అండమాన్ భూమి పుత్రిక ” కామాచ్చి చెల్లమ్మాళ్ “
చెల్లమ్మాళ్ చదివింది ఆరో తరగతే. కానీ వ్యవసాయంలో శాస్త్రవేత్తల్ని సైతం ఆకట్టుకొనే ప్రయోగాలు చేశారు.
సేంద్రియంగా కొబ్బరి సాగులో, పంటల యాజమాన్యంలో ఆమెది అయిదు థాబ్దాల అపారమైన అనుభవం ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన చెల్లమ్మాళ్ వందలాది రైతులకు స్ఫూర్తిప్రదాత.

దక్షిణ అండమాన్ ప్రాంతంలో ‘కామాచ్చి చెల్లమ్మాళ్’ అంటే ఎవరన్నట్టు చూస్తారు. కానీ ‘నారియల్ అమ్మ’ అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. రంగఛంగ్ గ్రామానికి చెందిన అరవయ్యేడేళ్ళ చెల్లమ్మాళ్ జీవితం మొత్తం కొబ్బరి తోటలతోనే పెనవేసుకుపోయింది. ఇక సాగు అనుభవం అయిదు థాబ్దాలకు పైనే. మొదట్లో పంటకు చీడపీడలు, సరైన దిగుబడి లేకపోవడం వల్ల ఆమె ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. భూమి సారం తగ్గిపోవడానికీ, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడానికీ కారణం రసాయనాల వాడకమేనని గ్రహించారు. ”రసాయనాల వాడకం వల్ల మట్టిలో సారం తగ్గిపోతుంది. అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మట్టిలో కోల్పోయిన పోషకాల్ని భర్తీ చెయ్యడం చాలా కష్టం. కాబట్టి రైతులందరూ సేంద్రియ సాగువైపు మళ్ళాలి” అంటారామె. మాటలకే పరిమితం కాకుండా… తన పది ఎకరాల పొలంలో వివిధ ప్రయోగాలను ఆమె చేపట్టారు. వర్షాకాలం తరువాత పొడిగా ఉండే వాతావరణంలో… మట్టిలో తేమ నిలవడం కష్టం. ఈ సమస్యను అధిగమించడానికి కొబ్బరాకులు, కొబ్బరి పీచును కుళ్ళబెట్టి, ఇతర ఆకులతో పాటు మట్టిని కప్పి ఉంచడం మొదలుపెట్టారు. మట్టిలో తేమ క్షీణించిపోకుండా నిలవడంతో పాటు కలుపు మొక్కల నివారణకు కూడా అది ఎంతో ఉపకరించింది. చీడపీడల నివారణకు వాడే హానికరమైన రసాయనాలకు స్వస్తి చెప్పి… వివిధ సేంద్రియ పదార్థాలతో ‘ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజిమెంట్’ వ్యూహాన్ని అమలు చేశారు. మరోవైపు అంతర పంటల పెంపకాన్ని చేపట్టారు. ”ఒకప్పుడు కేవలం కొబ్బరి మాత్రమే సాగు చేసేదాన్ని. కొన్నిసార్లు దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో ధరలు పడిపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చేది. అందుకే… ఒకే పంట మీద ఆధారపడకూడదనుకున్నాను. కొబ్బరితో పాటు దాదాపు 460 తాటి చెట్లు పెంచుతున్నాను. అరటి, వేరు శెనగ, పైనాపిల్, మిర్చి, కంద, చిలగడ దుంపలు, ఆకుకూరలు, పువ్వులు… అలా రకరకాల పంటలు వేశాను” అని వివరించారామె. ప్రస్తుతం ఏటా 27 వేలకు పైగా కొబ్బరికాయల దిగుబడి వస్తోంది.
చెల్లమ్మాల్ చేసిన కొత్త ప్రయోగాలు, ఆచరించిన వినూత్న పద్ధతులు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు తోటి రైతులకు స్ఫూర్తిగానూ నిలిచాయి. సుమారు 150 మందికి పైగా రైతులు ఈ పద్ధతులు అనుసరించేలా చేశారామె. ఆమె ప్రభావంతో… వారందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపారు. అలాగే రకరకాల పంటలు పండిస్తున్నారు. ”ఇలా చేయడం వల్ల ఏడాది పొడుగునా ఆదాయం ఉంటుంది. ఒక పంట దెబ్బ తిన్నా… మరొకటి ఆదుకుంటుంది” అంటారు చెల్లమ్మాళ్. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆమె సాగు విధానాల్ని పరిశీలించి అభినందించారు. గతంలో కొబ్బరి అభివృద్ధి బోర్డుతో సహా పలు సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్న ఆమెకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ని ప్రకటించింది.
చెల్లమ్మాళ్‌కు వ్యవసాయంలో ఆమె కుమారుడు రామచంద్రన్ సాయం చేస్తున్నారు. తన తల్లికి వచ్చిన ఈ పురస్కారం తమకు మరిన్ని ప్రయోగాలు చెయ్యడానికి స్ఫూర్తినిస్తోందని ఆయన చెబుతున్నారు. ”ఇప్పుడు ఆగ్రో-టూరిజం’ను ప్రమోట్ చెయ్యడానికి ప్రణాళికలు వేస్తున్నాం. మా పొలంలో రకరకాల పంటలు వేస్తున్నాం. సుగంధ ద్రవ్యాల్ని సాగు చేస్తున్నాం. ఫిష్ ఫార్మింగ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆగ్రో-టూరిజానికి మంచి అవకాశం ఉంది. అది స్థానికుల్నీ, విద్యార్థుల్నీ మాత్రమే కాదు… పర్యాటకుల్ని కూడా ఆకర్షిస్తుందని మేం భావిస్తున్నాం” అని ఆ తల్లి కొడుకులు చెబుతున్నారు. చెల్లమ్మాళ్ మునుపటి ప్రయోగాల మాదిరిగానే ఈ ఆగ్రో టూరిజం ఆలోచన కూడా మరింతమంది రైతులను ఆ బాటలో మళ్ళిస్తుందనడంలో సందేహం లేదు.
నేను మారుమూల పల్లెటూర్లో నివసిస్తున్నాను. నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చిందని ఎవరో చెప్పినప్పుడు… ఎంతో సామాన్యురాలినైన నాకు అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎలా ఇస్తారనుకున్నాను. నన్ను ఆట పట్టిస్తున్నారనుకున్నాను. తరువాత అండమాన్ అధికారి ఒకరు అది నిజమేనని చెప్పారు. ఇప్పుడు నా నోట మాటలు రావడం లేదు. – కామాచ్చి చెల్లమ్మాళ్
బేలేరు రైతుబిడ్డకు ‘పద్మ’ పురస్కారం
కేరళ భూమిపుత్రుడు సత్యన్నారాయణకు జేజేలు
వారి స్ఫూర్తి అందరికీ ఆదర్శం

కేరళ కాసర్‌ఘడ్ ప్రాంతంలోని బెలేరు గ్రామ రైతు 50 సంవత్సరాల సత్యన్నారాయణ బేలేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హోరెత్తుతున్న పేరు. అతను వరి రైతు కాదు.
రబ్బరు, వక్క పండిస్తారు. అయినా వరి కుటుంబం అంతా ఒక్కటిగా ఒక్కసారిగా వారి వైపు దృష్టి సారించారు. ఎందుకో తెలుసా?
తల్లిదండ్రులు, అన్నతో ఉన్న 5 ఎకరాలలో రబ్బరు, వక్క పంటలు సాగు చేస్తూ ఉమ్మడి వ్యవసాయం చేస్తూ ఉన్నా తనకున్న మక్కువతో 650 వరి రకాల విత్తనాలను సేకరించి, సంరక్షిస్తూ వరి జర్మ్ ప్లాజంకు కేంద్రబిందువై శాస్త్రవేత్తలను, రైతులను, జన్యుసంపద సంరక్షించే కేంద్రాలను అందరినీ తనవైపు ఆకర్షించారు. పెద్దగా చదువుకోలేదు. మొన్ననే 12వ తరగతి అక్షరాస్యతా మిషన్ ద్వారా పూర్తి చేశారు. 2024 పద్మశ్రీ పురస్కారంకు ఎంపికై చరిత్ర సృష్టించారు. వీరి ఉమ్మడి కుటుంబ వ్యవసాయ భూమి వాలు కలిగి ఉంది. దీనితో వరి సాగు కష్టం. దీనితో సత్యన్నారాయణ వరి రకాల సంరక్షణకు తన పెరటినే కేంద్రం చేసుకున్నారు. గ్రోబ్యాగ్స్‌లో విత్తనాలు నాటి, మొలకెత్తిన తరువాత మొక్కలను కుండీలలోకి మార్చటం చేస్తూ తన అభిరుచిని సాకారం చేసుకోవటంకు శ్రీకారం చుట్టారు. వంద గ్రాముల విత్తనాలతో కేరళ వరి రకాల సంరక్షణతో మొదలైన కార్యక్రమం నేడు పొడుగు, పొట్టి రకాలు, నలుపు, ఎరుపు వడ్లు, తక్కువ కాలం, ఎక్కువ కాలంలో పంట కొచ్చే రకాలు… ఇలా విభిన్న ప్రాంతాల, పలు వాతావరణ పరిస్థితుల్లో పండే 650 రకాల వరి విత్తనాలను లాభాపేక్ష లేకుండా సంరక్షిస్తూ ఉండటం మామూలు విషయం కాదు. వీరికున్న జీవ వైవిధ్యం, పర్యావరణ స్పృహకు శాస్త్ర సమాజం జేజేలు పలికింది. ఇటు శాస్త్రవేత్తలు, అటు వివిధ ప్రాంత రైతులు వారి దగ్గరున్న రకాల విత్తనాలు ఇచ్చి తోడ్పాటు అందించారు. సత్యన్నారాయణ కూడా తను సేకరించి భద్రపరుస్తూ ఉన్న విత్తనాలను తోటి రైతులకు అందిస్తూ వరి జన్యు సంపదను అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. 2021లో వీరికి ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్ పురస్కారం అందుకున్నారు.
– ‘రైతునేస్తం’ ప్రత్యేక ప్రతినిధి
