మనుషులందరూ ఎవరికి వారుగా ఉంటే వ్యక్తులౌతారు, సంఘటితమైతే శక్తి అవుతారుఅందుకే పెద్దలు సంఘటన్‌ మే శక్తి హై” అని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరికి వారుగా ఉన్న రైతు సోదరులు అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి సహకార రైతు సంఘాలు, ఖజ్పుఐ, రైతు సేవ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పిఓ) ఏర్పాటు చేయడం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న రైతులు అందరినీ సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా 2023-24 నాటికి సుమారు 10,000 ఎఫ్‌పిఓల ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ రైతు సంఘలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వాటికి నాబార్డు, యన్‌.సి.డి.సి., నాబ్‌ కిసాన్‌ వంటి సంస్థల తరఫున ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తున్నారు.

రైతు సంఘాల ఏర్పాటుతో ప్రయోజనాలు:

1. రైతు ఉత్పత్తిదారుల సంస్థ: రైతులు ఎఫ్‌పిఓలుగా సంఘటితం అవ్వడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంవత్సరానికి సుమారు 18 లక్షల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల వరకు ఆర్థిక సహకారాన్ని పొందే అవకాశం ఉంది. ఇట్టి డబ్బును సంఘాలు తమ సంఘంలో వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకోవచ్చు మరియు ఈ ఆర్థిక సహకారాన్ని సంఘాలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

2. ఈ సంఘాలకు వ్యాపారాభివృద్ధికి కావలసిన నైపుణ్యం పెంపుదల శిక్షణలను మరియు అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేపడతాయి.

3. రైతులు సంఘాలుగా ఏర్పడడం వల్ల తమకు కావల్సిన ఎరువులు పురుగు మందులు, విత్తనాలు వంటి వ్యవసాయ ఇన్‌పుట్‌లను టోకుగా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.

4. కస్టం హైరింగ్‌ సెంటర్‌: వ్యవసాయ అవసరాలకు కావలసిన పనిముట్లను ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ సంఘాలు కస్టం హైరింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్రాల ద్వారా సంఘంలోని సభ్యులు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను అనుకున్న సమయానికి, అతి తక్కువ ధరలో వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే సంఘానికి కూడా ఆదాయం సమకూరుతుంది.

5. NABARD : నాబార్డ్‌ వంటి జాతీయ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ప్రత్యేకంగా ఈ రైతు సంఘాల నిర్వహణ కొరకు ”నాబ్‌ కిసాన్‌” అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి అతి తక్కువ వడ్డీ రేటుతో అత్యధిక రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అలాగే ‘గ్రామీణ బండారన్‌ యోజన’లో భాగంగా ఈ సంఘాలు కమ్యూనిటీ గోదాములు నిర్మించుకోవడానికి 25 శాతం సబ్సిడీ లేదా గరిష్ఠంగా రూ. 2.25 కోట్లు సబ్సిడీ మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ‘క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌’లో భాగంగా ఈ సంఘాలు బయటి బ్యాంకులలో తీసుకునే రుణాలకు నాబార్డ్‌ పూచీకత్తు అందిస్తుంది.

6. NCDEX: నేషనల్‌ కమోడిటీ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌ అనే జాతీయ సంస్థ ఈ రైతు సంఘాలకు ఆన్‌-లైన్‌ వేదికగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా పంట కోత, పంట శుద్ధి మరియు రవాణా కొరకు అయ్యే ఖర్చులో 50-75 శాతం ఖర్చును ఈ సంస్థ రైతుకు అదనంగా చెల్లిస్తుంది.

7. Spice Board : జాతీయ సుగంధద్రవ్యాల బోర్డు వారు పసుపు ఉత్పత్తిదారుల సంస్థలకు బాయిలర్లు, పాలిష్‌ మిషిన్‌, పసుపు తీసే యంత్రాలు, టార్పాలిన్లు మొదలగు పరికరాలను 50 శాతం సబ్సిడీతో అందించడమే కాకుండా నాణ్యమైన పసుపు ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా అమ్ముకునే అవకాశాలను రైతులకు కల్పిస్తున్నాయి.

8. e-NAM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ”ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌)” అనే జాతీయ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థలో రిజిస్టర్‌ అయిన సంఘాలకు తమ పంట ఉత్పత్తులను జాతీయ మార్కెట్‌లో అనుకున్న రేటుకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.9. ఈ రైతు సంఘాలకు సుమారు 100 కోట్ల టర్నోవర్‌ వరకు కూడా ఆదాయపు న్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగినది.10. పంటల ఉత్పత్తి, కోతలు, సేకరణ, గ్రేడింగ్‌, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలలో ఈ రైతు సంఘాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. రైతు సోదరులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ చేయూతను వినియోగించుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మరియు సహకార సంఘాలుగా ఏర్పడి సమిష్టి కృషితో ఉమ్మడి విజయం సాధించి సహకార వ్యవస్థ యొక్క సత్ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.

బి. రాజ్‌కుమార్‌, వ్యవసాయ విస్తరణ అధికారి, నిర్మల్‌ జిల్లా. ఫోన్‌: 9014205493