వివిధ రకాల కారణాల వలన ప్రస్తుతం అవసరానికి తగ్గట్టుగా జీడిపిక్కల సరఫరా లేదు కాబట్టి ఇతర దేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. గత రెండుమూడు థాబ్దాల నుంచి అధిక దిగుబడులను ఇచ్చు అంటుమొక్కలు అందుబాటులో వస్తున్నా కాని ఇంకా మన అవసరాలకు తగినట్లు దిగుబడులను పొందలేకపోతున్నాము కాబట్టే దిగుమతులపై ఆధారపడవలసి వస్తుంది. ఈ పరిస్థితులు మారాలంటే మేలైన అంటుమొక్కలను వేసుకోవడంతోపాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని బాపట్లలోని డా|| వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, జీడిమామిడి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా|| కె. ఉమామహేశ్వరరావు వివరించారు.

ఆంధ్రరాష్ట్రంలో సుమారు 1,35,000 హెక్టార్లలో జీడిమామిడి సాగులో ఉంది. కానీ దిగుబడి మాత్రం సుమారు 1,20,000 టన్నులుగా ఉంది. సాధారణంగా హెక్టారుకి 2000 కిలోల వరకు దిగుబడి రావలసి ఉంది కాని ప్రస్తుతం సాధిస్తున్న దిగుబడిని పరిశీలించినట్లయితే దిగుబడి చాలా తక్కువగా ఉంది. మంచి దిగుబడి పొందాలంటే అధిక దిగుబడిని ఇచ్చు అంటుమొక్కలను నాటుకోవడంతోపాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఇక్కడ అధిక దిగుబడులను ఇచ్చు అంటుమొక్కలను ఉత్పత్తి చేస్తున్నాము. ఇప్పటి వరకు అనేక రకాల అభివృద్ధి పరచిన అంటుమొక్కలను మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులతో పాటు ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా కొనుగోలు చేసి నాటుకుంటున్నారు అని కె. ఉమామహేశ్వరరావు వివరించారు.
రైతులు అంటుమొక్కలను ఎంపిక చేసుకునేటప్పుడు అశ్రద్ధకు తావు ఇవ్వకుండా 9 నుంచి 12 నెలల వయస్సు గల 10 నుంచి 12 ఆకులు గల అంటుమొక్కలను ఎంపిక చేసుకోవాలి. అంటు జాయింట్ కూడా గట్టిగా ఉండాలి. 6þ9 సైజు గల కవరులో గల అంటుమొక్కలను కొనుగోలు చేసుకుని రవాణాలో తగిన జాగ్రత్తలు తీసుకుని, వెంటనే నాటుకోకుండా 2 లేదా 3 రోజుల తరువాత ప్రధాన పొలంలో వేసుకుంటే మోర్టాలిటిని తగ్గించవచ్చు. మొక్కలు రవాణాలో కొంత వత్తిడికి గురి అవుతాయి కాబట్టి నీడలో దించుకుని నీటిని అందించి రెండు, మూడు రోజులు ఆగి నాటుకోవాలని రైతులను ఉమామహేశ్వరరావు కోరుతున్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించగలిగితే రెండవ సంవత్సరం నుంచి కాపు మొదలు అవుతుంది కానీ మూడవ సంవత్సరం నుంచి దిగుబడి పొందవచ్చు. బాగా ఎండి రాలిపోయిన గింజలను సేకరించి రెండు, మూడు రోజులు మంచి ఎండలో ఎండబెట్టిన తరువాత గ్రేడింగ్ చేసి నిల్వ చేసుకోగలిగితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. సాధారణంగా దిగుబడి వచ్చిన కొత్తలో జీడి పిక్కల రేటు తక్కువనే ఉండి పండుగల సమయంలో పెరుగుతుంది కాబట్టి నాణ్యమైన జీడి పిక్కలను నిల్వ చేసుకుని గిరాకీ ఉన్న సమయంలో అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది అని ఉమామహేశ్వరరావు వివరించారు.
జీడిమామిడి అనగానే ఎక్కువ మందికి జీడిపప్పు మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ జీడిపప్పుతో పాటు జీడి పండ్ల నుంచి కూడా ఉపఉత్పత్తులను తయారు చేయవచ్చు. జీడిపండులో అనేక పోషకాలు ఉంటాయి. బత్తాయిలో కంటే రెండు రెట్లు అధిక సి విటమిన్ జీడి పండ్లలో ఉంటుంది. జీడిపండ్ల నిల్వ సామర్థ్యం చాలా తక్కువ కాబట్టి వీటి నుంచి రసం తీసి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ఒక ఎకరం జీడితోట నుంచి రెండు నుంచి మూడు టన్నుల జీడి పండ్ల దిగుబడి వస్తుంది. కిలోకు 5/-లు వచ్చినా కూడా ఎకరం జీడి తోట నుంచి 10 నుంచి 15 వేల రూపాయల అదనపు ఆదాయం పొందవచ్చు. కాబట్టి జీడి పండ్లతో తయారు చేయగల ఉపఉత్పత్తులకు మరియు జీడి పిక్కల నుంచి జీడి పప్పు తయారీకి సంబంధించిన విషయాల గురించి శిక్షణను అందిస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోగలరు. జీడి పంటకు సంబంధించిన సాగు పద్ధతులు, నాణ్యమైన అంటుమొక్కలు, చీడపీడల యాజమాన్యం గురించి 7382633656 ఫోనులో తనను సంప్రదించవచ్చని ఉమామహేశ్వరరావు కోరుతున్నారు.

