రొయ్యల సాగులో ఉండేటటువంటి ఒడిదుడుకులు దృష్ట్యా, ముఖ్యంగా సాగులో వ్యాధులు ప్రబలుట, మార్కెట్‌ రేట్లలో హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల రైతులు ప్రత్యామ్నాయ జాతుల పెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. ఉప్పు నీటిలో పెంపకానికి అనువైన ప్రత్యామ్నాయ జాతులలో పీతలు, పండుగప్పలు ముఖ్యమైనవి. పండుగప్పలో వ్యాధుల తీవ్రత తక్కువ. మాంసముకు అధిక డిమాండ్‌, ధర ఉండుట వల్ల రైతులు పండుగప్ప చేపల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. పండుగప్ప చేపల పెంపకం ఉప్పు నీటిలో, మంచినీటిలో కూడా చేపట్టవచ్చు. పండుగప్ప చేప పిల్లలను సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌ వాటర్‌, చెన్నై మరియు ఆర్‌జిసిఏ సిర్‌కాలి (తమిళనాడు) వారు హేచరీలలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. ముందుగా వీటిని నర్సరీలలో పెంపకం చేపట్టి, తరువాత పెంపకపు చెరువులలోకి మార్చుకొని సాగు చేయవచ్చు.

నర్సరీలలో చేప పిల్లల పెంపకము

  • కచ్చా నర్సరీలలో, హఫాలలో, సిమెంటు/ఎఫ్‌ఆర్‌పి ట్యాంకు, కేజ్‌లలో చేప పిల్లల పెంపకంను చేపట్టవచ్చు.
  • హేచరీల నుండి సుమారు 30-40 రోజులు వయస్సు గల పిల్లలను నర్సరీలలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నర్సరీలలో 1.5 సెం.మీ. పొడవు గల పిల్లలను 5-10 గ్రాములు వరకు పెంచుకోవచ్చు.
  • అలాగే ఫింగరులింగును 100-150 గ్రా.లు వరకు అడ్వాన్సుడు నర్సరీ పద్ధతిలో పెంచి వాటిని గ్రో అవుట్‌ పాండులోనికి బదిలీచేసి కల్చరు చేయడం వలన బ్రతుకుదల శాతం పెరిగి, సైజులో వ్యత్యాసాలు తగ్గి 10-12 నెలల కాలంలో 3-4 కిలోల బరువు గల చేపలను ఉత్పత్తి చేయవచ్చు.
  • చేపల పెంపక సమయాలల్లో అవసరాన్ని బట్టి 100% నీటి మార్పిడి చేయవలసి ఉంటుంది.
  • పండుగప్ప మాంసాహారి. ఆహారం సరిపడినంత దొరకకపోతే తోటి పండుగప్ప పిల్లలను తినివేస్తుంది (స్వజాతి భక్షణ). తద్వారా బ్రతుకుదల శాతం తగ్గి సైజులలో తేడాలు వస్తాయి. ఒకవేళ సరిపడినంత సహజ ఆహారం (జంతు ఫ్లవకాలు) లభించకపోతే ప్రతి రోజు చైనా గొరక, పాల చేప లేదా అందుబాటులో ఉన్న ఇతర చేపల మాంసాన్ని మెత్తని ముద్దగా చేసి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజుకు కిలో చొప్పున నీటితో కలిపి చెరువంతా చల్లుకోవాలి. 10 మి.మీ. పొడవు థ నుండి పండుగప్ప పిల్లలను కృత్రిమ మేతకు అలవాటు పరచవచ్చు కానీ 15-20 మి.మీ. పరిమాణంలో కృత్రిమ ఆహారానికి అలవాటు పడి బ్రతుకు శాతం బాగుంటుంది.
  • ఈ చేపలలో ఉన్న స్వజాతి భక్షణ లక్షణము బట్టి వీటిని ఎప్పటికప్పుడు వేరు చేస్తు ఉండాలి. దీనినే గ్రేడింగు అంటారు. ఎక్కువగా ఎదిగిన చేప పిల్లలను వేరొక నర్సరీలోకి మార్పిడి చేయుట వలన మిగిలిన చేపలు కూడా పెరుగుటకు దోహదమవుతుంది. ముఖ్యంగా 20-35 మి.మీ. సైజులో వారానికి ఒకసారి గ్రేడింగు చేయాలి. గ్రేడింగ్‌ సమయంలో తక్కువ ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. లేనిచో ఆహారము తక్కువగా తీసుకోవడం, శరీరంపై పొలుసులు ఊడి రంగు మారడం, నీటి పైభాగానికి వచ్చి గాలి పీల్చుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆక్సిజన్‌ లేకుండా ఎట్టి పరిస్థితులలోనూ గ్రేడింగు చేయరాదు. వేగంగా సున్నితంగా గ్రేడింగు చేయాలి. ఈ సమయమే పిల్లల పెంపకములో క్లిష్టమైన థ.
  • కృత్రిమ ఆహారాన్ని అలవాటు చేయటం, గ్రేడింగు అనే ఈ రెండు పనులు పండుగప్ప చేపల పెంపకంలో విజయానికి కీలకమవుతాయి.
  • 40 రోజులు పూర్తయిన తరువాత నీటి మట్టాన్ని తగ్గించి వల సహాయంతో పట్టుబడి చేసి ఒకే సైజు గల పిల్లలను అడ్వాన్సుడు ఫింగర్లింగ్స్‌ తయారు చేయడానికి వేరొక నర్సరీకి గాని లేదా గ్రో అవుట్‌ చెరువులలోనికి గాని మార్చుకోవాలి.

చెరువులలో పండుగప్ప పెంపకము

  • రొయ్యల పెంపకము చేపట్టి చెరువులను యధాతథముగ పండుగప్ప చేపల పెంపకముకు ఉపయోగించవచ్చు.
  • పండుగప్ప చేపల పెంపకమునకు చెరువు మట్టి పి.హెచ్‌ 7 కంటే ఎక్కువ ఉండాలి. దీని కోసం హెక్టారుకు 500 కిలోల నుండి ఒక టన్ను వరకు అవసరం మేరకు సున్నము చల్లాలి. నీటి పి.హెచ్‌ 7.5 నుండి 8.5 ఉంచాలి. నీటిలో కరిగియున్న ఆక్సిజన్‌ 5 పి.పి.ఎం. మించి ఉండాలి. ఈ చేప ఎలాంటి సెలీ నీటిలోనైనా తట్టుకొని పెరుగుతుంది (0-30 పిపిటి). హానికర వాయువులైన అమ్మోనియం 0.1 పిపియం కన్నా తక్కువ మరియు హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ 0.01 పిపియం స్థాయి మించి ఉండరాదు.

విత్తన ఎంపిక: సాధ్యమైనంత వరకు ఒకే సైజు పిల్లలను ఎంపిక చేసుకుంటే సైజులో వ్యత్యాసాలు లేకుండా ఉంటుంది. పొలుసులు ఊడిపోయి, నీరసంగా ఉన్న వాటిని చెరువులలో స్టాక్‌ చేయకూడదు. నర్సరీల ద్వారా పెంచిన పిల్ల అయితే సమస్యలు తక్కువగా ఉండి ఎదుగుదల ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా 100-250 గ్రా. బరువున్న పిల్లలను ఎకరానికి 1000 చొప్పున వేస్తే పెరుగుదల బాగుంటుంది.

మేతలు: 1-5 అంగుళాల పొడవు ఉన్న చైనా గొరక పిల్లలను లేదా గొరక చేప పిల్లలను ఆహారంగా వేయాలి. ప్రారంభంలో మొత్తం బయోమాస్‌లో సుమారు 10% ఆహారంగా ఇవ్వాలి. అధిక ప్రొటీన్‌ (45-55%) ఉన్న పెల్లెట్‌ ఫీడును చేప బయోమాస్‌ ఆధారంగా ఇవ్వాలి. 40-100 గ్రాములు బరువున్న చేపలకు 3% మేతను, 225 గ్రా. బరువున్న చేపలకు 2.5% మేతను, 450 గ్రాముల బరువున్న చేపలకు 2% మేతను, 680 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న చేపలకు 1.75% మేతను ఆహారంగా ఇవ్వాలి. పెల్లెట్‌ మేత పరిణామం కూడా చేప శరీర బరువును బట్టి పెంచుతూ వెళ్ళాలి.

  • చేప పొడి 55%, ఉడక బెట్టిన సోయా పిండి 15%, విటమిన్‌ సి, మినరల్‌ మిక్స్‌ర్‌లు ప్రధాన ముడి సరుకులుగా ఉపయోగించి, దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన పెల్లెట్‌ మేతలు కూడా కొంతమంది రైతులు ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
  • 100-150 గ్రా. బరువు ఉన్న పిల్లలను వేస్తే 10-12 నెలల కాలంలో 3-4 కిలోల బరువు పెరుగుతాయి. 1000 పిల్లలు వేసిన ఎకరం చెరువులో మంచి మేత యాజమాన్యం చేస్తే 90% బ్రతుకుదల వచ్చి 3-4 టన్నులు ఉత్పత్తి వస్తుంది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి 20 నుండి 30 శాతం నీటి మార్పిడి చేయాలి.

పండుగప్ప చేపల పెంపకంలో సాధారణంగా వచ్చే వ్యాధులు

పండుగప్ప చేపల సాగులో నీటి నాణ్యత సరిగాలేనపుడు అధిక ఒత్తిడి వల్ల చేపలు వ్యాధుల బారిన పడతాయి.

  • అధిక సేంద్రియ పదార్థములు చెరువులో పేరుకుపోయినప్పుడు ఇక్తియోబొడాసిస్‌, ట్రైఖోడైనా, మిక్సోబోలస్‌ వంటి పరాన్నజీవులు శరీరము మరియు శంఖులలో ఆవాసము ఏర్పరచుకుని కణజాలమును తినివేస్తూ ఉంటాయి. చేపలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మేతలు వృధా కాకుండా చూసుకోవాలి.
  • విబ్రియో పారాహిమోలైటికస్‌, విబ్రియో ఆల్జీనోలైటికస్‌ మొదలగు బాక్టీరియా జాతుల వల్ల తోక కొరుకుడు, వాజాల కొరుకుడు వ్యాధులు సోకుతాయి. స్ట్రేప్టోకోకస్‌ బాక్టీరియా వ్యాధి కేజ్‌ కల్చరులో పెరిగే పండుగొప్ప చేపలకు సోకుతుంది. ప్లవో బాక్టీరియం కాలుమ్నేర్‌ అనే బాక్టీరియా వలన పండుగప్ప చేపల శంఖులు కుళ్ళిపోతాయి. చేపలు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మేతలు వృధా అవకుండా చూసుకోవాలి. ప్రోబయోటిక్స్‌ వాడుకోవాలి. సున్నము నీటి పీహెచ్‌ ఆధారంగా ఇవ్వాలి.
  • లింఫోసిస్టోసిస్‌ వ్యాధిని కలుగచేసే ఇరిడియో వైరస్‌లు చేప శరీరపు కణజాలములలోకి చేరి చిన్న చిన్న కణుపులను తల, తోక భాగములలో ఏర్పరుస్తాయి. దీని వలన నర్సరీలలో పిల్లలు అధిక సంఖ్యలో చనిపోతాయి. వైరల్‌ నెర్వస్‌ నెక్రొసిస్‌ వైరస్‌ చేప నాడీ వ్యవస్థను ధ్వంసము చేస్తుంది. దీని వలన శరీర కణజాలము సహజ రంగు కోల్పోయి పాలిపోయిన రంగు వస్తుంది. వైరస్‌ వ్యాధుల నివారణకు మందులు లేవు. నాణ్యమైన చేప పిల్లలను తక్కువ సాంద్రతలో వేసి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం ఇచ్చి సాగు చేపట్టాలి.
  • నాసిరకం మేతలు, నిలువ ఉన్న మేతలు ఆడినప్పుడు చేపలు నల్లగా మారి వాటిలో ఎదుగుదల మందగిస్తుంది. 

పండుగప్ప చేపల పెంపకంలో గల ఇబ్బందులు:

స్వజాతి భక్షణ: ఇది పండుగప్ప పెంపకంలో ఒక సమస్యగా ఉంటుంది. దీని కారణంగా గ్రేడింగ్‌ చేయడం అత్యవసరం. స్వజాతి భక్షణ తగ్గించుకోవడానికి పెంపకమును రెండు థలలో అంటే నర్సరీ, గ్రో అవుట్‌ పాండ్స్‌లో చేస్తారు.

చేప పిల్లల లభ్యత: పండుగప్ప చేప పిల్లలను ఈ మధ్యకాలంలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌ వాటర్‌, చెన్నై మరియు ఆర్‌జిసిఏ సిర్‌కాలి వారు హేచరీలలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. అయితే కావలసినంత చేప పిల్లలు లభ్యమవడం లేదు.

సహజ వనరుల నుండి సేకరించిన పిల్లలలో సైజు వ్యత్యాసాలు ఎక్కువ మరియు కావలసినంత సంఖ్య సరఫరా లేదు.

మేత అలవాట్లు: పండుగొప్ప చిరుథలో సర్వభక్షకిగాను ప్రౌఢ థలో మాంసాహారిగాను ఉంటుంది. అధిక ప్రోటీన్‌ గల కృత్రిమ ఆహారం లభ్యమవడం లేనందున మేత పెట్టటం సమస్యగా ఉంటుంది.       దీ

కె. వీరాంజనేయులు, శాస్త్రవేత్త (మత్స్య విభాగము), డా. పి. లలిత కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త , డా. టి. క్రాంతి కుమార్‌, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగము), డా. ఎస్‌. చిరంజీవి, శాస్త్రవేత్త (తెగుళ్ల విభాగము), డా. ఎస్‌. ఆదర్శ, శాస్త్రవేత్త (కీటక విభాగము), డా. ఆర్‌. ప్రవీణ్‌బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగము), కృషి విజ్ఞాన కేంద్రం, పందిరి మామిడి, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఫోన్‌: 95533 64265.