ఈ సంవత్సరం జూలై మొదటి వారాంతం వరకు మన వాతావరణ శాఖ, ఎలినినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావం ఉండవచ్చునని, నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే వారి అంచనాలకు పూర్తి విరుద్ధంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, దాదాపు దేశంలోని అన్ని నదులకు వరదలు సంభవించుట మనం చూస్తున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు చేరటం, జూలై ఆఖరివారంలో ప్రారంభమైంది. వాగులు, కాల్వలు, చెరువులు పొంగుట, అనేక చోట్ల చెరువుగట్లు కూడా ధ్వంసం అగుటతో పాటు ప్రాజెక్టులకు కూడా ముప్పు వాటిల్లింది. వరంగల్, హైదరాబాద్ నగరాలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇటీవలకాలంలో మనం ఎన్నడూ చూడని విధంగా రోడ్లతో పాటు, భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పదుల సంఖ్యలో జన నష్టంతో పాటు వేలాది మూగ జీవులు ప్రాణాలు కోల్పోయాయి. పిడుగుపాటు, వడగళ్ల వల్ల పశువులతో పాటు, జీవాల మందలు కూడా మరణించాయి. సుమారు రెండు వారాలుగా అనేక ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల, పొలాలను ముంచి వేసిన వరద నీటి వల్ల పచ్చిక కుళ్లిపోయి పశువులకు మేత అందని పరిస్థితితో పాటు వరద నీటిలో కొట్టుకుపోయిన గడ్డి వాములు, వాన నీటితో తడిచి కుళ్లి-బూజుపడుతున్న గ్రాసాలు, దాణాల వల్ల పశువులు, జీవాలు, కోళ్ల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది. వాతావరణంలో అనూహ్యంగా, అకస్మాత్తుగా సంభవించే అతివృష్టి, పిడుగుపాటు, వరదలను ముందుగా ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితుల్ని ప్రస్తుతం మనం చూస్తూ వున్నాము. కాబట్టి పశుపోషకులు, జీవాల పెంపకందారులు రాబోయే రెండు-మూడు నెలల వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో నవంబరు నెలలో కూడా ఉప్పెనలు వచ్చి అనూహ్య నష్టాలను చవిచూచిన అనుభవాలను మనం మరచిపోకూడదు. అయినా వాతావరణ శాఖ సూచనలను విస్మరించకూడదు. సాధారణంగా వారి సూచనలు శాస్త్రీయ అధ్యయనాల మీదనే ఆధారపడి మాత్రమే ఉంటాయని అర్థం చేసుకోవాలి.
ఇక వరదలు, వానలు, పిడుగుపాట్లు, వడగళ్ల వానలు వల్ల సంభవించే నష్టాల గురించి చర్చిద్దాము.
ఆకస్మికంగా వచ్చే పిడుగు పాట్ల నుండి పశువులను, జీవాలను కాపాడుట ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అయినా పిడుగుపాటుకు అవకాశాలు ఎక్కువగా ఉండే పెద్ద చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద పశువుల్ని బంధించి ఉంచుట క్షేమం కాదు. వాటిని ఆరుబయలు ప్రదేశంలో కొంత స్వేచ్ఛగా ఉంచుట మంచిది. వడగళ్ల బారి నుండి రక్షించుటకు పశువుల్ని వీలైతే సిమెంటు శ్లాబులు క్రింద లేదా పటిష్టమైన రేకుల షెడ్ల క్రింద ఉంచి రక్షించాలి.
ఇప్పటి ఆకస్మిక వరదలలో వందలాది పశువులు, వేలాది జీవాలు వరద నీటిలో కొట్టుకుపోయిన వార్తల్ని దృష్టిలో ఉంచుకొని, పశువుల్ని, జీవాలను, ఎత్తయిన రక్షిత స్థలాలకు తరలించాలి. లోతట్టు ప్రాంతాలలోని పశువుల పాకలలోని పశువుల్ని సులువుగా విడుదల చేసి రక్షించుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జులై 26న వచ్చిన వరదల నుండి పశువులను డాబా పైకి తరలించి రక్షించిన దృశ్యాలను కొన్ని ప్రాంతాలలో చూశాను. వీలైతే ఇటువంటి జాగ్రత్తలు కూడా మంచివే.
ముసురు రోజుల్లో సుదీర్ఘంగా రొచ్చు, బురద, పేడ వంటి అశుభ్రాల మీద నిలబడిన పశువుల గిట్టలు, కాళ్లు పుండ్లు పడటం సాధారణం! సత్వరమే తగిన చికిత్సలు చేయకపోతే ఫుట్‌రాట్ వంటి మొండి సమస్యలు తలెత్తి పశువులు, జీవాలు తీవ్రమైన బాధలకు గురౌతాయి. ఇటువంటి సందర్భాలలో కాళ్లను, గిట్టలను మైలుతుత్తుం (2%) ద్రావణంలో ముంచుట లేదా ఈ ద్రావణం గుండా నడిపించుట మంచిది. కాళ్లకు, గిట్టలకు వేపనూనె పూస్తే స్వల్పమైన పుండ్లు త్వరగా నయమౌతాయి.
అనేక రోజుల పాటు పడే వానల వల్ల ఏర్పడే చలి వాతావరణం, చిత్తడి పరిసరాల వల్ల దూడలు ప్రాణాల కోల్పోయే ముప్పు ఎక్కువ కాబట్టి వీటిని చలిగాలుల నుండి రక్షించే జాగ్రత్తలు తీసుకుని పొడివాతావరణంలో ఉంచాలి.
ఈ సంవత్సరం జూలై మాసంలో కూడా తీవ్రమైన ఎండలు కొనసాగి, ఆకస్మికంగా భారీ వానలు, వరదలు వచ్చాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల పశువులు-జీవాల సహజమైన వ్యాధినిరోధక శక్తులు క్షీణించి, అవి అనేక అంటురోగాలకు సులువుగా బలైపోతాయి. కాబట్టి వెంటనే వీటికి గురక, దొమ్మ, పి.పి.ఆర్., గాలికుంటు వంటి ఆయా ప్రాంతాలలో ఉనికిలో ఉన్న ప్రమాదకరమైన వ్యాధుల నివారణ టీకాలు ఒకేసారి ఒక ప్రాంతం లేదా మందలో కనీసం 90 శాతం పశువులు లేదా జీవాలకు టీకాలు వేయించాలి. అనేక అంటువ్యాధి క్రిముల్ని వ్యాపింపచేసే ఈగలు, దోమలు, గోమార్లు, పిడుదుల నివారణకు డి.డి.టి., గమాక్సిన్, డెల్టామెథ్రిన్, సైపర్‌మెథ్రిన్ వంటి కీటకనాశకాలను పాకలు, కొట్టాలు, పరిసరాలలో స్ప్రే చేసి ఈ స్థలాలను పొడిగా ఉంచాలి. ఇందుకు తాత్కాలికంగానైనా మురుగు పారుదల ఏర్పాట్లు చేయుట అవసరం.
ఇటీవల నాలుగు సంవత్సరాలుగా పశువులు, జీవాలకు తీవ్రమైన సమస్యగా ఎదురైన లంపీస్కిన్ డిసీజ్ వ్యాధి నివారణకు అవసరమైన టీకాలు, ఇతర ఆరోగ్య భద్రతా చర్యల్ని వెంటనే చేపట్టాలి.
ప్రస్తుతం మన గేదెలు ఎక్కువగా నిండు చూడి థలో ఉండి, స్వల్పకారణాలకే గర్భస్రావాలకు లోనయ్యే ముప్పు ఉంది. ఇందుకు మేత కొరత, పరిసరాల అశుభ్రతతో పాటు క్షీణించిన వ్యాధినిరోధక శక్తి, వత్తిళ్లను తట్టుకోగల శక్తి తదితర కారణాలను గుర్తించి, తగిన నష్టనివారణ చర్యల్ని వెంటనే చేపట్టాలి.
క్షీణించిన పరిశుభ్రత, పోషణ, యాజమాన్య నిర్వహణ తదితర కారణాల వల్ల, బాలింత పశువులలో పొదుగు వాపు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంతేకాక వరదలు ఇతర విపత్తుల వల్ల సకాలంలో నిర్ణీత సమయానికి పాలుపిండకపోతే పొదుగులు నిండిపోయి పొదుగువాపు ముప్పు ఎక్కువగా ఉంటుంది.
మేత సమస్య: వరదల వల్ల పశువులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మేత కొరత, గడ్డివాములు వరదలలో కొట్టుకుపోవటం, మేతలు, గ్రాసాలు బూజుపట్టి ముక్కిపోయి వాటిని తిన్న పశువులు, జీవాలకు ప్రాణహాని జరగటం పరిపాటి. పచ్చికబీళ్లు వరద నీరు, బురదలలో మునిగిపోయి అందుబాటులో లేకపోవుట, పారా ల్యూసర్న్ వంటి పొట్టి రకం గ్రాసాలతో పాటు ఎదిగే థలో ఉన్న సూపర్ నేపియర్ వంటి పొడవు గ్రాసాలు కూడా చనిపోవటం జరగవచ్చు. ఇందువల్ల ఎదురయ్యే మేత సమస్యను ప్రత్యామ్నాయ మేతలు అంటే సుబాబుల్, మర్రి, రావి, అరటి తోట వ్యర్థాలు, మామిడి ఆకులు, నేరేడు, మారేడు, తుమ్మ, అవిసె, మునగ, వేప వంటి ఆకుల్నే కాక కొంత పరిమితంగా (అంటే మొత్తం మేతలో 25 శాతానికి మించకుండా) ఇప్పుడు విరివిగా లభిస్తున్న గుర్రపుడెక్కను కూడాను మేపవచ్చును. ఈ మేతల్ని అలవాటు చేయుటకు మొదట్లో వాటి మీద బెల్లం లేదా వరి తవుడును జల్లి మేపాలి. కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలు కూడా పశువులకు మంచి పోషకాలను అందించగలవు.

అజొల్లా-హైడ్రోపోనిక్ గ్రాసాల సాగును ఇంటి మిద్దెల మీద కూడా చేపట్టి నాటిన 7-8 రోజుల్లో కిలో విత్తు నుండి 7-8 కిలోల పుష్టివంతమైన పచ్చని మేతను పొందవచ్చును. ఎక్కువ మొలకెత్తే సామర్థ్యం కలిగిన జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్, పెసలు, శనగలు, ఉలవల నుండి ట్రేలలో అత్యంత మేలైన పచ్చిగ్రాసాలు పొందవచ్చును.
అజొల్లా అనే ఫెర్న్ మొక్కను ప్లాస్టిక్ టార్పాలిన్‌తో ఏర్పాటు చేసిన నీటి మడుగులలో పెంచితే పచ్చిమేతల సాగుకు భారీ విస్తీర్ణమైన సాగుభూముల అవసరమే ఉండదు. వరి గడ్డితో పాటు హైడ్రోపోనిక్ గ్రాసాలను, అజొల్లాను మేపగల్గితే అన్ని రోజులలోనూ పశువుల ఆహార అవసరాలు చాలా వరకు తీరగలవు.
ప్రమాదాలు, రోగాలు, వరదల వల్ల పశువుల్ని కోల్పోయినప్పుడు జరిగే నష్టాలకు పరిహారం పొందుటకు వెంటనే పశువులన్నింటినీ బీమా చేయించి వాటి చెవులకు బిగించిన నెంబరు పోగులు ఊడిపోకుండా జాగ్రత్త వహించాలి.
– డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

