ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ నిధులతో 2021-2022 నుండి 2025-26 సంత్సరాల కాలపరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, పందుల పెంపకం, పశుగ్రాస, దాణా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశు సంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు, గ్రుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వారికి సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుంది.

వివిధ ప్రాజక్టుల వివరాలు

గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌ పథకంలో 500 గొర్రెలు మరియు 25 పొట్టేళ్ళతో కూడిన యూనిట్‌ ఏర్పాటు చేయడం ద్వారా గొర్రె లేదా మేక పిల్లల ఉత్పత్తి మరియు పోషణ చేపట్టడం జరుగుతుంది. కోటి రూపాయలు, అంతకుమించి ప్రాజక్టు విలువ ఉన్నచో గరిష్టంగా రూ. 50 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో, ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును.

ఈ క్రింది విధముగా రాయితీలు వర్తిస్తాయి.

గొర్రెల / మేకల ఫారము యూనిట్‌      రాయితీ (గరిష్టంగా) రూ.లలో

100 గొర్రెలు/మేకలు + 5 పొట్టేళ్ళు/మేకపోతులు 10 లక్షలు

200 గొర్రెలు/మేకలు + 10 పొట్టేళ్ళు/మేకపోతులు 20 లక్షలు

300 గొర్రెలు/మేకలు + 15 పొట్టేళ్ళు/మేకపోతులు 30 లక్షలు

400 గొర్రెలు/మేకలు + 20 పొట్టేళ్ళు/మేకపోతులు 40 లక్షలు

500 గొర్రెలు/మేకలు + 25 పొట్టేళ్ళు/మేకపోతులు 50 లక్షలు

*    కోళ్ళ అభివృద్ధి పథకంలో తక్కువ వ్యయంతో కూడిన సాంకేతికతతో 1000 పెట్టలు + 100 పుంజులు సామర్థ్యం గల పెరటి కోళ్ళ యూనిట్‌ కోడి పిల్లల ఉత్పత్తి యూనిట్‌ మరియు పొదుగు కోళ్ళ యూనిట్‌ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రూ. 50 లక్షల మొదలుకొని అంతకుమించి ప్రాజక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా రూ. 25 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును.

*    పందుల పెంపకంలో 100 ఆడ పందులు మరియు 10 మగ పందులతో యూనిట్‌ ఏర్పాటు చేసి దీని ద్వారా పందిపిల్లల ఉత్పత్తి మరియు పోషణను చేపట్టడం జరుగుతుంది. రూ. 60 లక్షలు మొదలుకొని అంతకుమించి ప్రాజక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా రూ. 30 లక్షలు రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును. అదేవిధముగా 50 ఆడ పందులు + 5 మగ పందుల యూనిట్‌ ఏర్పాటు కొరకు గరిష్టంగా రూ. 15 లక్షల వరకు రాయితీ అందించబడును.

*    పశుగ్రాసం మరియు దాణా అభివృద్ధి పథకంలో సైలేజి తయారీ యూనిట్‌, పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్‌ మరియు సమీకృత దాణా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సైలేజీ తయారీ యూనిట్‌ సమీకృత దాణా మరియు పశుగ్రాస దిమ్మల తయారీ యూనిట్లకు కోటి రూపాయలు మొదలుకొని అంతకుమించి ప్రాజక్టు విలువ ఉన్నచో గరిష్టంగా రూ. 50 లక్షల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజక్టు విలువలో 50 శాతం రాయితీ మంజూరు చేయబడును.

ఈ కార్యక్రమముల ద్వారా గ్రామీణ స్థాయిలో పశూత్పత్తులైన పాలు, మాంసం మరియు గ్రుడ్ల ఉత్పత్తిని పెంచుకుని అధిక ఆదాయం పొందడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధిని కల్పించి సుస్థిరతను, ఆత్మనిర్భరతను సాధించవచ్చు. ఎగుమతుల ద్వారా విదేశీ మాదకద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తూ దేశ ఆర్థిక పురోగమనంలో పాలు పంచుకోగలరు.

లబ్దిదారుల అర్హత

అనుభవం గల వ్యక్తిగత పోషకులు, రైతు ఉత్పాదకత సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్‌ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్‌-8 కంపెనీల నుండి అర్హతను బట్టి లబ్దిదారులను ఈ క్రింద చెప్పబడిన విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

లబ్దిదారుల ఎంపిక విధానము:

1. లబ్దిదారు సంబంధిత ప్రాజక్టు అంశంపై శిక్షణ పొంది ఉండాలి లేదా ప్రాజక్టు నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. 

2. లబ్దిదారుడు నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాజక్టు నివేదికను తయారు చేసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

3. రాయితీ కొరకు మిగిలిన యూనిట్‌ ఖరీదు కోసం బ్యాంక్‌ రుణంగా పొందడానికి అవసరమైన పత్రాలను సమర్పించి బ్యాంకు అనుమంతి పొంది ఉండాలి.

4. లబ్దిదారుడు తన సొంత భూమి లేదా కౌలు భూమిలో మాత్రమే ప్రాజక్టు ఏర్పాటు చేయవలెను. 

5. వీటిని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ పరిశీలిస్తుంది.

6. నిబంధనల ప్రకారం అర్హతలున్న వారిని ఎంపిక చేసి నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌కు పంపిస్తారు.

సబ్సిడీ విడుదల చేయు విధానము

*    50 శాతం బ్యాక్‌ ఎండ్‌ మూలధన సబ్సిడి ప్రాజక్టు ప్రకారం రెండు దఫాలుగా విడుదల చేయబడుతుంది.

*    బ్యాంక్‌ వారు మొదటి థ రుణాన్ని లబ్దిదారునికి అందించారు అనే విషయాన్ని అధికారులు ధృవీకరించుకొన్న తర్వాత మాత్రమే మొదటి దఫా సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసిన బ్యాంక్‌ వారికి జమ చేయబడుతుంది. ఆ సబ్సిడీని బ్యాంకు వారు లబ్దిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

*    ప్రాజక్టు మొత్తం పూర్తయిన తరువాత అధికారులు ధృవీకరించుకొని రెండవ దఫా సబ్సిడీకి లబ్దిదారులను అర్హులుగా పరిగణిస్తారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లను https://www.apurban.com/Tenders_Display.aspx  నుండి పొందవచ్చు. సమగ్ర ప్రాజక్టు నివేదిక (DPR), సాంకేతిక తోడ్పాటు, ఇతర వివరముల కొరకు కె. దీపు (ఫోన్‌: 9704094969); డా లక్ష్మీనారాయణరెడ్డి (ఫోన్‌: 8790997387), డా. వై. సింహచలం, M.V.Sc.,  అదనపు సంచాలకులు, SMILE, విశాఖపట్నం. డా. ఆర్‌. అమరేంద్ర కుమార్‌, M.V.Sc., సంచాలకులు, పశుసంవర్ధశాఖ, ఆంధ్రప్రదేశ్‌. వారిని సంప్రదించగలరు.

రాష్ట్రంలోని ఔత్సాహిక రైతులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పశుసంవర్థక శాఖ వారు కోరుచున్నారు.