రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు ప్రచారం చేయటం జరిగింది. ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అనేకమంది సేంద్రియ సాగు పద్ధతుల గురించి వివరిస్తున్నాకాని, సుభాష్‌పాలేకర్‌ గారు చెబుతున్న జీరోబడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ఎక్కువమంది రైతు లోగిళ్ళకు చేరిందనుకోవచ్చు. సేంద్రియ సాగు పై బాగా అవగాహన వచ్చిన తరువాత కొత్తగా సేంద్రియ సాగు చేపట్టేవారు కానీ, అప్పటికే రసాయనిక వ్యవసాయం చేస్తూ తమ సాగుని సేంద్రియంలోకి మార్చుకుంటున్నవారు కాని ఎక్కువగా సుభాష్‌ పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతులకు ప్రభావితం అయ్యారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కేవలం సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు చేస్తున్న రైతులు కాలం గడిచే కొలది వివిధ రకాల కారణాల వలన సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు తోడు మిగతా సేంద్రియ సాగు పద్ధతులను కూడా జోడించి రసాయనరహిత వ్యవసాయాన్ని చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు కూడా సుభాష్‌ పాలేకర్‌ గారు చెపుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రభావితమయ్యి తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియ సాగులోకి మార్చాడు. 

రాంబాబుది వ్యవసాయ నేపథ్యం. వివిధ రకాల పంటల సాగులో రాంబాబుకు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందరిలాగానే రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్న సందర్భంలో స్నేహితుల ద్వారా సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని, తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చాలని తలంచి మెల్లమెల్లగా రసాయనాలు తగ్గిస్తూ సేంద్రియ పద్దతులను అమలు పరస్తూ 4 సంవత్సరాలు మిశ్రమ సేద్యం చేసి, సేంద్రియ సాగు గురించి, సేంద్రియ సాగులో అమలు పరచవలసిన పద్ధతుల గురించి పూర్తి అవగాహన వచ్చిన తరువాత తన పంటల సాగుని 6 సంవత్సరాల క్రితం పూర్తిగా సేంద్రియంలోకి మార్చి గత 6 సంవత్సరాల నుంచి తనకున్న 4 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నాడు.

సొంత భూమి 4 ఎకరాలలో శాశ్వత పందిర్లు ఏర్పాటు చేశాడు. 141/2þ141/2 అడుగుల దూరంలో రాతి స్థంభాలు ఏర్పాటు చేసుకుని, జి.ఐ. వైరుతో పందిరి ఏర్పాటు చేసుకున్నాడు. 4 ఎకరాల భూమిని వివిధ భాగాలుగా చేసుకుని 15 నుంచి 20 రకాల కూరగాయలు మరియు కొన్నిరకాల ఆకుకూరలు సీజన్‌ను బట్టి సాగు చేస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు వినియోగదారులకు, సాధ్యమైనన్ని ఎక్కువ రకాల కూరగాయలు, ఆకుకూరలు అందించడానికి వీలుగా తన పొలాన్ని ప్రణాళిక ప్రకారం సాగుకి సిద్ధం చేస్తుంటాడు. సేంద్రియ సాగులో పంట మార్పిడి మరియు అంతర, మిశ్రమ పంటలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి రాంబాబు తప్పనిసరిగా ఈ మెళకువలు పాటిస్తుంటాడు. అందులో భాగంగా గట్ల వెంబడి, పందిరికి, పందిరికి మధ్య పోటీ ఇచ్చే స్థంభాలకు కూడా అవకాశం ఉన్న కూరగాయలు పండిస్తుంటాడు. పంట మార్పిడిలో భాగంగా సంవత్సరంలో రెండు పంటలు కూరగాయల పంటలు పండిస్తూ మూడవ పంటగా వరి లేదా మొక్కజొన్న లేదా అపరాల పంటలు సాగు చేస్తుంటాడు.

18 రకాల పచ్చిరొట్ట విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పూత రాక ముందు రోటోవేటరు సహాయంతో భూమిలో కలియదున్నడముతో పాటు గొర్రెల ఎరువు, సొంత పశువుల ఎరువును దుక్కిలో అందిస్తుంటాడు. అవకాశం ఉన్నప్పుడు భూమి ఖాళీగా ఉన్నప్పుడు గొర్రెల మందలను లేదా పశువుల మందను కట్టిస్తుంటాడు. సేంద్రియ సాగులోకి మారిన మొదటలో దుక్కిలో ఘనజీవామృతం తప్పనిసరిగా అందిస్తుంటాడు. కాని ప్రస్తుతం ఘనజీవామృతాన్ని దుక్కిలో అందించకుండా పశువుల ఎరువుపై ద్రవ జీవామృతం చల్లి ఆ ఎరువును దుక్కిలో వేస్తుంటాడు. పంట వేసిన తరువాత క్రమం తప్పకుండా భూమికి జీవామృతాన్ని, సొతంగా తయారు చేసుకున్న జీవన ఎరువులు, జీవశిలీంద్రనాశనులను వెంచర్‌ ద్వారా అందిస్తుంటాడు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా సరిహద్దుపంటలుగా బెండ లాంటి కూరగాయలను, ఎర పంటలుగా బంతి లాంటి పంటలను సాగు చేస్తుంటాడు. రసం పీల్చు పురుగుల నియంత్రణకు పసుపు మరియు బులుగు రంగు జిగురు అట్టలు, కాయతొలుచు పురుగు, ఆకుతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు లాంటి చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, తీగజాతి కూరగాయలలో వచ్చే ఫ్రూట్‌ ఫ్లై నివారణకు ఫ్రూట్‌ ఫ్లై ట్రాప్స్‌ ఏర్పాటు చేస్తుంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడల ప్రభావం ఉంటే నీమాస్త్రం, థపర్ణి కషాయం, పంచగవ్య, వేపగింజల ద్రావణం లాంటివి ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నాడు.

సేంద్రియ సాగులో దిగుబడి సాధించడము ఒక పరీక్ష అయితే పొందిన ఆరోగ్యకరమైన దిగుబడిని ఆశాజనకమయిన ధరలకు అమ్మటం మరో పెద్ద పరీక్ష. సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలకు మామూలు మార్కెట్‌లో సాధారణ ధరే పలుకుతుంది కాని ప్రత్యేక ధరకు అమ్మకం చేయలేక పోతున్నారు. దానిని గ్రహించిన రాంబాబు తన చుట్టు ప్రక్కల ప్రాంతాలలో తన సాగు పద్ధతుల గురించి ప్రచారం చేయడం జరిగింది. తన సాగు పద్ధతులను చూడటానికి అనేకమంది వినియోగదారులు ప్రత్యక్షంగా రాంబాబు పొలాన్ని సందర్శించి నమ్మకం కుదిరిన తరువాత రాంబాబు దగ్గర కూరగాయలు మరియు ఆకుకూరలు కొని వాటి రుచి చూసిన తరువాత మరలా మరలా కొనుగోలు చేస్తుండడము మొదలయ్యింది. ఈ విధంగా 800 కుటుంబాలకు అవసరమయిన కూరగాయలను అందించగలిగే స్థాయికి రాంబాబు ఎదిగాడు. 8 వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి 800 కుటుంబాలకు, రోజు కొన్ని కుటుంబాలు చొప్పున వారంలో అన్ని కుటుంబాలకు వారానికి సరిపోను కూరగాయలు నేరుగా ఇంటి వద్దకు చేరవేస్తున్నాడు. ప్రస్తుతం 14 రకాల కూరగాయలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం శీతాకాలంలో 22 రకాలకు పైగా కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా వినియోగదారులకు అందించగలిగాడు. సాధ్యమయినంతవరకు తాను పండిస్తూ, తాను పండించ లేనివి తోటి సేంద్రియ రైతుల వద్ద నుంచి సేకరించి తోటి రైతులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు.

పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ తమ భూమిని కాపాడుకుంటూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఒక మంచి ఉద్యోగంలో పొందే జీతానికి తగ్గకుండా ఒకరి కింద పని చేయకుండా సొంతంగా సంపాదించుకుంటున్నాడు. మరిన్ని వివరాలు 98487 57411కి ఫోను చేసి తెలుసుకోగలరు.