భూతద్ద్ధంలో చూసినా కనీకనబడనంత పరిమాణం (సుమారు 0.01 నుంచి 1.0 మి.మీ. పొడవు) ఉండే నులిపురుగులు.. పంటలకు చేసే హానీ, నష్టం మాత్రం రైతు… కనీ విననంత (ఎరగనంత) విపరీతంగా ఉంటుంది.

  • ”ఎందెందు వెతికినా.. అందందే కలవు…” అనే సామెతలా.. ఇవి పర్వతాల ఎత్తు నుండీ… సముద్రాల లోతు వరకూ… ప్రాణి బ్రతకడానికి అవకాశమున్న ప్రతిచోట తమ ఉనికిని చాటుతాయి.
  • ఇవి మట్టిలో (లేదా) నీటిలో (మంచి నీరు, ఉప్పునీరు, మురుగునీరు)నే కాకుండా పరాన్నజీవులుగా మానవులు, జంతువులు, మొక్కలలో కూడా స్వేచ్ఛగా జీవిస్తాయి.
  • ఇవి కొన్ని వాటిలలో … ముఖ్యంగా పండ్లతోటలలో… జామతోటలలో… ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల తోటలలో 60 నుంచి 100 శాతం నష్టపరుస్తాయి. అదే జామ నర్సరీలలో అయితే.. 90 నుంచి 100 శాతం కూడా హాని చేస్తాయి.
  • నులిపురుగులలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్‌లతో కలిసి కూడా పంటలను ఆశిస్తాయి.
  • నులిపురుగులు (మెలదోగైని జవానికా) అలసంద పంటలో… రైజొక్టినా అనే శిలీంద్రంతో కలిసి ఆశిస్తే పంటకి 83 శాతం నష్టం కలుగుతుంది. కానీ ఇవే నులిపురుగులలో మరో కుటుంబం (మెలడోగైనిహాప్లా) రైజోక్టినా శిలీంద్రంతో కలిసి ఆశిస్తే అలసంద పంటకి 98 శాతం హాని జరుగుతుంది. 
  • మెలడోగైని ఇన్‌కాగినిటా అనే నులిపురుగులు ప్రత్తిపంటలో ఒంటరిగా ఆశిస్తే ప్రత్తి పంటకు నాలుగు శాతం (4%) నష్టం జరిగితే … ఇవే నులిపురుగులు లేకుండా ఫ్యుజేరియం అనే శిలీంధ్రం ఒక్కటిగా వస్తే ప్రత్తి పంటకు ఇదే 4 శాతం నష్టం కలుగుతుంది.
  • కానీ ఇవి రెండు కలిసి వస్తే మాత్రం .. నులిపురుగులు ప్రత్తి పంట వేరు వ్యవస్థ భౌతిక స్థితిని మార్పులకు గురి చేయడం వల్ల .. ఫ్యుజేరియం అనే శిలీంధ్రం మరింత ప్రమాదకరంగా పరిణమించి నష్టం 65 శాతానికి పెరుగుతుంది.
  • ఇలాగే.. తమలపాకులో ఎండుతెగులు కలిగించే శిలీంద్రం.. ఫైటోప్తోరా పారాసిటికాకు నులిపురుగు మెలడోగైని ఇన్‌కాగ్నిటా తోడైనా.. చెఱకులో వేరుకుళ్ళు కలిగించే ఫిథియం అనే శిలీంధ్రానికి రాడోఫిలస్‌ సిమిలిస్‌ అనే నులిపురుగు తోడైనా.. అగ్నికి ఆజ్యం పోసినట్లే! వీటి మిత్ర లాభం .. రైతుకు భేదం.
  • నులిపురుగులు ఆశించిన మొక్కలు.. గాలి వీచినా.. వర్షం పడినా.. సులువుగా పడిపోయేంత బలహీనం అయిపోతాయి.
  • కానీ వీటిని గుర్తించడం ఎంత కష్టం.. అంటే.. నేలలో పోషకాలు ఉన్నా సరే.. మొక్కలు పోషకాల లేమితో బాధపడుతున్న లక్షణాలు పైకి కనబడతాయి. 
  • నేలలో మొక్కలకు సరిపడేంత నీరు (తేమ) ఉన్నా సరే… ఇవి ఎండిపోయినట్లు కనబడతాయి.
  • నులిపురుగులు ఆశించినపుడు పంటపై వీటి లక్షణాలు కూడా పోల్చుకోవడానికి వీలులేనంత కష్టంగా .. ఒక్కో పంటలో … ఒక్కొక్క లాగా ఉంటాయి.
  • సాధారణంగా చాలా పంటలలో వీటి నష్ట లక్షణాలు…. మొక్కల ఎదుగుదల ఆగిపోవడం, మొక్క ఎండిపోవడంగా ఉంటాయి.
  • బత్తాయి పంటలో లేత ఆకులు, కొమ్మలు ఎండిపోవటం, నిమ్మ తోటలలో నిమ్మ చెట్టు వేర్లు, కొనలు ఉబ్బడం జరుగుతుంది.
  • వేర్లు మోడు లాగా మారిపోవడం, వేర్లు గాయపడిన ప్రదేశాల్లో ఉబ్బటం వంటి లక్షణాలు మొక్కజొన్న పంటలో కనబడతాయి.
  • వరిలో వేర్లపై గోధుమరంగు చారలు, అరటిలో వేర్లు, దుంపలు కుళ్ళిపోవడం, కూరగాయ పంటలలో సాధారణంగా.. వేర్లపై బుడిపెలు ఏర్పడటం వంటి లక్షణాలు వ్యక్తం అవుతాయి.

నివారణ:

  • నేలను లోతుగా దుక్కి చేయాలి. వేసవి దుక్కులతో మట్టిని కలియబెట్టాలి.
  • వేరుశనగను చిరుధాన్యాలతో, అరటి, వంగ, ఉల్లి వంటి పంటలను ఒక ఏడాదిపాటు బంతిపూల పంటతో ”పంటమార్పిడి” చేయాలి.
  • ఉద్యానపంటల్లో.. ముఖ్యంగా జామలో.. నులిపురుగులు లేనివిగా నిర్ధారించబడిన నర్సరీల నుంచి మాత్రమే ఆరోగ్యవంతమైన మొక్కలను కొనుగోలు చేయాలి.
  • ఎయిర్‌లేయరింగ్‌ చేసిన అంట్ల మొక్కలనే వాడాలి.
  • అంట్లుకట్టడానికి మరియు నర్సరీలలో అంటుమొక్కలను పెంచడానికి నులిపురుగులు లేని స్వచ్ఛమైన మట్టిని వాడుకోవాలి.
  • అరటిలో పిలకల దుంపపై చర్మం పలుచగా చెక్కి విత్తనశుద్ధికి సంబంధించిన ద్రావణంలో ముంచి, నీడలో ఆరనిచ్చి, తరువాత నాటుకోవాలి.
  • జనుము పంట తర్వాత అరటి నాటుకోవాలి.
  • ఎకరాకు 100 కిలోల వేపపిండిని భూమిలో కలియదున్నాలి.
  • కూరగాయ పంటలలో ఒక కేజీ విత్తనానికి 15-20 గ్రా. చొప్పున సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌తో గాని, ట్రైకోడెర్మావిరిడితో గాని విత్తన శుద్ధి చేయాలి.
  • పశువుల ఎరువు (లేదా) సేంద్రియ పదార్థాలు (ఆముదం లేదా గానుగపిండి) ఒక హెక్టారుకి రెండు టన్నులు వేసి భూమిలో కలియదున్నాలి.
  • అలసంద, ఆముదం వంటి నులిపురుగు ఆకర్షక మొక్కలను ప్రధాన పంటల చుట్టూ వేసి, మొలిచిన 45 రోజుల తర్వాత తీసివేయాలి.
  • చెట్టు నీడన బాగా చివికిన పశువుల ఎరువు ఒక టన్ను తీసుకొని, దానికి 20 కిలోల వేపపిండి కానీ, ఆముదం పిండి కానీ కలిపి, దానితో పాటు 2 కిలోల చొప్పున పర్పూరియోసిల్లమ్‌ లిలాసినమ్‌, సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ మరియు ట్రైకోడెర్మాహార్జినియమ్‌ కలిపి దానిని (మిశ్రమాన్ని) గోనెసంచులతో కప్పి, ప్రతిరోజూ నీటితో తడపాలి. ఈ విధంగా 30 రోజులు వృద్ధి చేసి మొక్కల దగ్గర 3 నుంచి 4 కిలోలు వేయాలి.
  • పాసిలోమైసెస్‌ లితేసినస్‌ శిలీంధ్రం 25 గ్రా. వేయాలి.
  • వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపుడు 100 గేజ్‌ కలిగిన పారదర్శక ప్లాస్టిక్‌ షీటును పొలంలో పరిచి 4 నుంచి 6 వారాల పాటు ఉంచి నులిపురుగులతో పాటు, కలుపు మొక్కలు కూడా నివారించవచ్చు.

కె. ఆంజనేయకుమార్‌ (83310 56106), వ్యవసాయాధికారి, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌, డా. ఎన్‌టిఆర్‌ లైవ్‌స్టాక్‌ బిల్డింగ్‌, హెచ్‌సిఎల్‌ దగ్గర, గన్నవరం, కృష్ణా జిల్లా – 521102.