పుట్టిన ప్రతి జీవీ మరణించవలసిందే. మరణం నుంచి ఏ జీవీ తప్పించుకోలేదు. ఈ అనంతకోటి జీవరాశిలో మనం కూడా ఉన్నాము కాబట్టి మనుషులమైన మనం కూడా ఏదో ఒక రోజు మరణించవలసిందే. మరణాన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ప్రస్తుతం ఉన్న వైద్య సౌకర్యాలు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, మన జాగ్రత్తలతో మరణాన్ని వాయిదా వేయవచ్చు కాని మరణాన్ని మాత్రం ఆపలేము. మనందరికి మరణం తప్పదు కాబట్టి మనమందరం ఏదో ఒక రోజు మరణించవలసిందే కాబట్టి, మరణిద్దాం. కానీ క్యాన్సర్‌తో మాత్రం మరణించవద్దు అంటున్నాడు హైదరాబాద్, అల్వాల్‌కు చెందిన కటకం విజయ్.
విజయ్‌ది వ్యవసాయ నేపథ్యం కాదు. వారి తండ్రి, తాతలకు వ్యవసాయంతో ప్రత్యక్ష అనుబంధం లేదు. ఉన్నత చదువులు చదివిన విజయ్ ప్రయివేటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయములో కొన్ని వ్యక్తిగత కారణాల వలన ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరి అయ్యి, పట్టుదలతో చదివి కేవలం రెండు నెలలు శిక్షణతో సిండికేట్ బ్యాంకులో మంచి ఉద్యోగం సాధించి కొనసాగిస్తుండగా తన సమీప బంధువులు, స్నేహితులు కొందరు క్యాన్సర్ బారిన పడి మరణించడం జరిగింది. తన పెదనాన్న మరియు బావ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం విజయ్ అతి సమీపము నుంచి చూడడం జరిగింది. ఈ సమయములో క్యాన్సర్ కారకాల గురించి పరిశీలించడం జరిగి అవకాశము ఉన్న ఏ మాధ్యమాన్ని వదలకుండా క్యాన్సర్ గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి తాను తెలుసుకున్న విషయం… ”వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తుల బాధ్యతారాహిత్య ప్రవర్తనల కలయికే క్యాన్సర్‌కి ప్రధాన కారణం”

అని విజయ్ చెబుతున్నాడు. మనం రోడ్డు మీద తినే బజ్జీలు, పునుగుల దగ్గర నుంచి, ఫార్మాలిన్ లాంటి రసాయనాలు కలిపిన పాలు, విష రసాయనాలతో పండించే ఆహార పదార్థాలు… ఈ విధంగా చెప్పుకుంటూపోతే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తుల యొక్క బాద్యతా రాహిత్యమే క్యాన్సర్‌కి కారణమని విజయ్ అర్థం చేసుకున్నాడు.
సిండికేట్ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో తన పెదనాన్న మరియు స్నేహితులు క్యాన్సర్‌తో మరణించడాన్ని గమనించిన విజయ్ తనవంతుగా క్యాన్సర్ సమస్యకు కొంతలో కొంత పరిష్కారం సమాజానికి అందించాలని తలచి కుటుంబ సభ్యుల అంగీకారంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టాడు. సమాజంలో ఉన్న క్యాన్సర్ సమస్యకు మనం తినే ఆహార పదార్థాలలో ఉండే విష రసాయనాలు కూడా కారణమని తెలుసుకుని తనవంతుగా విష రసాయన అవశేషాలు లేని ఆహార పదార్థాలను సమాజానికి అందించాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలి ఏ మాత్రం అవగాహన లేని వ్యవసాయరంగంలో అదీను సేంద్రీయ వ్యవసాయరంగంలో 8 సంవత్సరాల క్రితం అడుగుపెట్టాడు.

సొంత పొలం లేదు కాబట్టి హైదరాబాదు శివారు ఘట్‌కేశర్ సమీపములోని అవిశాపూర్లో పొలం కౌలుకు తీసుకుని సేంద్రియ సాగు మొదలు పెట్టాడు. వరి, మామిడి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు కొన్ని నాటుకోళ్ళను కూడా పోషించుకుంటూ వస్తున్నాడు. సేంద్రియ సాగులో వివిధ రకాల పద్ధతులున్నాయని గ్రహించి ఏదో ఒక పద్ధతి పైనే గుడ్డిగా ఆధారపడకుండా అన్ని రకాల పద్ధతులలో తనకు అనుకూలమైన అంశాలను తన పంటల సాగులో అమలు పరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏమాత్రం అనుభవం లేని రంగం, అదీను శారీరక శ్రమ ఎక్కువ అవసరమున్న సేంద్రియ సాగును ఎంచుకున్నాడు కాబట్టి మొదటలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సేంద్రియ సాగులో చీడపీడల నివారణ పెద్ద సమస్యగా ఉంటుంది. చీడపీడల నివారణకు వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు క్రమం తప్పకుండా పంటలపై పిచికారి చేయవలసి ఉంటుంది. కషాయాలు, ద్రావణాలు తయారు చేయడానికి, తయారు చేసిన వాటిని పంటలపై పిచికారి చేయడానికి మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మానవ వనరుల కొరత ఉన్న పరిస్థితులలో ఎక్కువ మానవ వనరులు అవసరమైన సాగు పద్ధతులను పాటించడం అంటే కత్తి మీద సాము చేస్తున్నట్లే. అయినా కాని ఏ మాత్రం వెనుకంజ వేయకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ ఆరోగ్యకరమైన దిగుబడులు తీయగలుగుతున్నాడు. తీసిన దిగుబడులను మధ్యవర్తులకు అందించినట్లయితే ధర ఆశాజనకంగా ఉండడము లేదు. దానికి పరిష్కారంగా నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయటానికిగాను సికింద్రాబాదు అల్వాలు ప్రాంతంలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకపు దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొంతమందికి నేరుగా ఇళ్ళ వద్దకు సేంద్రియ ఆహారాలను చేరవేస్తున్నారు.

8 సంవత్సరాల ప్రయాణంలో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొని, వినియోగదారుల సంఖ్యను ఏరోజుకారోజు పెంచుకుంటూ పోతున్నారు. వినియోగదారులకు అవసరమయిన వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో అందించాలంటే ఇంకా ఎక్కువ పొలం అవసరం పడటాన్ని గుర్తించి ఇటీవల హైదరాబాదు శివారు శామీర్‌పేటలో పండ్ల తోటను కౌలుకు తీసుకున్నారు. ఆ తోటలో జామ, సీతాఫలం, మునగ లాంటి పంటలు దిగుబడినిస్తున్నాయి. వీటికి తోడు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయల సాగు మొదలు పెట్టి మొత్తం 10 ఎకరాలపైగా భూమిలో పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల ఆహార పంటలు పండిస్తున్నారు.
వినియోగదారులకు సంవత్సరం పొడవునా కూరగాయలు, ఆకుకూరలు అందించాలనే లక్ష్యంతో పొలాన్ని భాగాలుగా విభజించుకొని ఒక పొలంలో దిగుబడి పూర్తి అయ్యే సమయానికి వేరే పొలంలో దిగుబడి మొదలయ్యేలా ప్రణాళిక వేసుకుని సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తం ఆహార ఉత్పత్తులను, ఎక్కువ రకాలు, ఎక్కువ రోజులు అందించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాడు. తమ వద్ద అందుబాటులో లేని వ్యవసాయ ఉత్పత్తులను తోటి సేంద్రియ రైతుల వద్ద నుంచి సేకరించి తోటి రైతులకు మంచి ధరను అందిస్తున్నారు.

సేంద్రియ సాగులో విత్తనానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి కొన్ని పురాతన వరి రకాలను సాగు చేస్తున్నారు. కూరగాయల విషయానికొస్తే మన పాత తరం వారు ఉపయోగించిన లేదా ప్రస్తుతం మన చుట్టుప్రక్కల అందుబాటులో లేని కూరగాయ విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి సేకరించి తన పొలంలో సాగు చేస్తూ అంతరించి పోతున్న విత్తనాలను కాపాడుతున్నాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంకరజాతి మరియ అభివృద్ధిపరచిన విత్తనాలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడముతో పాటు ఆ విత్తనాల ద్వారా వచ్చిన పంటలో పోషకాలు సక్రమంగా ఉండటము లేదు కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి మన పురాతన నాటు రకాలను ఉపయోగిస్తున్నారు. పురాతన నాటు రకాలలో పోషకాలు సక్రమంగా ఉంటాయి కాబట్టి తాము పండిచిన ఆహారం తినే వినియోగదారులకు ఆరోగ్యకర ఆహారాన్ని అందించవలసిన బాధ్యత తమదే అని భావించి అందుకు అవసరమయిన చర్యలు చేపడుతూ తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ముందు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 93984 60227 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
నా అర్థాంగి రత్నక్రాంతి సహకారం వలననే
సేంద్రియ సాగులో కొనసాగగలుగుతున్నాను

మనదేశంలోని చదువుకున్న యువతలో ఎక్కువమంది అంతిమ లక్ష్యం లేదా స్వప్నం ప్రభుత్వ ఉద్యోగం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించటానికి అవిశ్రాంతంగా ఏళ్ళకు ఏళ్ళు శ్రమిస్తూ ఉంటారు. అర్హత వయస్సు సమీపించే వరకు కూడా కొంతమంది తమ ప్రయత్నాలను ఆపరు. అర్హత వయస్సు అయిపోయిన వారు నిరాశతో వారి ప్రయత్నాన్ని ఆపి వేరే ఉపాధి అవకాశాలు వైపు అడుగులు వేస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కేవలం రెండు నెలల్లో సాధించి, కేవలం 8 నెలల్లో వదలి వేస్తానంటే ఏ మహిళా అంగీకరించకపోవచ్చు. కాని విజయ్ అర్థాంగి రత్నక్రాంతి పెద్ద మనసుతో అంగీకరించి, తాను ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో ప్రవేశించడానికి ప్రోత్సహించడంతోపాటు ప్రస్తుత పంటల సాగులో తన వంతు పాత్రను పోషిస్తుంది కాబట్టే తాను ముందుకు సాగగలుగుతున్నానని వివరిస్తూ అన్ని సమయాలలో తన వెన్నంటి ఉండి తనను నడిపించిన తన అర్థాంగికి విజయ్ కృతజ్ఞతలు తెలియచేశారు.
వ్యవసాయం చేయడం కంటే
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులభం

తన ఈ 8 సంవత్సరాల సేంద్రియ సాగు అనుభవంలో అనేక కష్టనష్టాలను భరించవలసి వచ్చింది. వ్యవసాయంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయినా కాని వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నాడు. వివిధ రకాల చీడపీడలను నివారిస్తూ, ప్రకృతివైపరీత్యాలను ఎదుర్కొంటూ స్వేదం చిందించి సేద్యం చేసి సాధించిన ఆరోగ్యకరమైన దిగుబడులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడం పెద్ద సవాలు. అయినా కాని అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ తన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నాడు. తన ఈ 8 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో వ్యవసాయం చేయడం కంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించటం సులభం అని గ్రహించినా కూడా వెనుకంజ వేయకుండా విజయ్ ముందుకు సాగుతున్నాడు.
సంవత్సరానికి రెండుసార్లు క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించండి

ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. కోల్పోయినప్పుడే దేని విలువైనా తెలుస్తుందనే విషయం మనకు మామూలే. కోల్పోవడము గురించి మాట్లాడితే కొన్ని కోల్పోతే మరలా, మరలా పొందవచ్చు. కానీ కొన్ని కోల్పోతే పొందే అవకాశాలు ఉండవు. అంటే అలాంటివి ఒకసారి కోల్పోతే మరలా పొందటానికి అవకాశము లేదు కాబట్టి అలాంటి వాటిని పోగొట్టుకోకుండా తప్పనిసరిగా కాపాడుకోవలసిందే. ఇంకా విపులంగా అర్థం కావాలంటే మన శరీరం ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం. మన శరీరంలోని అన్ని భాగాలు చాలా చాలా విలువైనవి. కాని మనము వాటి విలువను తెలుసుకోలేకపోతున్నాము. మనకు ఉచితంగా లభించాయి కాబట్టి మన శరీరంలోని అవయవాల యొక్క విలువ మనం తెలుసుకోలేకపోతున్నాము. ఉదాహరణకు కన్ను యొక్క విలువ కన్ను లేని వారిని అడిగితే చెప్పగలరు. అదేవిధంగా మిగతా శరీర అవయవాల విలువ తెలియాలంటే అవి పాడైపోయిన వారిని అడిగితేనే తెలుసుకునే పరిస్థితులలో మనం ఉన్నాం కాబట్టే మన అవయవాలను పాడు చేసుకునే జీవనశైలి వెనకాల మనం పరిగెడుతున్నాము.

ఈ విధంగా పరిగెడుతున్నామంటే మనకున్న జ్ఞానాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నాము. కొన్నికొన్నిసార్లు మన కంటే జంతువులు చాలా రెట్లు మేలు అనిపించేలా మనుషుల ప్రవర్తనలు ఉంటున్నాయి. ఇది సరైన పరిణామం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ జ్ఞానాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించటానికి ఉపయోగించుకోవాలి. ఆరోగ్యం యొక్క విలువ తెలియాలంటే ప్రత్యేకించి క్యాన్సర్ సమస్య వలన ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలియాలంటే సంవత్సరానికి రెండుసార్లు తమ సమీపములో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్ళి కొంత సమయాన్ని కేటాయించండి. క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించిన తరువాత మీలో వచ్చే మార్పులను గమనించండి. మీకు మీరే ఆరోగ్యకర జీవనశైలి వైపు అడుగులు మొదలు పెడతారు. క్యాన్సర్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొని మరణించిన మా బావ, మా పెద్దనాన్న పడ్డ ఇబ్బందులను నేను అతి సమీపము నుంచి చూడడముతోపాటు వారికోసం నేను కొన్ని రోజులు క్యాన్సర్ హాస్పటల్స్‌లో గడపడం జరిగింది. కాబట్టి నాకు ఆరోగ్యం మొక్క విలువ తెలిసింది కాబట్టి తోటివారికి తెలియ చేయాలనే లక్ష్యంతో క్యాన్సర్ హాస్పటల్ని సందర్శించండి అని చెబుతున్నానని విజయ్ వివరించాడు.

