శెలవు దినం కావడంతో అయిదో తరగతి చదివే టిట్టు సైకిల్ తీసుకుని సరదాగా రోడ్డు మీదికి వెళ్ళాడు. కొత్త సైకిల్ కావడంతో ఉత్సాహంగాను, సంతోషంగానూ ఉంది. రోడ్డు పక్కనున్న పచ్చటి తైలం చెట్లు చూస్తూ ఊరికి చాలా దూరం వెళ్ళిపోయాడు. ‘ఎలాగూ ఊరి బయటికి వచ్చాము కదా, మైలు దూరంలో ఉన్న కొండవరకు వెళ్లి వద్దాము’ అని అనుకున్నాడు.
రోడ్డు పక్కన ఓ అవ్వ చెరుకులు అమ్ముతూ కనిపించింది. డబ్బులిచ్చి ఓ పెద్ద చెరుకు గడ కొనుక్కున్నాడు. దారిలో తిందామని దాన్ని నాలుగు ముక్కలుగా చేయించి సైకిల్ వెనుక పెట్టుకున్నాడు.
కొద్ది దూరం పోయేసరికి దారిలో కార్లు, పెద్దపెద్ద వాహనాలు నిలబడి ఉండటం కనిపించింది. ‘ఏమి జరిగిందా’ అని ఆతృతగా చూశాడు. అడవిలో నుంచి రెండు ఏనుగులు రోడ్డుకడ్డంగా వచ్చాయని చెప్పుకుంటున్నారు.
సర్రున బండ్ల సందుల్లో దూరి ఏనుగులున్న చోటికి వెళ్లి చూశాడు.
చెరుకు లారీకి అడ్డంగా ఒక పెద్ద ఏనుగు, మరో గున్న ఏనుగు నిలబడి ఉన్నాయి. లారీ వెనుక బండ్లన్నీ నిలబడి పోయాయి.

లారీ డ్రైవర్ ఎంతసేపు హారన్ కొట్టినా అవి పక్కకి తొలగడం లేదు. తొండం ఎత్తి ఘీంకారం చేస్తూ లారీ చుట్టూ తిరగసాగాయి. డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ ధైర్యం చేసి లారీనుంచి దిగి వాటిని తరిమే ప్రయత్నం చేయడం లేదు.
ఏమి చేస్తే అవి పక్కకి తొలుగుతాయని ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న ప్రయాణీకులంతా ప్రణాళికలు వేయసాగారు. కొందరు ఫైర్, పోలీస్ స్టేషన్లకు, ఫారెస్టు వారికి ఫోన్ లు చేస్తున్నారు.

‘వాటిని పక్కకి పంపడం ఎలా’ అని టిట్టు కూడా ఆలోచనల్లో పడ్డాడు. చెరుకు తింటూ ఆలోచిద్దామని గడను తీస్తూ ఉంటే తళుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్‌లు చూసేట్లుగా తన సైకిల్ వెనుక ఉన్న చెరుకు గడ ముక్కలని దూరంగా రోడ్డు పక్కకి విసిరేశాడు.
అంతే…లారీ డ్రైవర్‌కి చక్కటి పరిష్కారం దొరికినట్లయింది. వెంటనే క్లీనర్‌కి చెప్పి లారీ పైకి ఎక్కించాడు. ఏనుగులు గమనించేట్లు అందినన్ని చెరుకు గడ కట్టలు తీసి రోడ్డు పక్కన ఉన్న పచ్చికలో వేయించాడు.
క్లీనర్ అలా మూడు కట్టలు పడేసినా ఏనుగులకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. చూసీ చూడనట్లు ఉండిపోయాయి. నిరాశపడ్డాడు క్లీనర్. ”ప్రయత్నించి చూద్దాం, మరో మూడు కట్టలు విసిరేయ్” అని చెప్పాడు డ్రైవర్. అలాగే మరో మూడు కట్టలు పచ్చికలో పడేశాడు క్లీనర్.
మొత్తం ఆరు కట్టలు పచ్చికలో పడ్డాక కానీ, ఆ ఏనుగుల్లో కదలిక రాలేదు. తృప్తిగా ఏనుగులు చెవులాడిస్తూ చిన్నచిన్నగా చెరుకు గడల కోసం పచ్చికలోకి వెళ్ళాయి. ”హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నారు అక్కడి జనం.
ఏనుగుల అడ్డు తొలగడంతో వాహనాలన్నీ సర్రుసర్రున బయలుదేరాయి. కార్లలో వెళ్తున్న పిల్లలు ఏనుగును చూస్తూ ”ఏనుగమ్మ… ఏనుగు!” అని చప్పట్లు కొడుతూ వెళ్ళారు.
ట్రాఫిక్ జామ్ సమస్య తీరిపోవడంతో లారీ డ్రైవర్ నవ్వుతూ టిట్టును దగ్గరికి పిలిచాడు. చెరుకు గడల మోపును బహుమానంగా ఇచ్చాడు. టిట్టు దాన్ని సైకిల్ వెనక పెట్టి, గట్టిగా కట్టి… టాటా చెప్పి సైకిల్‌ని ఇంటి వైపు తిప్పాడు.
చెరుకు గడలను ఇంటికి తీసుకు వెళ్ళిన టిట్టు కడుపారా తనే తినకుండా, చుట్టుపక్కల పిల్లోళ్ళకి కూడా పంచాడు. పిల్లోల్లందరూ తియతియ్యటి చెరుకును ఆడుతూపాడుతూ ‘జ్యాంజ్యాం’ అని తిన్నారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, ఫోన్: 9393662821
‘ప్రజాశక్తి’ ఆదివారం అనుబంధం స్నేహ 17-12-2023లో ప్రచురింపబడింది.

