సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువుకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే. పశువుకు అందించే ఆహారంలో నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో బాటు మాంసకృత్తులు, ఖనిజలవణాలు మరియు విటమిన్లు తగిన మోతాదులో దాణా రూపంలో అందిస్తుంటాం. పశువు శరీర అవసరాలను, పెరుగుదల ప్రత్యుత్పత్తి, పాల ఉత్పత్తుల కోసం ఇదెంతో ఉపకరిస్తుంది. తక్కువ పాలనిచ్చే పశువు తినే ఆహారంలో 66% శరీర పోషణకు ఉపయోగించుకోగా, అధిక పాల దిగుబడి నిచ్చేవి మాత్రం కేవలం 35% మాత్రమే శరీర పోషణకు ుపయోగించుకుంటాయి. పాలఉత్పత్తికయే ఖర్చులో మేతకే 55% మేర ఉంటుంది కాబట్టి, వీలైనంత నియంత్రణలో పోషకాల ఆహారం, స్థానిక వనరులతో తయారు చేసినవి ఉపయోగిస్తేనే, పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. గడ్డి కత్తిరించి మేపడం అలవాటు చేయాలి.
పోషకాల గని లాంటి దాణాలో సాధారణంగా మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలు, శనగలు, చెక్కలు, వరి తవుడు, చెరకు మడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఉప్పు లాంటి స్థూల పోషకాలుంటాయి.పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణాలు కలిపి ఒకేసారి మిశ్రమ దాణాగా అందించడాన్ని మిశ్రమ ఆహారం అంటారు. ఈ పద్ధతి ద్వారా పశువు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అంతేకాక, కూలీ ఖర్చు ఆదా అవుతుంది. ఇలా ఆహారం అందించడం ద్వారా పశువు పొట్టలో ఉదజని సూచిక స్థిరంగా ఉండి సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉంటుంది. సరిగ్గా లెక్కకట్టి మేపడం సాధ్యం అవుతుంది కాబట్టి పశుగ్రాసం, దాణా వృథా కూడా అరికట్టవచ్చు.

పశుగ్రాస కత్తిరింపు యంత్రంలో పచ్చిమేతను ముక్కలుగా కత్తిరించి, ఎండుగడ్డి, చొప్ప కూడా కత్తిరించి, దాణా కలిపి, 15 నుండి 20 నిమిషాలు మంచిగా కలిపి రోజుకు 3-4 సార్లు పశువుకు మేపాలి. మేతలు, దాణాల కొలతకై డిజిటల్ మీటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దాణా తొట్టిలో సమంగా పడేలా చేసే యంత్రాలు కూడా దొరుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పంటల వ్యర్థాలతో సైతం ఇలాంటి మిశ్రమ ఆహారం తయారు చేయవచ్చు. వివిధ వ్యవసాయ వ్యర్థాలైన చెరకు పిప్పి, జొన్నచొప్ప, ఎండుగడ్డి, పొద్దుతిరుగుడు కట్టె, వరిగడ్డి, ప్రత్తి కట్టె, సుబాబుల్ ఆకులు, ఎండిన టేకు ఆకులు, ఎండిన మామిడి ఆకులు, వేరుశనగ కట్టె లాంటి ఎన్నింటినో ఈ మిశ్రమ దాణా తయారులో తగు మోతాదుల్లో వాడవచ్చు. రుచికోసం మొలాసిస్ కలిపితే, దాణా రుచికరంగా ఉంటుంది.

ఈ పద్ధతి ద్వారా పశువులకు ఎక్కువ పీచు ఉండేపదార్థాలు సద్వినియోగంలోకి తేవచ్చు. కడుపు ఉబ్బరం ఏర్పడకుండా కొద్దికొద్దిగా మేపడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మిశ్రమ ఆహారం పాలఉత్పత్తి ఖర్చును తగ్గించడమేకాక, వెన్నశాతం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకులలో అధిక మాంసకృత్తులుండే చెట్లయిన మునగ, మలబారు, గ్లైరిసిడియా, సుబాబుల్, అవిశె, తురకవేప లాంటి చెట్ల ఇంటి ఆవరణలో పెంచి, ఇట్టి చెట్ల ఆకులు వినియోగంలోకి తేవడం, పాల ఉత్పత్తి ఖర్చు తగ్గుదలకు మొదటి మెట్టు. ఏ వస్తువైనా అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, అట్టి వస్తువుకు వినియోగదారుడు చెల్లించే ధర తగ్గుతుంది. కానీ, ఇది పాడిపరిశ్రమ విషయంలో జరగడం లేదు. అందుకే విరివిగా దాణా కర్మాగారాల స్థాపన జరిగి, పచ్చిమేత, అజొల్లా, మాగుడు గడ్డి లాంటివి మహాత్మాగాంధీ ఉపాధి పథకంలో విస్తృతపరిస్తేనే, పాడి పల్లవిస్తుంది. పాల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.
మధుసూదనరావు, ఉప సంచాలకులు,
విజయ డెయిరీ, ఆదిలాబాదు, 9121160553
