ఈ మధ్యకాలంలో ఆవులలో ముఖ్యంగా ఒంగోలు ఆవులలో తిరిగి పొర్లడం అనే సమస్య మనం ఎక్కువగా గమనించవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా గర్భవాతం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, అండాశయ తిత్తులు మొదలైనవి.

- పాడి పశువులలో అండాశయ ప్రాబల్యం 9-16 శాతం వరకు ఉంటుంది.
- దీని వలన ఈతకు మరియు గర్భధారణకు మధ్య వ్యవధి 20-30 రోజులు పెరుగుతుంది.
- ఆవులలో ఈతల సంఖ్య పెరిగేకొద్ది అదేవిధంగా అధిక పాల ఉత్పత్తి కారణంగా ఈ అండాశయ నీటి తిత్తులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- వేసవిలో తీవ్రమైన వేడి ఒత్తిడి కారణంగా ఆవులలో అండాశయ తిత్తులు ఏర్పడుట అధికమవుతుంది.
లక్షణాలు:

- ఎదకు-ఎదకు మధ్య సమయం ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ఎద సమయం 2-3 రోజులు ఉంటుంది.
- మట్టు ఎక్కువ పరిమాణంలో తరుచుగా వేస్తూ ఉంటుంది.
- తోక మొదలులో లావుగా, ఎత్తుగా ఉంటుంది.
- ఆవుకి మేపు సరిగా లేనప్పుడు సానుకూల శక్తి సమతుల్యత దెబ్బ తినడం వలన, హార్మోనుల సమతుల్యత ఏర్పడి మగ పశువు వలే దేహదారుఢ్యం సంతరించుకుంటుంది.
- పైన తెలిపిన లక్షణాలు ఎక్కువ కాలం ఉన్నట్లు అయితే గర్భంలోకి మట్టు చేరి గర్భం యొక్క పరిమాణం పెరుగుతుంది. దీని వలన పరీక్ష చేసిన యెడల చూడి పశువుగా భావించే అవకాశం ఉంటుంది.
కారణాలు:
- హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వలన అండాశయం నుండి విడుదల అవ్వవలసిన అండం విడుదల అవ్వకుండా, అండాశయం మీద పుటిక పెద్దగా పెరిగి నీటితిత్తుగా పరిణామము చెందుతుంది.
- శరీరంలో జీవక్రియలు అసమానతలకు లోనయినప్పుడు, మరియు గర్భవాతం ఎక్కువ రోజులు ఉన్న యెడల, పశువును ఎప్పుడూ కట్టేసి మేపడం వలన, ఒంట్లో కొవ్వు శాతం పెరిగి పోవడం వలన మరియు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
- మాంసకృత్తులు అధికంగా ఉన్న దాణా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వలన (ఉదా: ఉలవలు)
- ఈస్ట్రోజన్‌లు అధికంగా ఉన్న గడ్డి జాతులు (ఉదా: పిల్లిపెసర, చెరకు దవ్వ) అధిక మోతాదులో మేపడం వలన.
నివారణ:
- ఆవు ఈనిన తరువాత 3-5 నెలలలో తప్పనిసరిగా చూడి కట్టే విధంగా చూసుకోవాలి.
- పాలు ఇస్తుంది కదా అని ఎక్కువ మంది రైతులు చూలి కట్టించడం మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ కాలం దూడకు వదులుతారు.
- ఎప్పుడూ పాకలో కట్టే ఉంచకుండా పొద్దున, సాయంత్రం కనీసం రెండు గంటలు ఆవులను తిరగనివ్వాలి.
- సరైన మోతాదులో మేత మరియు దాణా అందించాలి.
- సూర్యరశ్మి ఎక్కువ సేపు పశువు యొక్క శరీరంకు తగిలే విధంగా చూసుకోవాలి.
- దీని వలన పశువుకు విటమిన్-డి అందుతుంది. ఒంట్లో కొవ్వు శాతం నియంత్రణలో ఉంటుంది. దీనివలన పశువులలో జీవక్రియ ఆరోగ్యవంతంగా జరుగుతుంది.
- త్వరితగతిన (3-5 నెలలు) చూలి కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహను రైతు సోదరులు విడనాడి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించినచో ఆవులలో అండాశయ నీటితిత్తుల సమస్యను అధిగమించి ఆర్థికంగా లాభపడతారు.
– బి. చంద్రప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మందా శ్రీనివాస్, ప్రొఫెసర్, ఎన్.టి.ఆర్ విశ్వవిద్యాలయం, గన్నవరం.

