షెడ్డు నిర్మాణము, స్థలం ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు

*  కోళ్ళ షెడ్డును వేరేవారి యొక్క కోళ్ళ షెడ్డుకు దూరంగా కట్టాలి. ఎందుకంటే అనివార్య కారణం వలన ఆ షెడ్డులో వచ్చిన వ్యాధులు ఈ షెడ్డుకు కూడా సంక్రమించవచ్చు. కనుక షెడ్డు నిర్మాణము 1-2 కి.మీ. దూరంలో నిర్మించాలి.

* షెడ్డును చెరువులు, కుంటలకు దూరంగా నిర్మించాలి. ఈ నీటి కొరకు వలస పకక్షులు మరియు పశువులు రావడం వలన ఆ పకక్షులకు మరియు పశువులకు ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే ఆ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది.

* షెడ్డు సరిహద్దు చుట్టూ కంచెను నిర్మించాలి. అదే విధంగా లోపల వివిధ షెడ్డుల యొక్క పైర్లు మరియు నిషిద్ధ ప్రాంతము యందు ”బయటి వారు లోనికి రాకూడదు” వంటి బోర్డులను కట్టవలెను.

* షెడ్డులోనికి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చు విధంగా నిర్మించాలి. తద్వారా షెడ్డు లోపలి వాతావరణం కోళ్ళకు అనుకూలంగా ఉండి కోళ్ళను ఒత్తిడి నుండి కాపాడటమే కాకుండా, షెడ్డులో వెలువడిన అమ్మోనియా వంటి వాయువులు బయటకు వెళ్ళిపోవును.

* షెడ్డు నిర్మాణాన్ని అక్కడున్న వాతావరణానికి అనుకూలంగా నిర్మించాలి. ఉదాహరణకు, వేడి, తేమ ఎక్కువ ఉన్న ప్రదేశములో తూర్పు, పడమర దిశలో నిర్మించాలి. తద్వారా ఎండ యొక్క వేడిమి లోపల ఉన్న కోళ్ళపై ప్రత్యక్షముగా పడకుండా కాపాడవచ్చు.

* షెడ్డు లోపలికి బయటి నుండి పకక్షులు రాకుండా జాలిని కట్టుకోవాలి.

* షెడ్డు చుట్టూ మురుగు నీరు నిలువ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

* షెడ్డు అడుగు భాగమును కాంక్రీటు వేసినట్లయితే సరైన పద్ధతిలో, సులువుగా నేలను శుభ్రపరచుకోవచ్చును.

* ప్రవేశ ద్వారమందు వాహనముల యొక్క చక్రములు శుభ్రపరచుటకు, షెడ్డుకు ముందు భాగమున పాదములు శుభ్రపరచుటకు అనుకూలంగా ఒక చిన్న ట్యాంక్‌ను నిర్మించి అందులో తగు మోతాదులో క్రిమిసంహారక మందును పోయవలెను. తద్వారా బయటినుండి లోపలకు వ్యాధికారక క్రిములు రాకుండా కాపాడవచ్చు.

* షెడ్డును నిర్మించే సమయంలో ఈ క్రమములో షెడ్డు నిర్మించాలి. మొదటగా పిల్లలను పొదిగే షెడ్డును తరువాత పెరిగే కోళ్ళను పెంచు షెడ్డును నిర్మించాలి.

* షెడ్డుకు-షెడ్డుకు మధ్య దూరము 30 అడుగులు ఉండేవిధంగా నిర్మించుకోవాలి.

షెడ్డులో పనిచేయువారు తీసుకొనవలసిన జాగ్రత్తలు

* ఫామ్‌ లోపలికి వెళ్ళే ముందు ముఖద్వారము వద్ద కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోవలెను.

* ఫామ్‌లో పనిచేసేవారు శుభ్రమైన బట్టలు ధరించాలి. వారికి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన ఉండాలి.

* ఏ షెడ్డులో పనిచేయువారు ఆ షెడ్డుకు మాత్రమే వెళ్ళవలెను. వేరే షెడ్డుకు వెళ్ళిన ఎడల, ఒకవేళ తను పనిచేసే షెడ్డులో ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే వేరే షెడ్డుకు కూడా వ్యాధులు వ్యాపించవచ్చు.

* అవసరమున్నప్పుడు మాత్రమే షెడ్డు యొక్క తాళము తెరువవలెను. మిగిలిన సమయంలో మూసి ఉంచి తాళం వేయవలెను.

షెడ్డు లోపల తీసుకొనవలసిన జాగ్రత్తలు

* ఒకవేళ ఇంతకు ముందు షెడ్డులో వ్యాధులు వ్యాపించి ఉన్నట్లయితే ఆ షెడ్డును శుభ్రముగా శుభ్రపరచి 3 వారాలు వేచి వున్న తరువాత కొత్త బ్యాచ్‌ను ప్రారంభించాలి. 

* షెడ్డు లోపల కీటకాల నివారణ చర్యలు చేపట్టవలెను లేని ఎడల ఈ కీటకాలు వ్యాధి వ్యాప్తిలో వాహకముగా పనిచేస్తాయి.

* ఎలుకలు, పందికొక్కుల నివారణ కూడా చేయవలెను. ఇవి కూడా వ్యాధి వ్యాపించడంలో తోడ్పడుతాయి.

* వ్యాధులు వ్యాపించడానికి ముఖ్యకారణం షెడ్డును శుభ్రంగా ఉంచుకోకపోవడం, ప్రభావవంతంగా షెడ్డును శుభ్రపరిచి క్రిమిసంహారక మందులు వాడి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లయితే చాలావరకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.

* పరిశుభ్రమైన, పరిశుద్ధమైన మంచి నీరు కోళ్ళకు ఎల్లవేళలా అందేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

* షెడ్డు యందు ఉపయోగించు అన్ని పరికరములను శుభ్రముగా కడగాలి. ముఖ్యంగా దాణా మరియు నీటి తొట్లను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి.

* క్రమబద్ధంగా బ్లోల్యాంప్‌తో కేజ్‌లను శుభ్రపరచాలి. కేజ్‌లను శుభ్రపరిచే ముందు పేరుకుపోయిన కోళ్ళ రెట్టలను తీసి వేయాలి.

* లిట్టర్‌ యందు తడి తనము లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని ఎడల శిలీంధ్రాలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది.

* గట్టిపడిన లిట్టర్‌ను ఎప్పటికప్పుడు తీసివేయాలి.

* గోడలను, నేలను క్యార్బనరి అమ్మోనియం కాంపౌండ్సుతో శుభ్రపరచాలి.

* చనిపోయిన కోళ్ళను ఎప్పటికప్పుడు తీసివేయాలి. వాటికి శవ పరీక్షలు పశువైద్యుని సహాయంతో జరిపించి పూడ్చి వేయాలి. శవ పరీక్షల ఆధారంగా పశువైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. 

* ఎల్లవేళలా పరిశుభ్రమైన సమీకృత దాణాను ఇవ్వాలి.

* క్రమబద్ధంగా మందులు, వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాలి. తద్వారా కోళ్ళు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.

డా. సి.హెచ్‌. శివప్రసాద్‌సహాయ ఆచార్యులు ఞ అధిపతి, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల. ఫోన్‌: 9866392292