పాడి గేదెల్లో అకస్మాత్తుగా పొదుగు, చనుమొనలు తీవ్రమైన వాపునకు గురై పాడి రైతులకు అధిక ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రధాన వ్యాధులలో వైరల్ మాస్టిటిస్ లేదా మ్యామిలైటిస్ (చనుమొనల తెగులు వ్యాధి / అల్సరేటివ్ థెలైటిస్) అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి ప్రధానంగా బోవిన్ హెర్పెస్ వైరస్ -2 అనే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తుంది.

ఈ వ్యాధి సోకినప్పుడు చనుమొనల్లో తీవ్రమైన వాపు, చనుమొనలు ఉబ్బడం, తీవ్రమైన నొప్పి వల్ల పాలు పితకడం మరియు దూడలు పాలు త్రాగడం లో అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాధి సోకిన ప్రాంతంలో లోతైన పుండ్లు ఏర్పడతాయి.

స్థానికంగా ఈ వ్యాధిని గుల్వాద్దీ వ్యాధి (Gulwaddee) అని పిలుస్తారు. చనుమొన మరియు పొదుగు కలిసే సంధి స్థానంలో మెడను కోసినట్లుగా మానని లోతైన పుండు ఏర్పడటం వల్ల దీనికా పేరు వచ్చింది. ముఖ్యంగా, పొదుగు యొక్క వెనుక చనుమొనలు ముందు చనుమొనల కంటే చాలా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి.

  1. వ్యాధికి అనుకూలించే పరిస్థితులు
    • తొలి ఈత గేదెలు : ఈ వ్యాధి ప్రధానంగా మొదటిసారి ఈనిన తొలి ఈత గేదెల్లోనే ఎక్కువ శాతం కనిపిస్తుంది. పెయ్యలు ఈనడానికి ముందే శరీరంలో నిద్రాణంగా ఈ వైరస్‌ను కలిగి ఉండి, ఈత తదుపరి ఒత్తిడి వల్ల వ్యాధి బారిన పడతాయి. సాధారణంగా ఈనిన మొదటి రెండు నెలల కాలంలోనే అత్యధిక కేసులు నమోదవుతాయి.
    • ఈత ఒత్తిడి మరియు హార్మోన్ల మార్పులు: ఈనే సమయంలో కలిగే తీవ్ర శారీరక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు మరియు ఈత సమయంలో వచ్చే పొదుగు నీటి వాపు వంటివి శరీరంలో దాగి ఉన్న హెర్పెస్ వైరస్‌ను తిరిగి క్రియాశీలకం చేస్తాయి.
    • చలికాలం: సంవత్సరంలోని ఇతర కాలాల కంటే ఉష్ణోగ్రతలు తగ్గే చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత, ప్రాబల్యం మరియు వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటాయి.
    • వ్యాప్తి కారకాలు: వ్యాధి సోకిన పశువుల నుండి ఆరోగ్యకరమైన పశువులకు పాలు పితికే మనుషుల చేతులు, క్రిమిరహితం చేయని పాలు పితికే పరికరాలు, కుట్టే కీటకాలు, వ్యాధిగ్రస్తు ఆబోతుల వీర్యం మరియు గాలి ద్వారా కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది.
  2. వ్యాధి దశలు మరియు లక్షణాలు
    వైరల్ మ్యామిలైటిస్ వ్యాధి గేదెల్లో కింది దశల్లో క్రమంగా తీవ్రమవుతుంది:
  3. ప్రారంభ దశ: వ్యాధి ప్రారంభంలో చనుమొనలు సాధారణ పరిమాణం కంటే 2 నుండి 3 రెట్లు పెద్దవిగా వాస్తాయి. చనుమొన చర్మం మందపడి మెరుస్తూ కనిపిస్తుంది. చనుమొన గోడల మందంలో 2 నుండి 5 మిమీ పరిమాణంలో గట్టి బిళ్ళలు లేదా వాపు బిళ్ళలు ఏర్పడతాయి. తీవ్రమైన నొప్పి వల్ల చనుమొన సాగే గుణాన్ని కోల్పోతుంది, దీనివల్ల పాలు పితకడం చాలా కష్టంగా మారుతుంది.
  4. తీవ్ర రూపం: ప్రారంభ బిళ్ళలు 48 గంటల్లో పగిలి లోతైన, మానని పుండ్లుగా మారతాయి. ముఖ్యంగా చనుమొన మరియు పొదుగు కలిసే సంధి స్థానంలో లోతైన పుండ్లు ఏర్పడతాయి. పుండు గడ్డకడుతున్న కొద్దీ దానిపై మందపాటి బ్లూ-బ్లాక్ పొక్కులు / మచ్చలు కమ్ముకుంటాయి.
  5. సంక్లిష్ట దశ: వ్యాధి ముదిరే కొద్దీ తీవ్రమైన కణజాల కుళ్ళుదల మరియు చర్మం నల్లబడి ఊడిపోవడం) జరుగుతుంది. చనుమొన కొంత భాగం ఊడిపోవడం జరుగుతుంది, తీవ్ర రూపంలో చనుమొన పూర్తిగా ఊడిపోయి కేవలం చనుమొన ద్వారం చుట్టూ ఉండే కణజాలం మాత్రమే మిగులుతుంది. చనుమొన ద్వారం సంకోచించి ఉంగరం వలె తయారై పాలు బయటకు రాకుండా మార్గం మూసుకుపోతుంది.
  6. సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపుకు, వైరల్ మ్యామిలైటిస్‌కు తేడాలు మరియు వ్యాధి నిర్ధారణ
    వైరల్ మ్యామిలైటిస్ వ్యాధిని సాధారణ బ్యాక్టీరియల్ పొదుగు వాపు నుండి వేరు చేయడానికి పాలు మరియు క్లినికల్ పరీక్షలు కీలకమైనవి:

లక్షణము / పరీక్ష : పాలు

సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపు (Bacterial Mastitis): పాలు విరిగిపోవడం, రంగు మారడం, చీము లేదా నీళ్లలా రావడం జరుగుతుంది

వైరల్ మ్యామిలైటిస్ (Viral Mammillitis): పాలు శుభ్రంగా, సాధారణ రంగు మరియు చిక్కదనంతో ఉంటాయి

లక్షణము / పరీక్ష : పాలు నిర్ధారణ పరీక్షలు
సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపు (Bacterial Mastitis): CMT పాజిటివ్; pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ మరియు సోమాటిక్ సెల్ కౌంట్ (SCC) గణనీయంగా పెరుగుతాయి

వైరల్ మ్యామిలైటిస్ (Viral Mammillitis): CMT నెగిటివ్; pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ మరియు సోమాటిక్ సెల్ కౌంట్ (SCC) సాధారణంగా ఉంటాయి

లక్షణము / పరీక్ష : వ్యాధి ప్రభావిత స్థానం
సాధారణ బ్యాక్టీరియా పొదుగు వాపు (Bacterial Mastitis): పొదుగు లోపలి గ్రంథి కణజాలాన్ని దెబ్బతీసి పాల ఉత్పాదనను, గుణ గణాలను మార్చుతుంది
వైరల్ మ్యామిలైటిస్ (Viral Mammillitis): చనుమొన బయటి చర్మం, గోడలు మరియు ద్వారం కి మాత్రమే పరిమితమవుతుంది

CMT- కాలిఫోర్నియా మాస్టైటిస్ పరీక్ష

  1. సమగ్ర వైద్య చికిత్సా పద్ధతులు
    వైరల్ మ్యామిలైటిస్ నివారణ, ఉపశమనం మరియు పుండ్ల నివారణకు శాస్త్రీయ చికిత్సా ప్రోటోకాల్:
    • వైరస్ నిరోధక మందులు (Antiviral Drugs): హెర్పెస్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అసిక్లోవిర్ (Acyclovir) మందును నోటి ద్వారా (2 mg/kg), 5% లేపనం (ointment) రూపంలో పూయాలి మరియు చన్ను లోపలికి కూడా ఎక్కించాలి.
    • ఫైబ్రోసిస్ నివారణ & రోగ నిరోధక శక్తి పెంపు: చనుమొన ద్వారం గట్టిపడి గడ్డగా మారకుండా నిరోధించే యాంటీ-ఫైబ్రోటిక్ చర్య కోసం లిథియం యాంటీమోనీ థియోమలేట్ ఇంజెక్షన్ ఇవ్వాలి. పశువులో రోగ నిరోధక శక్తిని పెంచడానికి నోటి ద్వారా జింక్ సల్ఫేట్ (రోజుకు 2-3 గ్రాములు, 10 రోజుల పాటు), విటమిన్ E-సెలీనియం, మరియు లెవామిసోల్ వాడాలి.
    • చికిత్సా విధానాలు: వైరస్ నిరోధకత మరియు మద్దతు చికిత్సగా ఐవర్‌మెక్టిన్ ఇంజెక్షన్ (0.1 µg/kg) 10 రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వడం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనితో పాటు, హెర్పెస్ వైరస్ అధిక ఉష్ణోగ్రత వద్ద నశిస్తుంది కాబట్టి ఇన్‌ఫ్రారెడ్ ల్యాంప్ వెలుగు చికిత్స ద్వారా చనుమొనల భాగంలో ఉష్ణోగ్రతను పెంచి వైరస్ రెప్లికేషన్‌ను అరికట్టవచ్చు.
    • నొప్పి మరియు వాపు నివారణ: వాపు, తీవ్ర నొప్పుల నివారణకు మెలోక్సికామ్ (0.5 mg/kg) మరియు అలెర్జీ నిరోధానికి క్లోర్‌ఫెనిరమైన్ మాలిక్యులేట్ ఇంజెక్షన్లను వాడాలి.
    • వైరస్ వల్ల ఏర్పడిన పుండ్లపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకకుండా నిరోధించడానికి యాంటీబయోటిక్స్ (ఉదాహరణకు: ఎన్రోఫ్లోక్సాసిన్, సెఫ్ట్రియాక్సోన్) అందించాలి.
    • పుండ్ల శుభ్రత మరియు లేపనాలు: చనుమొనలపై గట్టిపడిన బ్లూ-బ్లాక్ పొక్కులను/సిబ్బెలను సర్జికల్ బ్లేడ్, సిల్వర్ నైట్రేట్ స్టిక్స్ లేదా కాపర్ సల్ఫేట్ ఉపయోగించి జాగ్రత్తగా శుభ్రం చేయాలి. వైరస్ క్లోరోఫామ్‌కు సున్నితమైనది కాబట్టి డిబ్రైడ్‌మెంట్ తర్వాత క్లోరోఫామ్ ద్రావణంతో కడగవచ్చు. అనంతరం పొవిడోన్-అయోడిన్ లేదా క్లోర్‌హెక్సిడైన్ టీట్ డిప్స్ ఉపయోగించి రోజూ చనుమొనలను క్రిమిరహితం చేయాలి.
  2. పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్వహణ పద్ధతులు
    వ్యాధిగ్రస్త పశువుల వేరుపాటు: వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులను వెంటనే మిగిలిన ఆరోగ్యకరమైన పశువుల నుండి వేరు చేయాలి. వ్యాధి సోకిన గేదెలకు అందరి కంటే చివర్లో పాలు పితకాలి.

పరిశుభ్రత & క్రిమిసంహారక చర్యలు: పాలు పితకడానికి ఉపయోగించే పరికరాలను మరిగే నీటిలో లేదా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. పాలు పితికే ముందు, పితికిన తర్వాత అయోడోఫోర్ లేదా క్లోర్‌హెక్సిడైన్ ద్రావణాలలో చనుమొనలను ముంచడం తప్పనిసరి.

కీటకాల నివారణ: పశువుల పాకల్లో ఈగలు, దోమలు మరియు కుట్టే కీటకాలను నివారించేందుకు క్రిమిసంహారక స్ప్రేలు ఉపయోగించాలి. కీటకాలు వైరస్‌ను ఒక పశువు నుండి మరొక దానికి వేగంగా వ్యాపింపజేస్తాయి.

పశువుల కొనుగోలు జాగ్రత్తలు: కొత్తగా పశువులను కొనుగోలు చేసేటప్పుడు వాటి పొదుగు మరియు చనుమొనలను నిశితంగా పరిశీలించాలి. గతంలో ఈ వ్యాధి సోకి తగ్గిన పశువుల చనుమొనలపై తెల్లటి/రంగు మారిన మచ్చలుఉంటాయి. అటువంటి పశువులను లేదా పుండ్లు ఉన్న పశువులను కొనుగోలు చేయకూడదు.

డా.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, పశువైద్యశాల, నందిమండలం, కడప జిల్లా. Ph: 9618499184