ప్రస్తుతం లేయర్, బ్రాయిలర్, దేశవాళి కోళ్ళ ఫారాలలో తరచూ కనబడుతున్న రాణికేట్ వ్యాధిని వ్యవహారిక భాషలో కొక్కెర వ్యాధిగా పిలుస్తారు. కొక్కెర వ్యాధి పారమిక్సో తరగతి వైరస్ వలన సంక్రమిస్తుంది. అన్ని వయస్సుల కోళ్లకు, అన్ని రకాల కోళ్లలో (అనగా లేయర్స్, బ్రాయిలర్స్, దేశీ కోళ్లలో) ఈ వ్యాధి వలన అధికంగా మరణాలు సంభవించడమే కాకుండా గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తులు తగ్గి కోళ్ళ రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఈ కొక్కెర వ్యాధిని తీవ్రస్థాయి వ్యాధిగా గుర్తించడం జరిగింది.
వ్యాధి వ్యాప్తి
1. ఈ వ్యాధి గాలి ద్వారా ఒక కోడి నుండి మరొక కోడికి సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తమైన కోళ్ల ఫారాల నుండి మరొక కోళ్ల ఫారంకు గాలి ద్వారా వ్యాప్తి చెంది, కోళ్ల ముక్కు రంధ్రాల ద్వారా కాని, నోటి ద్వారా కాని కంటి ద్వారా కానీ శరీరంలోకి ప్రవేశిస్తాయి.
2. క్రితం బ్యాచ్‌లలో వ్యాధి సోకినట్లయితే వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. వ్యాధిగ్రస్తమైన ఫారాల నుండి వచ్చే మనుషులు, వాహనాలు, గుడ్ల పెట్టెలు, గోనె సంచుల వల్ల కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
4. వ్యాధిగ్రస్తమైన కోళ్ళ ఫారాల నుండి తొలగించిన కోడి ఎరువు నుండి కూడా వేరొక ఫారం కోళ్లకు సోకుతుంది.
5. దాణా మరియు త్రాగు నీరు కోడి ఎరువుతో కలుషితం అవడం వల్ల కూడా సంక్రమిస్తుంది.
6. ఫారం పరిసరాలలో దేశీ కోళ్ళు పెంచడం వల్ల, కొంగలు, కాకుల వంటి పకక్షులు ఫారం పరిసరాలలో తిరగడం వల్ల సంక్రమిస్తుంది.
7. ఈ వ్యాధితో మరణించిన కోళ్లను సరిగ్గా నిర్మూలించకపోవడం వల్ల మరొక ఫారంకు సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు
1. వ్యాధిగ్రస్తమైన కోళ్లు నీరసిస్తాయి, దాణా వినియోగం తగ్గుతుంది. నరాల బలహీనతను, ఆకుపచ్చని రెట్టను ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు.
2. కాళ్ల మరియు రెప్పల పక్షవాతం లేదా మెడ ఒకవైపుకు తిరిగినట్టు ఉండే లక్షణాలను ఈ వ్యాధిలో చూడవచ్చు.
3. బ్రాయిలర్ కోళ్లు నీరసించి బరువు తగ్గుతాయి.
4. లేయర్ కోళ్లలో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, తోలు గుడ్లు మరియు పలుచని పెంకు గల గుడ్లను ఎక్కువగా పెడతాయి.
5. తీవ్ర స్థాయి గురక లాంటి శబ్దాలు కూడా ప్రారంభమవుతాయి.
6. వ్యాధి సోకిన కోళ్లలో వాటి మొఖము ఉబ్బి ముక్కు రంధ్రాల గుండా నీరు వలే కారడం మనము గమనించవచ్చు.
7. వ్యాధి తీవ్రతరం అయితే కోళ్లలో మరణాల రేటు అధికంగా ఉంటుంది.
8. చనిపోయిన కోళ్లను కోసి పరిశీలించినట్లయితే ప్రోవెంట్రిక్యులస్ నుంచి రక్తపు మరకలను చూడవచ్చు. పేగులో పుళ్ళు ఏర్పడతాయి. గుడ్ల తిత్తులలో కూడా రక్తపు మరకలు/చారికలు చూడవచ్చు.
చికిత్స
1. ఈ వ్యాధి వైరల్ వ్యాధి కావడం వల్ల చికిత్స లేనప్పటికీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే లసోటా వ్యాక్సిన్‌ను డ్రాప్‌గా కానీ నీటి ద్వారా కానీ, ఇంజక్షన్ రూపంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది. దానితో పాటు ఎ, డి3, ఇ, కె విటమిన్లను ఇవ్వాలి.
2. వ్యాధి వ్యాప్తిని వ్యాధి తీవ్రతను తగ్గించడానికి పైరుసిడల్ ఏజెంట్లు అయిన బయోబస్టర్, బి-904 వంటి మందులను కోళ్ల మీద మరియు ఫారం చుట్టూ పరిసరాలలో పిచికారీ చేసి వైరస్‌ను నిర్మూలించవచ్చు.
నివారణ చర్యలు
1. ఫారంలో క్రితం బ్యాచ్‌లకు వ్యాధి సోకిన సందర్భాలలో ఖచ్చితమైన వ్యాక్సినేషన్ విధానాలను అవలంభించాలి.
2. వ్యాధి సోకిన కోళ్లను తీసివేసిన తరువాత తప్పనిసరిగా 6 లేదా 8 వారాల వ్యవధినిచ్చి, పూర్తి స్థాయిలో శుభ్రపరచి, తిరిగి కోళ్ళను కాని, కోడి పిల్లలను గానీ వేయాలి. ఖాళీ షెడ్లను ఫ్యూమిగేషన్ విధానంలో శుభ్రపరచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
3. ఫారం పరిసరాలలో వ్యాధి సోకిన సందర్భాలలో నివారణగా ముందస్తు వ్యాక్సిన్లు ఇవ్వాలి (లసోటా వ్యాక్సిన్)
4. అవసరాన్ని బట్టి రక్త పరీక్ష చేయడం వల్ల వ్యాధి సంక్రమించక ముందే వ్యాక్సిన్లు ఇవ్వవచ్చు. దాని మూలాన వ్యాధి నివారణ సాధ్యమవుతుంది.
5. కొంగలు, కాకులు వంటి ఇతర పకక్షులు షెడ్లలోనికి ప్రవేశించకుండా షెడ్ల సైడు జాలీల ఖాళీలను సరిచేసుకోవాలి.
6. లేయర్ కోళ్లకు ప్రతీ 5 లేదా 6 వారాలకొకసారి లసోటా వ్యాక్సిన్ ఇవ్వాలి. బ్రాయిలర్ కోళ్లకు 20 రోజుల వయస్సులో రెండవసారి లసోటా వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలి.
7. కోళ్లలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల వ్యాక్సిన్ టైటర్స్ తగ్గి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.
8. క్రమం తప్పకుండా విటమిన్లు ఇవ్వడంవల్ల టైటర్స్ తగ్గకుండా ఉంచవచ్చు.
9. దాణాలో ఉన్న టాక్సిన్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధి సంక్రమించవచ్చు కావున క్రమం తప్పకుండా దాణాలో టాక్సిన్ బైండర్లను వాడాలి.
10. వ్యాధి సోకి మరణించిన కోళ్ళ నిర్మూలన అత్యంత ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన మరణించిన కోళ్ళను కాల్చివేయాలి లేదా కనీసం పూడ్చి వేయాలి.
11. ఫారంలోకి బయటి నుండి వచ్చే మనుషులు, వాహనాల రాకపోకలను నియంత్రించాలి.
12. గుడ్లు, కోళ్ళ వ్యాన్లను ఫారంలోకి అనుమతించకూడదు.
13. షెడ్లు లోపల కోళ్లపై క్రమం తప్పకుండా వైరు సిడిల్ ఏజెంట్లు అయిన బయోబస్టర్ వంటి వాటిని స్ప్రే చేయాలి. షెడ్లు బయటి పరిసరాలలో 10% ఫార్మాలిన్‌ను స్ప్రే చేయడం వల్ల వ్యాధి సోకకుండా నిర్మూలించవచ్చు.
14. వ్యాధిగ్రస్తమైన షెడ్లలోని పీడర్స్, డ్రింకర్స్, బ్రూడర్స్లను వాడేటప్పుడు కాస్టిక్ సోడాతో మరియు 10% ఫార్మాలిన్తో శుభ్రపరచి వాడుకోవాలి.
15. వ్యాధి సంక్రమించిన షెడ్లలోని లిట్టరుపై 10% ఫార్మాలిన్ స్ప్రే చేసి సంచుల్లోకి ఎత్తి ఫారానికి దూరంగా పారబోయాలి.
డా. ఎన్. వేణుమాధవ్, టీచింగ్ ఫ్యాకల్టీ, డా. ఎన్. రమ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎల్.ఎఫ్.సి), కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, జగిత్యాల జిల్లా. ఫోన్ : 7989846261, 9490448540
