పశువైద్య నిపుణులు వి.వి.ఆర్‌.కె. శాస్త్రి 

వ్యవసాయ దేశమైన మన దేశంలో రైతులు పంటల సాగుతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల లాంటి వాటిని పోషిస్తూ జీవితాలను కొనసాగిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఒకప్పడు పంటఉన్న ప్రతి ఒక్కరికీ పాడి తప్పనిసరిగా ఉండేది. కాని రాను రాను వివిధ రకాల కారణాల వలన పాడిపంటల మధ్య దూరం ఏర్పడిరది. అయినా కాని మన దేశంలో పాడి పశువుల పోషణ ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు పాడి రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగతా ఇబ్బందులతో పోల్చుకుంటే పాడి పశువులకు చికిత్స విషయంలో ఎక్కువ ఖర్చులు భరించవలసి వస్తుంది. పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చులు అవ్వడం వలన పాడి రైతులకు పశుపోషణ గిట్టుబాటు కావడం లేదు. ఇందుకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. హోమియో చికిత్స విధానంలో తక్కవ ఖర్చులతో పాడి పశువులను రోగాల బారిన పడకుండా మరియు రోగాల బారి నుండి కాపాడవచ్చని గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్‌లో పశుగణాలకు హోమియో చికిత్సా విధానంపై మే 25న జరిగిన (264వ వారం) ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పశువైద్య నిపుణులు వి.వి.ఆర్‌.కె. శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య నిపుణులు శర్మ, ములగలేటి శివరాం, శివసాగర్‌ రెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్‌ మేనేజరు ప్రసాదరావు పొల్గొన్నారు.

మూగజీవాలకు సేవ చేయగలగడం మన అదృష్టంగా భావించవచ్చు. ఎన్నో జన్మల పుణ్యకర్మల వలననే మనము ఈ వృత్తిలో ఉండగలిగాము. కాబట్టి వచ్చిన అదృష్టాన్ని సక్రమంగా నిలుపుకోవాలంటే స్వార్ధం లేకుండా మూగజీవాలకు సేవ చేయగలగాలి. మనిషి లాగా మూగ జీవాలు తమ ఇబ్బందులను నోటితో చెప్పలేవు గనుక వాటి పరిస్ధితులను గమనిస్తూ మనమే వాటికి ఎదురయ్యే సమస్యలను గుర్తించి అందుకు సరైన వైద్యం అందించగలగాలి. పశువులకు కూడా అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, నాటు వైద్యం లాంటి అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో ఖర్చు తక్కువతో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని వైద్య విధానం హోమియోపతి అని చెప్పవచ్చు. ఈ విధానంలో పశువుకి వచ్చిన రోగ లక్షణాలను బట్టి హోమియోపతి మందులు అందించవలసి ఉంటుంది. కాబట్టి పశువైద్యలందరూ హోమియోపతి వైద్య విధానం గురించి కక్షుణ్ణంగా తెలుసుకోగలిగితే తమ ప్రాంతంలోని రైతులకు మంచి సలహాలు అందించగలరు. రైతులు పశుపోషణ వైపు మక్కువ పెంచుకోవాలంటే హోమియోపతి వైద్య విధానం బాగా ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు.