వాతావరణ ఆటుపోట్లు, పెట్టుబడి పాట్లు పీడిస్తున్న నేటి సాగు రంగంలో రైతులు నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అన్నీ బాగుంటే పండిన పంటకు ధర దక్కని దుస్థితి. ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా పంటల సాగుపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, జీవాలు, చేపలు, కోళ్ళ పెంపకాలను జోడిస్తే రైతులకు వివిధ రూపాలలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీనినే సమగ్ర వ్యవసాయం/సమీకృత వ్యవసాయం అంటారు. సమగ్ర వ్యవసాయంలో ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థ పదార్థం మరొక రంగానికి వనరులుగా ఉపయోగపడుతుంది. సమగ్ర వ్యవసాయంలో వచ్చిన పంట అవశేషాలు లేదా పశువుల పేడను కంపోస్టుగా వాడవచ్చు. అలాగే పాడి ఎక్కడైతే ఉందో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో ఎక్కువ పచ్చిగడ్డి లభిస్తున్నట్లయితే సైలేజ్ లేదా మాగుడు గడ్డి కూడా తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా రైతులు గ్రామాల్లో పశువుల పేడను, వ్యవసాయ వ్యర్థపదార్థాలను కుప్పలుగా వేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎండకు ఎండి వానకు తడిసి సహజ పోషకాలను కోల్పోతాయి.
రైతులు కొంత శ్రమపడి సేంద్రియ పదార్థాలను సేకరించి గుంటలో వేసి తగిన పరిస్థితులు కల్పిస్తే ఎరువుగా తయారవుతుంది. సాధారణ పరిస్థితుల్లో సేంద్రియ పదార్థాలు కుళ్ళటానికి చాలా నెలలు పడుతుంది. కుళ్ళే ప్రక్రియ చాలా త్వరగా జరగడానికి అనువైన పరిస్థితులను కల్పించడాన్ని కంపోస్టింగ్ అని అంటారు. ఇలా తయారైన ఎరువును కంపోస్టు అంటారు.
కంపోస్టింగ్‌కు అనువైన వ్యర్థ పదార్థాలు:
ఎండుగడ్డి / ఎండు ఆకులు / కలుపు మొక్కలు / గ్లైరిసీడియా కొమ్మలు / వివిధ (తర్వాత వచ్చిన) వ్యర్థ పదార్థాలు / కొమ్మల భాగాలు / పశువుల పేడ, గొర్రెల / కోళ్ళ పెంట, మూత్రములు / గోబర్ గ్యాస్ ప్లాంట్ స్లర్రీ మొదలైన వాటిని కంపోస్టు ఎరువు తయారు చేయడానికి వాడవచ్చు.
కంపోస్టు గుంట పరిమాణము: 5.25 మీ. þ 2 మీ. þ 1 మీ.
కంపోస్టింగ్ పద్ధతి:
- 5.25 మీ. పొడవు, 2 మీ. వెడల్పు, 1 మీ. లోతు గుంటలను పొలంలో ఒక మూల వీలయితే చెట్ల నీడలో త్రవ్వాలి.
- ఇలా త్రవ్విన గుంటలో నీరు నిలువకుండా సులభంగా ఇంకిపోవడానికి దిబ్బ అడుగున రాళ్లు, పెంకులు వంటివి 6 అంగుళాల మందము పరచాలి.
- సేకరించిన వ్యర్థ పదార్థాలను, చెత్తను 6 అంగుళాల మందం వరకు నింపి దానిపై పేడను, ఆపైన రాక్ ఫాస్ఫేట్ సుమారు 1 కిలో చిలకరించాలి. ఈ పద్ధతిన పొరలు, పొరలుగా వ్యవసాయ, పశువుల వ్యర్థ పదార్థాలపై రాక్ ఫాస్ఫేట్ చిలకరించి ఈ విధంగా భూమి మట్టానికి 1-2 అడుగుల ఎత్తు వరకు అమర్చిన తర్వాత అందులో తేమను పెంచటానికి నీటిని చిలకరించవలెను.
- ఆ తర్వాత గాలి సోకకుండా, మట్టి, పేడ మిశ్రమంతో పూత పూయవలెను.
- ఈ విధంగా చేసిన తర్వాత గుంతలో వేసిన సేంద్రియ పదార్థాలు కుళ్ళి సుమారు 75-90 రోజులలో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది.
- ఈ ప్రక్రియలో గుంతలో ఉత్పన్నమైన వేడికి (40-50 సెంటీగ్రేడ్) ఇందులోని హానికారక శీలీంద్రాలు, రోగకారక క్రిములు, కీటకాలు నశించును.
కంపోస్టింగ్ త్వరగా జరగడానికి అనువైన పరిస్థితులు పంట వ్యర్థ పదార్థాల ఎంపిక:
- కంపోస్టు త్వరగా 3 నెలలోపు తయారు అవ్వాలి అంటే కర్బన, నత్రజని మోతాదు తక్కువ ఉన్న వ్యర్థ పదార్థాలు ఎన్నుకోవాలి. కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్థాలలో తక్కువగా ఉంటే అవి త్వరగా కుళ్ళుతాయి.
- పంట వ్యర్థ పదార్థాలు బాగా చిన్నవిగా ఉంటే త్వరగా కుళ్ళుతాయి.
- గుంతలో ఎప్పుడూ తేమ తగినంత ఉండాలి. తేమ వలన కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెంది ఎరువును తయారు చేయడానికి దోహదపడతాయి. అందుకు దిబ్బపై నీటిని చిలకరిస్తుండాలి.
- ఎట్టి పరిస్థితులలోను కంపోస్టు గుంతలో నీరు నిల్వ ఉండకూడదు.
- సాధ్యమైనంత వరకు తేమ త్వరగా ఆరిపోకుండా కంపోస్టు గుంతను చెట్ల నీడలో వేసుకోవాలి.
కంపోస్టు వాడడం వల్ల లాభాలు
- నత్రజని, పొటాష్, భాస్వరం వంటి ప్రధాన పోషకాలే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింక్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు కూడా పంటకు అందుతాయి.
- పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అందువల్ల క్రిమినాశక మందులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది.
- యూరియా, డిఎపి, పొటాష్ వంటి ఎరువులు వాడనక్కర లేదు.
- కంపోస్టు వాడితే పంటకు నీరు తక్కువ పట్టి నీరు ఆదా అవుతుంది.
- పండిన పంట త్వరగా చెడిపోదు.
- నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు (సూక్ష్మ&క్రిములు) సంఖ్యను బాగా పెంచుతుంది. భూమికి సేంద్రియ కర్బనం లభిస్తుంది.
- కంపోస్టు ఎరువులోని జిగురు పదార్థాలు మట్టిని పట్టుకొని ఉండటం వల్ల మట్టికోత తక్కువగా ఉంటుంది.
- నేలలోకి గాలి బాగా వీచేలా, నీరు బాగా ఇంకేలా చేస్తుంది. నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది.
- ప్రతి ఏటా పంట దిగుబడి నిలకడగా ఉంటుంది.
- అలాగే పంట అవశేషాలు, ఆవుపేడ, డెయిరీ నుంచి వచ్చిన పెంటను ఉపయోగించి వర్మికంపోస్టును తయారు చేసుకోవచ్చును. వర్మికంపోస్టు 2 నెలలలో ఒక సైకిల్ పూర్తవుతుంది.
- పాడి ఉన్న ప్రదేశాల్లో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ సబ్సిడి మీద బయోగ్యాస్ ప్లాంట్‌ను నిర్మించి ఇవ్వటం జరుగుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ సైజ్ ఉండే పశువులను బట్టి అలాగే ఇంట్లో ఉండే మనుషులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 1 క్యూ.మీ. సైజు బయోగ్యాస్ ప్లాంట్‌కు 2 పాడి పశువులు అలాగే రోజుకి 25 కిలోల పేడ అనేది అవసరమవుతుంది. ఈ 25 కిలోల పేడను 25 లీ. నీటిలో కలిపి స్లర్రీ లాగా చేసుకోవాలి. బయోగ్యాస్ ప్లాంట్ ఇన్‌లెట్‌లో పొయ్యాలి. ఇలా చేసాక మనకి గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌ని వంట చేసుకోవడానికి వాడవచ్చు. అలాగే అవుట్‌లెట్‌ల నుంచి వచ్చే స్లర్రీని పొలాలకి వేయడం వలన నేల యొక్క సారవంతత గణనీయంగా పెరుగుతుంది. దాదాపు పశువుల పేడ కన్నా 3 రెట్లు నత్రజని ఈ బయోగ్యాస్‌లో ఉంటుంది.
- ఈ సమగ్ర వ్యవసాయంలో ఎక్కువగా పచ్చిగడ్డి లభిస్తున్నప్పుడు సైలేజ్/మాగుడు గడ్డి తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఉన్నప్పుడు వీటిని వాడవచ్చు. దీని తయారి కోసం మామూలుగా గుంత పద్ధతి అయినా అవలంభించవచ్చు. లేదంటే సైలో బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయి. సైలేజ్ అంటే పచ్చిగడ్డిని నిల్వ చేసుకోవడం. దీ
కంపోస్టింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- కుప్పలో వేడిమి 60-90 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు ఉండేలా చూసుకోవాలి.
- కంపోస్టు కుప్పలోని అన్ని భాగాలకు గాలి బాగా ఆడాలి.
- బెడ్‌లో వేసే వ్యర్థ పదార్థాలను 1-2 అంగుళాల సైజు ముక్కలుగా చేసి వేస్తే గాలి బాగా ఆడుతుంది.
- కంపోస్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి బెడ్‌లో ఉదజని సూచిక 6.5-7.5 మధ్యలో ఉండేట్లు చూసుకోవాలి.
డా. జె.డి. సరిత, డా. కె. కళ్యాణి, కె. సాధన (9940236076)
డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.

