దేశం ‘అమృత్ కాల్’ దిశగా అడుగులు ముందుకు వేయాలని బృహత్తర కార్యక్రమం తీసుకుంటున్న సమయంలో స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటు. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల నుంచి వ్యవసాయ పరిస్థితులు తెలిసిన వ్యక్తి. శాస్త్రవేత్త. విధాన నిర్ణయాలలో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఎక్కలేని ఎత్తులు లేవు. కాలానికి దీటుగా భారత వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేసిన శాస్త్రవేత్త. అంతేకాదు వ్యవసాయ రంగ పరిశోధనలకు మార్గదర్శనం చేసిన క్రాంతదర్శి. వేలాది యువ పరిశోధకులకు మార్గదర్శి. లక్షలాది యువతకు ఆదర్శ మూర్తి. జీవించిన 98 సంవత్సరాలు దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఆరాట పడ్డారు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తూ వచ్చారు. ఇంతగా దేశ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి లేరంటే అతిశయోక్తికాదు. అరుదైన శాస్త్రవేత్త. అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల ఆవశ్యకత గురించి ఆలోచించవలసిన అవసరం, బాధ్యతను పరిశోధకులకు ఎరుకపరచిన వాడు. పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ విధానాలు రూపకల్పనలో భాగస్వామ్యం అందుకున్న శాస్త్రవేత్త. సమాజ హితమే పరిశోధకుల లక్ష్యం కావాలని హితవు పలికారు. దేశ ఆహార భద్రత నుంచి ఆకలి లేని భారత్ మీదుగా, పోషణ భద్రత కోసం అహరహం శ్రమించి జీవించిన అరుదైన శాస్త్రవేత్త. 75 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో అత్యంత ప్రభావశీలి అయిన శాస్త్రవేత్తగా డాక్టర్ ఎం.ఎస్. స్వామి నాథన్ నిలిచారు.

1947లో 38 కోట్ల జనాభాకి సరిపడ తిండి గింజలు పండించే పరిస్థితి దేశములో లేదు. ఆహార ధాన్యాల కొరత వలన 30% మంది ప్రజలు అర్ధాకలితో బ్రతికారు. స్వతంత్రము తరువాత. ఒక కంకి పండే మొక్క నుండి 5 కంకులు పండించాలి, అధిక దిగుబడి సాధించాలి అంటే హరిత విప్లవమే శరణ్యమని భావించి అప్పటి ప్రభుత్వ అధినేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. దీనికి నాయకత్వము చేపట్టి నేటి 145 కోట్ల మందికే గాక మరొక 50 కోట్ల జనాభాకి సరిపడ ఉత్పత్తి చేయగలిన స్థితిలో ఉన్నామంటే అది ఎం.ఎస్. స్వామి నాథన్ కృషి ఫలితమే.
ఇవన్నీ ఒక ఎత్తయితే పట్టుదలగా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఆరాటపడి మద్దతు ధరలతో అండగా ఉండాలని పాలకుల మీద ఒత్తిడి తెచ్చారు. రైతు నాయకులకు కార్యకర్తలకు సంఘీభావంతో కదిలిన ఘటనలు వారి జీవితంలో చూడవచ్చు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తగా, హరిత విప్లవ పితామహుడుగా డా.ఎం.ఎస్. స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన కృషి అందరికీ తెలిసిందే. అది చరిత్ర పుటలకెక్కింది. రైతుల కష్టాలకు కారణాలు, రైతుల ఆత్మహత్యల నివారణ, వ్యవసాయ ఉత్పాదకత, భూ సంస్కరణలు, నీటిపారుదల, రుణ సదుపాయం, పంటల భీమా, ఆహార భద్రత, ఉపాధి, తదితర అంశాలపై డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని ”నేషనల్ కమీషన్ ఆన్ ఫార్మర్స్” లోతైన అధ్యయనం చేసి, అత్యంత కీలకమైన సిఫార్సులతో నాటి యు.పి.ఏ. ప్రభుత్వానికి 2006 అక్టోబర్ 4న నివేదికను సమర్పించింది. 17 సంవత్సరాలు గడచిపోతున్నా ఆ నివేదికలోని రైతాంగం యొక్క ప్రయోజనాలతో ముడిపడిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా కనీస మద్దతు ధర (MSP)ను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేస్తే, డా. ఎం.ఎస్. స్వామినాథన్ గారికి ఘనమైన నివాళి అర్పించినట్లు కాగలదు.
ఇటీవలనే కొత్త పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. అమృత మహోత్సవం నేపథ్యంలో అమృత్ కాల్ దిశగా దూసుకుపోవాలని సెలవిచ్చారు. అమృత్ కాల్ భారతదేశం అంటే ఆత్మహత్యలు లేని రైతు భారతం. స్వయం సమృద్ది భారతం. పోషకాహార లేమి లేని ఆరోగ్య భారతం. ఇటువంటి భారతమే స్వామినాథన్ కలలు కన్నారు. ఆ కలల సాకారం చేద్దాం. దీనికోసం అందరం సమష్టి కృషితో సాగుదాం. ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేస్తూ స్వామినాథన్ కలలు కన్న నవ వ్యవసాయ భారత నిర్మాణానికి కదలటమే స్వామినాథన్‌కు నిజమైన నివాళి అని రైతునేస్తం విశ్వసిస్తోంది. ఆ ప్రయత్నంలో మా పరిధిలో మేము కూడా భాగస్వామ్యం అందుకుంటామని వినమ్రంగా తెలియజేస్తున్నాం.
– వేంకటేశ్వరరావు

