ధాన్యం సేకరణను రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేయాలని, మిల్లర్లు సహకరించని చోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించాలని తెలంగాణా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రాత్రి సివిల్ సప్లైస్ భవన్‌లో సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, నేరుగా … ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… ”రానున్న 10-15 రోజులు కీలకమైనవి. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలి. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములను సిద్ధం చేశాం. మిల్లర్లు సహకరించనిచోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించండి. ధాన్యం నిల్వకు, కస్టమ్ మిల్లింగ్‌కు అయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మిల్లర్లకు 100% బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉండగా… తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి 10 శాతమే పెట్టిందన్న విషయాన్ని రైస్‌మిల్లర్ల సంఘం అధ్యకక్షులు… మిల్లర్లకు తెలియజేయాలి. ఒకవేళ మనవద్ద మిల్లింగ్ సామర్థ్యానికి మించి కొనుగోళ్లు జరిగితే… మిగులు ధాన్యాన్ని కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు పంపించొచ్చు” అని సూచించారు. మిల్లర్లతో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను ఆదేశించారు.

9 Nov, 2024
