మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవితాలను కొనసాగిస్తున్నారు. స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తూ పంటలు సాగు చేసి ప్రజల ఆకలిని తీర్చే చాలామంది రైతులు తమ కడుపులను కాల్చుకొంటున్నారనే విషయం అక్షర సత్యం. వ్యవసాయం చేసి పంటల సాగు చేస్తున్నారు కాని ఎక్కువమంది రైతులు తమ పంటలసాగులో ఆర్థికంగా నష్టాలను భరించవలసి వస్తుంది. పంటలసాగు లాభదాయకంగా లేకపోవడానికి వివిధ రకాల కారణాలున్నాకాని పెట్టుబడులు పెరగటంతోపాటు సరైన సమయంలో సక్రమంగా వ్యవసాయ పనులు చేయలేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులందరికి ఒకే సమయములో వ్యవసాయ పనులు మొదలు అవుతాయి కాబట్టి ఒకే సమయంలో అందరి పొలంలో వ్యవసాయ పనులు నిర్వహించడానికి కూలీలు అందుబాటులో ఉండకపోవడం అనే విషయం సర్వసాధారణం. అనుకున్న సమయానికి కూలీలు అందుబాటులో లేకపోవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు కూలీలకు ఎక్కువ డబ్బు చెల్లించవలసి రావడమే కూడా జరిగి  కూలీల ఖర్చు పెరిగి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కూలీల కొరతను అధిగమించడానికి ఫార్మ్‌ సంస్థ వారు ఒక రోబోను తయారు చేశారు.

మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కొంచెం నిదానించిందని చెప్పవచ్చు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఏదిఏమైనాకాని గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో సాంకేతికపరమైన యంత్రాలు, పనిముట్లు వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టడంలో కొంచెం వేగం పెరిగిందనవచ్చు. గతంలో పంటలసాగులో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు పంటలపై ఏమైనా పిచికారి చేయాలంటే 10-15 లీటర్ల ట్యాంకును వీపున వేసుకుని నాజిల్‌ అమర్చిన రాడ్‌ను చేతులతో ముందుకు, వెనుకకు లాగుతుంటే ఆ పరికరానికి అమర్చిన నాజిల్‌ ద్వారా మందులు పంటలపై పిచికారి జరుగుతుంటాయి. వరి కోతకోయాలన్నా, కంది, పెసర, మినుము, శనగ, మొక్కజొన్న మొదలగు పంటలు కోయాలన్నా మానవ వనరులనే ఉపయోగించేవారు. కాని ఇటీవలకాలంలో ఇలాంటి పనులు చేయడానికి యంత్రాలు రావడం అనేది రైతులకు దొరికిన అదృష్టంగా భావించవచ్చు.

అయినా కాని మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విషయాలను గుర్తించిన నిపుణులు, యువత, ప్రభుత్వాలు.. వ్యవసాయంలో కొత్త కొత్త యంత్ర పరికరాల ఆవిష్కరణ కొరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల ఫలితమే వ్యవసాయంలో ఎన్నో కొత్త యంత్రాలు, పరికరాలు రావడం జరిగింది. ఇటీవలకాలంలో వ్యవసాయంలో ప్రవేశపెట్టిన కొత్త యంత్ర పరికరాల గురించి ప్రస్తావించవలసి వస్తే డ్రోన్‌ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు డ్రోన్‌ సరసన రోబో కూడా చేరింది. డ్రోన్‌తో కేవలం పిచికారి మాత్రమే చేయవచ్చు. కాని రోబోతో వివిధ రకాల వ్యవసాయ పనులు చేయవచ్చు అని వివరిస్తున్నారు ఫామ్‌ రోబో సంస్థ ప్రతినిధి రాధాకృష్ణ.

ఎద్దుల అరకతో, పవర్‌ వీడర్‌తో చేసే పనులయినటువంటి అంతర సేద్యం, రోటోవేటర్‌, కలుపు నివారణ కొరకు ఉపయోగించే గొర్రు, గుంటకల లాంటి వివిధ రకాల అంతర సేద్యం పనులు ఈ రోబోతో చేసుకోవచ్చు. మందుల పిచికారికి కూడా రోబోను ఉపయోగించు కోవచ్చు. ఈ రోబో సుమారు 500 కిలోల వరకు బరువు మోయగల సామర్థ్యం కలది కాబట్టి అంత బరువు గల వ్యవసాయ ఉత్పత్తులను, పశుగ్రాసాలను కూడా రవాణా చేసుకోవడము కొరకు ఈ రోబోను ఉపయోగించుకోవచ్చు. రోబో బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది కాబట్టి పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి మంచి ప్రత్యామ్నాయం రోబో అని చెప్పవచ్చు. రోబోను ఆపరేట్‌ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. చిన్న పిల్లలు వీడియో గేమ్‌ ఆడుతున్నట్లు ఈ రోబోను ఆపరేట్‌ చేయవచ్చు కాబట్టి ఎవరైనా రోబోను చాలా సులభంగా ఆపరేట్‌ చేయవచ్చని రాధాకృష్ణ వివరించాడు. మరిన్ని వివరాలు 9154153922 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్