రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరి కోతలూ, నూర్పిడిలూ ముమ్మరంగా జరుగుతున్నాయి. మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పెట్టి కొంటామన్న హామీలు ఇంకా మొదలు కాలేదు. తుపాన్లు, అకాలవర్షాల వలన, రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. పెంచిన రైతు బంధు సహాయం కూడా ఇంకా మొదలు కాలేదు. చలికాలం పంటల సాగు కూడా మొదలయింది. ఈ నేపధ్యంలో జనవరి (పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ కార్తెలు) లో వివిధ పంటలలో చేయవలసిన వ్యవసాయ పనులను గూర్చి, పండిన పంటను అమ్ముకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మెలకువలను గురించి…
వరి: వర్షాకాలపు వరి పంట కోతలు కొన్ని చోట్ల పూర్తి అవగా, ఇంకొన్ని చోట్ల నడుస్తున్నాయి. తుపాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా నష్టం వాటిల్లింది. తెలంగాణాలో తూర్పు ప్రాంత జిల్లాల్లో కూడా బాగా నష్టం జరిగింది. వడ్ల సేకరణ ఇంకా మొదలు కాలేదు. త్వరగా ప్రొక్యూర్మెంటు చేసి, రైతుల బాధలు తగ్గించడం అత్యవసరం. మద్దతు ధర కంటే అధికంగా ఇస్తామన్న ధరను తెలంగాణాలో అమలు త్వరగా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేకరణ ధర పెంచాల్సిన అవసరముంది. ఎక్కువ ధర పెట్టి కొన్న ధాన్యాన్ని కర్ణాటక వంటి రాష్ట్రాలకు పంపే అవకాశమున్నందున, సేకరణ ధర పెంచి తెలుగు రైతులకు మేలు చేయవచ్చునని నా అభిప్రాయం. వరి పంటను ఇతర దేశాలకు ఎగుమతికి అనుమతించి మన రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేయవచ్చు. చలికాలం వరిని జనవరి మొదటి వారం లోపల విత్తితేనే అధిక దిగుబడులు సాధ్యం. నిదానిస్తే దిగుబడి బాగా తగ్గుతుంది. మొలకెత్తిన విత్తనాలను ప్రధాన పొలంలో తయారు చేసిన భూమిలో బురదనీటిలో వెదజల్లడం లేక డ్రమ్‌సీడర్ ద్వారా విత్తడం చేయవచ్చు. కొత్తరకాలను, వాటికి మంచి ధర వస్తుందో, రాదో తెలియని రకాలను, కొద్ది విస్తీర్ణంలో పరీక్షించడానికి మాత్రమే సాగు చేయాలి. పండించిన పంటకు మంచి లాభాలొస్తాయని నిరూపణ అయిన రకాలను విస్తారంగా పంట పెట్టవచ్చు. ప్రస్తుతం వరికి మంచి గిరాకీ ఉంది.
మొక్కజొన్న: దుక్కి దున్నకుండా వరి మాగాణులలో నేరుగా విత్తడానికి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో జనవరి మొదటివారం వరకు అనుకూలం. ఆ తరువాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలు మొక్కజొన్నను జనవరిలో విత్తడానికి అంత అనుకూలం కాదు. నవంబరు-డిసెంబరు నెలల్లో విత్తిన మొక్కజొన్న పంటలో అంతర కృషి, పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు నివారణ జనవరిలో చేయాల్సి ఉంటుంది. సస్యరక్షణలో ముఖ్యంగా కాయతొలుచు పురుగు, కత్తెర పురుగులు సమస్యాత్మకము. వీటిని వెంటనే అదుపు చేయాల్సి ఉంటుంది.
జొన్న: సెప్టెంబరు, అక్టోబర్‌లలో విత్తిన, మాఘీ, రబీజొన్న కోతలు జనవరిలో ఉంటాయి. చలికాలం జొన్న విత్తడం తెలంగాణలో డిశంబరులోపు పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆలస్యంగా జనవరిలో కూడా విత్తుతారు. అవి ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలు. అనుకూలమైన రకం: పర్భని శక్తి (ఐ.సి.ఎస్.ఆర్-14001). నీటి తడులతో విత్తన దిగుబడి 28-32 క్వి/ఎ. చొప్ప దిగుబడి 1.6-2.0 ట/ఎ. తెల్లగింజ. 120 రోజుల పంట. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. చేను మీద పడిపోదు. విత్తనాలను తయారు చేసి అమ్ముకుంటే రైతుకు మంచి లాభాలుంటాయి. జొన్న మార్కెట్ ధరలు మద్ధతు ధరల కంటే బాగా ఎక్కువగా ఉన్నాయి.
సజ్జ: రెండు తెలుగు రాష్ట్రాల్లో సజ్జ పంటను జనవరిలో విత్తవచ్చు. విత్తనోత్పత్తి కూడా చేపట్టవచ్చు. హైబ్రిడ్‌లతో సమానమైన గింజ దిగుబడినివ్వగలిగిన కాంపోజిట్ రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాంపోజిట్ విత్తనాల నుండి పండించిన విత్తనాలను రైతులు తిరిగి విత్తుకోవచ్చు. అనుకూలమైన కాంపోజిట్ రకాలు: ఎ.బి.వి-04, రాజ్-171, ఐ.సి.టి.పి-8203. సజ్జ మద్దతు ధర: రూ.2500/క్వి.
రాగి: ఈ పంటను నీటి పారుదల సౌకర్యమున్న చోట 2 తెలుగు రాష్ట్రాల్లో, జనవరిలో విత్తవచ్చు. నారుపోసి, నారు ఎదిగినాక నాటవచ్చు. విత్తనోత్పత్తి కూడా చేపట్టవచ్చు. వానాకాలం, చలికాలం, వేసవిలలో పండే అధిక దిగుబడి (14-15 క్వి/ఎ.) నివ్వగలిగిన రకాలు: భారతి, ఇంద్రావతి, సువర్ణముఖి, తిరుమల.
పెసర: నవంబర్‌లో విత్తిన పెసర జనవరిలో కోతకొస్తుంది. పెసర మద్దతు ధర రూ.8558/- క్వి. వరి మాగాణుల్లో పెసరను జనవరిలో విత్తవచ్చు. ఫిబ్రవరిలో విత్తితే అత్యధిక దిగుబడులొస్తాయి. విత్తే సమయంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే పై నుంటే మొక్క మొలుస్తుంది. తక్కువగా ఉంటే మొలక మొలవడం నిదానమవుతుంది. అందువలన ఉష్ణోత్రలు పెరిగేదాక ఆగి విత్తడం మంచిది. జనవరిలో విత్తడానికనువైన రకాలు: టి.ఎం-96-2, డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి), ఎల్.జి.జి-460, ఎల్.జి.జి-410, ఎల్.జి.జి-407, ఎం.జి.జి-351 (శ్రీరామ).
మినుము: అక్టోబరు-నవంబరులలో విత్తిన మినుము జవనరిలో కోతకొస్తుంది. జనవరిలో విత్తాలంటే 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే మొక్క మొలుస్తుంది. తక్కువ ఉంటే నిదానంగా మొలుస్తుంది. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకాలు: అన్ని కాలాలకు అనువైన పాలిష్ రకాలు: టి.బి.జి-104, జి.బి.జి-1. మద్దతు ధర రూ. 6950. మార్కెట్ ధరలు దీనికంటే అధికంగా ఉన్నాయి.
నవ్వులు: నువ్వు పంటలో అత్యధిక దిగుబడులు సాధించాలంటే కోస్తా జిల్లాల్లో డిశంబరు 15 నుండి జనవరి 15 వరకు, తెలంగాణలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు, రాయలసీమలో జనవరి 2-3 వారాలలో విత్తుకోవాలి. అన్ని ప్రాంతాల్లో అత్యధిక దిగుబడినిచ్చే రకం: జగిత్యాల తిల్-1 (జె.సి.ఎస్-1020). 5-8 క్వి/ఎ. పంటకాలం: 85-90 రోజులు. తెల్లగింజ. శ్వేత, హిమ, రాజేశ్వరి రకాలకంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. బూడిద తెగులును, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం విత్తనాలకు మంచి డిమాండు ఉంది. విత్తనోత్పత్తి చేసి లాభపడవచ్చు. మద్ధతు ధర రూ. 8635/క్వి.
ప్రొద్దుతిరుగుడు: వరి మాగాణుల్లో ప్రొద్దుతిరుగుడు విత్తడానికి డిశంబరు ఆఖరివారం నుండి జనవరి మొదటి వారం వరకు అనుకూలం. భూమి తయారు చేసి విత్తాలంటే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు విత్తడం మేలు. విత్తనోత్పత్తికి కూడా ఈ సమయాలలో విత్తడం అనుకూలం. బైబ్యాక్ అగ్రిమెంట్లు కుదుర్చుకొని హైబ్రిడ్ ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి చేపట్టడానికి కూడా ఈ సమయంలో విత్తడం అనుకూలం. వివిధ కంపెనీల ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్‌లను కూడా అగ్రిమెంట్ల ద్వారా ఈ నెలలో ఉత్పత్తి చేపట్టి అధిక దిగుబడి పొందవచ్చు.
వేరుశనగ: వేరుశనగ విత్తనాలకు విపరీతమైన డిమాండు ఉన్నది. పచ్చికాయలుగా అమ్మడానికి అనుకూలమైన రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్-1694), కదిరి-7, కదిరి-9, నిత్యహరిత. ఈ రకాల విత్తనాలను ఎంత ఉత్పత్తి చేసినా చాలడం లేదు. విత్తుకునే సీజన్ వచ్చినపుడు విత్తనాల కొరత తీవ్రంగా ఉన్నది. కదిరి లేపాక్షి (కె-1812) రకం అధిక దిగుబడినిస్తున్నప్పటికి వీటి గింజలతో తయారైన పదార్థాలు వగరుగా ఉన్నందున ఈ రకాన్ని కొనడానికి కొందమంది తయారీదారులు విముఖత చూపిస్తున్నారు. నవంబరు, డిశంబరు నెలల్లో విత్తిన వేరుశనగ పంటలో అంతరకృషి, కలుపుతీయుట, సస్యరక్షణ ఈ నెలలో చేపట్టాల్సుంటుంది. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. తేమ తక్కువై పంట ఎదగలేదని నీటి తడులు ఇస్తూ పోతే అధిక తేమకు పంట దిగుబడి బాగా పడిపోతుంది.
చెరకు: మోడెం/కార్శి తోటలు పెంచుట, కొత్త తోటలు నాటుట జనవరిలో ఉంటాయి. భూమిలో సరిపడినంత తేమ ఉన్నపుడు కార్శి/మోడెం తోటల్లో సాళ్ళ మధ్య దున్ని భూమి గుల్లబారేలా జనవరిలో చేయాల్సి ఉంటుంది. కొత్తగా చెరకు నాటుకోవాలనే రైతులు, భూమిని లోతుగా దున్ని దుక్కి చేయాలి. పురుగులు, రోగాల బారిన పడని నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఆంధ్రప్రదేశ్‌కు: స్వల్పకాలిక రకం: 2009ఎ107 (వశిష్ట): దిగుబడి 50-52 ట/ఎ. చక్కెర 20%. బెండు ఉండదు. పూత పూయదు. నీటి ముంపును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. మధ్యకాలిక రకం: 86ఎ146: దిగుబడి 61.2 ట/ఎ. చక్కెర 18.5%. బెండు ఉండదు, పూత పూయదు. నీటి ముంపును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్లు తెగులును సహజ పరిస్థితుల్లో తట్టుకుంటుంది. తెలంగాణకు: స్వల్పకాలిక రకం: 2003వి46 (భరణి): దిగుబడి 50 ట/ఎ. చక్కెర 18%. బెండు లేదు. పూత పూయదు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. మధ్యకాలిక రకం: 97ఆర్401: దిగుబడి 58 ట/ఎ. చక్కెర 18.5%. బెండు లేదు. కొద్దిగా పూత పూస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్ళు తెగులును కొద్దిగా తట్టుకుంటుంది.
టమాట: ప్రస్తుతం టమాట ధరలు చిల్లరగా కిలోకు 20/- అమ్ముతుండగా రైతు దగ్గర 10 రూపాయల వరకు అమ్ముతున్నది. జనవరిలో నారు పోసి, తర్వాత నాటిన పంట చేతికొచ్చే సమయానికి ధరలు కొద్దిగా పెరగవచ్చు. జూన్-జూలై ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశముంది. వాతావరణంలో విపరీత మార్పులొస్తే, అధిక అకాల వర్షాలు, వడగండ్లు వచ్చి పంటలు ఒక ప్రాంతంలో దెబ్బతింటే, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ, రేట్లు పెరిగే అవకాశముంది.
వంగ: టమాటతో పోలిస్తే వంకాయల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశముంది.
బఠాణీలు, ప్రెంచ్‌బీన్స్, కొత్తిమీర: చలికాలంలో అధిక దిగుబడి కారణంగా ఈ పంటల ధరలు తక్కువగా ఉండే అవకాశముంది. ధనియాల కొరకు పెంచిన పంట నూర్పిడి మార్కెట్‌లో అమ్ముట జనవరిలో ఉంటాయి.
బెండ: దిగుబడులు చలికి తగ్గుతాయి. ధరలు ఎక్కువగా ఉండే అవకాశముంది.
బూడిద గుమ్మడి, బీర: వీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తవచ్చు. అనుకూలమైన బీర రకాలు: జగిత్యాల లాంగ్, అర్కసుజాత. అనుకూలమైన బూడిద గుమ్మడి రకాలు: బి.హెచ్-24, బి.హెచ్-25.
గుమ్మడి, పొట్ల: వీటిని జనవరి కడవరకు విత్తవచ్చు. మంచి గుమ్మడి రకాలు: పూసా అలంకార్, పూసా విశ్వాస్. నేలపై పెంచడానికనువైన పొట్ల రకం: కో-2.
పశుగ్రాస పంటలు: హైబ్రిడ్ జొన్న పశుగ్రాస రకాలు ఎన్.ఎస్.జి-59-3, ఎం.పి.చారి, పి.సి.-6 మొ|| మొక్కజొన్న పశుగ్రాస రకాలు: టి.ఎస్.ఎఫ్.ఎం-15-5, జె-1006, ఆఫ్రికల్ టాల్ మొ||. సజ్జ పశుగ్రాస రకాలు: జైంట్ బాజ్రా, టి.ఎస్.ఎఫ్.బి-15-8, మోతీ బాజ్రా మొ||, బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు: ఎ.పి.బి.ఎన్-1, బి.ఎన్.హెచ్-14.
చామంతి: పూలు తెంపి మార్కెట్ చేయుట ఈ నెలలో ఉంటుంది.
బంతి: జనవరిలో నారు పోయవచ్చు. 25 రోజుల నారు నాటుకోవచ్చు. నాటిన 60 రోజులకు పూలు కోతకొస్తాయి.
ప్రతిపల్లె/జనావాసానికొక రైతు ప్రజా సంఘం
ఎఫ్.పి.ఓలు మొత్తం భారతదేశంలో చాలా కొద్ది చోట్లనే సక్సస్ అవుతున్నాయి. మిగతా అన్ని చోట్ల ఫెయిలవుతున్నాయి. వీటిపై ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనుక్ను ఫలితాలను సాధించలేక నిరుపయోగమవుతున్నది. ఇంత ప్రజాధనాన్ని ప్రతిపల్లె / జనావాసంలో రైతు ప్రజాసంఘాల ఏర్పాటుకు వినియోగించుకుంటే సుమారు 6 లక్షల పైచిలుకు ఉన్న గ్రామాలు, పల్లెలు, మరియు ఇతర జనావాసాలలో రైతు ప్రజాసంఘాలనేర్పాటు చేసి ఉండేవాళ్లం. ఒక్కొక్క జనావాసం/పల్లె సంఘానికి ఒక లక్ష రూపాయలు మంజూరు చేసినా ప్రతి గ్రామంలోను ఇలాంటి సంఘాలేర్పడి ఉండేవి. నేను స్వతంత్రంగా 28 సంవత్సరాలుగా కృషి చేసి, రైతు ప్రజా సంఘాలనేర్పాటు చేశాను. నా స్వంత ఖర్చులతో తిరిగి ప్రయత్నించాను. 800 పైచిలుకు ప్రదేశాలలో, సంఘాలు/సమాఖ్యలు ఏర్పాటుకు ప్రయత్నించడం జరిగింది. అందులో పోయినవిపోను 250 దాకా ఫోనులో కాంటాక్ట్‌లో ఉన్నాయి. 60కి పైగా నడుస్తున్నాయి.
రైళ్లు నడవాలంటే పట్టాలెంత ముఖ్యమో, పల్లె ప్రాంతాలు, జనావాసాలు, గ్రామీణాభివృద్ధి, ప్రజలు కోరుకున్న విధంగా ఉండాలంటే రైతు ప్రజా సంఘాలు, పార్టీలకతీతంగా ఉండడం అంత ముఖ్యం.
మారుమూల ప్రాంతాలతో సహా అన్ని జనావాసాల్లో ఈ సంఘాలు ఏర్పాటు చేయడం వలన, ప్రజలందరి అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇవ్వగలిగిన సంస్థలు ప్రతిచోట ఏర్పడతాయి. ఇవి స్వయం సమృద్ధాలు. స్వతంత్రంగా నిర్ణయాలు నిష్పక్షపాతంగా తీసుకుంటాయి. చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయి. సభ్యులకవసరమైన చిన్న చిన్న డబ్బు అవసరాలను కూడా తీర్చగల్గుతాయి.
ఎవరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా, అన్యాయాలను ప్రతిఘటిస్తాయి. దిక్కులేని వారికి సహాయకారిగా ఉంటాయి. ఏ పార్టీవారైనా, పార్టీలకతీతమైన సంస్థల ఏర్పాటుకు సహకరించడం వలన చిరస్థాయి కీర్తిని పొందవచ్చు. ఈ రైతు ప్రజా సంఘాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల విస్తరణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ప్రతి కుగ్రామానికి విస్తరణ కార్యక్రమాలు సులభంగా అందుతాయి. అన్ని జనావాసాలలో ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం. వ్యవసాయ అనుబంధ శాఖల వారందరికి శిక్షణలను ట్రెయినర్స్ ట్రైనింగ్ పద్ధతిలో ఇవ్వడం సాధ్యమే. అపార అనుభవాన్నుపయోగించుకోవడానికి ఏ పార్టీ వారైనా, స్వతంత్రులైనా ముందుకు రావచ్చు. అన్ని జనావాసాలలో రైతు ప్రజాసంఘాల ఏర్పాటుకు సహకరించి చిరస్థాయి కీర్తిని పొందండి. తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిన ప్రపోజల్స్‌కు సానుకూలంగా స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందే అవకాశముంది. ఇది రానున్న ఎలక్షన్లలో ఓట్లను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పార్లమెంటు, పంచాయతి ఎలక్షన్‌లలో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎలక్షన్‌లలో మెజారిటి సాధనకు కూడా ఉపయోగపడుతుంది.

