్తున్నారు.
వ్యాపార దృక్పథంతో పాటు ఒక సైంటిస్టుగా శాస్త్రీయ దృక్పథంతో ప్రారంభించిన ఎమ్.ఆర్.ఎఫ్. ఫారం ద్వారా ఔత్సాహిక గొర్రెల పెంపకందారులకు, యువ శాస్త్రజ్ఞులకు అవసరమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించాలనే తన లక్ష్యంతో ఈ ఫారం పనిచేస్తూ వుంది. భారీ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జీవాల పంపిణీ ద్వారా లబ్దిదారులు ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందుటకు అవసరమైన సహాయ సహకారాలను అందించుటకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉండగలనని డా. కోటయ్య ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా జీవాల రంగంలో కనిపించని విస్తరణ సేవలలో కీలకమైన విధాన ప్రదర్శన – ఫలితాల ప్రదర్శనల ద్వారా జీవాల పెంపకందారులలో సాంకేతిక చైతన్యాన్ని పెంచే లక్ష్యంతో నడుస్తున్న ఈ రిసెర్చి ఫారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అదనపు ప్రోత్సాహకాలను అందించవలసిన అవసరం ఉంది.
ఖర్చుకు వెనుకాడకుండా ఇతర రాష్ట్రాల నుండి 70-80 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసిన జన్యుపరంగానే కాక పుష్టిగా కూడా ఉన్నతంగా ఉండే నెల్లూరు జొడిపి, రాంబుల్లెట్ గొర్రెపోతులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వివిధ వయస్సుల ఆడపిల్లలు, యువతల్లుల్ని కూడా రెండు-మూడు తరాల జన్యుచరిత్రను గమనించి వందల సంఖ్యలో ఎక్కువగా పెంపకందారుల మందల నుండి నేరుగా సేకరించారు.

జీవాలకు అవసరమైన సూపర్ నేపియర్, హెడ్జ్‌లూసర్న్ గ్రాసాలతో పాటు ఉభయత్రా ఉపయోగపడే చిలకడదుంప, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటల్ని కూడా ఇక్కడే సాగు చేసి, వీటిని ముక్కలుగా చేసి దాణాలతో కలిపి మేపుతున్నారు. ఈ దాణాలు కూడా తన పౌల్ట్రీ ఫారంకు చెందిన దాణా మిశ్రమ కార్మాగారంలోనే శాస్త్రీయంగా తయారు చేస్తున్నారు. జీవాల ఎదుగుదలను వేగవంతం చేసే ఉలవల సాగును కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రారంభించుటకు ముందు డా. కోటయ్య దేశంలోని ప్రముఖ గొర్రెల పరిశోధనా కేంద్రాలను స్వయంగా సందర్శించి అక్కడి నిర్వాహకుల నుండి విలువైన సమాచారాన్ని సేకరించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ గొర్రెల జాతుల గొర్రెలు లభ్యమయ్యే ప్రాంతాలు నెల్లూరు, మాచెర్ల, నంద్యాల, మహానంది, నిజామాబాద్‌లతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి మూడు తరాల జన్యు చరిత్రను తెలుసుకుని కొనుగోలు చేసిన సుమారు 500 గొర్రెలు, పిల్లలు ఈ క్షేత్రంలో మాతృజీవాలుగా పెంచబడుతున్నాయి. రెండు సంవత్సరాలలో కనీసం మూడు ఈతల్ని పొందే లక్ష్యంతో బ్రీడింగ్ ప్రణాళిక రూపొందించుట జరిగింది. ఈ లక్ష్యం మేరకు తొలిథలోనే సుమారు నాలుగు వందల పిల్లలు ఇక్కడ జన్మించాయి. ఎదుగుదల, మార్కెట్ డిమాండు తదితర అంశాలలో నెల్లూరు జొడిపి జాతి గొర్రెలు నెల్లూరు పల్లా, నెల్లూరు బ్రైన్ తదితర స్థానిక జాతి గొర్రెల కంటే మేలైనవని గత రెండేళ్ల అనుభవంతో చెబుతున్నారు. ఇవికాక నారిజాతి, రాంబుల్లెట్ గొర్రెల్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెంచుతున్నారు. నారి జాతి గొర్రెలు ఐదు నెలల వయస్సులో సుమారు 40-50 కిలోల శరీరబరువు పెరుగుతాయని గమనించారు.
తొలి బ్యాచి గొర్రెలు రాకముందే ఐదు ఎకరాలలో సూపర్ నేపియర్, హెడ్స్‌లూసర్న్ సాగును ప్రారంభించారు.
షెడ్ నిర్మాణం: శాస్త్రీయ అధ్యయనాలకు అవసరమని ప్రత్యేకంగా కొంత ఎక్కువ ఖర్చైనప్పటికీ వివిధ అవసరాలకు మందలలోని జీవాల సంఖ్య బ్రీడింగ్ గదులు ఈనే గొర్రెలకు ప్రత్యేక అవసరాలు, కొత్తజీవాలకు క్వారంటైన్ షెడ్లు, గ్రాసాల కోత మిషన్లు తదితర ప్రత్యేక అవసరాలకు సుమారు 60 లక్షలు వెచ్చించి 10þ12 నుండి 16þ12 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదులకు అనుబంధంగా సుమారు మూడు రెట్లు అదనపు విస్తీర్ణం కలిగిన ఆవరణతో (పాడక్) నిర్మించుట జరిగింది. ఈ షెడ్లు ఎత్తైన నేల మీద పటిష్టమైన డ్రైయినేజ్ ఏర్పాటుతో నిర్మించుట ద్వారా గొర్రెలన్నింటికీ ఆరోగ్యరక్షణ కల్పించుట జరిగింది. స్వచ్ఛమైన త్రాగునీటిని బేసిన్ల పైన అమర్చిన నిపుల్స్ ద్వారా ఏర్పాటు చేశారు. పటిష్టమైన ఈ షెడ్లపై పరిశోధనా పరమైన అవసరాల కోసం కొంత ఎక్కువ ఖర్చైనప్పటికీ ఈ నిర్మాణ సామగ్రిని అవసరమైతే తక్కువ నష్టంతో వేరొక చోటుకు తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ షెడ్లలో 700 నుండి 800 వరకు జీవాలను పెంచవచ్చును. పరిశోధనలకు కాక కేవలం ఉత్పత్తే లక్ష్యంగా నడిచే షీప్ ఫారాలకు షెడ్లు మీద వ్యయాన్ని 10-15 లక్షలకు పరిమితం చేయవలెను.

జీవాల ఆరోగ్యభద్రత: సంచారమందలు, సంతలలో సమూహమైన జీవాలలో అనేక ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సంతల నుండి కాక ఆదర్శమైన గొర్రెల ఫారాలు గొర్రెల పెంపకందారుల నుండి మాత్రమే తనకు అవసరమైన ఫౌండేషన్ స్టాక్‌ను కొంత హెచ్చు ధర చెల్లించి అయినా కొనుగోలు చేయుటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఫారంలో జన్మించిన ప్రతి గొర్రె పిల్లకు, బయట నుంచి కొనుగోలు చేసిన ప్రతి జీవానికి ప్రత్యేక నెంబరు కలిగిన చెవిపోగు బిగించబడుతుంది. ఇది శాస్త్రీయ అధ్యయనాలకు చాలా అవసరం. వయస్సుకు తగ్గ శరీర తూకంతో పాటు, నిర్దేశించిన జాతి లక్షణాలు కలిగి, పుష్టిగా కనిపించే జీవాలను మాత్రమే కొనుగోలు చేయాలి. సొంత ఫారానికి వచ్చిన తర్వాత కనీసం 10 రోజులు వాటిని వేరుగా ఉంచి ఆల్బెండజోల్ వంటి పరాన్న జీవుల నిర్మూలన మందుల్ని అవసరమైతే లివర్ టానిక్స్‌ను పట్టించాలి. ప్రతిజీవం ఫారం ప్రవేశం వద్ద క్రిమినాశకం కలిపిన నీళ్లతొట్టిగుండా నడిచి మాత్రమే ఫారంలోకి ప్రవేశించాలి.
చిటుకరోగం, బొబ్బరోగం, గాలికుంటు, గురక మరియు బ్రూసెల్లోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాల వేయించుట, షెడ్లు ఆవరణలను ఎప్పుడూ పొడిగా శుభ్రంగా వుంచటం, మల మూత్రాలలో చిన్నతేడా కనిపించిన వెంటనే లేబొరేటరీ పరీక్షలు జరిపి ఆరోగ్య సమస్యల్ని గుర్తించటం వంటి విషయాలలో ఇక్కడి యాజమాన్యం అప్రమత్తంగా ఉంటుంది. ఇంతేకాక మరణించిన ప్రతి జీవానికి శవ పరీక్ష జరిపి, మృతకళేబరాలను శాస్త్రీయంగా తొలగించి, లోతుగా పూడ్చివేయటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు.
మేపు: జన్మించిన ప్రతి పిల్లకు 4 నుండి 5 వారాల వరకు తల్లి నుండి సమృద్ధిగా పాలను త్రాగనిచ్చి ఆ తర్వాత వేరు చేయాలి. ఇందువల్ల పిల్లలు వేగంగా పుష్టిగా పెరగటమే కాక, తల్లి కూడా మరో నెలలోపల చూడి కట్టే అవకాశాలు ఉంటాయి. 4-5 వారాల నుండి పచ్చిమేతతో పాటు విటమిన్లు, మినరల్స్ కలిగిన ప్రత్యేక సమీకృత దాణాలను 50 నుండి 100 గ్రాములు ప్రతిరోజూ అందించాలి. సూపర్ నేపియర్, లూసర్న్, మొక్కజొన్న, ఇతర గ్రాసాల మిశ్రమాల్ని చాఫ్‌కట్టర్‌తో చిన్న ముక్కలుగా తరిగి మేపుటతో పాటు రావి, మర్రి, సుబాబుల్, మల్బరి, తుమ్మ, మారేడు వంటి ఆకుల్ని కూడా అవకాశాన్ని బట్టి ఈ మేతలతో కలిపి మేపవచ్చును. పచ్చిమేతలు సమృద్ధిగా లభిస్తే సైలేజ్ మరియు టోటల్ మిక్స్‌డ్ రేషన్ టి.ఎం.ఆర్) అనే దాణాగ్రాసాల మిశ్రమాన్ని కాని మేప వలసిన అవసరం ఉండదు. ఎదుగుదలలో నిర్దేశిత ప్రమాణాలు లోపిస్తే వెంటనే పోషణ విషయంలోనూ, జీవాల ఆరోగ్య స్థితిపైనా, అవసరమైన సమీక్ష చేయాలి. వారం వారం తూకం వేస్తూ ఎదుగుదలను గమనిస్తూ దాణాలో మాంసకృత్తులు, ఇతర పోషకాల శాతాన్ని, దాణా పరిమాణాలను నిపుణుల సలహామేరకు సవరిస్తూ ఉండాలి. మాంసం కోసం జీవాలను విక్రయించే ముందు నెలరోజుల పాటు గొర్రెల దాణాలో ఉడికించిన ఉలవలు రోజుకు 100-150 గ్రాములు అదనంగా కలపితే అంతకు అనేక రెట్లు అదనపు ఆర్థిక ప్రయోజనం వుంటుంది.
ఎం.ఆర్.ఎఫ్ ఫారంలో జన్మించిన గొర్రె పిల్లల పుట్టుక శరీర తూకం ఇతర ఫారాల కంటే చాలా ఎక్కువగా అంటే 3.0 నుండి 3.8 కిలో గ్రాముల వరకు వుండుట గమనార్హం!
ఎక్కువ బరువుతో జన్మించిన పిల్లలు వేగంగా ఎదిగి త్వరగా యుక్త వయస్సుకు వచ్చి జీవితాంతం ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి. సమృద్దిగా జున్నుపాలను తొలివారంలోనూ, ఆ తర్వాత 5 వారాల వరకు తల్లిపాలను అందిస్తే పిల్లలు పుష్టిగా వేగంగా ఎదుగుతాయని డాక్టర్ కోటయ్య తన అనుభవాన్ని వివరిస్తున్నారు.
కనీసం గత మూడు తరాలలో ఎటువంటి రక్త సంబంధం (జన్యుసంబంధం) లేని ఆడ-మగ గొర్రెల మధ్య మాత్రమే సంపర్కాన్ని ఏర్పాటు చేయాలి. అంతర్గత సంపర్కం వల్ల నిర్వీర్యమైన సంతతి జన్మిస్తుంది. పోతుల వద్దకు, చీకటి సమయాలలో ఎదలో వున్న ఆడ గొర్రెను సంపర్కానికి వదలాలి. ఇందుకు అవసరమైతే రాత్రిళ్లు పాకలలో లైట్లు తీసి వేయుటతో పాటు వెలుతురు తగ్గించుటకు నల్ల పరదాలను ఏర్పాటు చేయగల్గితే మంచిది. లింగ విభజన అంటే ఒ మరియు ఖ క్రోమోజోములను వేరువేరుగా కలిగిన వీర్యాన్ని ఉపయోగించి మనం కోరిన ఆడ లేదా మగ సంతతిని పొందే కృత్రిమ గర్భోత్పత్తి విధానం అమలు కూడా పరిశీలనలో ఉంది.
చూడి పరీక్షలు: గొర్రెలలో చూడి నిర్ధారణ ఆవులు-గేదెలంత సులువుకాదు. మేత-నీరును ఒకపూట నిలిపి వేసి పొట్టను కొంత ఖాళీ చేసిన తర్వాత పొట్ట క్రింద తడిమి మూడు నెలలు దాటిన చూడిని 80 నుండి 90 శాతం ఖచ్చితంగా అంచనా వేయగల నైపుణ్యాన్ని పొందవచ్చు. ఇవికాక అల్ట్రాసోనిక్ సాధనం ద్వారా కూడా గర్భంలోని పిండాన్ని – పిండాల సంఖ్యను తెలుసుకోవచ్చును. రక్తం నుండి సేకరించిన సీరమ్ పరీక్ష ద్వారా ప్రొజెస్టెరోన్ హార్మోను పరిమాణాన్ని తెలుసుకొని తొలిమాసం చూడి దాటిన గొర్రెలలో చూడి నిర్ధారణ చేయవచ్చును. ఇదే పద్ధతిని గత నెల నుండి 100 శాతం ఖచ్చితత్వంలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల గొడ్డుమోతు గొర్రెల్ని గుర్తించి సకాలంలో సరియైన చర్యలు తీసుకొనుట సాధ్యమౌతుంది.
గొర్రెలలో ఎదసమన్వయం: ఒకేసారి ఎక్కువ సంఖ్యలో హార్మోన్లతో ఎదకు తెప్పించి వీటన్నింటికీ నిపుణుని చేత కృత్రిమ గర్భోత్పత్తి చేయుట వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నందున ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది.
సహజ సంపర్కం జరిపిన తర్వాత 15-17 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎద లక్షణాలకు పరిశీలించి, ఎద లక్షణాలు కనిపించకపోతే ఆ తర్వాత చూడి పరిశీలన చేయాలి. అందువల్ల మందలో ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్రతి 8-9 నెలలకు ఒక ఈతను పొందవచ్చు.
కవలలు అవసరమా?
ఒకే ఈతలో ఒకటి కంటే ఎక్కువ పిల్లల్ని ఆశించుట మంచిది కాదు. డాక్టర్ కోటయ్య అభిప్రాయం. గర్భంలో ఒకటి కంటే ఎక్కువ పిల్లలు వుంటే వాటికి తల్లిగర్భంలో తగినంత పోషణ అందక అవి తక్కువ శరీర తూకంతో జన్మిస్తాయి. పుట్టిన తర్వాత కూడా వాటి శరీర అవసరాలకు తగిన స్థాయిలో జున్నుపాలు, ఐదారు వారాల వరకు అందవలసిన తల్లిపాలు కానీ లభ్యం కానందున వాటి ఎదుగుదల కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అంతేకాక తన గర్భంలో రెండు కంటే ఎక్కువ పిండాల భరించుట వల్ల 60-70 శాతం అదనపు భారాన్ని భరించడమేకాక, ఈనే సమయంలో ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తవచ్చును. ఇటువంటి ఇబ్బందిని మూగజీవానికి కలిగించుట కూడా మానవత్వం కాదని డాక్టర్ కోటయ్య అభిప్రాయం.
సుమారు 1000 జీవాలకు అవసరమైన షెడ్ల నిర్మాణం మీద సుమారు 60 లక్షలు ఖర్చు అయినట్లు, జీవాల (పిల్లలతో కలిపి ఆడవి-మగవి విత్తనపు పోతులు) షుమారు 70 లక్షల రూపాయలు వెచ్చించినట్లు, ఇప్పటివరకు 450 వరకు పిల్లలు జన్మించి సంతృప్తికరంగా ఎదుగుతున్నట్లు, తన ఫారంలో జనన తూకాలు 3.0 నుండి 3.8 కిలోల వరకు ఉన్నట్లు పాలు విడిచిన పిల్లల దినవారీ ఎదుగుదల 100 120 గ్రాములు ఐదు నెలలకు వాటి తూకం 22 నుండి 25 కిలోల వరకు ఉన్నట్లు నెల్లూరు జొడిపి జాతి గొర్రెల ఎదుగుదల నెల్లూరు బ్రౌన్ మరియు నెల్లూరు పల్లా జాతుల కంటే మెరుగుగా ఉన్నట్లు డా. కోటయ్య వివరిస్తున్నారు.
సకాలంలో టీకాలు, పరాన్నజీవుల నిర్మూలన, చూడి తల్లుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాటు తాను తీసుకుంటున్న బయోసెక్యూరిటీ జాగ్రత్తల వల్ల తన ఫారంలో మరణాల శాతాలను 0.7 శాతానికంటే తక్కువ స్థాయిలో అదుపు చేసి సుదీర్ఘ అనుభవం కలిగిన సాంప్రదాయక జీవాల పెంపకందారుల్నే కాక, ఈ రంగంలోని శాస్త్రజ్ఞుల్ని కూడా డా. కోటయ్య అబ్బురపరచుట అభినందనీయం.
జీవాల అమ్మకం ద్వారానే కాక ప్రతి జీవం నుండి ఏటా లభిస్తున్న 0.5 నుండి 0.7 టన్నుల సారవంతమైన ఎరువు ద్వారా తనకు అదనపు ఆదాయాలు అందుతున్నాయి.
నిర్ధిష్టమైన నెంబరుతో పెరుగుచున్న ప్రతి గొర్రె యొక్క సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తమై తనకు సకాలంలో సరియైన నిర్ణయాలు తీసుకొనుటకు ఉపయోగపడుతున్నాయని, ఇదే సమాచారాన్ని ఇతర శాస్త్రజ్ఞులకు కూడా అందుబాటులో ఉంచగలనని డాక్టర్ కోటయ్య ప్రకటించుట అభినందనీయం!
డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

