పశువులలో పొదుగువాపు వ్యాధి – తీసుకోవలసిన జాగ్రత్తలు

పశువులలో వచ్చు వివిధ రకాల ముఖ్యమైన వ్యాధులలో పొదుగువాపు వ్యాధి ఒకటి. ఇది వివిధ రకాల వ్యాధి కారకాల ద్వారా కలిగి, రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించును. ఇది పాడి పశువులు అనగా ఆవులు, గేదెలలో చూడవచ్చు. అధిక పాల దిగుబడినిచ్చు పాడి పశువులలో అధికంగా చూడవచ్చును. దీనిని బొవైన్‌ మాస్టైటిస్‌ లేదా మామ్మైటిస్‌ అని కూడా అంటారు. ఇది మేకలు మరియు గొర్రెలలో కూడా గమనించవచ్చు. ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధికారక అనుకూల పరిస్థితులు అనగా పొదుగుకు గాయాలు, పుండ్లు, పగుళ్లు మొదలగునవి, అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు, మోటు పద్ధతిలో పాలు పితుకుట మరియు పాలను పూర్తిగా పిండివేయకపోవటం, అపరిశుభ్ర పాత్రలు, పాలు పితికే వ్యక్తులు మరియు వారి ఆరోగ్య పరిస్థితి వంటి అననుకూల పరిస్థితులలో వ్యాధికారకము పశువుల పొదుగు కణజాలాన్ని చేరి వ్యాధిని కలుగజేయును.

ఈ వ్యాధి కారకాలు ముఖ్యంగా స్ట్రెప్టోకోకస్‌, స్టెఫైలోకోకస్‌, కొరిని బ్యాక్టీరియమ్‌ పయోజినస్‌, ఈ.కొలై. సూడోమోనాస్‌, పాశ్చురెల్లా మల్టోసిడా, బ్రూసెల్లా అబార్టస్‌, మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌, ఆక్టినోమైసిస్‌ బోవిస్‌, ఆక్టినోబాసిల్లస్‌ లిగ్నిరేసి, నొకార్డియా, మైకోప్లాస్మా మరియు క్రిప్టోకోకస్‌ నియోఫార్మెన్స్‌ మొదలగునవి.

ఈ వ్యాధి కారకాలు, పశువులలో వ్యాధికి అనుకూల పరిస్థితులు కలిగినపుడు, టీట్‌కెనాల్‌ ద్వారా పాల పొదుగును చేరి అచ్చటి కణజాలాన్ని చేరి, మొదట ఇన్వేసివ్‌ ఫేజ్‌, తరువాత ఇన్ఫెక్షియస్‌ ఫేజ్‌ మరియు ఇన్‌ఫ్లమేటరీ ఫేజ్‌ ద్వారా పొదుగు కణజాలాన్ని నాశనం చేసి పాల దిగుబడిని మరియు పాల నాణ్యతను గణనీయంగా తగ్గించి, ఆ యొక్క వ్యాధిగ్రస్థ పశువులు పాల ఉత్పత్తికి పనికిరాకుండా చేసి రైతులకు లాభాలను తగ్గించి, ఆర్థికంగా నష్టాలను కలగుజేయును. పశువులలో ఈ వ్యాధి అనారోగ్యాన్ని, దాని తీవ్రతను అనుసరించి వ్యాధి లక్షణాలు పర్‌ఎక్యూట్‌, ఎక్యూట్‌, సబ్‌ ఎక్యూట్‌, క్రానిక్‌ మరియు సబ్‌ క్లీనికల్‌ రకాలుగా ఉండును.

పర్‌ఎక్యూట్‌ మాస్టైటిస్‌: ఈ రకంలో వ్యాధి తీవ్రంగా ఉండి శరీర వ్యవస్థలు ప్రభావితం కావటం వలన, వ్యాధిగ్రస్థ పశువు అధిక జ్వరం కలిగి (106-107 డిగ్రీల ఫారెన్‌హీట్‌), సరిగా మేత మేయక శ్వాస కష్టంగా తీసుకొనుట, పొదుగు నుండి పాలు రాకుండా, రక్తం కలిగిన ద్రవాలు వచ్చును.

ఎక్యూట్‌ మాస్టైటిస్‌: ఈ రకంలో పొదుగు వాపు కలిగి ఉండి, పాలలో మార్పులు కనిపించును. స్వచ్ఛమైన పాలకు బదులుగా పశువు పచ్చగా లేదా గోధుమ రంగులో ఉండి, గడ్డలు కలిగి ఉండును. వ్యాధి కారకము ఒక క్వార్టర్‌కి గాని మొత్తం నాలుగు క్వార్టర్స్‌కు గాని సోకును. దీని వలన పొదుగులోని క్రియాశీలత లోపించును. ఈ పరిస్థితిని వెంటనే గమనించి సరైన చికిత్స చేయుట వలన ఆరోగ్యం కలుగును.

సబ్‌ ఎక్యూట్‌ మాస్టైటిస్‌: ఇది కష్టతరమైన రకం, పొదుగు కణజాలంయందు మార్పు ఉండదు. కాని పాలలో మార్పు ఉండును. ఈ యొక్క పాలను పరీక్షలు చేయుట వలన, వ్యాధికారక సూక్ష్మజీవులను కనుగొనవచ్చు.

క్రానిక్‌ మాస్టైటిస్‌: ఈ రకం, వ్యాధి యొక్క చివరిథలో చూడవచ్చు. ఈ రకంలో పొదుగువాపు చెంది, గట్టిగా ఉండును మరియు పొదుగులో గడ్డలు కూడా కలుగును. పాలు పసుపు పచ్చద్రవంగా లేదా తెల్ల ముద్దగా ఉండి, కొన్నిసార్లు చెడువాసన కలిగి ఉండును.

సబ్‌క్లీనికల్‌ మాస్టైటిస్‌: ఈ రకంలో పాల పొదుగులోమరియు పాలయందు కంటికి కనిపించే మార్పులు ఏమీ ఉండవు. కొన్ని పాలల్లో తెల్లరక్తకణాలు (ల్యూకోసైట్స్‌) సంఖ్య పెరిగి, వ్యాధికారక సూక్ష్మజీవులను కలిగి ఉండును. ఈ రకం యందు, పాల చేపులో తేడాలు (తగ్గుట) మరియు పొదుగు యొక్క పరిమాణం తగ్గుట గమనించాలి. దీనిని కాలిఫోర్నియన్‌ మాస్టైటిస్‌ టెస్ట్‌ ద్వారా కనుక్కోవచ్చు.

ఎలర్జిక్‌ మాస్టైటిస్‌: కొన్ని సందర్భాలలో పాలు పితికేటపుడు, అకస్మాత్తుగా చన్నులు వాచిపోవటం జరుగుతును. ఈ రకంలో సూక్ష్మజీవుల ప్రమేయం ఉండదు. కాని మొదట ఈత పడ్డలలో, ఈనిన 10-20 రోజులలోపు గమనించవచ్చు. సాధారణంగా పాలు పితికేటపుడు అకస్మాత్తుగా చనుమొనలు కొన్ని క్షణాలలోనే 3-4 రెట్లు అధికంగా వాచిపోయి, చన్నుల చుట్టు ఒక వలయం లాగా ఏర్పడి ఉండును.

వ్యాధి నిర్ధారణ అనునది వ్యాధి లక్షణాలు, వ్యాధి చరిత్ర, పాల పరీక్షలు అనగా భౌతిక, రసాయనిక మరియు మైక్రోబయోలాజికల్‌ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. పొదుగును పరీక్షించుట, అనగా పొదుగు పరిమాణము, ఆకారము, వాపు, నొప్పి, ఎర్రగా మారటం మొదలగు లక్షనాలను గమనించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలి.

పాలలో వ్యాధికారక సూక్ష్మజీవులను ప్రయోగశాలలో గుర్తించి వాటిపై ఏ మందులు పనిచేస్తాయో సెన్సిటివిటి టెస్ట్‌ ద్వారా తెలుసుకొని, సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించటం ఉత్తమము. వ్యాధి నివారణకు ఉపయోగించే మందుల అవశేషాలను తగ్గించాలంటే రైతులు, పశువైద్యాధికారి చేత నిర్ధారించబడిన, సరైన మందులు, సక్రమమైన సమయంలో సరైన మోతాదులో వాడాలి.

నివారణ చర్యలు:

వ్యాధిని గమనించిన వెంటనే వ్యాధిగ్రస్త పశువులను ఇతర ఆరోగ్యకరమైన పశువుల నుండి వేరుచేయవలెను. పశువులనుండి పాలు పితికేటపుడు పొదుగును శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులను ఆంటీసెప్టిక్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. పొదుగులో పాలను పూర్తిగా పితికి వేయవలెను. ఆ తరువాత అరగంట వరకు పశువును నిలబడేటట్లు చూసినట్లయితే, ఆ సమయానికి చనురంధ్రాలు బిగుసుకుని, సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించకుండా ఉండును. చీము లేదా రక్తం కనిపించినట్లయితే పశువైద్యాన్ని సంప్రదించి వెంటనే వైద్యము చేయించాలి. పశువుల కొట్టమును ఎల్లపుడు పొడిగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

డా. ఎం. జీవనలత (9490292468), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, 

డా. ఎం. కె. శ్రీకాంత్‌ (9652655255), పశువైద్యాధికారి, రాజేంద్రనగర్‌.

Read More

ఆవులలో అండాశయపు నీటితిత్తులు – నివారణ చర్యలు

ఈ మధ్యకాలంలో ఆవులలో ముఖ్యంగా ఒంగోలు ఆవులలో తిరిగి పొర్లడం అనే సమస్య మనం ఎక్కువగా గమనించవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా గర్భవాతం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, అండాశయ తిత్తులు మొదలైనవి.

  • పాడి పశువులలో అండాశయ ప్రాబల్యం 9-16 శాతం వరకు ఉంటుంది.
  • దీని వలన ఈతకు మరియు గర్భధారణకు మధ్య వ్యవధి 20-30 రోజులు పెరుగుతుంది.
  • ఆవులలో ఈతల సంఖ్య పెరిగేకొద్ది అదేవిధంగా అధిక పాల ఉత్పత్తి కారణంగా ఈ అండాశయ నీటి తిత్తులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • వేసవిలో తీవ్రమైన వేడి ఒత్తిడి కారణంగా ఆవులలో అండాశయ తిత్తులు ఏర్పడుట అధికమవుతుంది.

లక్షణాలు:

  • ఎదకు-ఎదకు మధ్య సమయం ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ఎద సమయం 2-3 రోజులు ఉంటుంది.
  • మట్టు ఎక్కువ పరిమాణంలో తరుచుగా వేస్తూ ఉంటుంది.
  • తోక మొదలులో లావుగా, ఎత్తుగా ఉంటుంది.
  • ఆవుకి మేపు సరిగా లేనప్పుడు సానుకూల శక్తి సమతుల్యత దెబ్బ తినడం వలన, హార్మోనుల సమతుల్యత ఏర్పడి మగ పశువు వలే దేహదారుఢ్యం సంతరించుకుంటుంది. 
  • పైన తెలిపిన లక్షణాలు ఎక్కువ కాలం ఉన్నట్లు అయితే గర్భంలోకి మట్టు చేరి గర్భం యొక్క పరిమాణం పెరుగుతుంది. దీని వలన పరీక్ష చేసిన యెడల చూడి పశువుగా భావించే అవకాశం ఉంటుంది.

కారణాలు:

  • హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వలన అండాశయం నుండి  విడుదల అవ్వవలసిన అండం విడుదల అవ్వకుండా, అండాశయం మీద పుటిక పెద్దగా పెరిగి నీటితిత్తుగా పరిణామము చెందుతుంది.
  • శరీరంలో జీవక్రియలు అసమానతలకు లోనయినప్పుడు, మరియు గర్భవాతం ఎక్కువ రోజులు ఉన్న యెడల, పశువును ఎప్పుడూ కట్టేసి మేపడం వలన, ఒంట్లో కొవ్వు శాతం పెరిగి పోవడం వలన మరియు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
  • మాంసకృత్తులు అధికంగా ఉన్న దాణా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వలన (ఉదా: ఉలవలు)
  • ఈస్ట్రోజన్‌లు అధికంగా ఉన్న గడ్డి జాతులు (ఉదా: పిల్లిపెసర, చెరకు దవ్వ) అధిక మోతాదులో మేపడం వలన. 

నివారణ:

  • ఆవు ఈనిన తరువాత 3-5 నెలలలో తప్పనిసరిగా చూడి కట్టే విధంగా చూసుకోవాలి.
  • పాలు ఇస్తుంది కదా అని ఎక్కువ మంది రైతులు చూలి కట్టించడం మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ కాలం దూడకు వదులుతారు.
  • ఎప్పుడూ పాకలో కట్టే ఉంచకుండా పొద్దున, సాయంత్రం కనీసం రెండు గంటలు ఆవులను తిరగనివ్వాలి.
  • సరైన మోతాదులో మేత మరియు దాణా అందించాలి. 
  • సూర్యరశ్మి ఎక్కువ సేపు పశువు యొక్క శరీరంకు తగిలే విధంగా చూసుకోవాలి.
  • దీని వలన పశువుకు విటమిన్‌-డి అందుతుంది. ఒంట్లో కొవ్వు శాతం నియంత్రణలో ఉంటుంది. దీనివలన పశువులలో జీవక్రియ ఆరోగ్యవంతంగా జరుగుతుంది.
  • త్వరితగతిన (3-5 నెలలు) చూలి కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహను రైతు సోదరులు విడనాడి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించినచో ఆవులలో అండాశయ నీటితిత్తుల సమస్యను అధిగమించి ఆర్థికంగా లాభపడతారు.

– బి. చంద్రప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, మందా శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌, ఎన్‌.టి.ఆర్‌ విశ్వవిద్యాలయం, గన్నవరం. 

Read More