పాడి పశువుల ఉత్పాదక శక్తి పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పాడి పశువులలో ఎదను సరైన సమయంలో గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం అతి ముఖ్యమైనది. ఇలా చేయడం ద్వారా వలన ఈతల మధ్య వ్యవధి తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా కొనసాగుతుంది. యుక్త వయస్సు వచ్చిన ఆడ పశువుల్లో అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల వలన అసహజమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ స్థితిని ఎద అని అంటారు.
దేశవాళి పశువులు 3-4 సంవత్సరాల వయస్సులో ఎదకు వచ్చి 4-5 సంవత్సరాలలో మొదటి ఈత ఈనుతాయి. అదే సంకరజాతి పశువులు ఒకటిన్నర సంవత్సరం వయస్సులోపు ఎదకు వచ్చి 2-3 సంవత్సరాల వయస్సులో తొలి ఈత ఈనుతాయి. సాధారణంగా పశువులు 3 వారాలకొకసారి ఎదకు వస్తాయి. ఎద కాలం ఆవులలో 18-24 గంటలు, గేదల్లో 24-36 గంటలు ఉంటుంది. ఎద కాలంలోనే పశువులు సంపర్కానికి సిద్దంగా ఉండి మగ పశువుల్ని దాటనిస్తాయి.
పశువుల్లో ఎద లక్షణాలు:
ఎద కాలం సాధారణంగా మూడు థలుగా విభజించవచ్చును. మొదటి థలో మానం నుండి పలుచని తీగలు వేస్తుంది. రెండవ థలో మానం నుండి కోడిగ్రుడ్డు తెల్ల సొన లాగ చిక్కగా తీగలు వేస్తుంది. మూడవ థలో అండము విడుదలయి, వీర్య కణముతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. గేదేలలో కంటే ఆవులలో ఎద లక్షణాలు తేలికగా గుర్తించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రత్యేకించి గేదేలలో ఎద కాలం 8-12 గంటలు మాత్రమే ఉంటుంది.

గేదేలలో మూగ ఎద:
ఆవులలో లాగా గేదెలు ఎద లక్షణాలను స్పష్టంగా బహిర్గతం చేయలేక పోవడాన్ని మూగ ఎద అంటారు. గేదె మానం తెరచి చూస్తే లోపలి పొర ఎర్రగా ఉంటుంది. తీగలు తోకను, మానం పై అతుక్కొని ఆరిపోయి ఉంటాయి. గేదె అరుపు తక్కువ స్థాయిలో ఉంటుంది. మూగ ఎదను టీజర్ ఆంబోతు ద్వారా గుర్తించవచ్చు.
ఎదకు రాకపోవటం:
ఇది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఆలస్యంగా పొర్లుకు రావటం 2.ఈనిన తరువాత సకాలంలో ఎదకు రాకపోవటం* బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవుల బెడద, వ్యాధుల బారిన పడటం మరియు ఎక్కువ కొవ్వుపట్టిన పశువు ఎదకు సరిగా రాదు.* వేసవిలో అధిక వాతావరణ ఉష్ణోగ్రత, వడగాల్పు, గాలిలో అధిక తేమ శాతం ఉన్నప్పుడు పశువు ఎదకు రావటం కష్టం.* పశువు శరీరంలో కాపర్, కోబాల్ట్, మాంగనీస్ మొదలైన ముఖ్యమైన ఖనిజాలు లోపించడం* పుష్టికరమైన ఆహరం లోపించడం, విటమిన్ ‘ఎ’ లోపించడం, అండాశయంలో కాయతో పాటు ఇతర లోపాలు ఏర్పడటం, వ్యాధుల బారిన పడటం, పశువు ముసలిది కావటం, పుట్టుకతోనే కొన్ని లోపాలు సంక్రమించడం, అండాశయం సక్రమంగా వృద్ది చెందకపోవటం.
పశువు సకాలంలో ఎదకు రావాలంటే….
* పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెంచుటకు మేపు చాలా ముఖ్యం. పచ్చిగడ్డి కొరత నివారించటానికి సైలేజ్ గడ్డిని తయారుచేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి.
* బాహ్య పరాన్నజీవులు,అంతర పరాన్నజీవులను నిర్మూలించాలి.
* అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల నుండి పశువుల్ని సంరక్షించాలి. పశువు పై నీళ్ళు చల్లుతూ శీతల పరిస్థితిని కల్పించాలి.
* పశుపోషకుడు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు (ఈనిన 45 రోజుల తరువాత) పరిశీలిస్తే ఎదలోని పశువుల్ని సులభంగా గుర్తించవచ్చును.
* మూగ ఎద, బలహీనమైన ఎదల సమస్యలు ఉన్న పశువులకు ప్రతిరోజు 500-1000 గ్రాముల మొలకెత్తిన ఉలవలు, శనగలు, గోధుమలను వంటి ధాన్యాలను 20-30 రోజులు మేపాలి.
* గర్భకోశ వ్యాధులకు తగిన వైద్యం చేయించి ఫలితాలు పొందాలి వైద్యం చేసిన తరువాత కూడా చూడి కట్టించడం లేకపోయినచో పశువును మంద నుండి తొలగించాలి.
* విటమిన్ ఏ, డి, ఇ లను ఇంజక్షన్ రూపంలోనూ, కాపర్, భాస్వరం, జింక్, సెలీనియం మొదలగు ఖనిజ లవణాలను మినరల్ మిక్సర్ రూపంలో రోజుకు 50 గ్రాములు అందించాలి.
* ఎక్కువ కొవ్వు పట్టిన గేదెకు/ఆవుకు సరిపోను వ్యాయామం కల్పిస్తే చాలు చురుకుగా తయారయ్యి పశువులు ఎదకు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.
* పశువు ఈనడానికి రెండు మాసాలు ముందు నుండి పాలు పితకడం మాని వేసినచో ఈనిన తర్వాత ఎదకు తొందరగా రావచ్చును. సైక్లోమిన్ బిల్లలను వారానికి ఒకటి చొప్పున పశువులు ఎదకు వచ్చేంతవరకు ఇవ్వాలి. జెనోవా లేక ప్రజానా మందులను రోజుకు మూడు చొప్పున రెండు రోజులు వాడాలి.
* పశువు ఈనిన తర్వాత మొదటి సారి 11 నుండి 17 రోజుల్లో ఎదకు వస్తాయి కానీ ఆ రెండవ సారి 35 నుంచి 45 రోజుల్లో ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిస్తే 90% పశువుల్లో చూడి నిలిచే అవకాశాలు ఉంటాయి.
* పశువులలో హార్మోన్ లోపాలు ఉన్నవని గ్రహించినచో హార్మోన్లు వాడి పశువులను ఎదకు తేవచ్చును.
* పశు గర్భకోశ ద్వారంలోకి లుగాల్స్ అయోడిన్ పంపించి అండాశయాన్ని సున్నితంగా మర్దించి చురుకుగా తయారు చేయించినచో పశువు ఎదకు రావచ్చును.
ఎదలో ఉన్నప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* రైతులు తమ పశువు ఎద లక్షణాలను గుర్తించి సరైన సమయంలో గర్భధారణ చేయించినచో సకాలంలో గర్భం ధరించి, తిరిగి సకాలంలో పాల ఉత్పత్తి మొదలవుతుంది.
* పశువు ఈనిన 45 రోజుల తర్వాత వచ్చే మొదటి ఎదలో గర్భధారణ చేయించినచో చూడి నిలిచే శాతం అధికంగా ఉంటుంది. గర్భధారణ చేయించిన తరువాత 17 నుండి 26 రోజుల మధ్య క్రమం తప్పకుండా పశువును జాగ్రత్తగా పరిశీలించి తిరిగి ఎదకు వచ్చినదీ లేనిది నిర్ణయం తీసుకొని, అవసరమైనచో తిరిగి గర్భధారణ చేయించాలి.
* రైతులు పశువు మొదటి ఎదకాలం జాగ్రత్తగా గమనించి వెంటనే గర్భధారణ చేయించడం మంచిది.* మూగ ఎదకు వచ్చిన పశువులలో ఎద మామూలు కాలం కన్నా ఎక్కువ కాలం ఉండవచ్చును అందుచేత రెండవసారి ఇన్సెమినేషన్ చేయించవలసి వస్తే చేయించాలి.
* కొన్ని పశువులలో ఎద36 గంటలు దాటి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉండవచ్చును. కనుక గర్భధారణ చేసిన తర్వాత పశువును మూడు నుంచి నాలుగు రోజులు జాగ్రత్తగా గమనించి అవసరమైనచోతిరిగి గర్భధారణ చేయించాలి.
* 10 నుండి 15 శాతం పశువులు ఎక్కువగా గేదేలలోను, సంకరజాతి పశువులలోను ఎదకు వచ్చిన 7 నుండి 10 రోజుల లోపు మళ్ళీ వస్తాయి (ఐచీజిరిశి నీలిబిశి). కనుక గర్భధారణ చేసిన ఏడవ రోజు నుండి పదవ రోజు వరకూ పశువును జాగ్రత్తగా పరిశీలించి అవసరమైనచో గర్భధారణ చేయించాలి.
* అరుదైన సందర్భాలలో 4 నుంచి 5 రోజులలో లేక ప్రతి వారం అస్తవ్యస్తంగా పశువులు ఎదకు వస్తాయి.
* కొన్ని సందర్భాలలో 3 నుంచి 5 నెలల చూడి కాలంలో పశువులు ఎదకు వస్తాయి. దీనిని చూడి ఎద అని అంటారు. గర్భధారణ చేయించకూడదు. రైతులు పశువుల ఎద లక్షణాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం సకాలంలో చూడి కట్టించుటకు ఇది చాలా అవసరం.
* గర్భధారణ ఎద మధ్య థ నుండి చివరి థ వరకు చేయించవచ్చు. ఈ థలో చూడి కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
* పశువు అరవగానే వీర్య దానం చేయించరాదు. ఎద మొదలైన 12 గంటల తర్వాత గర్భధారణ చేయించాలి అనగా ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఆరు గంటల తేడాతో రెండుసార్లు గర్భధారణ చేయిస్తే ఫలితాలు బాగుంటాయి.గేదేలలో ఎద కాలం 24 నుంచి 36 గంటలు ఉంటుంది. అది ఎదకు వచ్చిన 24 గంటల తర్వాత వీర్యదానం చేయించాలి అనగా ఉదయం ఎదకు వచ్చిన మేరకు మరుసటి రోజు ఉదయం సాయంత్రం వరకు వచ్చిన గేదెకు మరుసటి రోజు సాయంత్రం చూడి కట్టించాలి.చూడి కట్టించడం ఆలస్యం చేస్తే కట్టు నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి.
* సరైన సమయంలో గర్భధారణ చేస్తే 70 శాతం పశువులు మొదటి సారే చూడి కడతాయి.
* పశువులు ఎదకు రావడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ తక్కువగా ఉన్న సమయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి.

* సహజ సంపర్కం: ఒక ఆవునుగానీ, గేదెనుగానీ ఎదకు వచ్చినప్పుడు ఆబోతు చేతగాని/ దున్నపోతు చేతగాని దాటించి గర్భధారణ చేయడాన్ని సహజ సంపర్కం అంటారు. ఈ పద్ధతి పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పద్ధతి.
* కృత్రిమ గర్భోత్పత్తి : మేలు జాతి ఆబోతు వీర్యాన్ని పరికరాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఆడ పశువు గర్భకోశంలో సకాలంలో ప్రవేశపెట్టి గర్భం ధరించేటట్లు చేసే ప్రక్రియనే శాస్త్రీయ గర్భోత్పత్తి లేదా కృత్రిమ గర్భధారణ అంటారు.
కృత్రిమ గర్భధారణ లాభాలు :

* పాల దిగుబడులు పెంచుటకు అధిక పాల దిగుబడి ఇచ్చే మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి అనుసరించాలి.
* తక్కువ ఖర్చుతో జాతిని మెరుగుపరచి అధిక పాల దిగుబడి పొందవచ్చు.
* అధిక పాల సార కలిగిన ఆంబోతుల వీర్యాన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా తెచ్చుకొనవచ్చు.
* మినీ డెయిరీలలో ఆబోతు మేపటం ఖర్చుతో కూడుకున్న పని. గర్భధారణ వల్ల తక్కువ ఖర్చుతో చూడి కట్టించుకొనవచ్చు.
* కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆబోతులకు ఉండే సుఖవ్యాధులు లేదా ఆవులలోని గర్భకోశ వ్యాధులు, ఆంబోతుల ద్వారా ఇతర పశువులకు సంక్రమించకుండా నిరోధించవచ్చు.

గర్భధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
* ఎద లక్షణాలు కనిపించగానే పశువును వేరు చేసి కట్టి ఉంచాలి.
* తొలిసారి గర్భధారణ చేసే పడ్డలు/పెయ్యలు బాగా బలంగా ఉండి, తగిన ఎత్తు పెరిగి ఉండాలి. సుమారుగా ఆవు దూడలు 200 నుండి 250 కిలోల బరువు, గేదె దూడలు 250 నుంచి 300 కిలోల బరువు ఉంటే మంచిది.* ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే గర్భధారణ చేయించాలి.
* అనారోగ్యంగా ఉన్న పశువులకు, తగినంత బలంగా లేని పశువులకు, గర్భవాతం ఉన్న పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించరాదు.
* పాడి పశువులు వేసే తీగలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎద మధ్య థ నుండి చివరి థ వరకు పశువు మానం నుండి తీగలు బాగా వేస్తుంది. తీగలు తొడ పైన, తోకకు అంటుకొని మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో గర్భధారణ చేయించి మంచి ఫలితాలను పొందవచ్చు.
* ఇన్సెమినేషన్ చేసేముందు, చేసిన తర్వాత పశువుకు విశ్రాంతినిచ్చి బెదరకుండా చూడాలి. పశువును కొట్టడం, పరిగెత్తించడం చేయ కూడదు. ఉద్రేకానికి గురికాకుండా మూడు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* కృత్రిమ గర్భధారణ చేసే పశువును ఏకాంతంగా చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.
* వీర్యదానం చేయించగానే చల్లని నీరు శరీరంపై చల్లడం మంచిది.
* వీర్య దానం చేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకూ,15 నుంచి 26 రోజుల మధ్య, 38 నుంచి 48 రోజుల మధ్య పశువు ఎదకు వచ్చుచున్నది లేనిది గమనించాలి. ఎదకు రాకుంటే 60 రోజుల తర్వాత చూడి పరీక్ష చేయించాలి.
* కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ, పశువును తిరిగి ఎద గురించి పరిశీలించవలసిన తేదీలు, చూడి పరీక్షకు తీసుకువెళ్ళవలసిన తేదీలు రాసి పెట్టుకోవాలి.
టి. విజయ నిర్మల, శాస్త్రవేత్త, ఫోన్: 8121136184;
ఎ. దేవివరప్రసాద్‌రెడ్డి, శాస్త్రవేత్త,
కె. వెంకట సుబ్బయ్య, శాస్త్రవేత్త,
ఇ.కరుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త
బి. శ్రీనివాసులు, విస్తరణ సంచాలకులు,
కృషి విజ్ఞాన కేంద్రం, డా. వై.ఎస్.ఆర్, ఉద్యాన విశ్వవిద్యాలయం,
వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా.
