పౌల్ట్రీ, జీవాల పరిశోధన అభివృద్ధిపథంలో ఇండ్‌బ్రో సంస్థ

ఈయనొక జంతు జన్యుశాస్త్రవేత్త. తిరుపతి వెటర్నరీ కాలేజీ నుండి 1970లో బి.వి.యస్సీ. డిగ్రీని, 1972లో ప్రతిష్ఠాకరమైన ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ నుండి ఎం.వి.యస్సీ. డిగ్రీని పొందిన డాక్టర్‌ తలపనేని కోటయ్య ఒక సాధారణ దిగువ మధ్య తరగతి రైతు బిడ్డ! వీరు 1948లో నెల్లూరు జిల్లా ఇందుపూరు గ్రామంలో జన్మించారు. తొలి నుండి పౌల్ట్రీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెంచుకున్న డాక్టర్‌ కోటయ్య, తన రీసెర్చ్‌ గైడ్‌ మరియు ఇతర గురువులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు పౌల్ట్రీ పరిశ్రమలో ప్రవేశించి పూనాపెర్ల్స్‌ మరియు కసిలా ఫార్మ్స్‌ మరియు హాచరీస్‌లలో పనిచేసి ఈ రంగంలో విలువైన అనుభవాన్ని గడించారు. ఆ తర్వాత 1993లో హైదరాబాద్‌ శివారు, రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ వద్ద తన కుమార్తె (పిల్లల శస్త్ర వైద్య నిపుణురాలు) మందాకిని పేర మందాకిని రిసెర్చి ఫారమ్‌ను స్వయంగా నెలకొల్పారు. ఆ తర్వాత థల వారీగా ఎదిగిన ఈ సంస్థ ఇండ్‌ బ్రో (ఇండియన్‌ బ్రాయిలర్‌) రిసెర్చ్‌ అండ్‌ బ్రీడింగ్‌ ఫారంగా 2000 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని కేసంపేట పరిసరాలలో సుమారు 20 కిలో మీటర్ల పరిధిలో, 2 నుండి 10 కిలోల మీటర్ల దూరాలలో దూరం దూరంగా బయోసెక్యూరిటీ లక్ష్యంతో 6 ప్రాంగణాలలో నిర్మించిన పౌల్ట్రీ షెడ్లు, హాచరీస్‌ ఏర్పాట్లు ఈ రంగంలోకి ప్రవేశించదలచిన ఔత్సాహికులందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. 

2006లో పౌల్ట్రీ రంగాన్ని అతలాకుతలం చేసిన బర్డ్‌-ఫ్లూ వ్యాధి వల్ల భారీగా నష్టపోయిన పౌల్ట్రీ సంస్థలలో ఇండ్‌ బ్రో సంస్థ కూడా ఉంది. బహుశ ఇదే తర్వాత కాలంలో బయోసెక్యూరిటీ పట్ల వీరిని అప్రమత్తం చేసి, అంటురోగాల నివారణకు ఖచ్చితమైన, కఠినమైన నియమ నిబద్ధతలను పాటించుటకు ప్రేరణ అయిందని చెప్పవచ్చు. ఒకే సంస్థలోని 6-7 ఫారాల మధ్య కార్మికులు, సిబ్బంది, వారి సామగ్రి ద్వారా వ్యాధి క్రిములు వ్యాప్తి చెందకుండా ఏ ఫారం సిబ్బందికి, అక్కడే వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తూ ఫారాల మధ్య మనుషులు – ఇతర జంతువుల కదలికలను నియంత్రించుటతో పాటు ప్రతిఫారమ్‌ ప్రవేశం వద్ద క్రిమినాశక ఫుట్‌ మరియు వాహన చక్రాల ప్రక్షాళన ఏర్పాట్లతో పాటు, శానిటైజర్‌ జల్లులను కూడా ఏర్పాటు చేయుట జరిగింది. ఇవన్నీ కూడా ఇతర ఫారాలకు మార్గదర్శకాలు.

తన సంస్థ ఆర్థికంగా నష్టాలతో ఉన్నప్పుడు తన భార్య శ్రీమతి సుధా కోటయ్య అందించిన ప్రోత్సాహం, ధైర్యం, అండదండలతోనే తాను మరల ఉత్తేజంతో గాడిలో పెట్టగలిగారు. ఈమె అన్ని రకాల టీకాలు వేయుటలోనే కాక, ఒక రోజు కోడి పిల్లల లింగనిర్ధారణ చేయుటలో కూడా మంచి ప్రవీణురాలుగా పేరుగడించి, సంస్థ అభివృద్ధికి ప్రతి థలోనూ ఈమె కీలక పాత్ర వహించారు.

ఇండోబ్రో సంస్థ తొలి థలో దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాలలో పౌల్ట్రీ పరిశ్రమ కొద్ది దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు చేతులలో ఉంది. వీటికి ధీటుగా పౌల్ట్రీ రంగంలో నిలబడాలనే ఉద్దేశంతో వారితో పోటీ పడకుండా 80 వారాలలో ప్రత్యేక రుచితో పాటు అధిక పోషక విలువలు కలిగిన, 345 గ్రుడ్లను పెట్టగల, నాణ్యమైన గ్రుడ్లను ఉత్పత్తి చేయగల ఇండ్‌బ్రౌన్‌ లేయర్‌ను తానే జన్యుపరంగా వృద్ధి చేసి, వాటి గుడ్లను ఇతర సాధారణ గుడ్ల కంటే రెట్టింపు ధరకు మార్కెట్లో విక్రయిస్తూ తన వ్యాపార ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అంతేకాక దేశీయమైన అసీల్‌ జాతి కోడి పుంజులతో రోడ్‌ ఐలాండ్‌ రెడ్‌ జాతి కోడి పెట్టలను కృత్రిమంగా సంకరపరచి వీరు రూపొందించిన ఇండ్‌బ్రో కలర్‌ బ్రాయిలర్స్‌ ఇతర బ్రాయిలర్స్‌ కంటే నెమ్మదిగా ఎదిగి అంటే 55 రోజుల వయస్సుకు సుమారు 2.0 కిలోల శరీర తూకానికి మాత్రమే చేరి నాణ్యమైన నాటు కోడిపెట్టల మాంసానికి ధీటైన, రుచికరమైన ఎక్కువ పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కలర్‌ బ్రాయిలర్‌ మాంసం ధర కూడా దాదాపుగా ఇతర బ్రాయిలర్‌ కోడి మాంసాల కంటే అధిక ధరను, అంటే కిలో ధర 350 రూపాయల వరకు పలుకుతోంది. ఈ ఫారాలలో ఎక్కడా అవసరానికి మించి యాంటి బయోటిక్స్‌ గానీ, ఇతర రసాయనాలు కానీ దాణాల రూపంలో గానీ, ఇతరత్రా గానీ వినియోగించబడవు. ఇండ్‌బ్రో కలర్‌ బ్రాయిలర్‌ కోడి మాంసం జాతీయ మాంస పరిశోధనా సంస్థ నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటోంది.

మనలో చాలామంది వినని, చూడని కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా జన్మించిన అత్యున్నత స్థాయి పేరెంట్‌ స్టాక్‌ నుండి ఉత్పత్తి అయిన పొదిగే గ్రుడ్ల, రోజు వయస్సు పిల్లలు, ముఖ్యమైన వాక్సిన్స్‌ చేయబడిన 5 వారాల పిల్లలు మన తెలుగు రాష్ట్రాలలోనే కాక, బీహార, ఉత్తరప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలకు మరియు నేపాల్‌, కెన్యా, ఉగాండా, సెనిగల్‌ తదితర దేశాలకు ఎగుమతి అగుచూ, అక్కడి పౌల్ట్రీ ఫారాలలోనూ, పెరళ్ళలోనూ పెరుగుతూ పెంపకందారులకు లాభాలను అందిస్తున్నాయి.

మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇండ్‌బ్రో సంస్థ కోళ్ల లాభదాయకతను గుర్తించి, తాము అమలు చేస్తున్న గ్రామీణ కుటీర పరిశ్రమ మరియు మహిళా సంక్షేమ పథకాలకు ఈ కోడి పిల్లలను భారీ స్థాయిలో కొనుగోలు చేసి, వేలాది గ్రామీణ లబ్దిదారులకు పంపిణీ చేస్తూ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. 

తమ వద్ద వుండే సుమారు మూడు లక్షల వివిధ రకాలు, వయస్సులోని కోళ్లకు ప్రతిరోజూ అవసరమైన సుమారు 40 టన్నుల దాణాను నాణ్యతలో ఎటువంటి రాజీపడకుండా స్వయంగా ఉత్పత్తి చేసుకొనుటకు రోజుకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కోళ్ల దాణా కర్మాగారాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు.

ఆల్‌ ఇన్‌-ఆల్‌ ఔట్‌ పద్ధతిలో పెంచబడే లేయర్‌ బ్యాచ్‌ల వల్ల నిర్వహణా సౌలభ్యంతో పాటు మార్కెటింగ్‌ సౌలభ్యతను కూడా గుర్తించి ఇండ్‌బ్రో సంస్థ ప్రయోజనం పొందుతూ ఉంది.

ఇక్కడే పెరిగిన బ్రాయిలర్‌ కోళ్లు అంతర్జాతీయ జంతు వధ ప్రమాణాలకు లోబడి స్టన్నింగ్‌ తర్వాత మాత్రమే బాధ కలిగించకుండా మానవత్వంలో వధిచబడుటేకాక, వాటి మాంస శుద్ధి మరియు ప్యాకింగ్‌ కూడా అత్యున్నత శుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ నిర్వహించబడుతుంది.

ఇండ్‌బ్రో సంస్థలో పెరిగిన ప్రతి పేరెంట్‌ కోడి వివరాలు, వాటి ఉత్పాదకత కంప్యూటర్లలో నిక్షిప్తమై విశ్లేకులకు అందుబాటులో ఉంటాయి. కంప్యూటర్లలో నిక్షిప్తమైన ఈ సమాచారం పౌల్ట్రీ శాస్త్ర విద్యార్థులు మరియు శాస్త్రజ్ఞుల పరిశీలనకు కూడా వారి విశ్లేషణలకు అందుబాటులో ఉంచుతున్నారు. తన సిబ్బందే తన బలం అని భావించే డాక్టర్‌ కోటయ్య తన వద్ద పని చేస్తున్న సుమారు రెండు వందల కార్మిక కుటుంబ సభ్యుల సంక్షేమానికి, విద్య, వైద్య సౌకర్యాలను స్వయంగా కల్పిస్తున్నారు. అందుకే ఈ సంస్థలో పనిచేసే కార్మికులు సుదీర్ఘ కాలంగా ఇక్కడే పనిలో కొనసాగుతున్నారు.

నిత్యకృషీవలుడు, నిరంతర పరిశోధకుడు, నైతికత కలిగిన వ్యాపారవేత్త అయిన డాక్టర్‌ కోటయ్య తన తపనను కేవలం పౌల్ట్రీ రంగానికే పరిమితం చేయకుండా 2021లో మందాకినీ గొర్రెల పరిశోధనా ఫారంను ప్రారంభించారు. ప్రస్తుతం 800 గొర్రెలు ఉన్న ఈ గొర్రెల ఫారమ్‌ ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే అనూహ్య విజయాలను సాధిస్తూ ఈ రంగంలో తరతరాల అనుభవం గడించిన సాంప్రదాయ గొర్రెల పెంపకందారులనే కాక గొర్రెల రంగంలోని సీనియర్‌ శాస్త్రజ్ఞులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ గొర్రెల ఫారం గురించి రాబోయే సంచికలో వివరిస్తాను.

డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611