అనంతజీవకోటితో పాటు మనిషి కూడా జీవనం కొనసాగించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరి. గాలి, నీరు ప్రకృతి నుంచి ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే.. మనం తినే ఆహారాన్ని స్వేదం చిందించి, సేద్యం చేసి అష్టకష్టాలు పడుతూ, నష్టాలను భరిస్తూ రైతు పండిస్తున్నాడు. మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయినా కాని పెరుగుతున్న జనాభాకు అవసరమయిన ఆహారాన్ని మన రైతులు పండించగలుగుతున్నారు. మన ఆహార అవసరాలను తీర్చడంతో పాటు వేరే దేశాలకు కూడా మన రైతులు పండించిన ఆహారాలను ఎగుమతి చేయగలుగుతున్నాము. మన దేశంలో చాలామంది రైతులు తాము నష్టాల ఊబిలో కూరుకు పోతూ కూడా తమ కాడిని ఆపకుండా కొనసాగిస్తున్నారు. కాబట్టే మనకు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. రైతు కాడి ఆపితే మనం అకలితో అలమటించవలసిందే. కాబట్టి రైతు కాడి ఆపకూడదు. మనిషి ఉన్నంత కాలం రైతు వ్యవసాయం చేయవలసిందే. ఏమయినా ఆగవచ్చు కాని వ్యవసాయం ఆగకూడదు అనే విషయం అక్షర సత్యం. కాని ఆ వ్యవసాయం చేసే రైతు ఆర్థికంగా బలపడుతున్నాడా? లేదా? అంటే చాలామంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతు పంటల సాగుని కొనసాగించలేడు కాబట్టి రైతులను లాభాల బాట పట్టించడానికి అవసరమయిన చర్యల గురించి ఎవరి పరిధిలో వారు ప్రయత్నిస్తున్నారు. బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొబ్బేపల్లికి చెందిన శరత్ కూడా రైతును లాభాల బాట పట్టించడానికి తనవంతు పాత్రను పోషిస్తున్నాడు.

శరత్‌ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని అందరిలాగే ఉన్నత చదువులు చదివిన తరువాత వ్యవసాయ రంగానికి దూరంగా ఉద్యోగ రంగంలో స్థిరపడాలని ఎంబిఏ వరకు చదువుకుని తన అభీష్టం మేరకు ఉద్యోగ (సాఫ్ట్‌వేర్) రంగంలో ప్రవేశించాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలో సమాజం గురించి, ప్రజల గురించి ఆలోచించడం మొదలయ్యింది. ప్రజలందరికి గాలి, నీరు తరువాత ఆహారం తప్పనిసరి. కాని ఆ ఆహారం పండించే రైతుకు సమాజంలో సరైన గౌరవం దక్కడం లేదు అని గ్రహించాడు. దానికి తోడు రసాయనాలతో పంటల సాగు కొనసాగిస్తుండడం వలన రసాయనిక అవశేషాలు ఉన్న ఆహారాలు తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ రెండింటికి సరైన పరిష్కారం తాను నేరుగా వ్యవసాయరంగంలో అడుగుపెట్టడమే అని తెలుసుకుని, చేస్తున్న ఉద్యోగాన్ని వదలి 2016వ సంవత్సరంలో పంటల సాగులో అడుగు పెట్టాడు.
తన ప్రధాన లక్ష్యం విష రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలి కాబట్టి అందుకు అనుగుణంగా సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలని గట్టిగా నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా తెలుసుకుని మొదటగా బొప్పాయి సాగును సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం మొదలు పెట్టాడు. 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బొప్పాయి సాగును కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సుమారు రెండు ఎకరాలలో బొప్పాయి సాగులో ఉంది. ఇందుకు గాను దుక్కిలో పచ్చిరొట్టపైర్లు వేసి పచ్చిరొట్ట పైర్లు పూత థలో భూమిలో కలియదున్ని అనంతపురం నుంచి కొనుగోలు చేసిన బొప్పాయి మొక్కలను 2023 వ సంవత్సరం ఆగస్టు మాసంలో నాటించాడు. భూమిలో సేంద్రియ పదార్థం పెరగడానికి అవసరమయిన చర్యలు తీసుకున్నాడు కాబట్టి బొప్పాయి ఆరోగ్యంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా జీవామృతాన్ని మరియు వివిధ రకాల జీవన ఎరువులను భూమికి అందించటంతో పాటు చీడపీడల నివారణకుగాను వేపనూనె, వేప కషాయం, జీవసంబంధిత కీటకనాశనులు, థపర్ణి కషాయం, అగ్నాస్త్రం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం పంట ఆరోగ్యంగా ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చేలా ఉంది.

2016వ సంవత్సరంలో శరత్ మొట్టమొదట సేంద్రియ పద్ధతులతో బొప్పాయి పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించాడు. కాని మార్కెటింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను పండించిన బొప్పాయి పండ్లను వ్యాపారస్తులకు అమ్మడానికి ప్రయత్నించగా అప్పుడు ఉన్న రేటు ఆశాజనకంగా లేకపోవడం వలన కొంత బొప్పాయి దిగుబడిని వ్యాపారస్తులకు అమ్మి కొంత బొప్పాయిని ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు లాంటి పట్టణాలలో నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టాడు. సేంద్రియ పద్ధతులతో పండించడం వలన బొప్పాయి రుచి బాగా ఉండి వినియోగదారులు మరలా మరలా కొనడం మొదలు పెట్టారు. ఆశాజనకమయిన ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడం తెలుసుకొన్న శరత్ బొప్పాయితో పాటు ఇతర సేంద్రియ రైతుల దగ్గర నుంచి కూరగాయలు మరియు ఇతర ఆహారాలను సేకరించి నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. ఎలాంటి రసాయనాలు అందించకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారాలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని తెలుసుకుని మార్టూరులో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆ దుకాణం ద్వారా తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులతో పాటు ఇతర రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు.
శరత్ లక్ష్యం తాను ప్రత్యక్షంగా వ్యవసాయం చేసి ఎలాంటి విష రసాయనాలు ఉపయోగించకుండా పంటలు పండించి తన పంటల సాగుని లాభాల బాట పట్టించడంతో పాటు తోటి రైతులను కూడా లాభాల బాట పట్టించడం కాబట్టి సేంద్రియ సాగులో తాను తెలుసుకున్న మెళకువలను తోటి రైతులకు కూడా తెలియ చేస్తూ తోటి రైతులను కూడా సేంద్రియం వైపు మల్లించడానికి తన వంతు కృషి నిరంతరం చేస్తూ ఉన్నాడు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి శరత్ దగ్గర సలహాలు తీసుకుంటున్న రైతులు చాలా వరకు తమ పద్ధతులు మార్చుకుంటూ తమ రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చుకుంటూ వస్తున్నారు.
గతాన్ని ఒక్కసారి గమనించినట్లయితే చాలామంది రైతులు పంటల సాగుతో పాటు పాడి పశువులు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు లాంటి వాటిని పోషిస్తూ వారికి తెలియకుండానే సమీకృత వ్యవసాయ విధానాన్ని అనుసరించారు. కాని రాను రాను వివిధ రకాల కారణాల వలన రైతులు ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. ఏక పంట విధానం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏక పంట విధానం వలన చీడపీడల ప్రభావం పంటలపై పెరగడంతో పాటు ప్రతికూల పరిస్థితులలో ఆ ఏక పంటలో నష్టం వచ్చినట్లయితే రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు తిరిగి సమీకృత వ్యవసాయ బాట పట్టవలసిందే అని గ్రహించిన శరత్ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటు కోళ్ళను పెంచుతూ, ఆవులను పోసిస్తున్నాడు. భవిష్యత్తులో చేపలను కూడా పెంచాలనే యోచనలో ఉన్నాడు.
తన సేంద్రియ పంటల సాగుని లాభాల బాట పట్టించడంతో పాటు తోటి రైతులు కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే లక్ష్యం శరత్ నిర్దేశించుకున్నాడు కాబట్టి అందులో భాగంగా ఇటీవల గాంఢీవ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాడు. ఇందులో రైతులను సభ్యులుగా చేర్చుకున్నాడు. ప్రస్తుతానికి 300 మందికి పైగా రైతులు గాంఢీవ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. ముందు ముందు ఇంకా సభ్యుల సంఖ్య పెరుగుతుందని వివరించాడు. రైతులకు అవసరమయిన శిక్షణా తరగతులు నిర్వహించటము, పంటల సాగుకు అవసరమయిన వ్యవసాయ ఉత్పాదనలను తక్కువ ధరలో రైతుకు అందుబాటులో ఉంచటం, రైతులు పండించిన ఉత్పత్తులను ఆశాజనకమయిన ధరలకు ఎక్కడ వీలుంటే అక్కడ అమ్మకం చేయడం లాంటివి ఈ కంపెనీ ద్వారా చేస్తాము అని శరత్ వివరించాడు.
సేంద్రియ సాగుపై అవగాహన పెరిగిన తరువాత అనేకమంది ఉద్యోగ రంగం నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టారు కాని అతికొద్దిమంది మాత్రమే వ్యవసాయరంగంలో కొనసాగుతున్నారు. ఎక్కువ మంది వ్యవసాయ రంగాన్ని వదలి తిరిగి వేరే రంగాలకు వెళ్ళారు. కాని శరత్ పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి సేంద్రియ సాగులో కొనసాగుతూ సాగుని లాభాల బాట పట్టించడానికి తన వంతు కృషిని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాడు. మరిన్ని వివరాలు 95533 01949 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

