సాధారణంగా కొబ్బరి అనగానే గోదావరి జిల్లాలు, సముద్రతీర ప్రాంతాలు, కేరళ లాంటి ప్రాంతాలలోనే పండుతుందంటుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. కొబ్బరిని రాయలసీమలో కూడా పండించి విజయం సాధించి కొబ్బరి నుంచి ఆదాయం పొందవచ్చు అని నిరూపిస్తున్నారు కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట నరసారెడ్డి.
వెంకట నరసారెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. డిగ్రీ వరకు చదివిన నరసారెడ్డి ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అందరిలాగానే వ్యవసాయంలో వస్తున్న మార్పులను తన సాగులో కూడా అమలు పరుస్తూ అన్నిరకాల పద్ధతులు పాటిస్తూ వస్తున్న నరసారెడ్డి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తన పంటల సాగుని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి 2011వ సంవత్సరంలో మార్చి అప్పటినుండి ఎలాంటి రసాయానాలు అందించకుండా కేవలం ప్రకృతి సేద్య విధానాలను అవలంభిస్తూ తన సాగును కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటలసాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవులు, ఎద్దులు కలిపి మొత్తం 14 పశువులను పోషిస్తున్నారు. ఇందులో ఒంగోలు, సాహివాల్, కాంగ్రెజ్, గిర్ రకాలైన మన దేశీయ జాతులు ఉన్నాయి. వీటికి అవసరమైన పశుగ్రాసాలను పూర్తి ప్రకృతి సేద్య విధానాలను సాగు చేస్తూ పశువులకు అందిస్తూ వస్తున్నారు.
మొత్తం వీరు 15 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. అందులో కొబ్బరి 31/2 ఎకరాలలో, 13/4 ఎకరాలలో మామిడి, 33/4 ఎకరాలలో నిమ్మ, 2 ఎకరాలలో అరటి, 11/2 ఎకరాలలో ఆముదం, మునగ పంటలు సాగు చేస్తూ మిగతా పొలంలో పశువులకుగాకు కో-4, సూపర్ నేపియర్, థరథ గడ్డి లాంటి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. ఈ 15 ఎకరాలలో 2011వ సంవత్సరంనుండి ఎలాంటి రసాయానాలు ఉపయోగించకుండా కేవలం ప్రకృతి సేద్య పద్ధతులనే పాటిస్తు న్నారు. ప్రతి పంటకు క్రమం తప్ప కుండా పశువుల ఎరువు అందించడంతోపాటు జీవామృతం, వానాపాముల ఎరువులను అందిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో బెల్లం ధర పెరగటం మరియు బెల్లం సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో జీవామృతాన్ని ఉపయోగించడం ఆపి వేసి ఆవు మూత్రాన్ని భూమికి అందిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు చీడపీడల ప్రభావంగా తక్కువగా ఉంటుంది కాబట్టి కషాయాలు మరియు ద్రావాణాల అవసరం పెద్దగా ఉండటం లేదు. తప్పనిసరి పరిస్థితులలో అవసరమైతే చీడపీడల నివారణకు వివిధ రకాలు ఆకులు, ఆవుమూత్రం, పేడల లాంటి వాటితో కషాయాలు తయారు చేయించి పంటలకు ఉపయోగించి చీడపీడలను నివారిస్తున్నారు.
కొబ్బరి:1985వ సంవత్సరంలో 31/2 ఎకరాలలో కొబ్బరి మొక్కలు నాటించారు. ఇందుకుగాను రాజంపేట నర్సరీ నుంచి ఈస్ట్‌కోస్టు రకం కొబ్బరి మొక్కలు తెప్పించి లైనుకి లైనుకి మరియు మొక్కకు మొక్కకు 18 అడుగుల దూరం పాటించి నాటించారు. ప్రస్తుతం 31/2 ఎకరాలకుగాను 375 కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరిలో అంతరపంటగా అవకాశాన్నిబట్టి అరటి సాగు చేస్తుంటారు. కొబ్బరి లైన్ల మధ్యలో ట్రెంచ్ తీసి ఆ ట్రెంచ్‌లోనే కొబ్బరి మొక్కల వ్యర్థాలను వేసి అక్కడే వీటిని అందింస్తుంటారు. కొబ్బరి మొక్కల పాదుల దగ్గర నీటిని అందించరు. ఈ పద్ధతిని గుజరాత్‌కి చెందిన ప్రముఖ ప్రాకృతిక రైతు కీ||శే|| భాస్కర్ సావే గారు పాటించారు. అదే పద్ధతిని నరసారెడ్డి గారు తెలుసుకుని తమ పొలంలో అమలు చేస్తూ తక్కువ శ్రమతో మంచి దిగుబడిని తీస్తున్నారు. ప్రస్తుతానికి సగటున ఒక్కొక్క చెట్టునుంచి సంవత్సరానికి సుమారు 200 కాయలవరకు పొందుతూ ఒక్కొక్క కొబ్బరి కాయను రూ. 15/- నుంచి 20/- ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. దిగుబడిని కొయ్యకుండా ఎండి రాలి పడిపోయిన కొబ్బరికాయలను టెంకాయలుగా అమ్ముతున్నారు.
మామిడి: 1990వ సంవత్సరంలో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం 90 చెట్లు ఉన్నాయి. వీటిలో తోతాపూరి, నీలం, బంగినపల్లి మొ||లగు రకాలు ఉన్నాయి. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని పొందుతున్నారు.
నిమ్మ: మొత్తం 33/4 ఎకరాలలో నిమ్మసాగులో ఉంది. ఇందులో 13/4 ఎకరాలలో హైడెన్సిటీలో 650 నిమ్మ మొలకలు 2015లో నాటించారు. నిమ్మలో అంతరపంటగా 100 అరటి మొక్కలు సాగు చేస్తున్నారు. 2 ఎకరాలలో మామూలు పద్ధతిలో నిమ్మ మరియు అంతరపంటగా అరటి సాగుచేస్తున్నారు. 2021లో కురిసిన అధిక వర్షాలకు నిమ్మపంట దెబ్బతింది. పూత సక్రమంగా రాలేదు. కాబట్టి 2022 ఏప్రిల్ నేలలో నిమ్మకు గిరాయికి బాగా పెరిగింది. ఎపుడు లేనంత రేటు నిమ్మ రైతులకు దక్కుతుంది. 50 కిలోల బస్తా రూ. 3,500/- నుంచి 4,000/- వరకు నడుస్తుంది. కర్నూల్ ప్రాంతంలో వ్యాపారస్తులు రైతుల దగ్గరనుంచి ఒక్కొక్క నిమ్మకాయ రూ. 6/-ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నిమ్మ పంట రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కానీ వీరివద్ద ప్రసుత్తం పంట లేదు. పంట రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నరసారెడ్డి అన్నారు.
అరటి: 2 ఎకరాలలో ఎలకి, అమృతపాణి రకాల అరటిని సాగుచేస్తున్నారు. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ఆరోగ్యకరమైన అరటి పంటను పండించి మంచి ధరకు అమ్ముతూ వస్తున్నారు.
ఆముదం, మునగ, పశుగ్రాసాలు: 11/2 ఎకరాలలో ఆముదం మరియు మునగ, మిగతా పొలంలో పశువులకు గాను పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 2021 సం||లో కురిసిన అధిక వర్షాలకు ఆముదం, మునగ పంటలు దెబ్బతిన్నాయి. పశుగ్రాసాల విషయానికి వస్తే పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ధాన్యపు జాతి, పప్పుజాతి పశుగ్రాసాలను తప్పనిసరిగా అందించాలి. కాబట్టి ఈ రెండు రకాలలో బహువార్షిక పంటలు ఎన్నుకున్నారు. ధాన్యాపు జాతి బహువార్షిక పశుగ్రాసం కో.4, సూపర్‌నేపియర్, పంటలు మరియు పప్పుజాతి బహువార్షిక పశుగ్రాస పంట అయిన థశరథగడ్డి (హెడ్జ్ లూసర్న్)లను పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆవులకు మరియు ఎద్దులకు అందిస్తూ వస్తున్నారు.

ఉన్నత చదువులు చదివిన నరసారెడ్డి వారి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంలో స్థిరపడి 15 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ తన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని మరియు కలుషితంకాని గాలిని అందించడంతోపాటు ప్రస్తుత సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారానికి సేంద్రీయ సాగే శరణ్యం అని ఆ దారిలో నడుస్తూ అందుకు అవసరమైన పశువులను పోషిస్తూ వీటన్నింటి ద్వారా సంవత్సరానికి 8 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతూ కుటుంబ సభ్యుల సహకారాంతో పంటల సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
మరిన్ని వివరాలకు వెంకట నరసారెడ్డిని
ఫోన్: 81868 81889లో సంప్రదించండి.
