అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే సేంద్రియ సాగులో విజయం తథ్యం

మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ, ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై అధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడా రైతులందరూ ఆర్థికంగా విజయం సాధించగలుగుతున్నారా? అని అడిగితే సమాధానం లేదు అని వస్తుంది. వివిధ రకాల కారణాల వలన ఎక్కువమంది రైతులు తమ పంటల సాగులో దిగుబడులు అయితే సాధించగలుగుతున్నారు కాని ఆర్థికంగా లాభాలు ఆర్జించలేకపోతున్నారు. తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపించుకోవడానికి కొంతమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. సేంద్రియ బాటపట్టిన రైతులందరూ లాభాలు ఆర్జించగలుగుతున్నారా? అంటే సమాధానం లేదు అని వస్తుంది. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే సేంద్రియ సాగులో అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అశ్రద్ధ చేయకుండా సద్వినియోగం చేసుకోగలిగితే సేంద్రియ సాగులో విజయం తథ్యం అని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా, ఉంగుటూరు గ్రామానికి చెందిన  గద్దె వెంకటరత్నం (రత్నాజి).

రత్నాజీది వ్యవసాయ నేపధ్యం. తోటి రైతుల లాగానే తమ పంటల సాగులో రసాయనాలు కూడా వినియోగిస్తూ సాగుని కొనసాగిస్తుండగా 2006వ సంవత్సరములో తమ ప్రక్క పొలంలో గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాల పరిధిలో భూపతిరాజు రామకృష్ణంరాజు గారు గో-ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టి రత్నాజీ గారిని కూడా అడగడము జరిగింది. గో-ఆధారిత వ్యవసాయంతో కాలుష్యం తగ్గుతుందని గ్రహించిన రత్నాజీ 2008 వ సంవత్సరం నుంచి తాను పండించే పంటలను గో-ఆధారిత వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టాడు. ఇందుకుగాను మొత్తం 9 దేశీయ జాతి ఆవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తమ పంటల సాగులో వినియోగిస్తున్నాడు. తమ సొంత పొలం 9 ఎకరాలతో పాటు కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని వరి పంటతో పాటు ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు.

ప్రస్తుతం కుజూ పటాలియా, తులసిబోసో, పిఎల్‌ఏ 1100 మొదలగు రకాలు సాగులో ఉన్నాయి. విత్తనాన్ని బీజామృతంతో విత్తనశుద్ధి చేయడముతో పాటు నారును కూడా బీజామృతంలో ముంచి బీహారు కూలీల చేత నాటించారు. దుక్కిలో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల విత్తనాలను ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనాలను పచ్చిరొట్టగా చల్లి అవి పెరిగి పూత వచ్చే సమయంలో ఆపచ్చిరొట్టను రోటావేటరు సహాయంతో భూమిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘనజీవామృతం అందించి బీహారు కూలీల సహాయంతో నారు నాటించారు. ఈ పద్ధతిలో కాలిబాటలు ఉండడముతో పాటు మొక్కలకు గాలి వెలుతురు బాగా అందుతాయి కాబట్టి చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండడము రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దుక్కిలో పచ్చిరొట్ట మరియు ఘనజీవామృతం అందిస్తూ వస్తూండడము వలన తమ భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి మొక్కలు బాగా రోగనిరోధక శక్తితో పెరుగుతున్నాయి. దానికి తోడు జీవవైవిధ్యాన్ని కాపాడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి రత్నాజీగారి పొలంలో మిత్ర పురుగుల నిష్పత్తి అనుకూలంగా ఉండడమ వలన చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండటము రత్నాజీ గమనించాడు. రెండు సంవత్సరాల క్రితం పంటపై ఆశించే చీడపీడల నివారణకు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల పిచికారి అవసరముండేది. కాని గత రెండు సంవత్సరాల నుంచి చీడపీడల కొరకు ఏవిధమైన చర్యలు చేపట్టనవసరం పడటము లేదు. నారు నాటడం, నేలకు జీవన ఎరువులు, జీవ శిలీంద్రనాశినులు, జీవ కీటకనాశినులు కలిపిన ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నారు. అయినా కాని ఎకరానికి మన పురాతన వరి వంగడాలు అయితే 25 నుంచి 30 బస్తాలు, పిఎల్‌ రకం ఎకరానికి 44 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు.

తమ పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవటానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవ శిలీంద్ర నాశినులు, జీవకీటక నాశనులు ఎన్‌ఐపిహెచ్‌ఎం నుంచి మదర్‌ కల్చర్‌ సేకరించి తానే సొంతంగా ఇంటి దగ్గరే వాటిని అభివృద్ధి పరచుకొని పంటల సాగులో వినియోగిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నీమాస్త్రం, అగ్నాస్త్రం, థపర్ణికషాయం లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నాడు. వచ్చిన వడ్ల దిగుబడిని ఒక సంవత్సరంపాటు నిల్వ ఉంచి పాతబడిన తరువాత బియ్యం పట్టించి కిలో బియ్యం 70/-లకు అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు. మార్కెట్‌లో ధర ఇంకా అధికంగా ఉన్నా కాని అందరికీ అందుబాటులో ధర ఉండాలన్న లక్ష్యంతో కిలో 70/-ల చొప్పున మాత్రమే అమ్మకం చేస్తున్నాడు. 75 కిలోల వడ్ల బస్తాను మరపట్టించి 56 కిలోల ముడిబియ్యాన్ని పొందుతూ కిలో రూ. 70/- చొప్పున అమ్మకం చేస్తూ బస్తా వడ్ల నుంచి రూ. 3,920/-లు ఆదాయం పొందుతున్నాడు.

ఎకరంన్నర పొలంలో ఇండోనేషియా మోడల్‌ సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నాడు. 70 సెంట్లలో వరి సాగు చేస్తూ దాని ప్రక్కనే 5 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు కందకం త్రవ్వి అందులో నీటిని నింపి కొరమేను, శీలావతి, కట్ల, రూప్‌చంద్‌ లాంటి చేపలను పెంచుతూ దాని ప్రక్కనే ఇంకో 40 సెంట్లలో వివిధ రకాల పండ్ల మొక్కలు, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఇంటికి అవసరమైన పసుపు, అల్లం లాంటి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. రాబోవు రోజులలో ఇంటికి అవసరమైన ఔషధ మొక్కలను కూడా సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ఈ ఎకరంన్నర సమీకృత వ్యవసాయం నుంచి మూడున్నర లక్షల ఆదాయం పొందడం జరిగింది. 

తాము సాగు చేసే వరి పొలంలో అజొల్లాకూడా దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. అజొల్లా వలన వరిపైరులో కలుపు సమస్య తగ్గడంతో పాటు గాలిలోని నత్రజని మొక్కలకు అందుతుంది కాబట్టి పంట ఏపుగా పెరుగుతుంది. పశువులకు దాణాగా అజొల్లాను అందించడంతో పాటు చేపలకు కూడా అజొల్లాను ఆహారంగా అందిస్తున్నాడు. మిగతా వారు పెంచే చేపలతో పోల్చితే తాము పెంచే చేపలను కిలోకు 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మినా కూడా వినియోగదారులు తాము పెంచే చేపలను కొనుగోలు చేయడం రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

సేంద్రియ సాగులో అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలుపరుస్తూ వచ్చిన దిగుబడిని అదేవిధంగా అమ్మకం చేయకుండా విలువజోడించి మంచి ధరకు వినియోగదారులకు నేరుగా అమ్మకం చేయడంతో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులను కూడా అమలు పరుస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసకోగలిగితే సేంద్రియ సాగు విజయం తధ్యం అని రత్నాజీ నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9948796638 కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

Read More

సమగ్ర సస్యరక్షణతోనే ఆరోగ్యకరమైన దిగుబడులు

రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు ప్రచారం చేయటం జరిగింది. ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అనేకమంది సేంద్రియ సాగు పద్ధతుల గురించి వివరిస్తున్నాకాని, సుభాష్‌పాలేకర్‌ గారు చెబుతున్న జీరోబడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ఎక్కువమంది రైతు లోగిళ్ళకు చేరిందనుకోవచ్చు. సేంద్రియ సాగు పై బాగా అవగాహన వచ్చిన తరువాత కొత్తగా సేంద్రియ సాగు చేపట్టేవారు కానీ, అప్పటికే రసాయనిక వ్యవసాయం చేస్తూ తమ సాగుని సేంద్రియంలోకి మార్చుకుంటున్నవారు కాని ఎక్కువగా సుభాష్‌ పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతులకు ప్రభావితం అయ్యారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కేవలం సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు చేస్తున్న రైతులు కాలం గడిచే కొలది వివిధ రకాల కారణాల వలన సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు తోడు మిగతా సేంద్రియ సాగు పద్ధతులను కూడా జోడించి రసాయనరహిత వ్యవసాయాన్ని చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు కూడా సుభాష్‌ పాలేకర్‌ గారు చెపుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రభావితమయ్యి తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియ సాగులోకి మార్చాడు. 

రాంబాబుది వ్యవసాయ నేపథ్యం. వివిధ రకాల పంటల సాగులో రాంబాబుకు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందరిలాగానే రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్న సందర్భంలో స్నేహితుల ద్వారా సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని, తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చాలని తలంచి మెల్లమెల్లగా రసాయనాలు తగ్గిస్తూ సేంద్రియ పద్దతులను అమలు పరస్తూ 4 సంవత్సరాలు మిశ్రమ సేద్యం చేసి, సేంద్రియ సాగు గురించి, సేంద్రియ సాగులో అమలు పరచవలసిన పద్ధతుల గురించి పూర్తి అవగాహన వచ్చిన తరువాత తన పంటల సాగుని 6 సంవత్సరాల క్రితం పూర్తిగా సేంద్రియంలోకి మార్చి గత 6 సంవత్సరాల నుంచి తనకున్న 4 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నాడు.

సొంత భూమి 4 ఎకరాలలో శాశ్వత పందిర్లు ఏర్పాటు చేశాడు. 141/2þ141/2 అడుగుల దూరంలో రాతి స్థంభాలు ఏర్పాటు చేసుకుని, జి.ఐ. వైరుతో పందిరి ఏర్పాటు చేసుకున్నాడు. 4 ఎకరాల భూమిని వివిధ భాగాలుగా చేసుకుని 15 నుంచి 20 రకాల కూరగాయలు మరియు కొన్నిరకాల ఆకుకూరలు సీజన్‌ను బట్టి సాగు చేస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు వినియోగదారులకు, సాధ్యమైనన్ని ఎక్కువ రకాల కూరగాయలు, ఆకుకూరలు అందించడానికి వీలుగా తన పొలాన్ని ప్రణాళిక ప్రకారం సాగుకి సిద్ధం చేస్తుంటాడు. సేంద్రియ సాగులో పంట మార్పిడి మరియు అంతర, మిశ్రమ పంటలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి రాంబాబు తప్పనిసరిగా ఈ మెళకువలు పాటిస్తుంటాడు. అందులో భాగంగా గట్ల వెంబడి, పందిరికి, పందిరికి మధ్య పోటీ ఇచ్చే స్థంభాలకు కూడా అవకాశం ఉన్న కూరగాయలు పండిస్తుంటాడు. పంట మార్పిడిలో భాగంగా సంవత్సరంలో రెండు పంటలు కూరగాయల పంటలు పండిస్తూ మూడవ పంటగా వరి లేదా మొక్కజొన్న లేదా అపరాల పంటలు సాగు చేస్తుంటాడు.

18 రకాల పచ్చిరొట్ట విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పూత రాక ముందు రోటోవేటరు సహాయంతో భూమిలో కలియదున్నడముతో పాటు గొర్రెల ఎరువు, సొంత పశువుల ఎరువును దుక్కిలో అందిస్తుంటాడు. అవకాశం ఉన్నప్పుడు భూమి ఖాళీగా ఉన్నప్పుడు గొర్రెల మందలను లేదా పశువుల మందను కట్టిస్తుంటాడు. సేంద్రియ సాగులోకి మారిన మొదటలో దుక్కిలో ఘనజీవామృతం తప్పనిసరిగా అందిస్తుంటాడు. కాని ప్రస్తుతం ఘనజీవామృతాన్ని దుక్కిలో అందించకుండా పశువుల ఎరువుపై ద్రవ జీవామృతం చల్లి ఆ ఎరువును దుక్కిలో వేస్తుంటాడు. పంట వేసిన తరువాత క్రమం తప్పకుండా భూమికి జీవామృతాన్ని, సొతంగా తయారు చేసుకున్న జీవన ఎరువులు, జీవశిలీంద్రనాశనులను వెంచర్‌ ద్వారా అందిస్తుంటాడు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా సరిహద్దుపంటలుగా బెండ లాంటి కూరగాయలను, ఎర పంటలుగా బంతి లాంటి పంటలను సాగు చేస్తుంటాడు. రసం పీల్చు పురుగుల నియంత్రణకు పసుపు మరియు బులుగు రంగు జిగురు అట్టలు, కాయతొలుచు పురుగు, ఆకుతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు లాంటి చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, తీగజాతి కూరగాయలలో వచ్చే ఫ్రూట్‌ ఫ్లై నివారణకు ఫ్రూట్‌ ఫ్లై ట్రాప్స్‌ ఏర్పాటు చేస్తుంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడల ప్రభావం ఉంటే నీమాస్త్రం, థపర్ణి కషాయం, పంచగవ్య, వేపగింజల ద్రావణం లాంటివి ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నాడు.

సేంద్రియ సాగులో దిగుబడి సాధించడము ఒక పరీక్ష అయితే పొందిన ఆరోగ్యకరమైన దిగుబడిని ఆశాజనకమయిన ధరలకు అమ్మటం మరో పెద్ద పరీక్ష. సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలకు మామూలు మార్కెట్‌లో సాధారణ ధరే పలుకుతుంది కాని ప్రత్యేక ధరకు అమ్మకం చేయలేక పోతున్నారు. దానిని గ్రహించిన రాంబాబు తన చుట్టు ప్రక్కల ప్రాంతాలలో తన సాగు పద్ధతుల గురించి ప్రచారం చేయడం జరిగింది. తన సాగు పద్ధతులను చూడటానికి అనేకమంది వినియోగదారులు ప్రత్యక్షంగా రాంబాబు పొలాన్ని సందర్శించి నమ్మకం కుదిరిన తరువాత రాంబాబు దగ్గర కూరగాయలు మరియు ఆకుకూరలు కొని వాటి రుచి చూసిన తరువాత మరలా మరలా కొనుగోలు చేస్తుండడము మొదలయ్యింది. ఈ విధంగా 800 కుటుంబాలకు అవసరమయిన కూరగాయలను అందించగలిగే స్థాయికి రాంబాబు ఎదిగాడు. 8 వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి 800 కుటుంబాలకు, రోజు కొన్ని కుటుంబాలు చొప్పున వారంలో అన్ని కుటుంబాలకు వారానికి సరిపోను కూరగాయలు నేరుగా ఇంటి వద్దకు చేరవేస్తున్నాడు. ప్రస్తుతం 14 రకాల కూరగాయలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం శీతాకాలంలో 22 రకాలకు పైగా కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా వినియోగదారులకు అందించగలిగాడు. సాధ్యమయినంతవరకు తాను పండిస్తూ, తాను పండించ లేనివి తోటి సేంద్రియ రైతుల వద్ద నుంచి సేకరించి తోటి రైతులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు.

పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ తమ భూమిని కాపాడుకుంటూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఒక మంచి ఉద్యోగంలో పొందే జీతానికి తగ్గకుండా ఒకరి కింద పని చేయకుండా సొంతంగా సంపాదించుకుంటున్నాడు. మరిన్ని వివరాలు 98487 57411కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More