పశువుల్లో గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్)

దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణనష్టం అంతగా ఉండదు. ఎద్దులు వ్యవసాయ పనులు సరిగా చేయవు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

వ్యాధి ఎలా వస్తుంది?
వ్యాధి సోకిన ఆవులు, గేదెల పాలద్వారా దూడలకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

  • జ్వర తీవ్రత 104-106 డిగ్రీల ఫారెన్‌హీట్ పెరిగి పశువులు నీరసించి పోతాయి.
  • పశువుల నోటిలో, చిగుళ్ళపై పొక్కులు ఏర్పడటం చేత పశువుల మేత, నీరు తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుండి చొంగకారుతూ ఉంటుంది.
  • నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 3, 4 వారాల్లో బొబ్బలు చితికి పుండ్లుగా మారి చర్మము గరుకుగా తయారవుతుంది.
  • పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
  • గిట్టలలో పుండ్లు ఏర్పడటం వలన ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవు.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి.
  • పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
  • వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను, గడ్డితో కాల్చివేయాలి.
  • చనిపోయిన పశువును, సున్నపు గోతిలో పూడ్చాలి
  • వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు త్రాగించకూడదు.
  • మార్చి – ఏప్రిల్ మరియు ఆగస్టు – సెప్టెంబరు మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

చికిత్స:

  • కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా నీమ్‌లెంట్, వేపనూనె పూయాలి.
  • నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి.
  • డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.

కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150

Read More

పశువులకు బీమా ఎందుకు అవసరం?రైతు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

“పశువు రైతుకు కేవలం ఒక జీవి కాదు… అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి.”
ఒక రైతు తన ఇంట్లో రెండు లేదా మూడు పాలిచ్చే పశువులను పెంచుకుంటున్నాడని అనుకుందాం. ప్రతిరోజూ వచ్చే పాల ఆదాయం ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, పశువుల మేతకు కొంత అండగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ పశువు అనారోగ్యంతో మరణిస్తే లేదా ప్రమాదానికి గురైతే? పశువును కోల్పోవడంతో పాటు, రైతు కుటుంబానికి వచ్చే రోజువారీ ఆదాయం కూడా ఆగిపోతుంది.

ఇలాంటి అనుకోని ఆర్థిక నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయడానికి పశువుల బీమా (Livestock Insurance) ఎంతో ఉపయోగపడుతుంది.

పశువుల బీమా అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే, పశువులకు బీమా అనేది అనుకోని ప్రమాదాల వల్ల పశువును కోల్పోయినప్పుడు రైతుకు ఆర్థిక రక్షణ కల్పించే వ్యవస్థ.

రైతు నిర్ణీత ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకుంటాడు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా చేసిన పశువు మరణించినప్పుడు, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా సంస్థ రైతుకు పాలసీలో నిర్ణయించిన పరిహారాన్ని అందిస్తుంది.

అంటే, బీమా పశువును తిరిగి తీసుకురాదు. కానీ పశువును కోల్పోయిన తర్వాత రైతు కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

పశువులకు బీమా ఎందుకు అవసరం?

  1. పశువు రైతుకు ఒక పెట్టుబడి
    ఒక మంచి పాలిచ్చే ఆవు లేదా గేదెను కొనుగోలు చేయడానికి రైతు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తాడు. పశువు ద్వారా పాలు, దూడలు, పేడ వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
    అందువల్ల పశువు ఒక ఉత్పాదక ఆస్తి. ఈ ఆస్తిని అనుకోని నష్టం నుంచి రక్షించుకోవడానికి బీమా ఒక ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.
  2. అనుకోని ప్రమాదాలకు ఆర్థిక రక్షణ
    పశువులకు వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక ప్రమాదాలు ఎదురవుతాయి. రైతు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ప్రతి ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు.
    ఉదాహరణకు: పశువు మరణం → ఆస్తి నష్టం → పాల ఆదాయం నిలిచిపోవడం → కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి
    ఇలాంటి పరిస్థితుల్లో బీమా పరిహారం రైతుకు కొంత ఆర్థిక ఊరటనిస్తుంది.
  3. చిన్న రైతులకు మరింత ఉపయోగకరం
    పెద్ద రైతు ఒక పశువును కోల్పోయినా ఇతర పశువుల ద్వారా కొంత ఆదాయం పొందగలడు. కానీ ఒకటి లేదా రెండు పశువులపై ఆధారపడే చిన్న రైతు కుటుంబానికి ఒక పశువు నష్టం కూడా పెద్ద ఆర్థిక సమస్యగా మారవచ్చు. అందుకే చిన్న, సన్నకారు రైతులకు పశువుల బీమా ప్రత్యేకంగా ఉపయోగకరం.

ఏ పశువులకు బీమా చేయవచ్చు?
ప్రభుత్వ పథకాల మార్గదర్శకాల ప్రకారం బీమా పరిధిలో పాలు ఇచ్చే దేశీ/క్రాస్బ్రీడ్ పశువులతో పాటు కొన్ని ఇతర పశువులు కూడా ఉండవచ్చు. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, యాక్, మిథున్ వంటి పశువులు కూడా సంబంధిత నిబంధనల ప్రకారం పరిధిలోకి రావచ్చు. ప్యాక్ యానిమల్స్గా గుర్రాలు, గాడిదలు, మ్యూల్స్, ఒంటెలు, పోనీలు వంటి జంతువులు కూడా పథక పరిధిలో ఉండవచ్చు. అయితే ఏ జంతువుకు, ఏ పరిస్థితుల్లో, ఎంతవరకు బీమా అందుబాటులో ఉందో రాష్ట్రంలో అమలులో ఉన్న తాజా మార్గదర్శకాలు మరియు పాలసీ నిబంధనల ఆధారంగా తెలుసుకోవాలి.

బీమా ఎలా పనిచేస్తుంది?
రైతు ముందుగా బీమా చేయించాలనుకునే పశువును ఎంపిక చేసుకోవాలి. అనంతరం పశువుకు సంబంధించిన గుర్తింపు వివరాలను నమోదు చేసి, దాని విలువను నిర్ణయిస్తారు. ఈ వివరాల ఆధారంగా బీమా పాలసీ తీసుకుని, నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించాలి. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత, పాలసీ నిబంధనలకు లోబడి పశువుకు అనుకోని నష్టం సంభవించినట్లయితే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ లేదా అధికారికి సమాచారం ఇవ్వాలి. అనంతరం పశువైద్య లేదా బీమా సంస్థ ప్రతినిధులు అవసరమైన పరిశీలన, ధృవీకరణ చేపడతారు. రైతు క్లెయిమ్కు అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, బీమా సంస్థ క్లెయిమ్ను పరిశీలిస్తుంది. పాలసీ నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్ అర్హత పొందితే, రైతుకు నిర్ణయించిన పరిహారం చెల్లించబడుతుంది. అందువల్ల బీమా తీసుకోవడం మాత్రమే కాదు, పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

రైతు బీమా తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

  1. పశువు విలువను సరిగ్గా నమోదు చేయాలి
    బీమా తీసుకునే సమయంలో పశువు విలువను ఎలా నిర్ణయిస్తున్నారు? ఎవరు విలువను ధృవీకరిస్తారు? పాలసీలో ఎంత మొత్తానికి బీమా చేస్తున్నారు? వంటి విషయాలను రైతు వివరంగా తెలుసుకోవాలి.
  2. పశువు గుర్తింపు చాలా ముఖ్యం
    పశువును ఇతర పశువులతో గందరగోళం కాకుండా గుర్తించడానికి చెవి ట్యాగ్, ప్రత్యేక గుర్తింపు లేదా సంబంధిత అధికారిక గుర్తింపు విధానం ఉపయోగించవచ్చు. గుర్తింపు వివరాలు సరిగ్గా నమోదు చేయడం క్లెయిమ్ సమయంలో ఎంతో ముఖ్యమైనది.
  3. పాలసీ కాలాన్ని తెలుసుకోవాలి
    పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది? ఎప్పుడు పునరుద్ధరించాలి? అనే విషయాలను రైతు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత జాతీయ మార్గదర్శకాలు సాధ్యమైన చోట ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి బీమా చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
  4. ఏ నష్టాలకు పరిహారం వస్తుందో తెలుసుకోవాలి
    “బీమా ఉంది కాబట్టి ఏ కారణంతో పశువు చనిపోయినా డబ్బు వస్తుంది” అనుకోవడం సరికాదు. ప్రతి పాలసీకి కొన్ని నిబంధనలు, మినహాయింపులు (exclusions), క్లెయిమ్ విధానాలు ఉంటాయి.
    అందువల్ల పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు:
    • ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
    • ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు?
    • ఏ పత్రాలు అవసరం?
    • నష్టం జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి?
    • ఎంత సమయంలోపు సమాచారం ఇవ్వాలి?

పశువు మరణించినప్పుడు రైతు ఏం చేయాలి?
ఇది చాలా ముఖ్యమైన విషయం.
పశువు బీమా చేసిన తర్వాత అనుకోని కారణంతో మరణిస్తే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి/సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
అవసరమైన గుర్తింపు, పశువైద్య ధృవీకరణ, మరణానికి సంబంధించిన పత్రాలు, పాలసీ వివరాలు వంటి వాటిని నిబంధనల ప్రకారం సమర్పించాలి.
పశువు మరణించిన వెంటనే తొందరపడి మృతదేహాన్ని తొలగించడం లేదా అవసరమైన పరిశీలనకు అవకాశం లేకుండా చేయడం క్లెయిమ్ ప్రక్రియలో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ముందుగానే సంబంధిత అధికారుల సూచనలు తెలుసుకోవడం మంచిది.

“బీమా అంటే అదనపు ఖర్చు” అనే ఆలోచన సరైనదేనా?
• చాలామంది రైతులు, “పశువుకు బీమా చేయడానికి డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి?” అని అనుకుంటారు. కానీ దీన్ని మరో విధంగా ఆలోచించాలి.
• ప్రీమియం – రక్షణ కోసం చేసే చిన్న ముందస్తు ఖర్చు.
• పశువును పూర్తిగా కోల్పోయినప్పుడు కలిగే ఆర్థిక నష్టంతో పోలిస్తే, బీమా కోసం చెల్లించే రైతు వాటా తక్కువగా ఉండవచ్చు.
• అంతేకాదు, ప్రభుత్వ పథకాల కింద అర్హత ఉన్న రైతులకు ప్రీమియంపై సబ్సిడీ కూడా లభించవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పశుసంపద బీమా National Livestock Mission (NLM) లోని “Research & Development, Livestock Insurance, Extension and Innovation” ఉప-మిషన్లో భాగంగా కొనసాగుతోంది.

ప్రభుత్వ సహాయం గురించి రైతు తెలుసుకోవాల్సింది
ప్రస్తుత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పశుసంపద బీమాలో రైతు ప్రీమియం వాటాను తగ్గించే విధంగా ప్రభుత్వ సహాయం అందించే విధానం ఉంది. 2025–26 వార్షిక నివేదిక ప్రకారం, రైతు వాటా 15 శాతానికి తగ్గించబడింది, మిగిలిన 85 శాతం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దిష్ట నిష్పత్తిలో భరించే విధానం అమలులో ఉంది. అయితే పథకం అమలు, అర్హత, రాష్ట్ర స్థాయి ప్రక్రియలు మారవచ్చు కాబట్టి రైతులు తమ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వద్ద తాజా వివరాలు తెలుసుకోవాలి.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ ప్రయోజనం నిర్దిష్ట పరిమితిలోని పశువులకు వర్తిస్తుంది; ఆ పరిమితికి మించి పశువులకు బీమా చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో పూర్తి ప్రీమియం చెల్లించి బీమా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల “ప్రభుత్వం మొత్తం బీమా డబ్బు చెల్లిస్తుంది” అని భావించకూడదు.

బీమా తీసుకునే ముందు రైతు చెక్లిస్ట్
బీమా పాలసీ తీసుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి:
• నా పశువుకు బీమా అర్హత ఉందా?
• పశువు విలువ ఎలా నిర్ణయించారు?
• బీమా మొత్తం ఎంత?
• నేను చెల్లించాల్సిన ప్రీమియం ఎంత?
• ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందా?
• పాలసీ కాలం ఎంత?
• ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
• ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ రాదు?
• పశువు మరణిస్తే ఎవరికి సమాచారం ఇవ్వాలి?
• ఏ పత్రాలు అవసరం?
• క్లెయిమ్ ఎన్ని రోజుల్లో నమోదు చేయాలి?
• బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి సంప్రదింపు నంబర్ ఏమిటి?

బీమా ఒక్కటే రక్షణ కాదు
పశువులకు బీమా చేయడం మంచిదే. కానీ బీమా అనేది మంచి పశుపోషణకు ప్రత్యామ్నాయం కాదు.
పశువులను వ్యాధుల నుంచి రక్షించడానికి సమయానికి టీకాలు, సరైన పోషణ, పరిశుభ్రమైన నీరు, మంచి గాలి ప్రసరణ, సరైన మేత, శాస్త్రీయ ప్రజనన నిర్వహణ, సమయానుకూల పశువైద్యం అన్నీ అవసరం.
అదే విధంగా పశువుల ఆరోగ్య రికార్డులు, టీకాల వివరాలు, చికిత్స వివరాలు, కొనుగోలు వివరాలు వంటి వాటిని సురక్షితంగా భద్రపరచడం కూడా మంచిది.
ముగింపు
రైతు పశువును కేవలం “పశువు”గా చూడకూడదు. అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి. అది రైతు శ్రమకు ప్రతిఫలం. అది గ్రామీణ కుటుంబ ఆర్థిక భద్రతలో ఒక భాగం. అందుకే పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక రక్షణ కూడా అవసరం. అనుకోని ప్రమాదాన్ని మనం ఎప్పుడూ ఆపలేకపోవచ్చు. కానీ దాని వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
“పశువును కాపాడటం బాధ్యత…పశువు విలువను కాపాడటం తెలివైన ఆర్థిక నిర్ణయం.”
కాబట్టి రైతు సోదరులు తమ ప్రాంతంలో అమలులో ఉన్న పశుసంపద బీమా పథకాల గురించి సమీప పశువైద్య కేంద్రం, పశుసంవర్ధక శాఖ కార్యాలయం లేదా అధికారిక బీమా ప్రతినిధి వద్ద వివరాలు తెలుసుకుని, అర్హత ఉన్న పశువులకు బీమా రక్షణను పరిశీలించడం మంచిది.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 9703121088

Read More

వర్తులాకార ఆర్థిక వ్యవస్థ – ఎన్‌డిడిబి వారి మృదా

భారతదేశంలో పాడి పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నాడు డా. వర్గీస్ కురియన్- రైతుల భాగస్వామ్యం, సహకార సంఘాల ఏర్పాటు ద్వారా సుస్థిర భారత దేశ అభివృద్ధికి బీజం నాటారు. రైతుల సాధికారిత లక్ష్యంగా ప్రతి అడుగులో రైతుకు మార్గదర్శిలా నిలబడేలా జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డిడిబి) గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేస్తోంది. దీని ప్రభావంతోనే రైతు సాధికారిత, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగలగడం, బలీయమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పోషకాల పూరిత పాలను అందించడం, భావితరాలకు సుస్థిర భవిష్యత్తు ఇవ్వగలగడం సాధ్యమైంది.




ఎన్‌డిడిబి పాడిపరిశ్రమ అభివృద్ధిపరంగా 6 సంస్థలను ఏర్పాటు చేసింది.
  1. 1974లో మదర్ డెయిరీ ఏర్పరిచి, శుద్ధీకరించిన పాలను వినియోగదారులకు చేరుస్తోంది.
  2. ఇండియన్ ఇమ్యునోజికల్స్‌ను 1982లో పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాలను ఉత్పత్తి చేయడం, అంతేకాక, హెపటైటిస్‌లాంటి టీకాల ఉత్పత్తి చేయడం ద్వారా అటు పశువుల ఆరోగ్యం, ఇటు ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది.
  3. 1978లో ఐడిఎంసి ని ఏర్పరిచి, దేశీయ పరిజ్ఞానంతో పాడి పరిశ్రమ పరికరాల ఉత్పత్తి ప్రారంభించింది. దీనివలన భారత్, డెయిరీ ఇంజనీరింగ్ రంగంలో స్వయం సమృద్ధత సాధించగలిగింది.
  4. 2010లో ఎన్‌డిఎస్ (ఎన్‌డిడిబి డెయిరీ సర్వీసెస్) స్థాపించి, సంస్థాగత నిర్మాణం ద్వారా పాడి పరిశ్రమల్లో పాల ఉత్పాదకత పెంపుదలకు కృషి చేస్తోంది. ఇప్పటికే దేశంలో 210 పైగా పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడినాయి.
  5. 2022లో CALF (Centre for Analysis and Learning in Livestock and Food) ని ఏర్పరిచి, పాల నాణ్యతా పరీక్షలతో పాలనాణ్యతకు పెద్దపీట వేసింది.
  6. 2022లో MRIDA అనే సంస్థ ద్వారా పాడిపరిశ్రమలో వ్యర్థాలను పునరుపయోగంలో తెచ్చి పాడిరైతుకు వర్తులాకార ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేసేలా చేసింది. దీనిద్వారా పశువుల మల, మూత్రాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, సేంద్రియ ఎరువులు ‘సుధన’ పేర తెచ్చి పాడిపరిశ్రమలో కొత్త అధ్యాయం సృష్టించింది. పశువుల పేడ, పర్యావరణానికి పీడగా భావిస్తున్న తరుణంలో ఎన్‌డిడిబి, దీని పునరుపయోగం ద్వారా పాడిరైతులను సుస్థిర అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించగా, వెలిగిన ఆశాకిరణం ‘మృదా’. మార్చి 2025లో సుజుకి R & D సెంటర్‌తో చేతులు కలిపి భారత దేశంలో వీలైనన్ని బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ధ్యేయంగా ప్రయాణం ప్రారంభించింది. తొలుత పశువుల పాకలు, గోశాలల వద్ద బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, గుజరాత్‌లోని వాసనాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రోజకు 65-70 మెట్రిక్ టన్నుల పేడ సేకరించి, దానికి గాను రైతులకు రూ. 150 లక్షలు చెల్లించగలిగారు. దీనిద్వారా దగ్గరలోని డెయిరీలకు బాయిలర్లకు ఇంధన సరఫరా, సుమారు 250 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి చూపించారు. రూట్‌గార్డ్, గ్రోమాక్స్ లాంటి పశువు…పేడ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ‘సుధన’ పేర రైతులకు అందజేసారు. ‘గోబర్ సే సమృద్ధి’ ని సాకారం చేసి ‘కార్బన్ క్రెడిట్స్’ పొందగలిగేలా ఎన్‌డిడిబి కృషి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌డిడిబి, సస్టెయిన్ ప్లస్ అనే సంస్థ సహకారంతో 10000 ఇళ్ళలో 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తోంది. వివరాలకు జయేష్ చవాన్ – ఫోన్: 9405716326 ని సంప్రదించవచ్చు. దీని ధన లబ్ధిదారుని వాటాగా రూ. 11,262/-గా నిర్ధారించారు. ఏది ఏమైనా, దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎన్‌డిడిబి వివిధ సేవల ద్వారా పాడి రైతుల అభివృద్ధికి అవిరళ కృషి చేస్తోంది. ఆనంద్‌లోని ఎన్‌డిడిబి సంస్థను ప్రతి ఒక్కరూ సందర్శిస్తే, పాడిరైతుల కోసం సంస్థ చేస్తోన్న కృషి తెలిసి వస్తుంది. ఇప్పటికే ఎన్‌డిడిబి సహకారంతో విజయ తెలంగాణ డెయిరీ ERP సేవలను కొనసాగిస్తోంది. ఇంకెన్నో ఆవిష్కరణలతో ఎన్‌డిడిబి అగ్రగామిగా ఉండాలని ఆశిద్దాం!
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ డెయిరీ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

డెయిరీ రంగం చదువు – సవాళ్ళు

దొడ్ల డెయిరీ వారి విరాళం రూ. 6.5 కోట్లతో కామారెడ్డి డెయిరీ కళాశాలలో నూతన భవన నిర్మాణం జరిగి, దొడ్ల డెయిరీ సిఇఓ బివికె రెడ్డి, యండి సునీల్ రెడ్డి, పివి నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయ ఉపకులపతి జ్ఞాన ప్రకాశ్‌లచే ఇటీవల ప్రారంభించబడింది. డెయిరీ విద్యనభ్యసించిన మొదటి బ్యాచ్ నుండి విద్యార్థులు అందరూ పాల్గొని గురువులు నర్సింహారెడ్డి, రాజరత్నం, హన్మంతరావు, జయరాజరావు తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా డెయిరీ టెక్నాలజీ ఆలుమ్ని అసోసియేషన్ కామారెడ్డి (DTAAK) ఏర్పడింది.

కాగా, పూర్వ విద్యార్థుల మనోగతాన్ని పరిశీలించినపుడు, డెయిరీ - ఇప్పుడు కేవలం పాల ఉత్పత్తి, సేకరణ, శుద్ధీకరణ, విక్రయమే కాదు సాంకేతికంగానూ, విశ్లేషణపరంగానూ, సుస్థిరత దిశగా, వినియోగదారుని భద్రత, విశ్వవ్యాప్తంగా పోటీకి సంసిద్ధత అవసరం ఉందని తేలింది.

ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా విజ్ఞానం, నైపుణ్యం, అందిపుచుకోగల సామర్థ్యం అవసరం అని గుర్తించడం జరిగింది.

ప్రస్తుత కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, సెన్సర్స్, జినోమిక్స్, ప్రిసిషన్ ఫార్మింగ్, డిజిటల్ గుర్తింపు, అత్యాధునిక ఆహార శుద్ధీకరణ మరింత ముఖ్యం అని తేలింది.

పశువు ఆరోగ్య పర్యవేక్షణకు సెన్సర్ల ఉపయోగం, అలాగే ఆహార వినియోగం, పాల ఉత్పత్తి కోసం కృత్రిమ మేధ వినియోగం అవసరమవుతోంది. ఆటోమేటెడ్‌గా పాలను పితకడం పనితీరుని మెరుగు పరచగలవు. అందుబాటులో ఉన్న విషయాల విశ్లేషణ సరైన నిర్ణయాలు తీసుకోడంలో పనికొస్తాయి.

ఇప్పుడు తెలివి ఒకటే కాదు, సాంకేతిక పరిజ్ఞానం, వైజ్ఞానిక దృక్పథం, డిజిటల్ నైపుణ్యాలు, వాణిజ్యంపై అవగాహన, పౌరసంబంధాలపై పట్టు, నాయకత్వ లక్షణాలు సైతం డెయిరీ రంగ విద్యార్థులకు ఎంతో అవసరం. డిగ్రీ ఆధారితంగా కాకుండా పోటీ ప్రధానంగా విద్యావ్యవస్థ పెంపొందాలి.

ప్రస్తుత నీటికొరత, వాతావరణ మార్పులు వేస్ట్ మ్యానేజ్‌మెంట్, పశు సంక్షేమం, వనరుల సద్వినియోగం లాంటి పరిస్థితులకు అనుగుణంగా పాడిపరిశ్రమ అభివృద్ధి కావల్సిన అవసరం ఉంది. దాణా ఉపయోగంలో మెరుగుదల, వ్యర్థాల తగ్గింపు వ్యవసాయ వ్యర్థాల పునరుపయోగం, లాంటి చర్యలతో వర్తులాకార వాణిజ్యం వృద్ధి చేసి సుస్థిర ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది.

డెయిరీ రంగంలో ఔత్సాహికులకు అవకాశాలు అపారంగా ఉన్నాయి. విలువ జోడింపు, శీతలీకరణ, డెయిరీ ఫార్మ్ నిర్వహణ, పశుఆరోగ్యం, పశు ఆహారం, డెయిరీ పరికరాలు, డిజిటలైజేషన్, పాల నాణ్యత, ప్యాకింగ్, వ్యర్థాల వినియోగం, వినియోగదారులకు నేరుగా పాలు అందుబాటులో తేవడం లాంటి ఎన్నో రంగాల్లో డెయిరీ నిపుణులు తమ సత్తా చాటుకోవడానికి అవకాశాలున్నాయి.

ఔత్సాహికులుగా ఆలోచన, శాస్త్రవేత్తగా ఆవిష్కరణ, సమస్య పరిష్కార దిశగా పనిచేయడం నేటి అవసరం.

దానికై సాంకేతికంగా ముందడుగు వేసిన డెయిరీల్లో ఇంటర్న్‌షిప్ చేయించడం, పరిశ్రమ నిపుణులచే విషయ వివరణ, అతిథి ఉపన్యాసాలు అవసరం.

నేడు పాడిపరిశ్రమ రంగంతో డెయిరీ క్లాస్‌ రూం లు అనుసంధానం కావల్సిన అవసరం ఉంది.

ఏదిఏమైనా భవిష్యత్ పాడిపరిశ్రమ పాడిరైతులపైనా, పశువైద్యులపైనా, డెయిరీ పట్టభద్రులపైనా, శాస్త్రవేత్తలపైనా, నైపుణ్యంగల పనివారలపైనా ఆధారపడి ఉంటుంది.

దీనికై ప్రాక్టికల్ విషయ సంగ్రహణ, డిజిటల్ పోటీతత్వం, ఆవిష్కరణా దృక్పథం, జీవితాంతం నిరంతర పరిజ్ఞాన సేకరణ ఎంతో అవసరం.

రేపటి తరానికి డెయిరీ పట్టభద్రులు కేవలం ఉత్తీర్ణతే కాకుండా, నూతన ఒరవడికి నాంది పలకాలి.

నాటి సహకార ఉద్యమ స్ఫూర్తి, పాడిరైతుల పట్ల సానుభూతి, పరికరాల పట్ల పరిజ్ఞానం, వినియోగదారుని భద్రత దృష్టిలో ఉంచుకుని పాడి పట్టభద్రులు ‘పాడి పంట’ నానుడిని నిజం చేయాలి. రైతు కళ్లలో భద్రతతో కూడిన ఆనందం వెల్లివిరియాలి.
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ డెయిరీ, హైదరాబాద్. ఫోన్: 9121160553
Read More

“పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది”

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను తీరుస్తాయి.

ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా క్రి మినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్లు: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమిన్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యత: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నేపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది

  • పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
  • ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
  • అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
  • శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
  • పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
  • ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాన్ సన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
  • గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
  • మినరల్ మిక్చర్ ను నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
  • పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
  • వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
  • సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
  • మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
  • కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
  • సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
  • కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
  • పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
  • పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.
    అందువల్ల “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana, Assistant Professor
College of Veterinary Science, Korutla. Ph: 8096871067

Read More

రైతు క్షేత్ర మరియు గృహ సంబంధిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి బయోగ్యాస్ (గోబర్ గ్యాస్)

భారత దేశం బలమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ ఖ్యాతి పొందినది. కారణం భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా మరియు పరోక్షం గాను వ్యవసాయ ఆధారిత ఉత్పతుల ఎగుమతులు, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ మూలధనం అందేది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద ఎప్పుడూ స్ధిరంగా ఉండేది. ఇటు రైతులు మరియు వ్యవసాయ అనుబంధ కార్మికుల ఆర్థికపరమైన ప్రగతి పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కర్మాగారాలు ప్రారంభించి పెట్టుబడి పెట్టి ఇటు ఉపాది కల్పనతో పాటు మంచి ఆర్ధిక ప్రగతిని సాధించేవారు. అంతే కాకుండా వ్యవసాయానికి పశు సంపదకు సంబందం వీడదీయలేనిది. కావున పాల ఉత్పత్తుల సంస్దలను ఏర్పాటు చేసి పాడి రైతులకు చేయూత అందించి ఇటు పశు పోషణలో గణనీయమైన అభివృద్ది సాధించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యంలో చిక్కుకొని పోయి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఆర్ధిక పురోగతి దెబ్బ తిని ఆ దేశాల ప్రజలు విల విల లాడారు. అటు వంటి సమయంలో భారత ఆర్ధిక వ్యవస్ద దెబ్బ తినకుండా నిల్చొని ప్రపంచదేశాలకు ధీటుగా జవాబు ఇచ్చింది. దానికి ప్రధాన కారణాలు పైన పేర్కొన్న అంశాలే కానీ ప్రస్తుతం అంతా విరుద్ధంగా మారింది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించి ఎక్కువమంది పట్టణాల వైపు తరలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ వ్యయo పెరగడంతో పాటు నష్టాలు పెరగడంతో అధిక శారరిక శ్రమ, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారడం వల్ల పూర్తిగా విఫలమయింది. దీనికి తోడు రైతుకు చేదోడు వాదోడు వుండే పశుపోషణ వ్యవస్దను పూర్తిగా నిర్లక్ష్య పరచడం కూడా ఒక ప్రధాన కారణం. నేల ఫల శక్తికి మూల కారణం అయిన సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కేవలం పశుపోషణ ద్వారా సాధ్యం అయ్యేది, ఈ పశుపోషణ ద్వారా వచ్చే సేంద్రియ పదార్దం నేలను సుదీర్గకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. కానీ ప్రస్తుత రైతులు సేంద్రియ ఎరువులు పూర్తిగా వదిలేసి కేవలం వాణిజ్య రసాయనిక ఎరువుల పైనే చొరవ చూపడం వల్ల నేలలో సేంద్రియ పదార్దం స్థితిగతులు పూర్తిగా తగ్గిపోయి నేల జీవ శక్తి క్షీణించి రసాయనిక ఎరువుల వల్ల నేల కలుషిత మై బీడు భూములుగా మారి పోయాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు నిమిత్తం వృక్ష సంపద పైన మాత్రమే ఆధారపడే వారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతవాసుల వలే వంట గ్యాస్ కు పూర్తిగా అలవాటు పడినారు. ఒక వైపు శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే గ్యాస్ వాడుక వల్ల వాటి ధరలు పెరగడంతో పాటు ప్రక్క దేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్థితికి చేరగా శిలాజ ఇంధనాల తరుగుదల వలన, వివిధ దేశాల మధ్య యుద్ద వాతవరణాల వలన వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అందేలా మారి ఇటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు అదనపు భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అభివృద్దికి సహకరించే సేంద్రియ ఎరువుల అవసరాన్ని తీర్చి నేల సారాన్ని పెంచే అధిక ఖర్చులతో కూడిన గ్యాస్ వంట బదులుగా పంట సంబంధిత వ్యర్దాలను, మరియు పశు వ్యర్ధాలతో అవాయు పరిస్దితులలో కుళ్ళింప చేసి అటు వంటకు గ్యాస్ మరియు ఇటు పోలానికి సేంద్రియ ఎరువును అందించవచ్చు. ఏమిటి ఆ పక్రియ అంటే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారీ విదానం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమగు అవాయు పరిస్దితుల్లో పని చేసే డైజెస్టర్ 1859లో ముoబై నగరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ విదానం మొట్టమొదట జర్మన్ శాస్త్రవేత్తలు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బయోగ్యాస్ విధానాన్ని ఆధునికరణం చేసి సులభంగా వాడేలా చేశారు. ఒకప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తిలో అగ్ర స్ధానంలో జెర్మనీ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చైనా దానిని అధికమించి అగ్రగామిగా ముందుకు వెళుతుంది. దానికి కారణం ఆ విధానంలో వున్న అధిక ఉపయోగాలే. మన దేశంలో కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం బయోగ్యాస్ అభివృద్దికి అనేక పరిశోధనలు చేసి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంస్ద ద్వారా ప్రజలకు సలహలు, సూచనలు, అవగహన కల్పిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు.

  1. బయోగ్యాస్ ప్లాంట్ మొత్తం అన్నీ విభాగాలను చూపించే నమూనా పటం

బయోగ్యాస్ తయారీ విధానం మరియు ముఖ్య విభాగాలు : బయోగ్యాస్ తయారీలో ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాలు కలవు అవి ఒకటి వ్యర్ద పదార్థాలను సంగ్రహించే విభాగం, రెండవది వ్యర్ద పదార్థాలను అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేసి బయోగ్యాస్ ఉత్పత్తి జరిపే డైజెస్టర్

కలిపే విభాగం (సంగ్రహణ విభాగం) :  ఈ విభాగం డైజెస్టర్ కు ప్రక్కన ఉండే భాగం. ఈ విభాగం ద్వారా బయోగ్యాస్ తయారీ కి అవసరం అగు వివిధ వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్దలను లోపలకి వేసి అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేయడానికి పశువుల పేడ నాలుగు భాగాలు మరియు  ఐదు భాగాలు నీరు (4 : 5) కలిపి లోపలికి పోయాలి . ఈ విధంగా పోసిన (4 : 5)  నిష్పత్తి కలిపిన పశువుల పేడ మరియు నీరు డైజెస్టర్ల లో స్టార్టర్ పదార్దంగా పనిచేసి లోపలి వ్యర్ద పదార్థాలు మిధనోకోకస్, మిధనో బాసిల్లాస్ వంటి బ్యాక్టిరియా సూక్ష్మజీవుల వలన  అవాయు పరిస్ది తుల్లో కిణ్వవణ పక్రియ ద్వారా కుళ్ళింపజేసి మీథేన్ (బయోగ్యాస్)  విడుదల అగును. 
  1. ఒకటవ రకమైన కదిలే ఢ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  2. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  3. మూడవ రకమైన దీన బంధు బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం

డైజెస్టర్ : బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) తయారీలో ముఖ్యమైన ప్రధాన విభాగం డైజెస్టర్ లేదా పేర్మెంటర్. బయోగ్యాస్ విభాగంలో ఇది మధ్యన ఉండి బయోగ్యాస్ తయారీకి సహకరించే అత్యంత కీలక విభాగం. సాధరణంగా బయోగ్యాస్ తయారీలో వాడే డైజెస్టర్ లేదా పేర్మెంటర్ ను మూడు రకాలుగా వర్గీకరించారు, అవి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ అభివృద్ది పరిచినది. ఈ రకపు డైజెస్టర్ ముడి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడి పరిమాణం పరంగా మధ్యస్థంగా ఉండును. సాధారణంగా భారత దేశంలో ఈ రకపు డైజెస్టర్లు ఎక్కువగా వాడుకలో కలవు. ఈ డైజెస్టర్ కు ఉన్న గొప్ప లక్షణం ఎటువంటి నష్టం లేకుండా మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు.
సాధారణంగా ఈ డైజెస్టర్ నేలలో 3.5 నుంచి 6.5 మీటర్ల లోతు మరియు 1.2 నుంచి 1.6 మీటర్ల వ్యాసార్దం గుంతను తవ్వి అందులో అమర్చాలి. పైన పేర్కొన్న కొలతలు సామాన్యంగా వాడేవి. ఈ కొలతలను బయోగ్యాస్ పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బయోగ్యాస్ డైజెస్టర్ లో రెండు గదులు కలవు. అవి మిశ్రమ విభాగం ద్వారా వేసే వ్యర్ద పదార్థాలు, వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్థాలను కుళ్ళింప జేసె డైజెస్టర్ . రెండవ గది డైజెస్టర్ ను రంద్రాలు కలిగిన గోడ ద్వారా వేరు చేయబడి కిణ్వన పక్రియ పూర్తి అయి బయోగ్యాస్ విడుదల జరిగిన తరువాత మిగిలిన పదార్దం ఆ రంద్రాల ద్వారా బయటకు వచ్చి చేరుకొనును. దీనిని మనం సేంద్రియ ఎరువుగా పాడి పంటలకు వాడుకోవచ్చు. డైజెస్టర్ పై భాగం కొద్దిగా వంపుగా వుండి ప్రెజర్ వాల్వుని కలిగి ఉండి వాలు కలిగిన పైపు ద్వారా వంట గదికి అమర్చుకొని వంట గ్యాస్ గా వాడుకోవచ్చు. ఈ పక్రియలో మొదట మిశ్రమ విభాగం ద్వారా వేసిన వ్యర్ద పదార్థాలు 4: 5 నిష్పత్తిలో వేసిన పేడ మరియు నీరు మిశ్రమం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి అవాయు పరిస్దితుల్లో మీథేన్ వాయువు అణువులు విడుదల అయి వంపు కలిగిన డైజెస్టర్ పై భాగాన్ని డీ కొని తడనం చెందడం ద్వారా పీడనం పెరిగి అన్నీ అణువులు ఒకదానికొకటి కలిసి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ను విడుదల చేయును. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన జనతా రకం దీనిని చైనా దేశం వాళ్ళు అబివృద్ది పరిచినారు. దీనిని సాధరణంగా ఇటుక మరియు కాంక్రీట్ మిశ్రమంతో నేల లోపల నిర్మిస్తారు. ఇది పరిమాణం పరంగా పెద్దది ఎక్కువ బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును. దీని జీవన కాల పరిమితి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మూడవ డైజెస్టర్ రకం దీనబంధు బయోగ్యాస్ దీనిని 1984లో ఎ. ఎఫ్. పి. ఆర్. ఓ అను నూడిల్లీకి చెందిన ఒక స్వచ్చంధ సంస్ద అభివృద్ది పరిచింది. ఇది కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చితే సగం ధరలో తయారీ అగును. నిరుపేద ప్రజలకు భాగా అనుకూలం అగు డైజెస్టర్

బయోగ్యాస్ వలన కలిగే ఉపయోగాలు:

  • పశువుల పేడ మిశ్రమ ద్రావణం మరియు విచ్ఛిన్నం అగు వివిధ పదార్ధాల ద్వారా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను ఇంటి వంటకు వాడుకోవచ్చు
  • కాంతి కోసం వాడే లాంతర్లలో నింపుకొని వాడుకోవచ్చు
  • రైతులకు సేంద్రియ ఎరువు లోటుని తీర్చి కావలసినంత సేంద్రియ ఎరువును సమకూర్చి ఆర్ధిక భారాన్ని తగ్గించి నేల ఆరోగ్యానికి కాపాడుటలో సహయపడును
  • పశుపోషణ అభివృద్దికి ప్రత్యక్షంగా ఉపయోగపడును. ఎలా అనగా బయోగ్యాస్ తయారీకి వాడే వ్యర్ధ పదార్ధాలలో అధిక భాగం పశువుల వ్యర్ధాలను వాడుతున్నారు. అంతే కాకుండా స్టార్టర్ పదార్ధంగా కూడా పశువుల పేడను వాడుట గమనించదగ్గ విషయం
  • విచ్చిన్నం అగు వ్యర్ధ పదార్ధాలను కుళ్ళింపజేయుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుటలో ఉపయోగపడును
  • సాధారణ పశువుల ఎరువుతో పోల్చుకుంటే బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో ఎక్కువగా పోషకాలు ఉండును. అందులో నత్రజని (2-2.5 %), భాస్వరం ( 1.5%), పోటాషియం (1 %) .
  • బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో అధికంగా సేంద్రియ కర్బనం మరియు హ్యూమస్ ఉండి నేలలో వివిధ జీవరాశుల అభివృద్దికి దోహదపడును.
  • ఎటువంటి నష్టం లేకుండా ఉష్ణశక్తి మరియు విద్యుత్ శక్తి పునరుద్దరణకు సహకరించును.
  • శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి వాటి స్ధానంలో బయోగ్యాస్ వాడుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడును.
  • వాయు కాలుష్యాన్ని తగ్గించి హరితగృహ వాయువుల ఉద్గారాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించును.
  • మిగతా సేంద్రియ ఎరువులలాగా కాకుండా చెడు వాసన లేకుండా వుండును,
  • బయోగ్యాస్ ఈగలు మరియు దోమల పునరుత్పత్తిని తగ్గించును

బయోగ్యాస్ తయారీలోన అధిగ మించవలసిన సవాళ్లు :

  • బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అనగా డైజెస్టర్ మరియు సంగ్రహణ విభాగం తయారీ అధిక ఖర్చులతో కుడికున్నది.
  • ప్రతి రోజు పశువుల పేడ మరియు ఇతర విచ్ఛిన్నం అయ్యే వ్యర్ధాలు సేకరణ శ్రమతో పాటు స్వల్ప ఆర్ధికపరమైన ఇబ్బందితో కూడుకున్నది.
  • సాధారణ వంట గ్యాస్ తో పోల్చుకుంటే బయోగ్యాస్ తక్కువ శక్తి కలిగిన ఇంధనంగా ఉపయోగపడును
  • ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్లయితే బయోగ్యాస్ తయారీకి చాలా ఎక్కువ సమయం తీసుకొనును.
  • బయోగ్యాస్ ను తయారీ దగ్గర మాత్రమే వాడుకోవాలి. దీని నిల్వ మరియు రవాణా అధిక వ్యయంతో కూడుకున్న అంశాలు
  • బయోగ్యాస్ తో పాటుగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్పేట్ వంటి వాయువులను వాడుకకు ముందు తొలగించాల్సిన అవసరం తప్పనిసరి
  • బయోగ్యాస్ ప్లాంట్ కు తగిన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల మీధేన్ వాయువు బయటకు విడుదల వలన హరిత వాయువుల మోతాదును పెంచడంతో పాటు మండే లక్షణం ఉండుట వలన అగ్ని ప్రమాదాలకు కారణం అగును
  • నైపుణ్యం కలిగిన వ్యక్తుల పర్యవేక్షణ మరియు శిక్షణ కలిగిన వ్యక్తులు ఉండి తగిన యాజమాన్య పద్దతులు పాటించుట వలన బయోగ్యాస్ తయారీలోని అవరోధాలను అధిగమించవచ్చు.

బయోగ్యాస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. 60 ఘనపు అడుగులు లేదా 2 మీటర్3 పరిమాణం కలిగిన బయోగ్యాస్ తయారీకి రోజుకి కనీసం 45-55 కేజీల పేడ అవసరం అంటే దీని కోసం 5 ఆవులు లేదా 5 గేదెలు అవసరం
  2. మానవ విసర్జన పదార్ధాలను (నైట్ సాయిల్) రోజుకి 60 కేజీలు హోటల్స్ మరియు హాస్టల్స్ , ప్రజల మరుగుదొడ్డి నుంచి సంగ్రహించి కూడా బయోగ్యాస్ తయారు చేయవచ్చు.
  3. ఒక పశువుల పేడే కాకుండా పందుల, కోళ్ళ విసర్జక పదార్దలను కూడా బయోగ్యాస్ తయారీలో వాడవచ్చు.
  4. బయోగ్యాస్ తయారికీ వాడే డైజెస్టర్ కి సూర్యరశ్మి సరిపడ తగిలేలా చూసుకోవాలి దీనివలన డైజెస్టర్ అంతర భాగంలో కిణ్వన ప్రక్రియ త్వరగా జరిగి ఇటు మీధేన్ వాయువు తయారీలో మరియు సేంద్రియ ఎరువు తయారీలో ఎంత గానో ఉపయోగపడును,
  5. బయోగ్యాస్ ప్లాంట్ కు మరియు వంట గదికి మధ్య దూరం 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
  6. బయోగ్యాస్ ప్లాంట్ ను మరియు వంట గదిని కలిపే పైపును కొద్దిగా వాలుగా వుండేటట్లు చూసుకోవాలి.
  7. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు గట్టిగా ఉండే నేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
  8. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు వాడే నేలలో నీటి ముంపు లేకుండా చూసుకోవాలి.
  9. బయోగ్యాస్ డైజస్టర్ ఇనుముతో తయారీ చేసినది అయితే అది త్రుప్పు పట్టకుండా రంగును వేసుకోవాలి.
  10. శీతకాలంలో డైజస్టర్ లో ఉష్ణ నష్టం జరగకుండా నివారించుటకు పైన వరి గడ్డి వేసుకోవాలి.
  11. పేడ ద్రావణం మరియు ఇతర పదార్థాల ద్వారా డైజెస్టర్లోనికి ఇసుక చేరకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
  12. భాగా కుళ్లిన ఎక్కువ మొలాసిస్ ను శీతకాలంలో వేయరాదు, ఎందుకు అనగా దీని వలన సరిగా మండని బయోగ్యాస్ విడుదల అగును.
  13. అరటి మరియు గుర్రపు డెక్కలను 5 – 10 సెం,మీ కత్తిరించుకొని సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  14. నీలగిరి లేదా యూకలిప్టస్ ఆకులను 5 రోజులు నీటిలో నానబెట్టిన మిశ్రమాన్ని పేడ ద్రావణం వేయడానికి ముందుగా వేసుకోవాలి.
  15. విచ్ఛిన్నం అగు గృహ మరియు ఇతర వ్యర్ధ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికుని, వరి మరియు అరటి కాండం ముక్కలను పశువుల పేడ ద్రావణంతో కలిపి సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  16. పశువుల పేడ ద్రావణం మిట్ట మధ్యాహ్నం డైజస్టర్ లోకి సంగ్రహణ విభాగం ద్వారా పంపుకోవాలి.
  17. ఉదయం మరియు సాయంత్రం బయోగ్యాస్ విడుదల అగు గొట్టం ద్వారా దేని సహయంతో నైనా డైజస్టర్ లోపలి భాగంలోని చెత్తను 50 సార్లు బాగా కలుపుకోవాలి. దీనివలన డైజెస్టర్ లో పేరుకు పోయిన తెట్టును సులభంగా తొలగించి బయోగ్యాస్ విడుదలకు సహకరించును. పై విధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు బయోగ్యాస్ తయారీ విధానాన్ని అనుసరించుట వలన ఇంటికి కావలసిన వంట గ్యాస్ అందించుట తో పాటు రైతుకు కావల్సిన సేంద్రియ ఎరువు అందించుట వలన నేల ఆరోగ్యాన్ని కాపాడుటతో పాటు బయోగ్యాస్ తయారీకి పశువుల ఎరువు పశువుల నుంచి సంగ్రహించుట ద్వారా పశుపోషణ ప్రోత్సహించి రైతులు ఆర్ధికంగా ప్రగతికి ఉపయోగపడుతూ పరిసరాలలో వ్యర్ద పదార్దాల కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఈ విధంగా రైతుకు అన్నీ రకాలుగా చేయూతను ఇవ్వడం వలన బయోగ్యాస్ ను రైతు క్షేత్ర మరియు గృహ సంబందిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి అని పిలవడంలో అతిశయోక్తి లేదు.

టి. రాజశేఖర్, సిహెచ్. సీత రామ లక్ష్మి, ఎ. శీరిష, ఎమ్. చారుమతి, ఎన్ . భారతి, టి. శ్రీలత, ఎమ్. ముకుందరావు
వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి
ఫోన్: 6304852859

Read More

పశువైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) వినియోగం: భవిష్యత్ పశుసంవర్ధకానికి నూతన దిశ

పరిచయం
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) నేటి కాలంలో పశువైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. పశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల ముందస్తు గుర్తింపు, పాల ఉత్పత్తి పెంపు, సంతానోత్పత్తి నిర్వహణ, మేత నిర్వహణ మరియు వ్యవసాయ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో AI కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో కూడా పశుపాలక రైతులు ఆధునిక సాంకేతికతలను స్వీకరిస్తూ అధిక ఉత్పాదకత మరియు లాభదాయకత సాధిస్తున్నారు. AI ఆధారిత పరికరాలు, సెన్సర్లు, మొబైల్ యాప్‌లు మరియు డేటా విశ్లేషణ వ్యవస్థలు పశుసంవర్ధక రంగాన్ని స్మార్ట్ వ్యవస్థగా మార్చుతున్నాయి.

పశువుల ఆరోగ్య పర్యవేక్షణలో AI
పశువుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతోంది. ప్రస్తుతం పశువుల మెడకు లేదా కాళ్లకు ధరించే స్మార్ట్ కాలర్లు మరియు సెన్సర్లు శరీర ఉష్ణోగ్రత, కదలికలు, మేత తీసుకునే సమయం మరియు విశ్రాంతి వ్యవధిని నమోదు చేస్తాయి. ఈ సమాచారాన్ని AI సాఫ్ట్ వేర్ విశ్లేషించి జ్వరం, మాస్టిటిస్, జీర్ణ సమస్యలు లేదా ఇతర వ్యాధుల సంకేతాలను ముందుగానే గుర్తిస్తుంది. తద్వారా రైతులు మరియు పశువైద్యులు వెంటనే చికిత్స చర్యలు చేపట్టగలుగుతారు.

వ్యాధుల నిర్ధారణలో కృత్రిమ మేధస్సు
ఇటీవలి కాలంలో AI ఆధారిత మొబైల్ అప్లికేషన్లు పశువుల ఫోటోలు, వీడియోలు మరియు లక్షణాలను విశ్లేషించి సంభావ్య వ్యాధులను సూచిస్తున్నాయి. చర్మ వ్యాధులు, కుంటితనం (Lameness), మాస్టిటిస్, శ్వాసకోశ వ్యాధులు మరియు ఇతర అంటువ్యాధులను గుర్తించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. కొన్ని దేశాల్లో ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ మరియు ప్రయోగశాల పరీక్షల ఫలితాలను AI ద్వారా విశ్లేషించి వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ధారణ చేస్తున్నారు.

సంతానోత్పత్తి నిర్వహణలో AI
పాడి పశువులలో ఈస్ట్రస్ (Heat) గుర్తించడం రైతులకు ప్రధాన సవాలు. ప్రస్తుతం AI ఆధారిత సెన్సర్లు మరియు యాక్టివిటీ మానిటరింగ్ పరికరాలు పశువుల ప్రవర్తనలో మార్పులను గుర్తించి సరైన కృత్రిమ గర్భధారణ (AI) సమయాన్ని సూచిస్తున్నాయి.
దీని వల్ల:
• గర్భధారణ శాతం పెరుగుతుంది.
• ఖాళీ రోజులు తగ్గుతాయి.
• పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
• రైతుల ఆదాయం పెరుగుతుంది.

పాల ఉత్పత్తి పెంపులో AI
ఆధునిక డెయిరీ ఫార్ములలో AI ఆధారిత మిల్కింగ్ సిస్టమ్స్ వినియోగంలోకి వస్తున్నాయి. ఈ వ్యవస్థలు ప్రతి పశువు పాల ఉత్పత్తి, పాల నాణ్యత, కొవ్వు శాతం మరియు ఆరోగ్య స్థితిని నమోదు చేస్తాయి.

AI విశ్లేషణ ద్వారా:
• అధిక ఉత్పత్తి చేసే పశువులను గుర్తించవచ్చు.
• పోషకాహార లోపాలను అంచనా వేయవచ్చు.
• పాల ఉత్పత్తిని మెరుగుపరచే సూచనలు పొందవచ్చు.

మేత నిర్వహణలో AI
పశువుల ఉత్పాదకతలో మేత కీలక పాత్ర పోషిస్తుంది. AI ఆధారిత ఫీడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు పశువు వయస్సు, బరువు, పాల ఉత్పత్తి మరియు శారీరక స్థితిని బట్టి సరైన మేత మిశ్రమాన్ని సూచిస్తాయి.

దీని వల్ల:
• మేత ఖర్చులు తగ్గుతాయి.
• పోషకాహార సమతుల్యత మెరుగుపడుతుంది.
• పాలు మరియు మాంస ఉత్పత్తి పెరుగుతుంది.

పౌల్ట్రీ రంగంలో AI
కోళ్ల పరిశ్రమలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. సెన్సర్లు మరియు కెమెరాల ద్వారా కోళ్ల కదలికలు, ఆహార వినియోగం, నీటి వినియోగం మరియు ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తారు.

AI వ్యవస్థలు:
• వ్యాధుల ప్రారంభ సంకేతాలను గుర్తిస్తాయి.
• మరణాల రేటును తగ్గిస్తాయి.
• ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
• నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి.

డ్రోన్లు మరియు రోబోటిక్స్ వినియోగం
అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రోన్లు మరియు రోబోటిక్స్ పశుసంవర్ధక రంగంలో వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పెద్ద పశువుల మందలను పర్యవేక్షించడం, మేత భూముల పరిస్థితిని అంచనా వేయడం జరుగుతోంది. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు మానవ శ్రమను తగ్గించి పాల సేకరణను వేగవంతం చేస్తున్నాయి.

తాజా AI సాంకేతికతలు
ప్రస్తుతం పశువైద్య రంగంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన AI సాంకేతికతలు:

  1. స్మార్ట్ కాలర్లు మరియు వేర్‌బుల్ సెన్సర్లు
  2. AI ఆధారిత హీట్ డిటెక్షన్ సిస్టమ్స్
  3. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు
  4. AI వ్యాధి నిర్ధారణ మొబైల్ యాప్‌లు
  5. డ్రోన్ ఆధారిత పశు పర్యవేక్షణ
  6. ఆటోమేటిక్ ఫీడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్
  7. కంప్యూటర్ విజన్ ఆధారిత లేమ్‌నెస్ గుర్తింపు
  8. AI ఆధారిత పౌల్ట్రీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్

రైతులకు కలిగే ప్రయోజనాలు
• వ్యాధుల ముందస్తు గుర్తింపు
• చికిత్స ఖర్చుల తగ్గింపు
• పాలు, మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంపు
• సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుదల
• మేత వినియోగ సామర్థ్యం పెంపు
• శ్రమ మరియు నిర్వహణ ఖర్చుల తగ్గింపు
• అధిక ఆదాయం మరియు లాభదాయకత

ముగింపు
కృత్రిమ మేధస్సు పశువైద్య మరియు పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. వ్యాధుల ముందస్తు గుర్తింపు నుండి పాల ఉత్పత్తి పెంపు వరకు ప్రతి దశలో AI రైతులకు తోడ్పడుతోంది. భవిష్యత్తులో AI ఆధారిత సాంకేతికతల వినియోగం మరింత విస్తరించి, స్మార్ట్ పశుసంవర్ధక వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. రైతులు, పశువైద్యులు మరియు విస్తరణ సంస్థలు ఈ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా మరియు స్థిరంగా తీర్చిదిద్దవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్ : 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

“పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది”

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను తీరుస్తాయి.

ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా క్రి మినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్లు: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమిన్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యత: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నేపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది

  • పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
  • ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
  • అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
  • శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
  • పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
  • ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాన్ సన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
  • గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
  • మినరల్ మిక్చర్ ను నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
  • పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
  • వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
  • సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
  • మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
  • కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
  • సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
  • కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
  • పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
  • పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.
    అందువల్ల “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana, Assistant Professor
College of Veterinary Science, Korutla. Ph: 8096871067

Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More

పాడి పరిశ్రమకు కల్పతరువు: హైబ్రిడ్ ‘నేపియర్ బజ్రా గడ్డి ‘ సాగు!

పాడి పరిశ్రమలో విజయవంతంగా రాణించాలన్నా, నిలకడగా లాభాలు ఆర్జించాలన్నా మేత ఖర్చును తగ్గించుకోవడం అత్యంత ప్రధానమైన అంశం. సాధారణంగా ఒక పాడి ఆవు లేదా గేదె రోజువారీ ఖర్చులలో దాదాపు 60 నుండి 70 శాతం భాగం దాణా మరియు పశుగ్రాసానికే ఖర్చవుతుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి, పశువులకు ఏడాది పొడవునా పోషకాలతో కూడిన నాణ్యమైన పచ్చిమేతను అందించడంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి ఒక అద్భుతమైన వరంగా నిలుస్తుంది. సజ్జ (Pearl Millet / Bajra) మరియు నేపియర్ గడ్డి (Elephant Grass) జాతులను సంకరీకరణం చేయడం ద్వారా అభివృద్ధి చేసిన అద్భుతమైన, అత్యధిక దిగుబడినిచ్చే బహువార్షిక పశుగ్రాసమే ఈ హైబ్రిడ్ నేపియర్ బజ్రా గడ్డి. కింగ్ గ్రాస్, ఎలిఫెంట్ గ్రాస్ దీనిని తెలుగులో సజ్జ సంకర గడ్డి, లేదా గంటలగడ్డి అని పిలుస్తారు. ఈ పంట వేడి, తేమతో కూడిన వాతావరణంలో తగినంత వర్షపాతం లేదా నీటి పారుదల సౌకర్యం ఉన్నప్పుడు అత్యంత అద్భుతంగా పెరుగుతుంది. ఇది దాదాపు అన్ని రకాల నేలలకు అనుకూలించినప్పటికీ, నీరు నిలవని, మంచి సారవంతమైన బంకమట్టి లేదా ఒండ్రు నేలలు దీని సాగుకు అత్యంత అనువైనవిగా పరిగణించబడతాయి. ముఖ్యంగా నత్రజని ఎరువుల యాజమాన్యానికి ఈ పంట అద్భుతంగా స్పందిస్తూ, ఎక్కువ పిలకలు మరియు ఆకుల పెరుగుదలతో పాటు మొత్తం పశుగ్రాస దిగుబడిని గణనీయంగా పెంచుకుంటుంది. కేవలం పశుగ్రాసంగానే కాకుండా, గడ్డికి ఇతర పారిశ్రామిక మరియు పర్యావరణ ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే అధిక సెల్యులోజ్ కారణంగా దీనిని ఇథనాల్, బ్యూటానాల్ మరియు మిథేన్ వంటి జీవ ఇంధనాల (Biofuel) మరియు బయోఎనర్జీ ఉత్పత్తుల తయారీకి వాడుకునే సంభావ్యత ఉంది. అంతేకాకుండా, ఇది ఒక అద్భుతమైన ఫైటోరెమిడియేషన్ (Phytoremediator) జాతిగా గుర్తించబడింది. ఇది నేలలో పేరుకుపోయిన భార లోహాలు మరియు కొన్ని రకాల రసాయన కాలుష్య కారకాలను సమర్థవంతంగా గ్రహించి, కలుషితమైన నేలలను శుద్ధి చేయడంలో పశువుల రంగానికి మరియు పర్యావరణానికి ఎంతగానో దోహదపడుతుంది.

సాధారణంగా భారతదేశంలో ఈ గడ్డిని మార్చి మధ్య నుండి ఆగస్టు చివరి వరకు నాటుతారు. అయితే గరిష్ట పచ్చిగ్రాస దిగుబడి మరియు ఎక్కువ కోతలు సాధించడానికి మార్చి మధ్యలోనే నాటడం పూర్తి చేయడం ఉత్తమం. ఇలా ముందుగా నాటడం వల్ల వేసవి తీవ్ర ఉష్ణోగ్రతలు రాకముందే పంట స్థిరపడి, సుదీర్ఘమైన, ఉత్పాదక పెరుగుదల కాలాన్ని కలిగి ఉంటుంది. ఆలస్యంగా నాటితే పెరుగుదల కాలం తగ్గి, నవంబర్ నాటికి కేవలం ఒక కోత మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత శీతాకాలపు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా పంట సుప్తచేతనావస్థ (dormant phase) లోకి ప్రవేశించి పెరుగుదల నిలిచిపోతుంది. నాటిన సుమారు మూడు నెలల తర్వాత, పంట తగినంత ఎత్తుకు వృద్ధి చెందినప్పుడు (సుమారు ఒక మీటర్) మొదటి కోతకు సిద్ధమవుతుంది. ఆపై వాతావరణం, నేల సారం, నీటి లభ్యతను బట్టి ప్రతి 45-50 రోజుల విరామంలో తదుపరి కోతలు చేపట్టవచ్చు. పశువులకు కనీస పోషక అవసరాలను (maintenance ration) అందించడమే పచ్చిగ్రాస సాగు యొక్క ప్రాథమిక లక్ష్యం. ఒకవేళ పంటను చాలా ఆలస్యంగా కోస్తే, అందులో పీచు మరియు లిగ్నిన్ శాతం పెరిగి జీర్ణశక్తితో పాటు పశుగ్రాస నాణ్యత, మాంసకృత్తుల (crude protein) స్థాయిలు తగ్గిపోతాయి. అందువల్ల, సరైన పోషక విలువలు మరియు రుచి సమతుల్యత కోసం పంటను సుమారు 1 మీటర్ ఎత్తులో లేదా సిఫార్సు చేసిన కోత వ్యవధిలో కోయడం ఎంతో ముఖ్యం. ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలకు పచ్చిగ్రాసంగా ఉపయోగపడటంతో పాటు, కట్-అండ్-క్యారీ పద్ధతి, సైలేజ్ మరియు హే తయారీ, మృత్తిక పరిరక్షణ మరియు ఫాడర్ బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఏడాది పొడవునా పశుగ్రాస కొరతను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

హైబ్రిడ్ నేపియర్ రకాలైన APBN 1, CO-4 మరియు CO-5 లు వాటి అసాధారణ పచ్చిగ్రాస దిగుబడికి విస్తృతంగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ పశుగ్రాసం యొక్క అసలు పోషక విలువ మరియు జీర్ణశక్తి అనేది అది కోసే దశ మరియు ఎత్తుపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. పంటను చాలా ఆలస్యంగా కోస్తే, అందులో పీచు (fiber) మరియు లిగ్నిన్ (lignin) శాతం పెరిగి, జీర్ణశక్తితో పాటు క్రూడ్ ప్రోటీన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనికి విరుద్ధంగా, సరైన పెరుగుదల దశలో అనగా సాధారణంగా 1 మీటర్ ఎత్తులో లేదా సిఫార్సు చేసిన కోత వ్యవధిలో (50-60) కోయడం వల్ల దిగుబడికి మరియు పోషక నాణ్యతకు మధ్య సరైన సమతుల్యత లభిస్తుంది; ఇది ముఖ్యంగా క్రూడ్ ప్రోటీన్ పరిమాణాన్ని, మేత రుచిని (palatability) మరియు పశువులు తినే శాతాన్ని మెరుగుపరుస్తుంది.అందువల్ల, సకాలంలో నాటడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం మరియు సరైన కోత వ్యవధులను పాటించడం ద్వారా, హైబ్రిడ్ నేపియర్ గడ్డి స్థిరమైన పశుగ్రాస ఉత్పాదక వ్యవస్థలలో అత్యంత ఉత్పాదకత కలిగిన, పోషక సమర్ధవంతమైన మరియు నమ్మకమైన పచ్చిగ్రాస పంటగా ఉపయోగపడుతుంది. ఇందులో 8–12% ముడి మాంసకృత్తులు, 25-35% ముడి పీచు మరియు 55–60% జీర్ణమయ్యే పోషకాలు (TDN) ఉంటాయి. సమృద్ధిగా లభించే కాల్షియం, పశువులలో పాల ఉత్పత్తిని, ఎదుగుదలను మరియు పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీని రసభరిత స్వభావం మరియు మంచి రుచి కారణంగా పశువులు దీనిని ఇష్టంగా తింటాయి.

ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు
హైబ్రిడ్ నేపియర్ గడ్డిని ప్రధానంగా ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలకు పచ్చిమేతగా సాగు చేస్తారు. దీని అధిక గడ్డి దిగుబడి క్రింది వాటికి ఎంతో అనుకూలమైనదిగా చేస్తుంది:

  • పచ్చిగ్రాస ఉత్పత్తి
  • సైలేజ్ (పాతర గడ్డి) మరియు హే (ఎండుగ్రాసం) తయారీ
  • కట్-అండ్-క్యారీ (కోసి మేపడం) పద్దతి
  • మృత్తిక పరిరక్షణ మరియు నేల కోత నివారణ
  • ఫాడర్ బ్యాంకులు (గ్రాస నిధి) మరియు ఏడాది పొడవునా పశుగ్రాస సరఫరా

ఏడాది పొడవునా బహుళ కోతలను ఇచ్చే దీని సామర్థ్యం పశువులకు నిరంతర మరియు నమ్మకమైన పచ్చిగ్రాస సరఫరాను నిశ్చయపరుస్తుంది. దీర్ఘకాలిక లేదా రుతుసంబంధ పశుగ్రాస కొరతను ఎదుర్కొనే ప్రాంతాలలో ఈ గుణం పశువులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.భూమి తక్కువగా ఉండి సాంద్ర పద్ధతిలో (కొట్టాలలో వేసి మేపడం) ప్రాధాన్యత ఇచ్చే చిన్నకారు రైతులకు కోసి మేపే (cut-and-carry) పద్ధతి అత్యంత అనువైనది. ఈ విధానంలో కోసిన గడ్డిని పశువులు కాండం వదలకుండా పూర్తిగా తినేలా చేయడానికి చాపింగ్ (ముక్కలుగా కత్తిరించడం) చేయాలి. అలాగే, కోసిన ముక్కలను కొన్ని గంటల పాటు ఎండలో ఆరబెట్టడం (wilting) ద్వారా అధిక తేమ తగ్గి, రుచి పెరగడమే కాకుండా పశువులలో జీర్ణక్రియ మరియు స్వచ్చంద మేత వినియోగం మెరుగవుతాయి. ఈ పద్ధతిలో సాధారణంగా ప్రతి 6 నుండి 8 వారాల వ్యవధిలో కోతలు చేపడతారు. అయితే వేడి మరియు తేమతో కూడిన తీరప్రాంతాలలో సరైన నీరు, ఎరువుల యాజమాన్యం ఉంటే ప్రతి 4 వారాలకే వేగంగా కోతకు వస్తుంది. ఒకవేళ పొడి వాతావరణం లేదా నీటి ఎద్దడి ఉంటే పంట ఉత్పాదకత దెబ్బతినకుండా 2 నెలల వరకు వ్యవధి ఇవ్వడం మంచిది.

నియంత్రిత పద్ధతిలో పచ్చికబయళ్ల నిర్వహణ (Pasture utilization) కోసం కూడా ఈ గడ్డిని విజయవంతంగా ఉపయోగించవచ్చు. పశువులు అధిక పోషక విలువలు కలిగిన లేత ఆకులు, చిగుర్లను సమర్థవంతంగా తినేలా ప్రతి 6 నుండి 9 వారాల వ్యవధిలో నియంత్రిత పద్ధతిలో మేపడం (controlled grazing) చేయాలి. మేపిన తర్వాత నేలపై సుమారు 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు పంట మోడులను (residual height) ఉంచడం వల్ల తిరిగి వేగంగా పెరగడానికి మరియు కాండం గట్టిపడకుండా ఆకులు రావడానికి సహాయపడుతుంది. నిరంతర ఉత్పాదకత కోసం ప్రతి కోత లేదా మేపిన ప్రతి చక్రం తర్వాత ఎరువులు వేయడం మరియు ముదిరిన నిరుపయోగ కాండాలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా పచ్చికబయళ్ల నాణ్యతను స్థిరంగా ఉంచవచ్చు.
అధిక పచ్చిగ్రాస దిగుబడి కారణంగా ఈ గడ్డి ఎండుగడ్డి (Hay) మరియు పాతర గడ్డి (Silage) తయారీకి సైతం ఎంతో అనుకూలమైనది. నాణ్యమైన ఎండుగడ్డి కోసం గడ్డి 1.5–2.0 మీటర్ల ఎత్తులో, పిలకకు 4-6 ఆకులు ఉన్నప్పుడే కోయాలి. దీనివల్ల కాండం లేతగా ఉండి జీర్ణశక్తి బాగుంటుంది. కోసిన తర్వాత సహజ సూర్యరశ్మిలో లేదా మెకానికల్ డ్రైయర్ల ద్వారా సమానంగా ఎండబెట్టడం వల్ల బూజు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. మరోవైపు, సైలేజ్ తయారీలో ఈ గడ్డిలో ఉండే అధిక తేమ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ల (WSC) వల్ల కిణ్వ ప్రక్రియలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనిని అధిగమించడానికి గడ్డిని సైలేజ్ చేసే ముందు కాసేపు ఆరబెట్టడం మరియు మొలాసిస్ (బెల్లం పాకం) లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ వంటి సైలేజ్ సంకలనాలను చేర్చడం ద్వారా కిణ్వ ప్రక్రియను పెంపొందించి, నాణ్యమైన సైలేజ్ ను ఏడాది పొడవునా నిల్వ చేసుకోవచ్చు.

సాగు పద్ధతులు
హైబ్రిడ్ నేపియర్ గడ్డి (Pennisetum purpureum x Pennisetum glaucum) అనేది భారతదేశంలో CO-3, CO-4, CO-5 మరియు సూపర్ నేపియర్ వంటి రకాలతో ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల వాతావరణ పరిస్థితులలో విస్తృతంగా సాగవుతోంది. ఇది ప్రాథమికంగా వేడి, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందే ఉష్ణమండల జాతి. ఈ పంట 25-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఉత్తమంగా పెరుగుతుంది. ఇది మంచు తదితర తీవ్ర చలి పరిస్థితులను అస్సలు తట్టుకోలేదు; ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 15 °C కంటే తగ్గినప్పుడు దీని పెరుగుదల గణనీయంగా మందగిస్తుంది. దీనికి పెరుగుదల కాలంలో సమానంగా విస్తరించిన సుమారు 800–1500 మి.మీ వార్షిక వర్షపాతం అవసరమవగా, పొడి వాతావరణ పరిస్థితులలో అనుబంధ నీటి పారుదలకు ఈ పంట చాలా అద్భుతంగా స్పందిస్తుంది. వేగవంతమైన పెరుగుదలకు తగినంత నేల తేమ అవసరమైనప్పటికీ, ఈ పంట నీటి నిల్వను అస్సలు తట్టుకోలేదు, కాబట్టి సరైన నీటి పారుదల వసతి కల్పించడం ఎంతో కీలకం. నిరంతర సూర్యరశ్మి పిలకల సంఖ్యను, పచ్చిగ్రాస దిగుబడిని పెంచుతుంది; నీడ ఉన్నచోట దీని ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుంది. పెరిగిన దశలో మొక్కలు పొడవుగా, రసభరితమైన కాండాలతో దట్టమైన ఆకులను కలిగి ఉండటం వల్ల అధిక గాలి వేగం ఉన్నప్పుడు పంట పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యస్థ గాలులు ఉండే ప్రాంతాలు లేదా గాలిని నిరోధించే చెట్లు ఉన్న పొలాలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి.
మంచు ప్రభావం తక్కువగా ఉండి, వేడి వాతావరణం ఉన్నంతవరకు ఇది సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తు వరకు బాగా పెరుగుతుంది. అయితే, 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలలో చల్లని ఉష్ణోగ్రతల వల్ల మొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గి దిగుబడి క్షీణిస్తుంది. ఉత్తర భారతదేశంలో (పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో) శీతాకాలపు నెలల్లో (డిసెంబర్-జనవరి) సంభవించే మంచు, సుదీర్ఘ చలి పరిస్థితులు నేపియర్ గడ్డికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఉష్ణోగ్రతలు 10 °Cకంటే తగ్గితే పంట పెరుగుదల పూర్తిగా మందగించి, ఆకులు మాడిపోవడం, కణజాల నష్టం మరియు పైభాగాలు ఎండిపోవడం జరుగుతుంది. తీవ్రమైన చలి వల్ల పిలకలు పాక్షికంగా చనిపోయి, శీతాకాలంలో పశుగ్రాస లభ్యత తగ్గుతుంది. నేల రకాల విషయానికి వస్తే, హైబ్రిడ్ నేపియర్ ఇసుక లోమ్ (sandy loam) నుండి ఒండ్రు నేలల వరకు విస్తృత శ్రేణి నేలల్లో పెరుగుతుంది. అయినప్పటికీ, సేంద్రీయ కర్బనం అధికంగా ఉండి, నీరు నిలవని, సారవంతమైన లోమ్ నేలలు అధిక దిగుబడికి అత్యంత అనువైనవి. ఇది 5.0–8.0 ( 5.5–7.5) pH పరిధిలో బాగా పెరుగుతుంది మరియు స్వల్ప ఆమ్ల లేదా మధ్యస్థ క్షార/ఉప్పు నేలలను తట్టుకోగలదు. కానీ అధిక ఉప్పు, తీవ్ర క్షార లేదా నీరు నిలిచే చౌడు నేలలు దీని సాగు కోసం పనికిరావు.

నేపియర్ గడ్డి సాగులో భాగంగా నాటడానికి ఒక నెల ముందు పొలంలో హెక్టారుకు 20–25 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు వేసి, రెక్కల నాగలితో దున్ని చదును చేయడం ద్వారా మట్టిని మెత్తటి పదునుకు తీసుకురావాలి; ఆ తర్వాత నేల మట్టానికి సుమారు 20 సెం.మీ ఎత్తులో, 90–100 సెం.మీ దూరంలో బోదెలు మరియు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నేపియర్ గింజలు చాలా చిన్నవిగా మరియు తక్కువ మొలక సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వాటిని ప్రజననానికే వాడతారు కాబట్టి,. వాణిజ్య సాగు కోసం దీనిని కాండం ముక్కలు (setts) లేదా వేర్లతో కూడిన పిలకల ద్వారా శాఖీయంగా ప్రవర్ధనం చేస్తారు. కాండం ముక్కలను నేరుగా నాటడం కంటే, మొదట నర్సరీలో పిలకలను పెంచి ఆపై ప్రధాన పొలంలో నాటడం (transplanting) ద్వారా పొలమంతటా ఏకరీతి పంటను సాధించవచ్చు, కానీ ఈ పద్ధతికి శ్రమ మరియు ఖర్చు ఎక్కువ అవుతుంది. మునుపటి పంట యొక్క వేర్లతో కూడిన మోడులను (rooted stubbles) విడదీసి కూడా నాటవచ్చు, అయితే వీటికి పిలకల బలానికి కొద్దిగా ఎక్కువ నత్రజని అవసరమవుతుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన, సులువైన పద్ధతి కాండం ముక్కలను ఉపయోగించడమే.

తెలంగాణలో వేడి వాతావరణం ప్రారంభమయ్యే మార్చి-ఏప్రిల్ నెలల్లో మరియు నైరుతి రుతుపవనాల రాకతో జూలై-ఆగస్టు నెలల్లో నాటడం మంచిది. ఈ సమయంలో 25-35 celsius అనుకూల ఉష్ణోగ్రతలు వేగంగా మొలకెత్తడానికి సహాయపడతాయి. దక్షిణ మరియు తీరప్రాంతాలలో, ఏడాది పొడవునా వాతావరణం వేడిగా ఉండటం వల్ల, తీవ్రమైన కరవు లేదా అధిక నీటి ముంపు లేని ఏ సమయంలోనైనా దీనిని నాటవచ్చు. నాటడానికి బాగా పెరిగిన మూడు కన్నులు/మొగ్గలు ఉన్న ఆరోగ్యకరమైన కాండం ముక్కలను ఎంచుకోవాలి. ప్రతి ముక్క పొడవు సుమారు 20–30 సెం.మీ ఉండాలి. సాధారణంగా వరుసల మధ్య 90-100 సెం.మీ మరియు వరుసలో మొక్కల మధ్య 50-60 సెం.మీ దూరం ఉండేలా బోదెలపై నాటాలి. ఇది అంతరకృషి పనులకు (కలుపు తీత, ఎరువులు వేయడం, నీటి పారుదల) వీలుగా ఉంటుంది. నేపియర్ కాండం ముక్కలను నేల ఉపరితలానికి సుమారు 45డిగ్రీల కోణంలో నాటాలి, దీనివల్ల 1-2 కన్నులు మట్టిలోపల వేర్లు రావడానికి మరియు 1-2 కన్నులు పైకి చిగురించడానికి వీలుంటుంది. ఇది నిలువుగా నాటడం కంటే ముక్కలు కుళ్లిపోకుండా కాపాడుతుంది. వేర్ల పిలకలను మాత్రం నిలువుగా నాటాలి. ఒక ఎకరానికి సుమారు 10,000 నుండి 12,500 కాండం ముక్కలు అవసరమవుతాయి. వీటిని సిద్ధం చేసిన కాలువలలో 7-8 సెం.మీ లోతులో నాటాలి.

పంట నాటిన మొదటి 45-60 రోజులు నేపియర్ గడ్డి నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి కలుపు పోటీని తట్టుకోలేదు. ఈ దశలో కలుపు నివారణ సరిగ్గా లేకుంటే దిగుబడి తగ్గుతుంది. కాబట్టి కలుపుని నివారించాలి. గుంటక తోలడం, చేతి కలుపు తీయడం మరియు మొదళ్లకు మట్టిని తోయడం ద్వారా వేర్లకు గాలి ఆది, పిలకలు వేగంగా వస్తాయి. మట్టిని తోయడం వల్ల మొక్కలు పడిపోకుండా యాంత్రిక మద్దతు లభిస్తుంది. ఆచ్ఛాదనం (Mulching) ఆకులు అలములు కప్పడం) ద్వారా కూడా తేమను కాపాడి కలుపును అణచవచ్చు. తెగుళ్లు మరియు వ్యాధుల యాజమాన్యం విషయానికి వస్తే, కాండం తొలిచే పురుగు, చెదపురుగులు మరియు మిడతలు కాండం, వేర్లు మరియు ఆకులను దెబ్బతీస్తాయి. వీటిని లోతు దుక్కులు మరియు అవసరమైతే వేప ఆధారిత జీవ పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు మరియు కాటుక తెగులు వంటి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన కాండపు ముక్కలను వాడాలి మరియు వ్యాధి సోకిన భాగాలను వెంటనే తొలగించాలి. హైబ్రిడ్ నేపియర్ గడ్డి నాటిన సుమారు 3 నెలల (80-90 రోజులు) తర్వాత మొదటి కోతకు సిద్ధమవుతుంది. తదుపరి కోతలను మొక్కల పెరుగుదలను బట్టి ప్రతి 45–55 రోజుల వ్యవధిలో చేపట్టవచ్చు. సగటున ఏడాదికి 5 నుండి 7 కోతలు పొందవచ్చు. సాధారణంగా హెక్టారుకు సగటున 2500–3500 క్వింటాళ్ల పచ్చిగ్రాస దిగుబడి వస్తుంది, అయితే సరైన యాజమాన్య పద్ధతులు మరియు ఎరువులు వాడితే 4000 క్వింటాళ్ల/హెక్టారు వరకు దిగుబడి సాధించవచ్చని పరిశోధనా ఫలితాలు వెల్లడించాయి. కోతను ఎల్లప్పుడూ నేలకు దగ్గరగా కోయాలి, ఇది తదుపరి మోడుల పెరుగుదలకు మరియు ఎక్కువ పిలకలు రావడానికి సహాయపడుతుంది. ముదిరిన గడ్డి పీచుగా మారిపోతుంది కాబట్టి లేత రసభరిత దశలోనే కోయాలి. స్థిరమైన ఉత్పాదకత కోసం నేపియర్ గడ్డిని ఒకే పొలంలో 5–6 సంవత్సరాల వరకు ఉంచవచ్చు, ఆ తర్వాత దాని స్థానంలో వేరే పంటను మార్చాలి.

నేపియర్ గడ్డిలో కరిగే మరియు కరుగని రెండు రూపాల ఆక్సలేట్లు ఉంటాయి, ఇవి ముఖ్యంగా లేతగా,వేగంగా పెరుగుతున్న మొక్కలలో మరియు అధిక నత్రజని ఎరువులు వేసి పెంచిన వాటిలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థలో క్యాల్షియంతో బంధాన్ని ఏర్పరుచుకుని, శరీరం శోషించుకోలేని కరుగని క్యాల్షియం ఆక్సలేట్గా మారతాయి,

తద్వారా మొత్తం ఖనిజాల సమతుల్యతను దెబ్బతీస్తాయి (Nasution et al., 2025). అధికంగా ఆక్సలేట్లను తీసుకునే జంతు రక్తంలో క్యాల్షియం స్థాయిలు తగ్గడం (మిల్క్ ఫీవర్/పాల జ్వరం వలె),ఎముకలు బలహీనపడటం, ఎదుగుదల లోపించడం మరియు తీవ్రమైన సందర్భాలలో స్పటికాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. లేత మొక్కలు, అధికనత్రజని ఎరువుల వాడకం మరియు కరవు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం అత్యధికంగా ఉంటుంది.

హైబ్రిడ్ నేపియర్ గడ్డిలో ఆక్సలేట్ శాతాన్ని తగ్గించడానికి వివిధ రకాల సమర్థవంతమైన యాజమాన్యవ్యూహాలను అనుసరించవచ్చు. మొదటగా, పంటను సరియైన వయస్సులో, అంటే 45 నుండి 60 రోజుల మధ్య సరైన పెరుగుదల దశలో కోయడం ద్వారా ఆక్సలేట్ మరియు టానిన్ సాంద్రతలను అదుపులో ఉంచవచ్చు, ఎందుకంటే చాలా లేత మొక్కలలో ఈ యాంటీ- న్యూట్రిషనల్ కారకాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. కోసిన పశుగ్రాసాన్ని వాడబెట్టడం (wilting) మరియు ఎండబెట్టడం (sun-drying) వంటి పద్ధతులకు గురిచేయడం ద్వారా అందులోని కరిగే ఆక్సలేట్లను, హైడ్రోజన్ సయనైడ్ (HCN) ను గణనీయంగా తగ్గించవచ్చు. దీనితో పాటు, కిణ్వ ప్రక్రియ ద్వారా సైలేజ్ చేయడం (Ensiling) వల్ల ఆక్సలేట్ టానిన్లు మరియు ఫైటేట్ స్థాయిలు సమర్థవంతంగా తగ్గడమే కాకుండా పశుగ్రాసం యొక్క రుచి, జీర్ణశక్తి కూడా మెరుగుపడతాయి. పొలంలోఅధిక నత్రజని ఎరువులు వేయడం వల్ల ఆక్సలేట్ సాంద్రతలు పెరుగుతాయి కాబట్టి, సమతుల్య ఎరువుల వాడకం ద్వారా తగినంత పొటాషియం మరియు భాస్వరం అందిస్తూ ప్రతిపోషక కారకాలు( అనేవి ఆహారంలో సహజంగా ఉండే రసాయన పదార్థాలు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను జీర్ణం చేయడం, శోషించుకోవడం లేదా వినియోగించుకోవడాన్ని అడ్డుకుంటాయి. అందువల్ల ఆహారంలోని పోషక విలువ తగ్గుతుంది. ) పేరుకుపోవడాన్ని అదుపులో ఉంచాలి. పశువులకు మేతగా ఇచ్చేటప్పుడు సున్నం లేదా ఖనిజ మిశ్రమాల వంటి క్యాల్షియం వనరులను ఆహారంలో చేర్చడం ద్వారా ఆక్సలేట్ సంబంధిత లోపాలను అధిగమించవచ్చు. అలాగే, నేపియర్ గడ్డిని లూసర్న్, అలసందలు లేదా మునగ వంటిపప్పుధాన్యాల పశుగ్రాసాలతో కలిపి ఇవ్వడం వల్ల ఆక్సలేట్ వంటి ప్రతిపోషక కారకా ల సాంద్రత తగ్గడమే కాకుండా, పశుగ్రాసంలో ప్రొటీన్ మరియు ఖనిజాల శాతం పెరిగి పశువులకుమేలైన పోషకాలు అందుతాయి.

సి. హెచ్. రామకృష్ణ కె. సుష్మ, సి. హెచ్. శివప్రసాద్, పి. అమరేశ్వరి, మరియు టి. రఘునందన్
పశుగణ క్షేత్ర సముదాయ, పశువైద్య కళాశాల
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం. ph: 7989269600

Read More