రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, రబీ పంటలు మార్కెట్లకు బాగా వస్తున్నాయి. ప్రత్తి రేట్లు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. మిరప రేట్లు బాగాన్నాయి. టమాట ధరలు బాగా పడిపోయాయి. మిగతా కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. వరి ప్రొక్యూర్మెంట్‌ మే నెలలో కూడా కొనసాగే పరిస్థితి. ఎండలు సాధారణంగా ఉండవచ్చనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మే నెల (భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు)లో పలు పంటలలో చేయవలసిన వ్యవసాయ పనులను గురించి తెలుసుకుందాం. రాబోయే ఖరీఫ్‌ పంటకు ముందుగా చేయవలసిన పనులను కూడా తెలుసుకుందాం. చేతికొచ్చిన పంటను అమ్మేటపుడు గుర్తుంచుకోవలసిన మెళకువలు, సంఘాల సహకారం గురించి కూడా తెలుసుకుందాం.

వరి: మద్ధతు ధరకు మిల్లు యజమానులు తరుగు తీయకుండా వరిని కొంటామని ప్రకటించి దానికవసరమైన చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. మిగతా ప్రభుత్వాలు కూడా ఈ విధమైన పద్ధతులు పాటించి రైతులకు మేలు చేయవచ్చు. తద్వారా పలుకుబడి పెంచుకోవచ్చు. చలికాలపు వరి పంట మే నెలలో కూడా మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉన్నదని ధరలు 2024 వరకు అధికంగా ఉంటాయని మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ వారు తెలుపుతున్నారు. అందువలన నాణ్యమైన బియ్యానికి ధరలు బాగుంటాయని ఆశిద్దాం. వడ్లకు బదులు బియ్యాన్ని తయారు చేసి అమ్మడానికి రైతులు, రైతు సంఘాలు ప్రయత్నించండి. చిన్న చిన్న మొబైల్‌ రైస్‌ మిల్లులను రైతు ప్రజా సంఘాలు కొని, అద్దె ప్రాతిపదికన రైతులకిస్తే, రైతులు బియ్యాన్నమ్మే వారుగా ఎదుగుతారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది. వడ్లను, అనుకూలమైన చోట, పాతవయ్యేంత వరకు నిల్వ చేసి బియ్యం చేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వచ్చే వీలున్నది. పల్లెల నుండి పట్టణాలకు వలసపోయిన వారి ఇండ్లు ఖాళీగా ఉన్నవాటిని వడ్ల నిల్వకు  ఉపయోగించవచ్చు. నాణ్యమైన సన్నబియ్యానికి ధరలెక్కువగా వస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో కూడా ధరలెక్కువగా దొరికే సన్న బియ్యాలను సాగు చేయడానికి కావలసిన విత్తనాలను మే నెలలోనే తయారుగా పెట్టుకోండి. వర్షాకాలంలో నారుపోయుట రోహిణి కార్తెలో (25-5-23 నుండి 7-6-23 వరకు) మొదలు పెట్టుట ఆనవాయితి. నాటుకు నీరు పుష్కలంగా ఉన్న చోట రోహిణి కార్తెలో నారుపోసి తర్వాత నాటిన పంటలో చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉండి దిగుబడి బాగా పెరుగుతుంది. కొత్త రకాలను కొద్ది భూమిలో పరీక్షించడానికి కొనవచ్చు. బాగా పండి, వాటికి ధరలు బాగుంటే తర్వాతి సీజన్లలో ఆ రకాల విస్తీర్ణాన్ని పెంచవచ్చు. విత్తనాలను ముందే తెచ్చి తయారుగా పెట్టుకోండి.

ప్రత్తి: రైతుల దగ్గర ప్రత్తి చాలామటుకు వ్యాపారస్తులకు అమ్ముడు పోగానే, ప్రత్తి ధరలు పెరుగుట క్రితం సంవత్సరం జరిగింది. ఇప్పుడు కొన్ని మార్కెట్లలో ప్రత్తి ధర క్వింటాలుకు 8000 దాటి పలుకుతున్నది. ఇది ఇంకా పెరగవచ్చని ఊహ. వర్షాలు తగినంత పడినా, లేక నీటి తడులివ్వడానికి అవకాశమున్నచోట మేనెల కడ వారంలో (రోహిణి కార్తెలో) ముంగారి ప్రత్తి విత్తడం అలవాటు. రోహిణిలో విత్తే పత్తిలో చీడపీడల బెడద ముఖ్యంగా గులాబి రంగు పురుగు ఉధృతి చాలా తక్కువ. ప్రత్తిని అధిక సాంద్రతలో (80þ20 సెం.మీ.) ఎకరాకు 25000 మొక్కలుండేటట్లు పెంచుకోవాలి. అధిక సాంద్రత విధానం, వర్షాధారంగానూ, నీటితడులిచ్చి కూడా పంటబెట్టవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తవుతుంది. తదుపరి పంటగా పెసర, మినుము, నువ్వులు, శనగ, వేరుశనగ సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్న ప్రాంతాలలో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయి. వర్షాలు పడకుండా బెట్టవచ్చినపుడు వీలున్నచోట నీటి తడి ఇచ్చి ప్రత్తి దిగుబడి బాగా పెంచవచ్చు. మీరు గమనించిన మంచి దిగుబడినిచ్చే రకాలనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి నమ్మకంగా అధిక దిగుబడులు సాధించండి. కొత్త రకాలను కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి, వాటి దిగుబడి, వాటికి వచ్చే ధర బాగుంటే ఎక్కువ విస్తీర్ణంలో వచ్చే సంవత్సరం ప్రయత్నించవచ్చు. ఇంటి దగ్గరే రైతులు సంఘాలుగా / గ్రూపులుగా ఏర్పడి బాగా బేరమాడి, మోసపోకుండా వ్యాపారులకమ్మితే మార్కెట్‌కు తీసుకెళ్లి అక్కడ పడే బాధల నుండి తప్పించుకోవచ్చు.

మొక్కజొన్న: చీడపీడల బాధ తక్కువగా ఉండి, అత్యధిక దిగగుబడులు సాధించడానికి మే చివరి వారం నుండి జూన్‌ మొదటి వారం వరకు విత్తాలి. ఈ సమయంలో భూమిలో తేమ విత్తనం మొలకెత్తడానికి సరిపడినంత ఉండాలి. బాగా వర్షం కురిసి గాని, నీటి తడి ఇచ్చిగాని విత్తాల్సుంటుంది. బెట్టలేకుండా నీటి తడులివ్వగలిగిన ప్రదేశాల్లోనే అత్యధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఎకరాకు 45-50 క్వింటాళ్ళ గింజ దిగుబడినివ్వగలిగిన ప్రైవేటు హైబ్రిడ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అల్లం: ఈనెలలోపల విత్తవలసిన పంట. జూన్‌లో విత్తితే దుంపకుళ్ళు ఎక్కువై దిగుబడులు తగ్గుతాయి. అధిక దిగుబడి రకాలు: తెలంగాణకు: రియోడిజనీరో, మారన్‌; ఆంధ్రప్రదేశ్‌కు: రియోడిజనీరో, వైనాడ్‌లోకల్‌. అత్యధిక దిగుబడులకు ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అనుకూలం. పాక్షిక నీడ గల్గిన ప్రాంతాలయిన పందిరి కూరగాయతోటలు, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ తోటలలో కూడా ఈ పంట పండుతుంది. ఎకరాకు 600-800 కిలోల దుంపలు విత్తనానికి సరిపోతాయి.

పసుపు: 6-7 నెలల్లో త్రవ్వడానికి వచ్చే స్వల్పకాలిక పసుపు రకాలను ఆంధ్రప్రదేశ్‌లో నాటడానికి మే చివరి వారం అనుకూలం. అదే తెలంగాణలో అయితే జూన్‌ మొదటి వారంలో నాటాలి. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు: ఐ.ఐ.ఎస్‌.ఆర్‌. ప్రతిభ: 185-190 రోజుల పంట; దిగుబడి: 15-16 ట/ఎ. రికవరి: 18.5 శాతం. ఐ.ఐ.ఎస్‌.ఆర్‌.ప్రభ: 195 రోజుల పంట, దిగుబడి: 15ట/ఎ. రికవరి: 19.5 శాతం.

నువ్వులు: తెలంగాణలో మే రెండవ వారంలోపు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. తర్వాత ఆగస్టు రెండవ పక్షం అనుకూలం. రాయలసీమలో మే-జూన్‌ నెలల్లో విత్తడం అనుకూలం. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మే రెండవ పక్షంలో విత్తడం మేలు. అనుకూలమైన రకం- రెండు తెలుగు రాష్ట్రాలకు: జగిత్యాలతిల్‌-1 (జె.సి.ఎస్‌-1020): 90-125 రోజుల పంట. నువ్వుల దిగుబడి: 5-8 క్వి/ఎ. చలికాలం, వేసవి కాలాల్లో కూడా పంట పెట్టవచ్చు. ఈ నెలలో విత్తనోత్పత్తి చేపట్టి మంచి ఆదాయం పొందే అవకాశం. 

కొత్తిమీర: ఎండాకాలంలో ఎదుగుదల తక్కువ. మసాలాలలో బాగా వాడతారు. రోగనిరోధక శక్తిని పెంచే గుణముంది. ఎండాకాలంలో బాగా గిరాకీ ఉన్న పంట. ఎకరాకు ఆదాయం లక్షకు పైమాటే. పాక్షిక నీడ గలిగిన తోట పంటలు, పందిర్ల క్రింద, షేడ్‌ నెట్లు, నెట్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో ఈ పంట బాగా వస్తుంది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను నీడలేకున్నా పండించవచ్చు. చవుడులేని పొలాల్లో పండించడానికి అనుకూలమైన కొత్తిమీర రకాలు: ద్వా, పంత్‌హరితిమా, కో-1, 2, 3. చౌడు భూముల్లో కూడా పెరిగే కొత్తిమీర రకం: కో-2. జూలై మొదటి పక్షం వరకు కొత్తిమీర ధరలు అధికంగా ఉండే అవకాశముంది.

పొదీన: ఎండాకాలంలో మంచి ఆదాయాన్నిచ్చే మరొక పంట పొదీనా. మసాలా వంటల్లో ఆకును వాడుతారు. తైలం తీసి కూడా మార్కెట్‌ చేయవచ్చు. అనుకూలమైన రకాలు హిమాలయ, శిలిక్‌, కోసి. దిగుబడి పొదీనా 15-20 ట/ఎ. నూనె తీస్తే 70-75 కిలోల నూనె/ఎ.

ఆకుకూరలు:  పాలకూర: వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. చౌడు భూముల్లో కూడా కొద్ది తక్కువ దిగుబడితో పండుతుంది. మంచి రకాలు: ఊటీ: 24ట/ఎ. జాబ్‌నగర్‌ గ్రీన్‌: 16-19 ట/ఎ.

తోటకూర, ఎర్ర తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటికూర, సోయకూర, కొయ్యగూర మొదలైన ఆకుకూరలు కొద్దిపాటి నీటితో, కొద్దిపాటి భూమిలోనయినా పండించవచ్చు. మంచి ఆరోగ్యానికి, ఆకుకూరల వినియోగం పెరుగుతున్నది.

పూలు – కనకాంబరం: నాటిన 3 సంవత్సరాల వరకు పూస్తుంది. తొలి రెండు సంవత్సరాలలో పూత ఎక్కువ. తర్వాత తగ్గుతుంది. మే-జూన్‌ నెలల్లో నారు పోసుకుని, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో నాటాలి. పూల కాడల్లో, పూలు తెంపడం పూర్తయినాక, ఖాళీ కాడలను, ఎండిన కొమ్మలను తీసివేస్తూ, అవసరాన్ని బట్టి, నీరు పెట్టి, సేద్యం చేస్తే, సంవత్సరం పొడవునా కనకాంబరం పూలను పొందవచ్చు.

టమాట: నీరు పుష్కలంగా ఉండడం వలన, టమాట ఎక్కువ విస్తీర్ణంలో పండించడం వలన దిగుబడి ఎక్కువ. ధరలు తక్కువగా ఉన్నాయి. విస్తీర్ణాన్ని నియంత్రిస్తేనే ధరలు పెరుగుతాయి. అధిక వర్షాలు/తుఫాన్లు/వడగండ్ల వానలు వంటి విపరీత పరిస్థితులొస్తే దిగుబడి తగ్గుతుంది. రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. తొలకరిలో మేఘావృత వాతావరణముంటే దిగుబడి తగ్గి ధరలు పెరగవచ్చు.

వంగ: ప్రస్తుతం టమాట రేట్లు తక్కువగా ఉన్నందున ఇతర కూరగాయలను పండించడానికి మొగ్గు చూపుతున్నారు. వంగ ధరలు టమాటల కంటే ఎక్కువగా ఉన్నందున ఈ పంట ప్రాచుర్యం పెరిగింది.

కీరదోస: వీటి వినియోగం సాలాడ్‌ కొరకు విపరీతంగా పెరుగుతున్నది. ఎండాకాలం ఇంకా గిరాకీ ఎక్కువ ఉన్నందున ధరలు బాగుంటాయి. రైతులు పండించి మంచి ఆదాయం పొందవచ్చు.

ఫ్రెంచిబీన్స్‌: ఎండాకాలంలో పాక్షిక నీడ ఉన్న ప్రాంతాలలో లేక చల్లటి కొండ ప్రాంతాలలో పంట తీయవలసి వస్తుంది. వెజ్‌ బిరియానీలో వాడకం ఎక్కువ. అందువలన ఎండాకాలం మంచి రేటొస్తుంది.

సిరిధాన్యాలు: బెట్టను తట్టుకునే శక్తి గలిగిన కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలు, తొలకరికి ముందు వచ్చే మంచి వర్షాలకు విత్తుకోవచ్చు. వర్షాధార భూముల్లో ప్రయత్నించవచ్చు. రోహిణిలో వచ్చే వర్షాలను లాభదాయకంగా ఉపయోగపెట్టవచ్చు. బెట్ట సమయములో తడి ఇవ్వగల ప్రదేశాల్లో దిగుబడి మరియు ఆదాయం ఎక్కువగా ఉంటాయి.

రోహిణిలో నీరున్న చోట పంటలు: నీరు బాగా ఉన్న చోట బెండ, గోరుచిక్కుడు, కాకర, పొట్ల, బీర, గుమ్మడి, సొర, విత్తుకోవచ్చు. కూరగాయల నార్లు పోసుకోవచ్చు. కంది, పెసర, మినుము పంటలను విత్తుకోవచ్చు. దానిమ్మ, రేగు మొక్కలను నాటవచ్చు. పామారోజా, కామంచి వంటి సువాసన మొక్కల విత్తనాలు విత్తుకోవచ్చు.

మామిడి: తయారైన కాయలను తెంపి, చెట్ల క్రింద వరిగడ్డి/బోదగడ్డిలో కార్బైడు వేయకుండా మాగబెట్టి ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. ప్రకృతి సిద్ధంగా మందులు వేయకుండా మాగబెట్టిన పండ్లు అని బోర్డు పెట్టుకోవాలి. రోడ్ల ప్రక్కన ఉన్న తోటల దగ్గర వ్యాపారం అనుకూలం.

పలు పంటల మీద, రైతు ప్రజా సంఘాల మీద, అధికారుల సేవలు ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా మార్చే విధానాల మీద సంప్రదించడానికి 9494408619కు ఫోను చేయవచ్చు.

ప్రకృతి విపత్తులు, రైతుల కష్టాలు మార్కెట్లలో సరుకు నష్టాలు- పరిష్కార మార్గాలు

ఏప్రిల్‌, మే నెలల్లో పడే అకాల వర్షాలు, వడగండ్ల వానలు పంటను మార్కెట్‌కు తెచ్చినాక కూడా రైతులను విపరీతంగా నష్టాల పాలు చేస్తున్నాయి. ఈ బాధల నుండి రైతులను కాపాడాలి. ప్రభుత్వ విధానాలలో మార్పులు తేవాల్సిన అవసరముంది. రైతులు పండించిన పంటలను ఇండ్ల దగ్గరికే వచ్చి కొనే వ్యవస్థలను బలోపేతం చేయాలి. వ్యాపారులు ఒక్కొక్క రైతును మోసగించకుండా కాపాడడానికి ప్రతి జనావాసం/కుగ్రామం/గ్రామం/ పెద్ద ఊర్లలో రైతు ప్రజా సంఘాలను ప్రోత్సహించడం ఆచరణ సాధ్యం. ప్రజలు పట్టణాలకు వలస వెల్లడం వలన ఊర్లలో చాలా ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని రైతులు, రైతు సంఘాలు తమ పంటల ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తే మంచి ధర వచ్చినపుడు అమ్ముకోడానికి వీలవుతుంది. ఈ పద్ధతులను ప్రోత్సహించడానికి విస్తరణ విభాగాలను సమాయత్తం చేయవచ్చు. మార్కెట్‌లో దొరికే రేటు, ఊర్లోనే, బాధలు లేకుండా రైతుకు దక్కించవచ్చు. దీనికి రైతు ప్రజా సంఘాలను మారుమూల పల్లెలతో సహా అన్ని జనావాసాలతో ఏర్పాటయ్యేటట్లు ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్న వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఉపయోగించి వీటిని ఏర్పాటు చేయవచ్చు. బాధలు పడి, ఖర్చు భరించి పండిన పంటను మార్కెట్‌కు తీసుకొని పోయి, అక్కడే అమ్మాలనే పాలసీని మార్చాలి. రైతుల బాధలను తగ్గించాలి. ఇండ్ల దగ్గరే మంచి రేటుకు బాధలు లేకుండా అమ్ముకునేందుకు, ప్రభుత్వ యంత్రాంగం సహకరించే విధంగా విధాన మార్పులు తేవాలి.

ప్రజల/రైతుల కొరకు యంత్రాంగం: రైతుల/ప్రజల వద్దకు యంత్రాంగం అనే పద్ధతికి మారాలి. ఉత్పత్తిదారులకు/వ్యాపారులకు అనుసంధాన కర్తలుగా ఉత్పత్తిదారులకు సహాయపడేందుకు అధికారులను సమాయత్తం చేయాలి.