రోషానికి, రౌద్రానికి, రణానికి ప్రపంచంలోనే పేరు గాంచిన మన అసీల్‌ జాతి పందెం కోడి మన దేశానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఆంధ్ర-తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనే కాక థాయిలాండ్‌ తదితర కొన్ని విదేశాలలో కూడా ఈ పందెంకోడి పుంజుల కూత లేనిదే గ్రామాలు నిద్రలేవవని ప్రతీతి. పెట్టలు సంవత్సరంలో కేవలం 50-60 గుడ్లు మాత్రమే ఉత్పత్తి చేయగల్గినప్పటికీ, వీటి మాంసం పరిమాణంలోనే కాక రుచి, నాణ్యతలలో కూడా అత్యంత గిరాకీ కలిగి ఉండుట, ముఖ్యంగా వీటి మాంసం మరియు గుడ్లలోని మాంసకృత్తులు, విటమిన్లు, ఇతర పోషకాల వల్ల కరోనా వంటి ప్రమాదకరమైన వైరస్‌ వ్యాధులబారి నుండి తట్టుకోగల శక్తి పెరుగుతుందనీ, ప్రకృతిసిద్ధమైన పెరటి వాతావరణాలలో పెరిగే ఈ కోళ్ల మాంసాన్ని, గ్రుడ్లను వినియోగదారులు ఆర్గానిక్‌ ఉత్పత్తులుగా భావించి ఆదరించడం వంటి కారణాల వల్ల దేశీ కోళ్లలో అసీల్‌ (అసలైన కోడి అని అర్థం) కోడి మాంసానికి, గ్రుడ్ల ధరలు పెంపకందారులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఇందుకు ఈ జాతికి సహజంగా ఎక్కువగా వుండే వ్యాధి నిరోధక శక్తి వాతావరణ తీవ్రతలను తట్టుకోగల శక్తులే మరో ముఖ్య కారణం. వేల సంవత్సరాల చరిత్రలో పల్నాటి యుద్ధం – బొబ్బిలి యుద్ధం వంటి చరిత్రాత్మక గాధలలో కూడా మన అసీల్‌ జాతి పుంజులు కీలక పాత్ర పోషించాయి. అయితే జీవహింసా నివారణ చట్టం వల్ల ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో కోడి పందాలు నిషేధించబడ్డాయి.

మంచి సహజ సిద్ధమైన పరిస్థితులు – పోషణలో పుంజులు 3-4 కిలోలు, పెట్టలు 1.5-2.0 కిలోలు శరీర తూకం కలిగి తెలుగు రాష్ట్రాలలో లైవ్‌ కోళ్లకు కిలోలకు 250 నుండి 300 రూపాయల ధర పలుకుతున్నాయి. ఇందులో ఉత్పత్తి ఖర్చు గ్రామీణ ఫారాలలో కిలోకు 150 నుండి 180 వరకు ఉంటుంది. పెరళ్లలో పెరిగే కోళ్ళ మీద ఖర్చు ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది.

పందెం పుంజుల ధర సగటున 6000 నుండి 7000 మధ్య ఉండగా ప్రత్యేక గుర్తింపు పొందిన పుంజుల ధరలు లక్షకు పైగా కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం కేవలం హైదరాబాదు నగరంలోనే ప్రతివారం 20,000 కు పైగా అసీల్‌ కోళ్లు మాంసం కోసం విక్రయించబడ్తున్నాయని ఒక అంచనా.
అసీల్‌ కోడిపుంజు లక్షణాలు: 

పొడవైన సన్నని తల, చురుకైన కళ్లు, కండపట్టిన ఎర్రని శిఖ, పొడవైన మెడ, గంభీరమైన కూత, దృఢమైన ముక్కు, చిన్న తోక, ముఖ్యంగా బలిష్టమైన పొడవైన నిటారైన కాళ్లు, కాళ్ల వెనుక దృఢమైన ఆరి, కలిగిన ఈ పుంజులు ఎరుపు, పసుపు, నలుపు, బంగారు మిశ్రమ వర్ణాలలో కనిపిస్తాయి. బలమైన కాళ్లు రెక్కలు పటిష్టమైన వేళ్లు, ఆరి, చురుకైన కళ్లు, వాటిని మంచి పోరాట పకక్షులుగా గుర్తింపు నిచ్చాయి. శతృజీవాల నుండి తప్పించుకొనడానికి ఇవి సులువుగా చెట్లమీదకు, ఎత్తైన ప్రాంతానికి ఎగిరి తమను తాము ఆత్మరక్షణ చేసుకోగలవు. పందాల రంగంలో ఈ పుంజుల్ని వివిధ స్థానిక పేర్లతో వర్గీకరించారు.

పుట్టినప్పుడు 35-40 గ్రాములు, 14వ వారంలో ఒక కిలో, 20 వ వారానికి 1.5 కిలో సంవత్సరానికి 2.5 నుండి 3.0 కిలోలకు పుంజులు పెరిగితే పెట్టల పెరుగుదల ఇందులో 75-80 శాతానికే పరిమితం అవుతుంది. పెట్టలు 22-25 వారాల వయస్సులో గ్రుడ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తే పుంజులు కూడా అదే వయస్సుకు బ్రీడింగుకు సిద్ధమౌతాయి. అసీల్‌ కోళ్లలో వ్యాధినిరోధక శక్తి, వైరి జంతువులను ధీటుగా ఎదుర్కోగల శక్తి, ఎగిరే శక్తి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల శక్తి ఎక్కువే అయినప్పటికీ, వాణిజ్యపరంగా అసీల్‌ జాతి కోళ్ల పెంపకాన్ని చేపట్టదలచిన వారు వివిధ అంటురోగాల నివారణకు టీకాలు వేయించే అవసరాన్ని ఇతర జాగ్రత్తలను విస్మరించకూడదు. 

టీకాల ప్రణాళిక:

పుట్టిన వెంటనే మారెక్‌ టీకా,  7వ రోజు – రాణికెట్‌ టీకా (లసోటా) (కొక్కెర తెగులు) 14-16 రోజుల మధ్య – ఇన్ఫెక్షియస్‌ బర్సల్‌ డిసీజ్‌ వాక్సిన్‌ (ఇబిడి) 5వ వారం – పౌల్ట్రీపాక్స్‌ (అమ్మవారు) 8వ వారం – రాణికెట్‌ వాక్సిన్‌ హాచరీస్‌ నుండి పిల్లల్ని 5-6 వారాల వయస్సులో కొనుగోలు చేస్తే అప్పటికే వాటన్నింటికీ హాచరీస్‌ స్థాయిలోనే దాదాపు అన్ని వాక్సినేషన్‌లు పూర్తి శాస్త్రీయంగా, సంతృప్తికరంగా, సులువుగా పూర్తి అవుతాయి.

గ్రామీణ సంక్షేమ పథకాలన్నింటిలో పేదలకు చాలా అనువైన అనుబంధ పరిశ్రమ అసీల్‌ జాతి కోళ్ల పెంపకం. దీనిని ప్రభుత్వం వారు శాస్త్రీయంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తే సుస్థిరమైన ఆదాయాలు, సంక్షేమం, అభివృద్ది అతి తక్కువ ఖర్చుతో అత్యధిక నిరుపేద – మధ్య తరగతి రైతాంగానికి అందించవచ్చును. 

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండ్‌బ్రో పౌల్ట్రీ పరిశోధన బ్రీడింగ్‌, హాచరీ సంస్థ వంటి సంస్థలు అసీల్‌ జాతి కోడి పుంజుల్ని అధిక మాంసంతో పాటు అధికంగా గ్రుడ్లను కూడా ఉత్పత్తి చేసే రోజ్‌ఐలాండ్‌ రెడ్‌ పెట్టలతో క్రాస్‌ చేసి ఉత్పత్తి చేసే సంతతి నాణ్యమైన ఎక్కువ మాంసంతో పాటు ఏటా 150-160 ఆర్గానిక్‌ కోడిగ్రుడ్లను ఇస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అత్యంత లాభదాయకమైన ఈ అసీల్‌-క్రాస్‌ కోళ్లను పెరళ్లలోనే కాక చిన్న చిన్న గ్రామీణ పౌల్ట్రీ ఫారాలలో పెంచడాన్ని తెలుగు రాష్ట్రాలు ఆర్ధిక-సాంకేతికంగా ప్రోత్సహిస్తున్నాయి. 

గ్రామీణ స్థాయిలో ప్రత్యేక కాలనీలలో కేంద్రీయ కోడిపిల్లలు-కోళ్ల ఫారాలను (నర్సరీ తరహాలో) ఏర్పాటు చేసి, వీటి ద్వారా వివిధ లబ్దిదారులకు వివిధ కాలవ్యవధుల మధ్య ఎదిగే కోళ్లను పెంపకానికి పంపిణీ చేయవచ్చును. అముల్‌ పాల సహకార సంఘాల పంధాలలో అసీల్‌ (ఆర్గానిక్‌) కోళ్ల పెంపకాన్ని, మేతల సరఫరాను, వైద్య సేవల్ని, సాంకేతిక సహకారాలతో పాటు శాస్త్రీయంగా ప్రాసెస్‌ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో మాంసాన్ని విక్రయించి, తద్వారా లభించే ఆదాయాలను అందరికీ ఆమోదయోగ్యమైన, సహకార చట్టాలు, నిబంధనావళులకు లోబడి పెంచుకుంటూ లబ్ది పొందవచ్చు. అయితే అశాస్త్రీయంగా, రాజకీయ ప్రయోజనాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించే ఏ సహకార సంస్థ బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవనే వాస్తవాన్ని పాలకులు, అధికారులతో లబ్దిదారులందరూ గుర్తించినప్పుడు  మాత్రమే ఇటువంటి పథకాలు విజయవంతం కాగలవు. 

డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611