మనది వ్యవసాయాధారిత దేశం అయినప్పటికినీ, మన నేలలు, మన భౌగోళిక పరిస్థితులు, మన మానవ వనరులు.. అన్నీ కూడా వివిధ రకాల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికినీ, ఎక్కువ మంది రైతులు ఎక్కువ సార్లు తమ పంటల సాగులో లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఎక్కువ శాతం మంది రైతులు పంటలసాగులో నష్టాలను భరించవలసి వస్తుంది. వ్యవసాయం లాభసాటిగా లేకపోవటానికి ఉన్న కారణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల లాంటి కారణాలు ఒక రకం కారణంగా చెప్పవచ్చు. ఈ రకం కారణాలు మన చేతులలో ఉండవు కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు లభించకపోవచ్చు. రెండో రకం కారణాలుగా మన చేతులలో ఉండే విత్తన ఎంపిక, ఏక పంట విధానం, సరైన అవగాహన, పెట్టుడులు లేకపోవడము, అవసరమయిన సమయానికి చర్యలు చేపట్టలేకపోవడము, సరైన ప్రణాళిక వేసుకోలేకపోవడం… లాంటి కారణాల వలన కూడా రైతులు నష్టాలు భరించవలసి వస్తుంది. ఈ రెండో రకం సమస్యలు రైతుల చేతులలో ఉంటాయి కాబట్టి వాటికి రైతులు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించి అమలు పరచగలిగితే పంటల సాగు లాభసాటిగా మలుచుకోవచ్చు అనే విషయం అనేకమంది రైతుల అనుభవాలు చెబుతున్నాయి. ఈ తరహాలో ఆలోచించి పక్కా ప్రణాళికతో తమ వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారు విశాఖపట్టణం జిల్లా, బక్కనిపాలెంలో రెండు ఎకరాల కంటే తక్కువ పొలంలో పక్కా ప్రణాళికతో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న రైతు దపంతులు పార్వతి, మాధవ్.
మాధవ్ సివిల్ ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తరువాత వీరు వేరే రంగాల వైపు ఆలోచించకుండా వ్యవసాయరంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారంలో ఉండే విష రసాయన అవశేషాల వలన మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకుంటూ తోటి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలంటే వ్యవసాయం చేయాలని, అదీను సేంద్రియ సాగు చేయాలనే తలంపుతో విశాఖపట్టణం జిల్లా మధురవాడ సమీపములోని బక్కనిపాలెం గ్రామంలో సుమారు రెండు ఎకరాల పొలం తీసుకుని ఆ పొలంలో పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల కూరగాయలు, కొన్ని రకాల పండ్ల సాగు మొదలు పెట్టారు.
ప్రస్తుతం వ్యవసాయం చేసే రైతులు చాలావరకు లాభాలు ఆర్జించలేకపోతున్నారు కాబట్టి అందుకు కారణాలు తెలుసుకుని అవే సమస్యలు తలెత్తకుండా వీరు జాగ్రత్తపడుతూ పక్కా ప్రణాళికతో పంటల సాగు కొనసాగిస్తున్నారు. సాధారణంగా పంటల సాగులో వచ్చే ప్రధాన సమస్యలు అయిన ఎక్కువ పెట్టుబడులకు పరిష్కారంగా సేంద్రియ బాటపట్టి తామే సొంతంగా సేంద్రియ సాగులో అవసరమయ్యే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ పెట్టుబడి తగ్గించుకుంటున్నారు. కలుపు సమస్య పరిష్కారానికి పొలం మొత్తం బెడ్‌లు వేసి బెడ్‌లపై మల్చింగ్ షీటు పరచి విత్తనాలు లేదా మొక్కలు నాటుతున్నారు. తీగజాతి కూరగాయలకు కూడా తక్కువ ఖర్చుటో ఇంటూ (þ) పందిరి వేసుకున్నారు. సంవత్సరం పొడవునా పలు రకాల పంటల సాగుకు వీలుగా పంటలు సాగు చేస్తున్నారు. ఆశాజనకమైన ధరలు పొందాలంటే సొంత మార్కెటింగ్ సరైన పరిష్కారం అని గ్రహించి తాము పండించే పంటలను సాధ్యమయినంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఈ విధంగా అన్ని విషయాలను పరిశీలిస్తూ పక్కా ప్రణాళికతో పంటలు సాగు చేస్తూ తమ వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారు.

గడచిన రబీ సీజనులో సుమారు ఎకరం పొలంలో బీర పంట సాగు చేశారు. ఇందుకుగాను ఐఐహెచ్&ఆర్ బెంగుళూరు నుంచి అర్క ప్రసన్న విత్తనాలను ఎంపిక చేసుకున్నారు. ఈ విత్తనాలు సూటి రకం విత్తనాలు కాబట్టి ప్రతిసారి విత్తనాలను కొనుగోలు చేయకుండా రైతులు తమ పంట నుండి విత్తనాలను సేకరించుకొని మరలా నాటుకోవచ్చు కాబట్టి ఈ విత్తనాలను ఎంపిక చేసుకున్నారు. ఎకరానికి గాను సుమారు 750 గ్రాముల విత్తనం అవసరం పడింది. బీర పంట అయిన తరువాత ఈ పొలంలో వంగ, పుచ్చ లాంటి పంటలు వేయాలనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి రెండు బెడ్‌ల మధ్య దూరం అందుకు అనుకూలంగా పెట్టుకుని బెడ్‌లపై మల్చింగ్ షీటు పరచి, మల్చింగ్ షీట్‌కి రెండు వసరులలో రంధ్రాలు చేసుకుని రంధ్రాలలో బీర విత్తనాలను నాటించారు. బీర నాటిన 15 రోజులకు బీర తీగ మొదలయ్యింది. తీగ పాకటానికి అనుకూలంగా తక్కువ ఖర్చులో ఇంటూ (þ) పందిరి ఏర్పాటు చేసుకున్నారు. బీరలో వచ్చే చీడపీడల నివారణకు పసుపుపచ్చ జిగురు అట్టలు, సోలార్ దీపపు ఎర, పండుఈగ ఎరల లాంటివి ఏర్పాటు చేసుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు పిచికారి చేశారు. దుక్కిలో పశువుల ఎరువు, ఘనజీవామృతం, మేకల ఎరువు అందించడంతో బాటు క్రమం తప్పకుండా జీవామృతం, బియ్యం కడిగిన నీటిని నేలకు అందిస్తూ రావడం వలన ఎలాంటి చీడపీడలు ఆశించని నాణ్యమైన దిగుబడి పొందారు. ఎకరం పొలం నుంచి సుమారు 6000 కిలోల బీర దిగుబడి పొంది సగటున కిలో 25/-ల చొప్పున అమ్మకం చేశారు. బీర పంట కాపు మొదలయ్యే సమయానికి బెడ్‌ల మధ్యలో వంగ మరియు పుచ్చ విత్తనాలు నాటారు. వంగ పంట ఇప్పుడే దిగుబడి మొదలయ్యింది. రోజుకు 50 కిలోల వరకు వంగ దిగుబడి పొందుతున్నారు. పుచ్చ పంట దిగుబడి ఇంకా రావాల్సి ఉంది.
వీటితో పాటు కొన్ని రకాల ఆకుకూరలు, అరటి, మునగ, సపోట, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, పసుపు, అల్లం, తినే ఉసిరి, నారింజ, చిక్కుడు, బెండ లాంటి మొక్కలను / పంటలను సాగు చేస్తూ పొలం చుట్టూ వెదురు నాటించారు. తాము సాగు చేసే పంటలన్నింటికి దుక్కిలో ఘనజీవామృతం, పశువుల ఎరువు, మేకల ఎరువు అందించడంతోపాటు క్రమం తప్పకుండా జీవామృతం, బియ్యం కడిగిన నీరు, కిచెన్ వేస్ట్ ద్రావణం, వేరుశనగ చెక్క, వేపచెక్కల ద్రావణం లాంటివి భూమికి అందించడంతో పాటు పంచగవ్య మరియు వివిధ రకాల కషాయాలను పంటపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతున్నారు. మరిన్ని వివరాలు 8978198938 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
వేరుశనగ, వేపచెక్కల ద్రావణం: 100 లీటర్ల నీటిలో 5 కిలోల వేరుశనగ చెక్క మరియు ఒక కిలో వేప చెక్క లేదా వేపపిండిని వేసి ప్రతిరోజు రెండు సార్ల చొప్పున కలుపుతూ ఉంటే 5 నుంచి 7 రోజులలో ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 15 రోజులకు ఒకసారి బీర పంటకు డ్రిప్పు ద్వారా భూమికి అందించారు.
బియ్యం కడిగిన నీరు: 10 కిలోల బియ్యాన్ని 200 లీటర్ల డ్రమ్ములో వేసి రెండు రోజులు కలిపిన తరువాత మూడవ రోజున ఈ ద్రావణాన్ని డ్రిప్పు ద్వారా పంపించి మరలా ఆ డ్రమ్ములో నీటిని నింపుతారు. ఈ విధంగా ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీటిని పంపుతుంటారు. నెలకు ఒకసారి ఆ డ్రమ్ములో 10 కిలోల బియ్యం వేస్తుంటారు. ఈ నీటిలో కొన్నిసార్లు కిచెన్ వేస్ట్ ద్రావణాన్ని కూడా కలుపుతుంటారు.

