ప్రకృతి అందించే పరిపూర్ణ ఆహారమైన పాలలో నీరు, చక్కెర (లాక్టోజ్‌), ఇతర విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండగా వెన్నశాతం మాత్రమే ఎక్కువ మార్పులకు లోనవుతుంటుంది. పాలలోని ‘వెన్న’ను అసహజ పద్ధతుల్లో ఇతర పదార్థాలతో పూరించలేము.

డెయిరీల్లో సాధారణంగా గేదె పాలకైతే కిలో వెన్నకు ధర చెల్లిస్తుంటే, ఆవు పాలకైతే పాలలోని వెన్న, వెన్నేతర ఘనపదార్థాలను కలిపి కిలో ఘన పదార్థాల కింద ధర కడుతుంటారు. వాణిజ్యసరశిలో నడిచే డెయిరీలు, పాలే జీవనాధారంగా చేసుకున్న పాడిరైతులు పాలల్లో వెన్నశాతం పెంచుకోవడానికే ఆసక్తి చూపుతారు.

పాడి పశువుల జాతులు, జాతిభేదము, కాల ప్రభావము, ఈనిన తర్వాత రోజులు, ఈతల సంఖ్య, పాలుపితికే వేళల్లో మార్పులు, పశువు ఆరోగ్య పరిస్థితి, తినే మేత, పాలు పితికే విధానము మరియు పాలుపితికే చోటు తరచు మార్చడం లాంటి అంశాలు వెన్నశాతంలో వ్యత్యాసాలకు కారణమవుతుంటాయి. 

వెన్నశాతం తగ్గడానికి కారణాలు

1) పశువుల ఆహారంలో పీచు పదార్థాల తగ్గుదల, పశువుల ఆహారంలో కనీసం 1.2% పీచు పదార్థం లేకపోతే వెన్న శాతం తగ్గుతుంది.

2) పచ్చిమేతలు లేకపోవుట: మేలు జాతి పచ్చిమేతలు పశువుల బరువుకు1.4% తప్పక మేపాలి.

3) దాణా ఇవ్వకపోవడం: పశువుల ఆరోగ్యసంరక్షణకై తగు మోతాదులో దాణా తప్పక ఇవ్వాలి.

4) పీచురహిత పిండిపదార్థాలు, అసిటిక్‌ ఆమ్ల ఉత్పత్తిని తగ్గించి, పాలలో వెన్నశాతాన్ని ప్రభావితం చేస్తాయి.

5) ఎక్కువ మోతాదులో నూనెచెక్కలను మేపితే క్రమేపి వెన్నశాతం తగ్గుతుంది.

6) మేతల్లో క్రూడ్‌ ప్రొటీన్‌ తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది.

7) మేతల్లో భాస్వరం తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది.

8) అధిక పాలనిచ్చే థలో, శక్తినిచ్చే పదార్థాలతో కూడిన దాణా తగ్గినా, క్రమేపి పాలలో వెన్న శాతం తగ్గుతుంది.

9) వేసవి/ఎక్కువ తేమ ఉండేకాలంలో వెన్న శాతం తగ్గుతుంది.

10) అధిక మోతాదులో సొమెటిక్‌ కణాల సంఖ్య, వెన్న శాతం తగ్గిస్తుంది. 

పాలు తీసేటపుడు చివరి థ పాలల్లో, పశువు ఎండిపోయే ముందు ఉత్పత్తి అయే పాలలో, శీతాకాలం ఉత్పత్తి అయే పాలలో, పోషకాల పచ్చిమేత మేపినా, తక్కువ పాలిచ్చే దేశీవాళీ పశువుల్లో అధిక వెన్న శాతం కనిపిస్తుంటుంది.

దాణాలో ప్రొటీన్లు తగు పాళ్ళలో ఉండేలా చూసుకొని, దాణాలో బైపాస్‌ అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

స్థానికంగా దొరికే ప్రత్యామ్నాయ దాణా తయారీ వస్తువుల వాడకం దానా తయారీ ఖర్చును తగ్గిస్తుంది.

పశువుకు ఎల్లవేళలా మేత, నీరు అందుబాటులో ఉంచడంతోబాటు మేత అందించే తొట్టెలు శుభ్రంగా ఉంచాలి.

రూమెన్‌ బైపాస్‌ ఫ్యాట్స్‌ దాణాతో జతచేసి మేపడం వలన పాలలో వెన్నశాతం పెరుగుతుంది. అయితే ఇవి 2శాతం మించకుండా జాగ్రత్తవహించాలి. అధికపాలనిచ్చే పశువులకై మార్కెట్లో డెయిరీలాక్‌, మెగాలాక్‌ పేరుతో ఇవి అందుబాటులో ఉన్నాయి.

పశువు పెద్దపొట్టలో పి.హెచ్‌. అదుపుచేసే సోడా ఉప్పు, 50-70 గ్రా. 2-3 దఫాలు దాణాలో చేర్చి అందిస్తే వెన్న పెరుగుతుంది.

వేసవిలో తగు జాగ్రత్తలతో వెన్నశాతం పెంచుకుని పాడి రైతులు లాభాలు గడించడమే పాడి రైతు ముందున్న తక్షణ కర్తవ్యం. 

– మధుసూదనరావు, ఉపసంచాలకులు, విజయడెయిరీ, ఆదిలాబాదు. 

ఫోన్‌ : 9121160553